24, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య " కనుల కాటుక జిగి నల్లకలువలందు", 23.09.2020

 


 

23 - 09 - 2020 ; ప్రణాళిక

(సమస్యా పూరణ)

సమస్య " కనుల కాటుక జిగి నల్లకలువలందు"

సమస్యాపాదం తేటగీతి లో..

తేటగీతి

 

కనుల కాటుక జిగినల్ల కలువ లందు

చెంప నునుపుల నీడలో కెంపు మెరుపు

పగడపు టధరముల్ జాడ భాసురంబు

మేని కాంతులు జూడంగ మిసిమి ఛాయ

సీత సోయగమ్మునదాగె శిశిర శోభ

 

రమ, కంకిపాడు________________

 

 

తేటగీతి

వెన్నెలలవి పలకరించి వెలుగు లిచ్చి  

కన్నె నగుమోము సిగ్గుల కలవరంబు 

లొలుక, పరవశించేనులే రూపసి గని   

కనుల కాటుక జిగి నల్ల కలువలందు

కాంతులవి జూచి వీక్షణల్ వింత లాయె

 

వై.శ్రీదేవి_______________ 


 

శృంగారరసము

తేటగీతి - 1

పువుల బరువుచే వంగు కెంజివురు తీగ 

జాఱు సిగలందు నొసఁగంగ జాజిపూలు 

"కనుల కాటుక జిగి నల్ల కలువలందు"

సోమకాంతుల వనితల మోములందు 

వికచబంధూక కాంతులు పెదవులందు

 

 

వీరరసము

 తేటగీతి - 2

"కనులకాటుక జిగి నల్ల కలువలందు"

గానరాక వేదనతోటి కలవరంబు  

రుధిరఘాతంబుతో సేన వ్యధని జూచి

నయనమందరుణము బెంచి భయమువదిలి  

యుద్ధతంత్రముల జిగీష సిద్ధమనుచు        

రాణి రుద్రమదేవి ! నీరాజనమ్ము !!

 

కస్తూరి శివశంకర్______________ 


 

ప్రకృతి

నీ ముంగురుల హొయలే కదా జలపాతాలన్నీ..

నీ పారాణి  వెలుగులు ఎఱ్రగా మార్చాయి వెళ్తున్న సూర్యుణ్ణి....

నీ వదనకాంతి వలనేమౌ చంద్రుడి వెన్నెల వెల వెల...

నీ కనుల కాటుక జిగి నల్ల కలువలందు మెరిసింది తళ తళ....

నీవు తెలుపకున్నా నీరాకకి ప్రకృతిచ్చిన సంకేతాలు నే చూస్తున్నాను ...

నువ్వే ప్రకృతేమో అనే  విస్మయంలో నేనున్నాను....

కన్నాజీరావు________

నా పాత చిత్రం తో 

 


నుదుటి పై బొట్టు ధగధగల్  చెదరె,తగ్గె

కనుల‌ కాటుక జిగి నల్ల కలువ లందు,

కంట నీటి చారలు కారి కారి యెండె

ముఖము పైన,కేశములన్ని ముసురు కొనెను,

వదన మంతయు వాడెగా నిదుర లేక

దేహ మంతయు శుష్కించె తిండి లేక

పట్టు పరుపుల పవళించు పడతి యీమె

యిట్టి కష్టముల్ తల్లికి నేల, బ్రహ్మ

రాత  తప్పించ నెవరికి చేత కాదు

ననుచు సీతను వనములో గనుచు పవన

సుతుడు వికలిత మదితోడ వెతను పొందె

 

పూసపాటి_______________

 

 

ఇచ్చిన పాదము  తేట గీతి

నా పూరణ. మద్యాక్కర లో

తలచుచు సతతము‌ పతిని‌ ధరణిజ మదిలో నిరతము

కలవర మొందుచు  నుండె,    కనుల కాటుక జిగి నల్ల

కలువ లందు కనగ జాల, కాంచ కుంటి నుదుట నేను

తిలకపు ధగధగ లిపుడుదేహ మంతయు చిక్కి పోయె

విలువైన పోషణ లేక,వెచ్చని పరుపుల పైన

చెలిమితో నిదురించు తల్లి సీతమ్మ వదన మిచట నొ

గులుచు నుండెను గదాజుట్టు కుదురులు‌ ముడులతో నిండె,

తలచి చూడగ నెవరైన తలరాత తప్పించ లేరు,

సులువుగా ననుచు నా  పవన సుతుడు సీతను గాంచి వగచె

పూసపాటి_______________

 

 

తేటగీతి 

విరుయు దిరిసెన పూవలె మురుయు  సీత

కనులకాటుకజిగినల్లకలువలందు

రామ రూపంబు నిలుపగ రాత్రి పవలు 

జగము లెల్ల పరవశించ జనుల తోడ !

 

మాదిరెడ్డి సురేశ్______________

 

తేటగీతి మాలిక

అంచు చీరను గట్టియు అద్రితనయ

కలువ వన్నెల కాంతుల కమల నయన

సిరుల గురిపించు తల్లియు సింధుకన్య

జగము గాయుచు కన్నుల జయమునిచ్చు

అలుపు లేకను రక్షించు అంబగాను

కనులకాటుక జిగినల్ల కలువలందు

 

గీతాశైలజ_____________

 

 

తేటగీతి 

మరు లొలుకు చెలి మేని తామరల సొబగు

ముత్యమల్లె తళుకు లీను నిత్యమల్లె

కనుల కాటుక జిగి నల్లకలువ లందు

పుష్పలతిక నా మదిదోచు పువ్వుబోడి

 

వాణిశ్రీ నైనాల_____________

 

 

గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం

కన్యా శుల్కం నాటకంలోని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ గుర్తు కొస్తోంది..

ఆనాటి సమాజంలో కన్యాశుల్కం ఒక దురాచారం.

 

ఆట పాటల తోటి కన్నియలు మొగుడు తాత యని గేలి చేయగా చిన్నారి పూర్ణమ్మ దుర్గను చేరీ దుఃఖించే

కన్నుల కాటుక జిగి నల్ల కలువలందు చేరే

మేలిమి జేరెను మేని పసల్

హంసల జేరెను నడకల బెడగులు

దుర్గను జేరెను పూర్ణమ్మ...

 

వి.విజయ____________

 

 

వచన కవిత-

అభిజ్ఞాన శాకుంతలము ఘట్టం-

 

ప్రేమ వివాహంబాడి  అంగుళీయకమిచ్చి,

వెళ్ళి తిరిగి రాకున్న ప్రియ దుష్యంతుని,

మదినందు  తలచి తలచి వగచి వగచి,

చింతించు శకుంతల * కనుల కాటుక జిగి

నల్ల కలువలందు * గాంచక ,

వేకటి మనిషి కాంతులు ఆయమ వదనమందు  కనక ,

తండ్రి కన్వమహర్షి తల్లడిల్లి అల్లల్లాడెలే,

జామాత కడకు పుత్రికను కొని పోవుటకు,

నిశ్చయించి రయమున పయనమాయే.

 

CA కె మల్లికార్జునరావు____________

 

 

కృష్ణుని దేహ ఛాయ నీలి మేఘమందు

రాధ కనుల కాటుక జిగి నల్ల కలువలందు

అమర ప్రేమ మధుర కావ్యమందు

కూరిమి వినిన మనసు ముదమునొందు

 

విష్ణుప్రియ_____________

 

 

కనుల కాటుక జిగి నల్ల  కలువలందు

జిగి సరస్సు నంతను తెల్ల హంసలా మార్చు శక్తీ ని వర్ణించు యొక్తిని

కవితలకు కావ్యములకును

కవుల ద్వారా ప్రసాదింప బడును గదా.

 

మురళి మోహన్_____________

 

 

తేటగీతి.. 

కనుల కాటుక జిగి నల్ల కలువలందు

కరిగి నిశి రాత్రులయినను కనికరమున

కలత తీర్చి, మక్కువ మీర కౌగిలింతు

వనుచు, యమున సైకతముల వ్యాకులమున

వేచితి, వెతలు తీరగ వేకువ కువ

కువల స్వనముల స్వరములు కురియ నిమ్ము

 

అవళూరు సీత___________

 

 

ముంతాజ్ బేగం మరణంతో కృంగిపోయిన షాజహాను జీవితము మీద నైరాశ్యము తో ఒక రేయి నందు కలువలతో నిండి ఉన్న సరస్సుకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న ఇతివృత్తం గా తేటగీతి లో పూరణ

 

తేటగీతి.. 

షాజహాను వేదన తోడ సరసు గేగి

విశ్రమింప కలువలన్ని వెలుగుతుండ,

రాజు జ్ఞాపకముల తోడ రాణి యొక్క

కనుల కాటుక జిగి నల్ల కలువ లందు

నొదిగి నీలోత్పలములన్ని యొరిమి తెలుపు

నట్లు యుండ బాద్షా దుఃఖ మధికమయ్యె

 

మరొక పూరణ మగువ సౌందర్యము గురించి

 

మధురాక్కర

మనసు దోచె చక్కదనపు మగువను వర్ణింపక

తనువు నైగనిగ్యము తళతళలాడుచుండె గద

వనిత కటము చంద్రిక వోలె భాసిల్లుచుండెగద

కనులు నిర్మలముగయుండి కాంతిప్రకాశితమై

కనులకాటుక జిగి నల్లకలువలం దిమిడిబోయె

కటము= చెంప

 

వెంకట్.సిహెచ్_____________

 


 

 

పచ్చని వనమున

పుచ్చ పువ్వు లాంటి పున్నమి వెన్నెలలో

శశిరేఖ చింతాక్రాంతయై

అభిమన్యుని జ్ఞాపకాలలో ...

కనుల కాటుక జిగి నల్ల కలువలలో

నలిగి పోయె వెన్నెల కూడా చీకటాయె

మనసున వెలిగే లేకపోయే

మదిలో ఆశలు మాసిపోయే

ప్రేమ నే మరి మరి తలచి

ప్రాణము నిలుపుకునే

 

వి.విజయ____________

 

కనులు కాటుక జిగి నల్లకలువలందు

హరిత వర్ణపు ప్రకృతి హాయి గొలుపు వేళ

కొలను చెంతన కన్య శృంగార కావ్యమై

సంచరించు పడతి సౌOదర్య లహరిగా

కనుల కాటుక జిగి నల్లకలువలందు

 

శ్రీనివాస్_____________

 

 

శివధనుస్సును ఫెళ్ళున విరిచిన

సుందరరాముని సుందరరూపమును గాంచిన

సుందరి జానకీదేవి  

కనులకాటుకజిగి **

 **నల్లకలువలందు దాగే.

 

డి. వి. హేమలత____________  

 

 

తేటగీతి

దూర దేశమ్ము నుండి నాధుండు మరలి

రాగ; సతికి మానసమదె రంజిలగను

వేడ్క తోడ కొమ్మను గాంచి విభుడు; సతి

తలపుల కాసారమందు వలపు కురియ

కలువ కన్నుల యందున పులకలుగని;

కనుల కాటుక జిగి నల్ల కలువలందు

దాచిన యనురాగమటంచు తలచి మురిసి;

నిండు చందురుడై తాను నిరతి తోడ

స్నిగ్ధ కాంతుల వెల్గుచు చేరె సతిని!

 

చల్లా దేవిక____________ 

 

1 కామెంట్‌:

  1. ధన్యవాదాలు 🙏🙂.చక్కని పద్యాలు కవితలు.చాలా చక్కగా కూర్చారు అందరూ.
    మురళి గారి ప్రయత్నం వలన నాలాంటి వారు ఒకేచోట అన్ని చదవడానికి వీలు పడుతుంది.
    ధన్యవాదాలు.
    నా చిత్రం ఎంతో ధన్యమైంది ఈరోజు.

    రిప్లయితొలగించండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...