17, సెప్టెంబర్ 2020, గురువారం

చిత్రం పై పద్యం - 47, తెలుగు - జానపదం - వెలుగు - రేఖ, (శీర్షిక : జానపదం)

 


17, సెప్టెంబర్ 2020, గురువారము

తెలుగు తేనియలు

శీర్షిక : జానపదం; చిత్రం పై పద్యం  - 47

మీరు మీ కవిత్వంలో ఈ పదాల ప్రయోగం చేయగలరు


తెలుగు - జానపదం - వెలుగు - రేఖ

*****************************************


#వెలుగుబాట

వచన ప్రయత్నం

 

తెలుగు మృగ్యమయ్యె తెలుగు వారి నోట

జానపదములకు జనాదరణ ఒకప్పటిమాట

వెదుకులాటలో కానవచ్చెను కొత్త  ఆశల మూట

తెలుగు తేనియలు చూపుతున్నది వెలుగు రేఖల బాట

 

కన్నాజీరావు

 *******************

 

ఆటవెలది

తెలుగు నేల పైన ధీరులై నిలిచేడి

జానపదుల భాష జాలువారి

భానురేఖ వలె భావనలందించి

పల్లె పాట తోటి పంచు వెలుగు

 

సి.హెచ్ రజిత, కరీంనగర్

 ******************************

 

జాతి చరితకు గురుతుగా జానపదులు

పాడు కమ్మనైన తెలుగు పాటలన్ని

వెలుగురేఖలు వెదజల్లు విశ్వ మంత

వూరి మట్టి పరిమళాలు పోగు పోసి

పంట చేల సొబగులన్ని పాట కూర్చు

పసిడి బాల్యపు భాషను వదల వద్దు

జానపదుల గీతములందు జాతి మసలు

 

రమ, కంకిపాడు.

********************* 

 

పనికిఁ బాటఁ జేర్చె తెలుగు పల్లె జనులు

చేవ లేని వారలకది జీవరేఖ

జానపదము నిల్పు భరత జాతి ఖ్యాతి

వెలుగుఁ జూపి జేర్చె కడకు విష్ణు పదము

 

చాగంటి చరణ్

 ******************

 

తేనేపలుకు నా పాట జానపదమేనంట

జాతి పలుకు బాట తెలుగు తేనీయులంట

అమ్మలారా... ఓయ్. అన్నలారా...

అక్కలారా... ఓయ్. గురుతండ్రులారా...

తేటగీతిలోనా...

తేటగీతిలొన పద్యపరవణ్ణాలు వడ్డిస్తారంట,

కవనంలొ కవితలు కవిపురుషుల నోట

కాలుదువ్వెనంట,

శివుడు చక్రవర్తుల వాణి నైనాల రమా రమనీయమంట,

కన్నాజీ చిత్రాలు మల్లికార్జునుడి శోభఅంటా..

పద్మాలత గాన మాధుర్యం....

జైకరుల సీమ నా తెలుగు వెలుగు రామ్మోహన రాజనాలు మా ఇంట వెలుగుచుండె చూడు

తేనేపలుకు నా పాట జానపదమేనంట

జాతి పలుకు బాట తెలుగు తేనీయులంట

అమ్మలారా... ఓయ్. అన్నలారా...

అక్కలారా... ఓయ్. గురుతండ్రులారా...

గురువులు... శ్రీమాన్ మా గురువులు..

గురువులు నాగులపల్లి శ్రద్ద పాట పద్యాలు అందించగోరు...

గురువులు... శ్రీమాన్ మా గురువులు..

అవులూరు సీతక్క, విష్ణు ప్రియల ఛలోక్తులు

అత్తిలి వారి వరస అనంతమవును ఇంట

ఛందోబద్దం కాదు శాస్త్రి గారి చేత

మురళిగారి మైనాలు మాదిరెడ్డి వారి రతనాలా రాట్నాలు

ఎందరెందరో ఉన్న నా సమూహ మిత్రులు

తేనేపలుకు నా పాట జానపదమేనంట

జాతి పలుకు బాట తెలుగు తేనీయులంట

అమ్మలారా... ఓయ్. అన్నలారా...

అక్కలారా... ఓయ్. గురుతండ్రులారా...

చల్లాటి దేవిలు చల్లంగా కరుణించి జాన్సీ రాయుగోరు సమూహ పెద్దల దీవెనలు

రాజ్యామేలుతుడే పూసపాటి వారి కంట

జాతి ఉద్దరులు వీరు

తెలుగు చరణాలు చాగంటి రేఖలు ఉద్భవిస్తున్నాయి అందరి చెంత గోరు

ఎందరెందరో ఉన్నారు అందరిలో చిన్నవాడు

కోతి అల్లర్లు చిలిపి బంధు మిత్రుడు సూరిగాడు

పాట కట్టాను నేను జానపదము నేడు

తేనేపలుకు నా పాట జానపదమేనంట

జాతి పలుకు బాట తెలుగు తేనీయులంట

అమ్మలారా... ఓయ్. అన్నలారా...

అక్కలారా... ఓయ్. గురుతండ్రులారా...

 

సూర్య తాడిపూడి

 *********************

 

వెలుగు రేఖలు

నా అందం చూడు బావయ్యో !

తెలుగు జనుల హృదయాల స్వేచ్ఛా విహంగము జానపదం 

మానవీయ సంస్కారాల కలయికల  తెలుగు వెలుగు రేఖలే మన జాన పదాల పాటలు, నృత్యాలు.

మురళి మోహన్

 *******************

 

గేయ రచన

 

జాను తెలుగు గేయం,

జనపదుల జానపదం,

తెలుగు సంస్కృతి వెలుగుదీపం,

కాంతి రేఖలు విరజిమ్ము పుంజం.....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

********************************* 

 

తేటగీతి

 

జనుల గుండెల గొంతుకల్ జాన పదము ,

లాయె తెలుగుపల్లెపదము లాయె గజ్జె,

కట్టి తప్పెట చేపట్టి గాన  మాడ

వెలయు స్వర రేఖముల్దివ్వె   వెలుగు లాయె.

 

CA కె మల్లికార్జునరావు

***************************

 

 

జానపదమా నీపద ధ్వనులు ఎక్కడమ్మా...

నీవు రేఖా మాత్రముగా ఉండి పోకుమా...

డప్పు మీద చేయి పడగానే

ఊగని తెలుగోడి కాలు ఉండునా చెప్పుమా....

నీ జోరు హుషారు తెలుగు వాడికి కావాలమ్మా.....

అహో..తెలుగోడా అంటూ

మద్యాహ్న మార్తాండుడిలా వెలుగులిమ్మా.....

 

ఉషారాణి

*************

 

 

సీసము

శ్రమజీవుల పలుకుల్ సాహిత్య రూపంబు  నొంది జానపదమౌ పొందికపడి

తెలుగు సాహిత్యంబు వెలుగొందె తొల్లిటి కష్టజీవుల భాష గరిమ నుండి

భాషకాయువు పట్టు పల్లె పదంబుల సొగసు సోయగముల శోభితంబు

లావణ్య మంతయు లలిత కళల యందు  నొదిగి జానపదంబు లుత్తమమయె

తేటగీతి

కనుమరుగవుతుండెడి తెన్గు గాటమంత

భాను రేఖలై ప్రజ్వలింప వలెననెడి

యాశయముగ జానపదము ల్నద్భుతముగ

వృద్ధి పరచి, సౌమంగల్య మివ్వ వోలె.

 

వెంకట్. సిహెచ్

 *******************

 

చంపకమాల

తెలుగు పదంబు జావళుల తీయని జానపదంబు పల్కినన్  జిలుగులునద్దు బాసలవి జీవనమందున పల్కరించగా  

వలపులు పల్లెబాటలకు బంధములేయగ గువ్వజంట, ని

ర్మలమగు భావలాహిరులు రంజిలు మోమున హాయిరాగముల్ 

కలుషములేని సత్ప్రణయకాంక్షలు చెల్వములీ విలాసముల్ ,

కలికి మనోజ్ఞమైన కలకంఠికి పొంకపు భావనల్వలే !!! 

కస్తూరి శివశంకర్

******************** 


 తేటగీతి

జానపద జావళి తెలిపె జాతి ప్రగతి

దేశ  సంస్కృతి మూలమై  దిషణి యందు,

గుండె  లోతుల పొరలిన నిండు పదము

వెలుగు పథము జూపగ జాను తెలుగు కాంతి

రేఖలుగ విశ్వమంతయు శాఖ వాఱె

 

అవళూరు సీత

****************** 

 

ఉత్పలమాల

జానపదంబు నందొడగి జాతికి వెల్గుల తొల్లి రేఖలై

మేనులుగన్న తెల్గిదియె మేటి పదమ్ముల జావళీలవన్

వానల యెండలందు జనవాణిగ సాగెడి పల్లెపాటలన్

తేనెల గానమున్ గడిపి దీరును సేదలె  తన్వు మర్వగన్

 

వాణిశ్రీ నైనాల

******************* 


 

పల్లెటూరి మాటల్లో తెలుగుదనం

కల్మషమంటూ ఎరుగని ప్రేమగుణం

పొలం పనుల పాటల్లో జానపదం

అలసటనే మరిపించును జనపదం

వెన్నెల వెలుగులో గోదారి తీరం...

కాంతిరేఖ తోడుగా నావ ప్రయాణం..

కన్నుల ముందు పల్లె జీవనచిత్రం మరొక్కమాటు పిలుస్తోంది నా గ్రామం..

 

విష్ణుప్రియ

************* 

 

జానపదం

జానపదము పల్లె జనము జీవ నాడి

తేట తెలుగుపదములతో పాట పాడి

అలసి సొలసిన మనసుల వేల వెలుగు

నింపు రసమయ రమణీయ సొంపు రేఖ.

మాదిరెడ్డి సురేష్

******************** 

 

తేటగీతి

జనము నుండియె బుట్టెను జానపదము

పల్లె వాసుల సంస్కృతి వల్లె వేసె

శ్రమము దీర్చు సాధనమాయె శ్రావ్యముగను

నాట పాటలకు నెలవు నాదరించ

తెలుగు భూమియె కళలకున్ వెలుగు రేఖ

 

ఎం.పద్మలత

*****************

 

ఏటి రేవు కాడ 

వీచే పిల్లగాలి జానపదం

ఏటి లోన 

పడవ ప్రయాణం జానపదం

పడవలోన పలికే 

మనుషుల పదాలు జానపదం

ఏటిలోన నీలిరంగు 

నీటి చప్పుడు జానపదం

ఏటి చుట్టూ పరుచుకున్న 

పచ్చగడ్డి జానపదం

ఆకాశపురంగు చొక్కా 

చేసే సందడి జానపదం

ఆకుపచ్చని చీర 

రువ్విన అందాలు జానపదం

ఆగక మ్రోగిన డప్పుల 

శబ్దాలు జానపదం

పైకెగిరిన ఎర్రని కండువా 

పలికే జానపదం

యువతీ యువకుడు 

నవ్యాపథం జాతికి మేలుకొలుపు!


కొవ్వూరి 

********* 


వచన కవిత:


తెలుగు నేలను చరిత నొందిన

చక్రవర్తుల కథలు జానపదము

చేసి పాడెదము ఆళ్ళ రాజ్యంల

జనుల మోముల సంతోష రేఖలు

ఆళ్ళ బతుకుల్ల వెలుగు కాంతులు

మీ కిష్టముగ చెప్పెదము వినరండు


CA కె మల్లికార్జునరావు 

 ***********************


సీము

చదువు సంధ్యలవియె యొదవకున్నను గాని వ్రాత పూతలనెడు పటిమ లేక

ఆధునిక మెరుపు లంటకున్నను గాని నాగరికత లేమి భాగమైన

రసార్ద్ర భరితమై రంజిలు కళలెల్ల పల్లె జీవనమున భాగమాయె;

జానపద కళల సౌరునే గాంచగ తెలుగు సంస్కృతియట తేజరిల్లు!


తేటగీతి

మెరుపు జూచి పింఛము విప్పి మురియు నెమలి;

పచ్చని చివురుల భుజియించి పాడు పికము;

చక్కని కళల నేర్చి తనియు జానపదులు

జానపదకళలకు సాటి కాన గలమె!

 

చల్లా దేవిక. 

 **************


 

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...