5, సెప్టెంబర్ 2020, శనివారం

పదము - స్వనము - రవళి – మురళి, దత్తపది - 35, 04 సెప్టెంబర్ 2020, శుక్రవారము

 


 

నీ సుతిమెత్తటి పాదాలను అంటిన గోరింట,
రవ్వంత చిలిపి రగడ రేపే నా యదనంతా...
నీ పట్టీల మువ్వల స్వనాలు విని నా కర్ణిక,
సుస్వరాలను మైమరిపించేలా నీ నడక,
పదముల పదనిసలై పాదముపై పడి
అందెల రవళి మ్రోగిన రాగల తలపులో
డోలాకృతమై నా మనసు పరవసించగా...
మురళి గానము విని నృత్యమా...
నా కావ్యానికి నర్తించే నీ పాదమా...
నీ నర్తన భువిపై చేసినా..
లయబద్ధము నా గుండెచప్పుడవున...
 
సూర్యతాడిపూడి.
 *****************************

 

చిత్రం చూడగానే
 అందెల రవమిది పదములగా
అంబరమంటిన హృదయము గా
మోహన మురళి వినినంతనే
 ఘళ్ళు  ఘళ్ళు మనే
మువ్వల స్వనములుగా
పారాణి పాదాలు సవ్వడులు గా
రాధ మది ఊగెను ఊయల గా
 
నాగమణి

 
 
పారాణి దిద్దిన
పదములు
పవిత్రస్వనముల నదములు
పల్లవిత మధురరవళులు
ముగ్ధమోహన మురళులు!
 
రామ్ మోహన్,  నిజామాబాద్
 ********************************
 
నా రాణి
పారాణి
పదముల
సోయగాలను
చూసినంతనే
అంతరంగమే
పొంగె
యమునా
తరంగమై
మది మురిసె
మురళీ రవమై
 
నా చెలియ
చిరు మువ్వల
రవళుల లో
నిక్షిప్తమైన
సుస్వనముల
సడి వినినంతనే
నా గుండె
సవ్వడులే
గుడి గంటలై
మ్రోగంగ
ప్రేమ పూజారి
నేనైతిని
 
రమ, కంకిపాడు.

******************************* 

 
నీ అందెల రవళి నాకు శుభోదయం
నీ  పదము ల  పారాణి నాకు చూపిస్తోంది అరుణోదయం
నీ మువ్వల స్వనాలు నేనైతే బావుందంటోంది నా హృదయం
నీ పాదాలను పట్టి వదల నంటోంది నా నేత్రద్వయం
నీ మువ్వల స్వనాలు పెంచుతాయి నా డేంద పు సవ్వడి నిద్వయం
నీ అందెల రవళిని నా మానస మురళి చేసుకొంది అన్వయం
నీ పాదముల పారాణి, అందెల రవళి నాకు నిరంతరం అద్వితీయం
నీ పాదముల సొగసు చూసి నీకై  పరుగులు తీయమంటోంది నా
పద ద్వయం.
 
ఉష

******************************* 

 
 
ఉత్పలమాలికలో నా భావకవిత..
 
నీ పద నిక్వణమ్ములవి
        నిల్వగ  మానసవీధులందునన్
నీ పద నూపురమ్ములవి;
        నిస్వనముల్ మధురోహలిమ్మనన్
నీ పద మువ్వలస్వనము
          నెమ్మదినెమ్మదిగా మనోజ్ఞ్మమై   
నీ పద పల్లవంబులను
       నీ సుమసుందర మంజువుల్ గనెన్;  
నీ పిలుఫుల్, విపంచి గని
         నీరదమంచును తేలియాడగా
నీ పదమంజరుల్, మురళి
     నిస్వనముల్ సృజియించినట్లుగా    
 
కస్తూరి శివశంకర్

********************************** 


 
అందెల రవళి
 
నీ అందెల సవ్వడి  అలికిడి లో
అణువణువునా అలజడులు
నీమువ్వల స్పనాల  లాహిరి లో
ఎన్నడు ఎరుగని ఉరవడులు
ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది ఈ జీవన హేల
నీ కదలికల మెరుపుల మెలికలు
నా ఎదన గిలిగింతలు కలగ
అనంత లయతో...
నిరంత గతితో
జతులు ...
ఆడుతూ పాడుతూ
పరుగులు తీసే
రాధా మాధవ హృదయం...
 
వి. విజయ
**********************
 
 
ఘల్లు ఘల్లుమని పదముల  తొడిగిన
అందియలే నినదించగా
ఝల్లు ఝల్లుమని యెద సవ్వడులే
అందెల రవళితో జతకట్టగా
మనసు పాడెనే  మధు  మురళి
 
కలకల కూజితమ్ముల స్వనములే
స్వరాలై రాగ మాలిక నాలపించగా
పంచమ స్వరమున పాడిన గీతం
మురళి లోలుని వేణు గానమై పలుకరించగా
మనసు పాడెనే మధు  మురళి
 
పదముల కలదిన పారాణి 
పల్లవముల అరుణ కాంతులే
సంధ్యా రాగపు మధురిమలే పెంపు చేయగా
వేలికి తొడిగిన మట్టెలు  చిరు చిరు రవళుల
తప్పని లయలై హొయలు పోవఁగ
మనసు  పాడెనే  మధు మురళి
 
తలపుల  విరులే  మాలికలల్లి
పదములు కూర్చి పాటగ మార్చి
యెద సవ్వడులే లయ స్వనములైన
మధుర రీతి మాధవ  గీతిలో లయం కానీ
 
అవళూరు సీత
*******************************
 
 
సొగసు సంతరించుకున్న
పాదాల మురిపాలు
పండిన గోరింటాకు అందాలు
చక్కనమ్మకు చిక్కిన అందం
శోభాయమాన దృశ్యం
పచ్చని ఛాయాకు
సింగారాలు
కలబోసిన వర్ణాలు!
గజ్జెలు కట్టిన చిన్నది
కొసరి కొసరి ఒడ్డిస్తుంది
పరవశపు మైమరుపులు
బాపు గీసిన బొమ్మో
రవివర్మ కుంచె నుండి జారిన
రంగుల చిత్రమా!
ఇంతుల సొగసు
ఇలా చూడతరమా! కలనైనా
కనని అభినందన
అభినయ అభినేత్రి నర్తనం
మయూరం
ఎదురుచూస్తున్నా
నీ నిలువెత్తు చిత్రరాజం కోసం!
 
కోవూరి

********************* 


 
గేయ రచన,
 
గోపాలుని సుస్వర మురళి,
గోపకాంతల పదముల,
అందెల రవళి తో గోకులం,
సుస్వనమున ప్రతి ధ్వనించెన్...
 
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
 ***********************************
 

 

తేటగీతి - 1.

 పెదవికిపదముతేనిలాపేరు కుంది

మధురస్వనమువలెనుర మనసుదోచె
కాలియందలిరవళికికళ్ళు మురిసె
మురళిగానముచేతనుమురిసె మనసు
 
లలితారెడ్డి, శ్రీకాకుళం
 ****************************
 

 

సీసము
సోయగమొలికించు సుందరి పదముల
       కద్దిన మైదాకు హరువునిచ్చె
నందియ రవళియే నంతరంగము నందు
        సెలయేటి స్వనములు జేయచుండె
చిగురాకు పాదము ల్జిలుగులన్ని నెరపు
        చుండెడి నిగనిగల్ యోగితంబె!
పాదకటకములే పడతి పాదము జేరి
        హొయలొలిగించెడి యోగ్యమిదియె!

 

తేటగీతి
ముచ్చట గొలిపె పదముల మోహనాంగి
వెండి పట్టీలు ధరయించి వెలుగు చుండె;
ప్రథిత సంసార మార్గాన పావనమగు
వశను మురళించెడి విభుడెవండు గలడె!
 
వశ=భార్య
మురళించు= తిరస్కరించు
విభుడు= భర్త
 
వెంకట్. సిహెచ్

***************************** 

 

 

సీసము 

ఎంత మాధుర్యమో! నెంత సుగంధమో!

          పథక రచన యెంత పాటవంబె!
అహరహ మద్భుత యంశములివ్వగ
         సభ్యుల కవనంబు ఘనత కెక్కి
 తేనియ సమూహపు దీప్తి పున్నమి వోలె
          చంద్రికలన్ వెదజల్లు చుండె
వారంతము సతము వైభవ మిచ్చెడి
          సాహిత్యపు సమీక్ష సాతము గదె!

 

తేటగీతి
యిదియె తెలుగుతేనియతెట్టు! యింపుగాను
పద్య, వచనములల్లి భావన తరంగ
ములననుభవించెడి దళపు మోహనమిది.
వందనములివి! శ్రేణికి ప్రణతులివియె!!
 


 

ధిమి తక  ధిమి తక
 తక ధిమి తక ధిమి
పదముల సుందర స్వనముతో
రవళిల హొయలతో
మురళిల స్వరముతో
మిళితమైన నా పాదముల కలియిక తో దేహామంతయు
ఆరోగ్యం ,వ్యాయామం, శాంతం,సంతోషం, సంత్రుప్తుల
తరంగములు
ప్రవహించు చిన్నవీ!
 
మురళి
 ************************

 

నీ పదము న పారాణి రంగు
పండిన మన ప్రేమ లా
నీ మువ్వల మృదు స్వనము
మన మనసుల పాటలా
నీ మట్టెల చిరు రవళి
మన జీవన సరళి లా
 ఈ నేను- ఆ నువ్వు
గిరిధారి - మురళి లా
 
విష్ణుప్రియ
చెలి కాలి అందియల చిరు మువ్వల సవ్వడి
లయబద్ధమై , స్వర మధురిమయై. రూపొంది
నా ఎదపై రసధునులు మీటగా
మోహన రాగానికి నూపురి పోసె
అణువణువున పులకలు మెలపించె
ప్రతి అడుగు శృతి మయమై ,
ఆ రాచనడక కళకళలాడు నాట్యమై !
నెర్రని పాదాల పారాణితో, అందెల మెరుపులో
అణువణువు మెరిసె మణిరాసులై !
 
లలిత దీక్షిత్

***************************** 


 
అమ్మ కడుపులో
ఆతురతతో  తన్నిన
అపురూప పదములు
నాన్న గుండెలపై
చిందులేసిన
చిట్టి పదములు
 మెత్త మెత్తగా
అత్త చెక్కిలి తాకిన
ముద్దు పదములు
పడుతూ లేస్తూ
తప్పటడుగులు వేసిన
లేలేత పదములు
అడుగులో అడుగు వేసుకుంటూ నన్ననుకరించిన
చిలిపి పదములు
బొటనవేలితో భూమిని రాస్తూ
సిగ్గు మొగ్గలై  ప్రేమను తెలిపిన
సిరుల పదములు ...
ధూళినైనా కాకపోతిని
పాద స్పర్శతో
పులకించుదునే!!
మెట్టెనైనా కాక పోతిని
వేలుపట్టి కాలం వెళ్లబుచ్చుదునే!!
మంజీరమైనా కాకపోతిని
నిత్యా లింగనంలో
సోలిపోదునే!!
పారాణి లేపనమైనా
కాకపోతిని
నా మరణం వరకు నిన్నంటివుందునే!!
 
వాణిశ్రీ నైనాల
 ************************
 
 
యమునా తీరమున
కృష్ణుని తలచి తలచి
ఆర్తిగా ఎదురు చూచి
వేచి ఉన్నది రాధ
అల్లన నందనందనుని
 మురళి గాన స్వనము విని
తనువంతా పులకించే
చరణ ద్వయము కంపించే
మయురిలా నటన మాడే
అందెల రవళితో సందడి చేసే
భక్తి పారవశ్యంతో గానం చేసే
పదము పదములో ప్రణయ
రాగములు పల్లవింపజేసే
 
CA  కె మల్లికార్జునరావు

************************************ 

  
 
మదిలో తలపులన్నీ మతిలేక తిరుగాడి
  నీ పాదముల చెంత నిలిచి పోయె
మందార పూవులై మాణిక్య కాంతితో
  గోరింట పాదాల గుస్తరించె
కులకాంత పాదాలు గోరింట వర్ణాలు
  గుండెలో గుడికట్టి కుదురుకొనగ
చెన్నైన పాదాలు చెదరగా నీయవు
  చూపులార్ప గాలేని చూడ్కులగుచు
 
 నీదు యందియల్ దృష్టిని నిలువరించ
మెట్టినిల్లాలి మెట్టెల మెరపుతోడ
నటన చేసెడి పాదాల నాట్యగతులు
శృతిని చేయుత జీవన ధృతిని గూర్చి
 
ఓలేటి
 *****************************
 
  
కళ్ళకు కాటుక 
నుదుటన బొట్టు
తలనిండా పూలు
 కాళ్ళకు గజ్జలు
చేతులకు గాజులు
పాదాలకు పారాణి
ఇవి కదా ఇంతికి అందాలు
 
గోరింట పాదాలతో
అందెల స్వనములతో
సప్తస్వర పదములతో ఆ
మురళీ మోహనుడి(ప్రియుడి) చెంత చేరి
 పరవశమందె
 
గజ్జెల గలగల సవ్వడి తో
 నెమలి  నడకల వయ్యారిని గాంచి
ప్రియుని ఉల్లము పొంగిపోయె
ఇరు హృదయాలు రస రంజిత భరితము
 లాయె.
 
డి నాగమణి

************************** 


 
పదము లై పదిలముగా నీ నామామృతము
స్వనము లై తాకె నా మది మంజీరమున,అందెల
రవళి లో నీ నాట్య భంగిమ జత కలిసె
మురళి గానము నై నేను నిన్ను మురిపించగా
 
శ్రీనివాస్

************************ 


  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...