28, జనవరి 2021, గురువారం

చిత్రమునకు కవిత - 19.01.2021 మంగళవారం , మనిషి- మేధ- విశ్వం

 

19.01.2021 మంగళవారం చిత్రమునకు కవిత

మనిషి- మేధ- విశ్వం



చిత్రము మీద మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు

కవులు/కవయిత్రులు / ఔత్సాహికులు  తమ అంతరంగంలో దాగిన సుమధుర భావనలను వెలికి తీసి తేనియల గరిమ తెలిపెడి కవితలల్లి, సమూహానికి హరువు గూర్చగలరని విన్నపము.

 

తేటగీతి

నరుని మేధకు విద్దియ నడక నేర్ప

విద్య నిగదించు విలువలు విడచిబెట్టి

మానవత్వపు జాడలు మంటగలిపి

శాస్త్ర విజ్ఞాన మందగ జారుకొనియె

 

ఆటవెలది....

వేమన జయంతి సందర్భంగా

సుమతి శతకము జగతికి సుధలు బంచు

వేమ నార్యుని పలుకులె వేదమయ్యె

భాస్కరుని బాట పయనించు భావితరము

పట్టు వీడక చదువుడీ పద్యములను.

 

2.  సీస పద్యం

విద్య నేర్వగ నబ్బు విజ్ఞాన భాండముల్ శుద్ది జేయగన వి వృద్దిజెందు

యోగ్యమైన చదువు యోచనకు నెరవై శోధించి, సాధించ సుధలు గురియు

శాస్త్ర సాంకేతిక యస్థ్రముల్ విఖ్యాత మగురీతి, పొదిలించి వేగమంద

రాకెట్లు, లాంచర్లు రయ్యని పరుగులు కొరొనాను యింటికి తరిమిగొట్టె

 

తేటగీతి

విద్య రూపము మారగ విశ్వమందు

పట్టు వీడక మనుజులు పరుగుదీయ

మానవత్వపు సత్తువ మరువవద్దు

విలువలుడిగిన విద్దెకు నెలవు గనము.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

ఓ మనిషి నీ మేధస్సుకు విశ్వంలోని రహస్యాలను తెలుసుకొ నె దక్షత ఉంది నీ మేధస్సులో అనవసర విషయాలలో గందరగోళం చేయకు నీ మేధస్సు లోని ఆలోచనలు పరమాత్మకు సంకేతాలు

మీ మేధస్సుకు కు అనూహ్యమైన  శక్తి ఉంది. ఆ శక్తిని జాగృతం చేయు, నీ మేధస్సుతో అనంతమైన అనుభవైక వేద్యమైన అపూర్వమైన విజయం సాధించు.

మంజూష నిజామాబాద్.

 

 

తే. గీ.

సృష్టి యందున మనుజుండు శ్రేష్ఠుడౌను

 య ద్భుతం బగు మేధస్సు య తడి సొత్తు!

వాడవలయు దానినీ ప్రపంచ శాంతి

కొరకు, విశ్వవినాశము న్ గో ర రాదు!!

డి.రామ నాగేశ్వరరావు

 

 

మనిషి,మేధ,విశ్వం

మనిషి అంతరంగమందుండు నొక విశ్వము

బహిరంగమందు వెలయు నింకొక విశ్వము

రెంటినీ సృష్టించె పరమాత్మ స్వమనమ్మున

జూడ నీరెండు నొకటే, నిదియే నద్వైతమ్మన.

CA కె మల్లికార్జునరావు

 

 

ఆ.వె II

మేధ పెరిగి మనిషి బేధ భావము జూపె

విశ్వమంత తిరిగి విర్రవీగె

చేవ చచ్చి తుదకు చీకాకు పడిపోయె

క్రిమిని జూచి డస్సి క్రమము తప్పె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

వచనం

విశ్వం ముందు మనిషి మెదడు,

పరిమాణంలో చాలా చిన్నది,

అయినాసరే విశ్వాన్ని తన లో,

ఇముడ్చు కోవాలని అహర్నిశలు,

పరిశోధిస్తూనే ఉంటుంది మనిషి మేధస్సు....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

శతక పరిచయం చేసిన మొదటి రోజు విన్నవించినట్లు, విధివశాత్తు మాయమైపోయిన వారి అబ్బాయిని, శాంకరియే,  ఆపదనుంచి ఉధ్ధరించి, క్షేమంగా ఇలుచేర్చిందనే కృతజ్ఞతతో....

పద్యాలలో సింహభాగం, అప్పటికప్పుడే అశువుగా చేసిన శతకమిది.

ఆయన నివాసం రాజమహేంద్రిలో

అక్కడి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రవిభాగానికి అధిపతిగా వృత్తి రీత్యా...

అక్కా,బావలు.. భీమవరం లో రెండు వేర్వేరు హైస్కూళ్ళకి  ప్రధానోపాధ్యాయులు.. అది 1977..కవిగారి అబ్బాయి, అప్పుడు 10 వ తరగతి...ఆ అబ్బాయిని తమ దగ్గఱ ఉంచుకుని, తీర్చిదిద్దుతామన్న అక్కాబావల ప్రేమపూర్వక ఆహ్వానాన్ని కాదనలేక, భీమవరం లో వారి దగ్గర ఉంచారు. ఒక రోజు సాయంత్రం ఆ అబ్బాయి స్కూల్ నుండి  ఇంటికి తిరిగి రాలేదు.. మాయమై పోయాడు.

మరునాడు ఉదయం క్షేమంగా తిరిగి వచ్చాడు.ఎవడో బైరాగి, కాషాయ దుస్తులలో ఉన్న జటి.. తనని, స్కూల్ నుండి వస్తుండగా, ఢీ కొట్టడం మాత్రమే గుర్తుందని.. తరువాత ఏం జరిగిందో గుర్తులేదని చెప్పాడు.. ఏ వశీకరణమో..మత్తుమందు ప్రభావమో తెలియదు..

ఓ అర్థరాత్రి మెలకువ వచ్చి చూస్తే.. వీరవాసరం రైల్వే స్టేషన్ లో.. ఆ బైరాగి పక్కన పడుకుని ఉన్నాడు.. ఆ బైరాగి కునుకులో ఉన్నాడు.. రైలు ఎక్కించి ఎక్కడికి  తీసికెళ్లాలనో, ఏమి కీడు చేద్దామనో..ఏ రైలు కోసమో... వెయిటింగ్... ఆ అబ్బాయి, చిన్నగా తప్పించుకుని, ఎవరో సైకిల్ ఆసామి.. రైతు కనిపిస్తే, బ్రతిమలాడి,అతనినెక్కించుకుని,తనే సైకిల్ తొక్కుకుంటూ పాలకొల్లు లో ఉన్న ఇంకో బంధువుల ఇంటికి ఏ తెల్లారు ఝాముకో  చె్రుకున్నాడు.

తమ కుమారునికి, మత్తు మందు ప్రభావం నుండి మెలకువ తెప్పించి, ఆ సన్యాసికేమో  పెనుమత్తు కల్పించి,వాడి దుష్టాలోచన వమ్ము చేసి, అబ్బాయిని రక్షించి తమ  వద్దకు క్షేమంగా తిరిగి చేర్చి, పుత్ర వేదన తప్పించింది తను ఆరాధించే తన శాంకరీ మాతయే అని అయన ప్రగాఢ విశ్వాసం..ఏమయితేనేం..

ఒక దుర్ఘటన సుఖాంతం అయ్యింది. ఇది కథ కాదు.. వాస్తవం.

తన చివరిరోజు వరకూ ఆ కృతజ్ఞతతోనే  ఆమెని అనుక్షణం తలచుకుంటూ,పూజిస్తూనే     గడిపారాయన.

ఈ ఘటనలో నాకు మాత్రం, ఘటనాఘటన సమర్థురాలు, ఆ శాంకరి లీలయే  ద్యోతకమయ్యింది.

నాకనిపించింది.. తప్పిపోయింది . సోమారామం ఉన్న భీమవరంలో..ఆపద

తప్పిచ్చుకుని చేరుకున్నది క్షీరారామం అయిన పాలకొల్లుకి. ఆ భీమవరం సోమేశ్వరస్వామి, అన్నపూర్ణలు, క్షీరారామ క్షీరరామలింగేశ్వరస్వామి,పార్వతీదేవియే రక్షించారేమో అని. ఇంకా విచిత్రంగా..ఆ అబ్బాయి పెద్దయి,20 ఏళ్లుగా అక్కడే  ఉంటూ కొలిచేది ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి, మాణిక్యాంబనీ... ఇది అంతా ఒట్టి కాకతాళీయమే అని కొట్టి పారేయగలమా ? ఏమో !

 ఇక, కొసమెరుపు...

ఆ అబ్బాయే మా మేనమామగారి పెద్ద కొడుకు. పెద్దయ్యాక, మా చెల్లాయికి భర్త అయ్యాడు. అతని చెల్లాయే నా better-half.. నా కాంతం. POT EXCHANGE Marriages అన్నమాట..

రెండు పెళ్లిళ్లు ఒకే రోజున.. ఒకే వేదికమీద జరిగాయి.

అతను,ఎమ్.ఏ. బియెడ్.. స్కూల్ టీచర్ గా ద్రాక్షారామ లో పనిచేస్తూ,

అదృష్టం వల్ల అనునిత్యం, ఆ ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి, మాణిక్యాంబనీ సేవిస్తున్నాడు.

పర్సనల్ విషయాలు కదా షేర్ చేద్దామా వద్దా అని రెండు మూడు పర్యాయాలు యోచించిన తరువాతే పంచుకుంటున్నాను.. మీరందఱూ నాకు ఆత్మీయులే కదా, పంచుకోవడం తప్పుకాదు అనిపించింది. ఈ విషయాలు, ఇక్కడ, అసంబద్ధం మాత్రం, ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే,

ఈ పూర్వవృత్తాంతమే, కవిహృదయాన్ని సరియైన దృక్కోణంతో చూడగలిగి, శతక రచనకు ప్రేరణ అయిన హేతువును సరిగా అర్థం చేసుకోడానికి, ఆ పద్యాల అంతరార్థాన్ని ఆసాంతం ఆస్వాదించడానికి దోహదపడుతుంది.

చాలా పద్యాలు ఈ నేపథ్యాన్ని స్పృశిస్తాయి... అందుకని.

"అమ్మలఁ గన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ.' శివాని.. శాంకరి

"నిను నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ !!

వట్టెం వెంకట రమణ

 

 

ఆపదుద్ధారిణీ శతకము (భాగము -3)

ప్రభ్వీ!శివగౌరీ! మహా రహస్య!

ఆపదుద్ధారిణీ ! శరణు !!

 

6

మ.

ఇక నేనట్ల యొనర్తు నీ స్మరణ నిద్రింపగ మచ్ఛయ్య మీ

దకు బోవన్ మఱి మేలు కాంచిన యెడన్ దైనందినాచార, కా

ర్యకలాపంబుల జిక్కినన్;విడువకమ్మా నను నీ పాద సే

వకు, నీ యీ శరణార్థి రక్షణ కలాపా ! ఆపదుద్ధారిణీ !!

( మచ్ఛయ్య.. మత్ శయ్య మేలు కాంచిన యెడన్.. మెలకువ వచ్చినప్పుడు, మెలకువగా ఉన్నపుడు)

 

**********

శా.

నీవే దెచ్చి యొసంగినట్టి కొమరున్ నేనింటికిందెచ్చుచో

దేవీ! త్రోవన నెంత సిగ్గు పడిపోతిన్! వీని  కే దండ్రినే

కావచ్చున్; కొడుకట్టి యిక్కటున జిక్కన్, నీవ కాపాడినా

వీవే తండ్రివి నా కుమారునకు ప్రభ్వీ ! ఆపదుద్ధారిణీ !!

 

శా.

కాడీ పుత్రుడు పుత్రమాత్రుడదె యే గంధర్వుడో శప్తుడై

నేడస్మద్గృహసీమ బుట్టె నిజమంతే !కాక ప్రత్యక్షపుం

జాడన్ నీదు మహత్త్వమిట్లు తెలుపన్ సాధ్యంబె ? ఛిజ్జ్రుంభణ

క్రీడా లాస్య ! మహా రహస్య ! శివగౌరీ ! ఆపదుద్ధారిణీ !!

 

( పుత్రమాత్రుడు వట్టి పుత్రుడు మాత్రమే కాదు శప్తుడై.. శపించబడినవాడై, శాప వశుడై నేడస్మద్గృహసీమ.. నేడు... అస్మత్.. గృహసీమ..నా ఇంటిలో)

చిత్.. JrumbhaNa..(తెలుగు టైపింగ్ కి లొంగడం లేదు) క్రీడాలాస్య.

 

శా.

నీ మేల్ ప్రాణములుండగా మఱవలేన్ నిక్కంబ యీ బాము రే

ఖామాత్రంబుగ నేని;పై భవములన్ జ్ఞప్తిందటస్థించినన్,

నీ మాహాత్మ్యములుగ్గడించుచు, గృతుల్ నిర్మించుచున్,  నీ జపం

 

బే మంత్రంబుగ బట్టుచున్ మురిసిపోనే ! ఆపదుద్ధారిణీ !!

( ఉగ్గడించు.. ప్రస్తుతించు, ప్రశంసించు  కృతుల్.. కావ్యములు, రచనలు)

 

10 మ.

పటుభక్తిన్ దలమున్కలైన సుకవుల్ పాల్కుర్కి సోమన్న, ధూ

ర్జటి, శ్రీనాథులు నీదు పెన్మిటి విచిత్రంబైన లీలల్ వచిం

చుటకున్ హేతువు వారి జీవితములం జూపించియున్నట్టి యు

త్కటతాదృక్కరుణా నిదర్శనమె కాదా ! ఆపదుద్ధారిణీ !!

( పెన్మిటి... పెనిమిటి, భర్త

లీలల్ వచించుట.. లీలలు కావ్య, ప్రబంధాలుగా వ్రాయడం

ఉత్కటతాదృక్కరుణా నిదర్శనము... ( ఉత్కటము..అధికమైన/గోప్ప..)

అధికమైన/గోప్ప  కరుణా(కటాక్ష)వీక్షణములే ఋజువు/నిదర్శనము)

వట్టెం వెంకట రమణ

 

 

తేటగీతి

వేల కోట్ల కణములకు విడిది యైన

మనిషి మేధజాడ మరచి మరల మరల

వెదకు చుండు సంతోషపు బెడగు కొరకు

విశ్వమంత  భ్రమణమొందు విసుగు లేక

ఆత్మ లోని జ్ఞాన జ్యోతి హరువు గనక

రమ,కంకిపాడు

 

తే

మనసు చక్షువుతో గాంచు మహిమనొంది

మనిషి విశ్వవీక్షణ చేసి మహిని గెలువ

నర్భకుడు చరాచరముల నదుపుచేయ

వింతగాదె నరుని మేధ  విశ్వమందు

 

 

ఉ.మా

ఎంతని గొల్వ విశ్వమిది యింతని జేతికి చిక్కినట్లుగన్

వింతల మర్మమెంచకిది  వేడుక తోచెను మానవాళికిన్

పొంతనలేని పోకడల పోడిమి నాశమొనర్చబూనుచున్

చింతన జేయకీ మనిషి చిక్కె నవీనత మోహమందునన్

వాణిశ్రీ నైనాల

 

 

తే.

 మర్త్యలోక మేధాశక్తి మహిమలన్ని

తామొనర్చె దుష్ట పనుల ధాటికి రహి

నలసిపోయి మేధాచక్షువులుగ నరులు

మరలుబడి వగచుదురోయి ధరణి నందు

అన్వయము తెలుపు నిమిత్తము అర్థములు

నలసిపోవు= నశించు,     మేధాచక్షువు= గ్రుడ్డివాడు

 

 

మేధస్సు

ధనంబు , ఆభరణంబులు మూటగట్టి దాచుకోగానీ

వాడుకో పూర్తిగా సృష్టి కర్త మనందరికీ ఇచ్చిన ఈ అద్భుత మెదడును

అవయవములన్నిటికీ అదియే ఆత్మబంధువు, ప్రాణ మిత్రుడు

నిదురించనంత సమయంబును వినియోగించు వివిధరీతుల

సద్విషయంబులపై చురుకుగా , హుషారుగా

అటులయినచో లేదుకదా ఢోకా ఆరోగ్యంబునకు !

జి మురళీ మోహన్ రావు

 

 

మనిషి మనిషిని దెలియంగ మనసు తోడ

మేధ నెంత యొ వాడెను మెల్ల మెల్లగ

 విశ్వ మందలి విషయ పు , విద్య లెల్ల

గరపి, మేలును పొందెను  కౌశలముగ


 

కం||

మెదడుకు బని జెప్పక తా

నెదుగుటకై పాటు బడక నెట్టి విధముగన్

కుదిరిన రీతిగ బ్రతుకును

ముదముగ నడిపించ వలదు మూర్ఖుని వోలెన్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

తేటగీతి

వేలకోట్ల కణములకు విడిది యైన

మనిషిమేధ జాడమరచి మరల మరల

వెదకుచుండు సంతోషపు బెడగు కొరకు

విశ్వమంత  భ్రమణమొందు విసుగు లేక

ఆత్మ లోని జ్ఞాన పు జ్యోతి హరువు గనక

రమ,కంకిపాడు

 

 

సీ.

విశ్వమండల మందు వెలుగు కిరణముగ నిలిచి జ్ఞానార్థి యై నివ్వటిల్లు

మానవ మేధస్సు మహిమ నెంతయొ గద! వలువలె లేనాది వాసియైన

మానవుని బ్రతుకు యానపు పరిణామ పరిమాణ మంతయు పరిగణింప

బ్రహ్మ చకితుడయి ప్రతిసృష్టి నొనరించు నరుని మేధస్సుకు నమసు లిడునె

గీ.

దినదినము ప్రవర్ధిల్లెడు మనుజు నంత

రంగమందు జనించెడు ప్రభవ మెంతొ!

జ్ఞాన తృష్ణతో యెసగ విజ్ఞాన గనులు

ద్రవ్వి నిపుణత తోడ తా రాసికెక్కు

వెంకట్.సి హెచ్

 

 

వేద కాలమునాడు వేదవిద్యలఁనేర్చి అణిమాది మహిమల నలరినావు

త్రేతా యుగంబున దివ్యమౌ గమనాన ధర్మంబుఁ దప్పక తనరినావు

ద్వాపరమందున వ్యాసుని యండన దుష్ట సమూహము దునిమినావు

కలియుగం బందున ఘనమేథ తోడుగా నిఖిల జగంబును నియతిఁజేసి

 విశ్వ నిర్మాణ సాఫల్య వినుత చరిత!  

 విశ్వమంతయు ముంజేత పేర్చినావు

 మంత్ర శక్తికి ధీటుగా యంత్ర శక్తి

 పదిల పరచిన మేథావి! వందనమ్ము!

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

సీసపద్యము

నవ్యపొంకముల మానవమేధ వికసించి వింత పుంతలు ద్రొక్కివివిధ పసల

జీవనగతులన్ని జిగిదేఱగ ప్రగతి పథముల వైపుగపయనమయ్యె

అహరహము ప్రవృద్ధమగు స్వార్థబుద్ధుల కోర్కెల వలలోన కూరిపోయి

నరుడు తన వినాశనమునకు తానె హేతువయిన దుస్థితి తోడు కాగ

 

ప్రకృతిప్రళయ తాండవమాడి ప్రబలినంత

మందు లేని వ్యాధియెమహా మనిషి యుసురు

తీయ ,తెఱకువ మరిచిన మాయమనిషి

మేధయే నొక వింతగా మిడిసి పడెను

అవళూరు సీత

 

******* 

 

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...