11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

దత్తపది - 37 ఆట - పాట - కలము - కాగితం , 11 - 09 - 2020 - ప్రణాళిక


 
దత్తపది -  37
 
ఆట - పాట - కలము -  కాగితం
 
ఈ పదములతో, పద్య కవిత / వచన కవిత  అందించగలరు
 
పద్యం : స్వేఛ్ఛా ఛందము
 
వచన కవిత : నాలుగు పాదములు;
ప్రతి పాదములో
12 అక్షరాలతో అందించగలరు

********************************************** 


ఈ రోజు దత్తపది   ఆట పాట కలం కాగితం... 

గేయ రచన,
వ్యాకరణ పరిధి లో రాయనిది

 

కిన్నెరసాని పరుగుల ఆటలు,

తెలుగు నాట కిన్నెర పాటలై,

విశ్వనాధ కలము నుండి జాలువారి,

మన మనో కాగితం పై శాశ్వత ముద్ర నొందె....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

********************************  

 

(ఆట)క్కరి శకుని‌ (పాట)వముగ జూద మందు నోడించెను మాయ చేత,

 (కలము) తెలిసియు శాంతివ చనములు పలుకుట సోదరా పాడికాదు,

 సంధిని కోరిన సమరము జరుగక (నాటం)కముకలిగి నా(కల ము)గి

యునుగ మీ పల్కులు యుక్త మని తలచి  మనుమంట (కాగి,తం)దన మని నిట

 

 నీపలుకులకు వత్తాసు నేను పలుక 

 జాలనుగ ధర్మ నందనా కాలమునకు

తలను వంచిన నామది తంపి కోరు

చున్నదనిపల్కె నా భీముడన్న తోడ

 

అంటకాగి     = అంటి పెట్టుకొని

తందన.  =   సరియని

తంపి   =  యుద్ధం

 మనుము+ అంటకాగి =  మనుమంట కాగి

 

పూసపాటి 

*********** 

  

నా చిన్ని కవిత ఈ రోజు దత్తపది కి 


చిన్నతనపు ఆటలు గుర్తుకు వచ్చి,

మధురమైన పాటలకు మైమరచి,

నా మనసుగెను కవిత వ్రాయాలని

 బాల్యం గురించిఅందుకే

వ్రాస్తున్నా కాగితం పై కలం  ఉంచి.

 

ఉషారాణి.

************ 

 

అమ్మతోడు దోబూచులాట మధురం

శ్రీరాముని జోలపాట సుమధురం

కలం పట్టని బాల్యమింకా మధురం

కాగితం పడవల వాన మధురం !!!

 

విష్ణుప్రియ

************* 

 

సీసము 

 

విద్యా వినయముల్వివేక  సంపదలవి   శోభనుగూర్చగ సురుచిరముగ

శివశంకరు హృదయ సీమను వసియించి హరితమై వరలుచు హాయి నిడుచు;

మనసు కాగితమున మక్కువ మీరగ సంప్రీతిగా జేయ సంతకమ్ము

కలమునే ఝళిపించి కస్తూరి వారలె కవన సృష్టిని జేసె కాంక్ష తోడ;

 

తేటగీతి

ఆట పాటల తోడ తామరితి గూర్చి

చదువు సంధ్యల వెల్గెడు సంతు గాంచి

కస్తురి పరిమళమ్ముల కడలుకొనుచు

చిరునగవుల వెల్గొందుమో శివుని హరిత!

 

తేటగీతి 

నీదు జీవనోద్యానమ్ము నిరతమున్ను

సుందర హరితమ్మౌ గాత సుభగ హరిత;

జన్మదిన కామనలివియె సంతసమున

పూని తెల్పుచునుంటిని పొల్పు గాను!

 

చల్లా దేవిక.

************** 

  

ఆట వెలఁదిలో

 

తేనె  లూరు కవిత తెలుగున వ్రాయగా 

కాగితమ్ము  తీసి కలము వెదుక

ఆట పాట లందు అల్లరి పిల్లలు

విసరి వేయ నేను  విసిగి పోతి

 

అవళూరు సీత

******************* 

 

చరవాణి మాయాజాలమును తెలిపెడి ప్రయత్నంగా దత్తపది పూరణ మధురాక్కర లో

 

ఆటలాగక చరవాణి  నందాటలే మెండయ్యె

పాట పాడెడి రీతి రూపము నంత మారిపోయే

మాటలు లిఖించెడి కలము  మంట కలిసిపోతుండె

దీటుగా కాగితము వాడె దివ్యకాలము పోతుండె

మాటలు కరువై చరవాణి  మంతనములు మెండయ్యె

గాటు కవితా రచనలన్ని  గగన కుసుమము లయ్యె

పాటవమయిన పఠనమే పతనమయ్యె దశ వచ్చె

సాటి రాని జ్ఞానము మాయ చరవాణి నందుండెనే

మేటి విద్యలన్ని సతము మిడిమాలముగ సాగునా?


వెంకట్. సిహెచ్

******************** 

 

ఆట పాట కలము కాగితం

 కలము ను చేబూని దక్షిణ హస్తంబున

 కాగితం పై మనోఙ్ఞ అదేశానుసారంబు

 పాట లెల్ల పల్లవులతో రా సినా రె

 ఆట లతోనాట్యమాడ నట నర్తికి లై

 

వి. వి. శ్రీనివాస్

****************** 

 

 కందము 

 ఆట క్కరి శివ ప్రతిభా

పాట వముల మున్గితేల, వలచిన సఖుడిన్

సూటిగ హరితయె చూడగ 

చాటుగ కాగితము కలము చప్పున దాచెన్

   

తేటగీతి(మాలిక)

 

కలము లోని సిరా తెల్ల కాగితమున

 నాట్యమాడుచు వయ్యారి నడక నడిచి

 సొగసు లూరిచు వొంపుల సొంపు తోటి

 కూర్చె కవనమై కవితయై ముద్దు లొలుకు

 నక్ష త్రాలై మెరయుచుండె నక్షరములు

 తీపి రాగాల. గానమై కవిత విరిసె

 నాదమై శ్రుతి లయలతో నణువణువున

 కోయలమ్మ పాటను పాడ ,కుదిపె, రాతి

 గుండె లోని బాధను ,కరి గించు చుండె!

 

 లలిత దీక్షిత్

****************** 


వచన కవిత -  CA కె మల్లికార్జునరావు 

1.

అతడు  ఆట ఆడితే  ప్రళయ తాండవం,

అతడు పాట పాడితే ప్రణవ ఝంకారం,

అతడు తాగినది కల కలం రేపిన గరళం,

భక్తి భావమున సమర్పించినచో కాగితం,

పూలకూ ముదమంది వరమిచ్చు దైవం,

అతడే భోళా శివుడు నే చేసేద  వందనం.

2. 

ఓ నా ప్రియాతి ప్రియమైన గగన సఖీ,

నీవు ఆట అయిన నేను పాట నవుదును,

నీవు కాగితమవగ నే కలమునవుదును,

మనము ఏకమైన జగత్కల్యాణమగును 

3.

పవిత్ర గోదావరి తరంగి నా కలం,

ఆమె నడయాడు  నేల నా కాగితం,

నా హృదిలో మెదలగ  భావావేశం,

నే సృష్టించితి ఆటపాటల రూపకం,

పరవశమై ప్రకృతి పురుష సంగమం,

ఆడి పాడ ప్రసరించెను విశ్వానందం .


4.

మహాకవి దాశరథి జైలు లో చెప్పిన 

మాటలు కొంచెం మార్పులతో:


"ఇక్కడ కాగితం లేదు, 

కలం లేదు, దీపం లేదు. 

కానీ గళం ఉంది. కోపం ఉంది. 

మృత్యువు ముఖాన ఉమ్మేసి, 

శాశ్వత చైతన్య పదాల మీద 

అమర ప్రయాణం చెయ్యాలనే

తెగువ ఉంది. ధారణా శక్తి ఉంది.

ఆశుధారా కవన జవనాశ్వాలు

ఉన్నాయి, ఇక దిగులేల...  మనం

ఆటలాడడానికో, పాట పాడడానికో

కాదు కదా ఉద్యమంలో దూకింది? " 


CA కె మల్లికార్జునరావు 

 

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...