14, జనవరి 2021, గురువారం

14 01 2021, చిత్రం - భావం, సంకురాతిరి తెచ్చును సంబరములు

 సంక్రాంతి శుభాకాంక్షలు 


****** 


******

చిత్రము మీద మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు

కవులు/కవయిత్రులు తమ అంతరంగంలో దాగిన సుమధుర భావనలను వెలికి తీసి తేనియల గరిమ తెలిపెడి కవితలల్లి, సమూహానికి హరువు గూర్చగలరని విన్నపము.

 

(సంకురాతిరి తెచ్చును సంబరములు)

తారావళి

ఒకటి

గగన మందున తిరుగాడు   కర్మ  సాక్షి

మాసమున కొక‌‌ రాసిని‌ మారు చుండు,

భానుడు  మకరమున‌ జేర వచ్చు నట్టి

సంకు రాతిరి తెచ్చును‌ సంబరములు

 

రెండు

కొత్త పంటతో రైతుల గూళ్ళు నిండ

ధాన్య లక్ష్మితో గృహములు‌ తాండ వించు

పసిడితో నలరారెడి పల్లె లందు

సంకురాతిరి తెచ్చును  సంబరములు

 

మూడు

తెల్ల వారక ముందుగా పల్లె లందు

మగువ లెల్లరు లేచి గోమయము జల్లి

రంగవల్లులు దీర్చంగ లక్ష్మి వచ్చు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

నాలుగు

అటక పైన దాగిన బొమ్మలన్ని‌ దించి

శుభ్ర పరచి రంగుల నద్ది  శోభ తోడ

బొమ్మల కొలువు చేర్చంగ భోగ మిడెడు

సంకురాతిరి తెచ్చును‌ సంబరములు

 

అయిదు

గంగిరెద్దుల మేళంబు ,చెంగు చెంగు

మనుచు దూకు లేదూడలు, మదికి హ్లాద

మిచ్చు  హరిదాసు  కీర్తనల్, మిసిమి నొప్పు

సంకురాతిరి,తెచ్చును సంబరములు

 

ఆరు

చలిపులి విసర పంజాను, చెలిమి తోడ

నెదురు కొన భోగి‌మంటల  నెల్ల జనులు

తెల్ల వారు ఝామున వేసి తృప్తి బడెడు

సంకురాతిరి తెచ్చును‌ సంబరములు

 

ఏడు

కోడి పందెంబు లొకప్రక్క కొలువు దీర,

కొత్త బియ్యపు పొంగళ్ల ఘుమఘుమ లొక

ప్రక్క తాక మురిసి పోవు  ముక్కు లన్ని,

సంకురాతిరి తెచ్చును‌ సంబరములు

 

ఎనిమిది

మేళతాళముల రవముల్ మిన్ను కెగయ

సంక్రమయ్య ప్రతిమను కంసాలి వద్ద

నుంచి తెచ్చి బొమ్మల మధ్య  నుంచు  నట్టి

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

తొమ్మిది

రాగి నాణెముల్,పువ్వులు,రేగి పండ్లు

పిల్ల పాపల  తలలపై తల్లు  లెల్ల

పోసి దీవించు చుండుగా భోగి నాడు

సంకురాతిరి తెచ్చును‌ సంబరములు

 

పది

కొత్త పరికిణీలను కట్టి,కులుకు లిడుచు

కూరిమి గల పతిని‌ కోరి గొబ్బి యలను

పూజ చేతురు కన్నియల్ మోజు తోడ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పదకొండు

కొత్త బెల్లము,వరిపిండి,కొబ్బరి పలు

కులును యేలకుల పొడుము  కలిపి చేసి

నట్టి చలిమిడి నెల్లరున్   పట్డు బట్ట

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పన్నెండు

నేతి యరిసెల వాసనల్ నెమ్మి‌ గూర్చ

జంతికల ఘుమఘుమ లిడ సంత సమ్ము

నాసికా దోయి ఘనముగ నాట్య మాడ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పదమూడు

చెరుకు గడలను పండ్లతో చీల్చు కొనుచు

మొక్క జొన్నవిత్తులు నోట కుక్కు కొనుచు

పచ్చి శనగలు నోటిలో పగులుచుండ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పదునాలుగు

డోలు సన్నాయి వాయించ కాలు దువ్వి

గంగి రెద్దుల జతలన్ని కదలి‌వచ్చి

చిత్ర గతుల నాట్యంబాడు చెలిమి‌ తోడ

సంకురాతిరి తెచ్చును‌ సంబరములు

 

పదిహేను

శంఖ మూదుచు తిరుగాడు జంగమయ్య

లొక్కవీధిలో,హరిదాసు లొక్క చోట

కీర్తనలు సలుపుచు నుండు నార్తి తోడ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పదహారు

చెరువు గట్టునకు జనము జేరి  మర్రి

మాకుకు ఘనత నొప్పారు మోకు కట్టి

వూయలల నూగి పొందెదర్ హాయి నచట

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

పదిహేడు

కాపు గారి కోడి గెలుచు కాయ మనుచు

పందెమును కోరు కొందరు, పట్టు బట్టి

నాయుడమ్మ  కోడి గెలుచుకాయ మనగ

సంకురాతిరి తెచ్చును సంబ రములు

 

పదునెనిమిది

పాయసంబుయు,పులిహోర పానకంబు

పెసర వడపప్పు, గారెలు, పెరుగు బువ్వ

దేవుని ప్రసాదము జనత తీసు కొనెడి

సంకురాతిరి తెచ్చును సంబ రములు

 

పందొమ్మిది

పంట కాలువలో దిగి  పరవశముగ

జలకముల నాడు చుండగ లలన లెల్ల

చెరువు లోదూకి కొందరు చిందులేయు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై

కోర చూపుల బావలు ,నోర చూపు

చూచు మరదళ్లు,బుగ్గలన్ దాచు కొనిన

సిగ్గులు నడుముపై  చేసెడు చిలిపి పనులు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై ఒకటి

పట్టు చీరలన్ ఘనముగా  కట్టి పడతు 

లెల్ల పిల్లపాపల తోడ   నుల్ల మలర

వెడలు పేరంటములకును వేడ్క తోడ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై రెండు 

ఎద్దు కొమ్ములను కడిగి యెరుపు రంగు

వేసి, గోవులకు పసుపు పూసి బొట్లు

పెట్టి పూజించ‌ నెల్లరు ప్రేమ తోడ

సంకురాతిరి తెచ్చును  సంబరములు

 

ఇరవై మూడు

పెయ్య దూడకు మెడలోన పిల్ల గంట

కోడె దూడకు గంటలు కొమ్ము లందు

కట్టి తిరుగాడ ముదముగన్ కాంచు నట్టి

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై నాలుగు

కొత్త  యల్లుళ్ళు చేరంగ నత్త వారి

గృహమునకు కళ కళ లాడు నెల్ల వేళ

లందు వెలుగు కన్నె ముఖము లక్షణముగ

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై  అయిదు

పిల్ల పాపలతో గూడి  పెద్ద  వారు

గాలి పటములు వదలుచు గోల చేయ

నింగి లో నాట్య మాడుచున్ నెమ్మి నిడెడు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై  ఆరు

ఆట పాటల తో పూల బాట పైన

ముక్కనుమ నాడు చేఱును ముదిత లెల్ల

సంక్రమయ్యను వదలంగ సరసు లందు

సంకురాతిరి తెచ్చును సంబరములు

 

ఇరవై ఏడు

తెలుగు నాటన జనులకు వెలుగు నిడుచు

పెద్ద పండగై జనులకు  ప్రేమ నిడుచు

మూడు రోజులు జనులకు  మోద మిడుచు

సంకురాతిరి తెచ్చును సంబరములు

చిత్ర బంధ కవి , పూసపాటి

 

సంబరాల సంక్రాంతి:-

ఆవు పేడతో కళ్ళాపి జల్లి అందంగా తీర్చిన రంగవల్లులు ...

బంతి పూల సింగారింపుతో  ముస్తాబైన  గొబ్బెమ్మలు ...

కొత్తధాన్యపు సంచులతో నిండుగానున్న  లోగిళ్ళు ...

అల్లుళ్ళ సందళ్ళతో మురిసిపోయే అత్తమామలు ...

కుంకుళ్ళతో తలంటు స్నానాలు ...

పట్టుపరికిణీలు, గాజుల  గలగలలతో  అందాలొలికే ముద్దు గుమ్మలు ...

హరిదాసుల సందళ్ళు ...గంగిరెద్దుల పరుగుల్లూ...

పచ్చంచు చీర కట్టిన పల్లె సీమ అందాలు ...

చలిపులిని పారద్రోలే భోగిమంటల భగభగలు...

షడ్రసోపేతమైన పిండివంటల ఘుమఘుమలు...

కోడిపందాలు ...అంబరాన్నంటే సంబరాలు...

వెరసి సంక్రాంతి పండుగ పరవశాలు...!!

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ...!!

సుకన్య వేదం

 

తెలుగు వారి సంప్రదాయం...

ప్రతి తెలుగు వాడి హృదయం సంతోష మయం...

తెలుగింటి తోరణాలు...

తెలుగింటి వంటలు...

పల్లె గడపలు... ముగ్గుల వాకిళ్ళు ...

భోగి మంటల వెచ్చని ఆత్మీయతలు...

సంక్రాంతి గొబ్బెమ్మల ఇంటింటి అందాలు....

కనుమ చెరకు తీపి కబుర్లు...

అమ్మమ్మ , తాతయ్యల ..పుట్టింటి ఊరు జ్ఞాపకాలు...

కోడి పందేల సరదాలు...

కొత్త అల్లుళ్ల దర్పాలు ...

మరపురాని మధురానుభూతులు...

CA  కె మల్లికార్జునరావు సరోజాదేవి

 

 

ఉత్పలమాల

పండుగ దెచ్చెనన్ సిరుల పంటలు సైరికునింట హెచ్చుగన్

మెండుగ సంతసంబునట, మేలుగ నబ్బిన భోగ భాగ్యముల్ 

నిండుగ శోభయున్ ,మిగుల నేర్పుగ దిద్దిన రంగవల్లులున్

దండిగ పూజలన్ మడక, దాపట వల్పటి కోడెదూడలన్..

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, వాకిళ్లలో ముగ్గులు. కానీ సం అంటే మంచి, క్రాంతి అంటే మార్పు.  అలాగే సంక్రమణం అంటే మారడం, క్రాంతి అంటే అయోమయానికి నివృత్తి అనికూడా ఉన్నాయి. మనజీవితంలో కూడా మంచి మార్పు, మంచి వైపు పయనం అనేది కోరుకుంటున్నామా!! వ్యక్తిగతంగా మనలో మార్పు అవసరమో గుర్తించమా! తనతో తను,కుటుంబంతో, సమాజంతో, ఎలాంటి మార్పుకావాలో గమనించామా!! ద్వేషానికి, అసూయకు,అసహనానికి దూరం.ఒక రోజులో కనీసం ఒకరికి ప్రత్యుపకారం కొరని సహాయం. కనీసం ఇద్దరు మిత్రులు, బంధువులతో మాట్లాడటం.రోజుకు ఒక్కసారయినా కుటుంబంతో కలిసి భోజనం. రోజులో అరగంట శరీరాన్ని , మనసును  శుద్ధి చేసుకోవడం. ఖర్చులు ఎందుకు పెడుతున్నామో తెలుసుకోవడం.ఎంతమంది కొత్త మిత్రులను పొందాలి.. ఇంకా ఏవీ మనకు మేలుచేస్తాయో తెలుసుకుని సంక్రాంతి వైపు పయనిస్తారని ఆశిస్తూ " సంక్రాంతి  శుభాకాంక్షలు "

రాంమోహన్

 

హాయి హాయిగా

మనసే మనోహరం గా

మకర సంక్రాతియే మధురంగా

అందచందాలతో అన్ని హంగులతో

రంగు రంగులుగా శోభాయమానంగా

తీర్చిదిద్దిన చిత్రమే కలిగించు చుండె

అంతులేని ఆనందము సంపూర్ణ ఆహ్లాదము !

జి మురళీ మోహన్ రావు

 

రంగుల రంగవల్లికలు లాలిత పద్యసుమాలు జల్లినన్

హంగుగ హాసచంద్రికల నందముజిందగ దివ్య శోభలై

పొంగగ , సంతసమ్ములన పుష్యమిరాగము పల్కరించగన్

రంగహరీ యటంచు సుమరాగములన్ పచరించు దాసులే

చెంగలువల్ విలోకనపు శీతగభస్తి విలాసయుక్తమై !

మంగళహారతుల్ వెలుగు మానితమౌ వరమీయగన్ సదా

 

 

తే.గీ

రంగవల్లుల వరముల రాజ్యలక్ష్మి

వరసిరులు కటాక్షించు  సౌభాగ్యలక్ష్మి

దరికి జేరంగ వచ్చెను ధాన్యలక్ష్మి

సుజనులకు జయములనిమ్ము విజయలక్ష్మి

సకల జనులకు గోరెద శాంతి సుఖము

కరుణతో వరమీయు సంక్రాంతి లక్ష్మి

కస్తూరి శివశంకర్

 

ఉత్పలమాల:

కూడిన చుక్కమ్రుగ్గువల "కోవిడు" రక్కసి చిక్కి  సొక్కగా

పాడు "కరోన" గొబ్బెమల పాదములంబడి నల్గి నీల్గగా 

 వీడగ బాధలన్నియును వేగమె "వ్యాక్సిను"వచ్చుచుండగా

వేడుక మీర సంక్రమణ వెల్గులు లోకములందు నిండెగా.

గోలి

 

సంక్రాంతంటే...................

సంక్రాంతంటే గొబ్బెమ్మలు, ముద్దు గుమ్మలు,

సంక్రాంతంటే రంగవల్లులు, ఆడపిల్లలు

సంక్రాంతంటే హరిదాసులు,  పల్లెవాసులు,

సంక్రాంతంటే పల్లెవాసులు,  ధాన్యపురాసులు,

సంక్రాంతంటే పట్నవాసులు, గాజు గ్లాసులు,

సంక్రాంతంటే పట్నవాసులు, పల్లె దెసలు,

సంక్రాంతంటే బడి సెలవులు, పిల్లలు  చెరువులు,

సంక్రాంతంటే గంగి రెద్దులు, పెద్దల సుద్దులు,

సంక్రాంతంటే అత్తమామలు, కొత్త అల్లుళ్ళు,

సంక్రాంతంటే తల్లిదండ్రులు, కొడుకులు కూతుళ్లు,

సంక్రాంతంటే గడసరి బావలు, సొగసరి మరదళ్ళు,

సంక్రాంతంటే మమకారాలు, వెటకారాలు,

సంక్రాంతంటే భోగి మంటలు, పిండి వంటలు,

సంక్రాంతంటే కోడిపందేలు, పులావ్ పళ్ళాలు,

సంక్రాంతంటే కుర్రకారులు, పందెపు దారులు....

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

తే. గీ.( ఆరు పాదాలు)

పాడి పంటల ధిక మిచ్చి భాగ్య సిరుల

పంచి పర్వ పు సంతుష్టి పెంచి యిలను

మమ్ము చల్లగా కాపాడు మనసు కలుగు

మూగ జీవములార! యీ స్వాగతము ను

పలుకు చుంటిమి మేమిచ్చు పసుపు కుంకు

లను సాద రాన గొనుడు మహిత కరుణ.

డి.రామ నాగేశ్వరరావు


ధాన్యరాసుల గాదెలే ధైర్య మిడగ

పిల్ల పాపల నవ్వులే వెల్గులవగ

యింతి దిద్దెడిముగ్గులే యింటి కింపు

పొలము దున్నే బసవడికి పూజ చేయు

పుణ్య భూమినాదని మది పొంగి పోయె

సంబరాల సంక్రాంతికి స్వాగతమ్ము

రమ,కంకిపాడు. 



ఉ.మా

చుకు కుల్కు పల్లె విడ మౌనము నింపగు పుల్గు పాటలన్

దంచెడి శైత్యమున్ తనదు దారికి దెచ్చుచు వైరి దీధితుల్

గాంచ ఖబాష్ప బిందువుల గజ్జెలు దాల్చిన ధాన్య రాశులన్

బంచును సంబరంబులిల బండుగ పుష్యపు శోభ నిండగన్

ఖబాష్ప= మంచు


కలిమి గూర్చు పశువులకు హలముగట్టి

ఎద్దులకు మ్రొక్క నేతెంచ నేరువాక

ధాన్య రాశుల గొల్తురు దాన మొసగ

బ్రతుకు కర్థము దెల్పెడు పండుగిదియె!


పిల్ల పాపల యాటల పేర్మి జూప

బంధు మిత్రుల కలయిక బలము గూర్చ

నేతి యరిసె మినపసున్ని నినుపుజేయ

కోడి పందెంబులుత్సాహ కోహలములు

గాలి పటముల కేరింత కేళి నెరప

కాంతులానంద హేల సంక్రాంతి శోభ


వాణిశ్రీ నైనాల 

 


ఆ  బాల భానుని లేలేత కిరణాలు 

పుడమిని  తాకుతున్న వేళ

కుహు కుహు అని కోయిలమ్మ రాగాలు

వీనులకు విందు చేస్తున్న వేళ

సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలాలని

నిదురమబ్బుని వీడె ప్రజలంతా


ఇంటి ముంగిట చలిమంటలు వేయంగా

ముద్దుగుమ్మలు రంగురంగుల రంగవల్లులు

 గొబ్బెమ్మలతో తీర్చి దిద్ధంగ

పిల్లలు ఆటపాటలతో ఆనందాల కేరింతలతో ఆటలాడంగ

అమ్మ లందరూ పిండి వంటలలో 

మునిగి తేలంగా

 సంకురాత్రి సంబరాలు మిన్నంటే.


కోడి పందాలు ఎడ్ల పందాలతో

పల్లెలు కోలాహలంతో నిండిపోయే

మూడు రోజుల పండుగ ముచ్చటైన పండుగ  గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ భామ లందరూ నాట్యం చేస్తూ 

కనులకు ఆహ్లాదం పంచే

నాగమణి దేవరశెట్టి 




1. తేటగీతి

సంకురాతిరి జరుపగ సంబురముగ

పుస్తకములను దీయుడు బుద్దిమరలి

పద్య రచనలు జేయుడు భారమనక

సారు యాఙ్ఞయె మనకిల సంతసమ్ము..


2. తేటగీతి

తెలుగు పద్యముల్ చదువగ వెలుగులీను

పలుకు బంధముల్ మెరియంగ పగడమల్లె

పదము లందుండు జిలుగులె పద్యమగును

మాతృ భాషకు జైకొట్టు మహము జూపి 

పి.ఎల్.నాగేశ్వరరావు 




తే.

ఇంటికి సిరుల కాంతుల నింపుగాను

మోసుకొచ్చెడి పశువులె మోహనంబు

జంతు జీవజాలంబును సమ్ముదముగ

జేరదీసి పోషించెడు శ్రేష్టమైన

తెలుగు జాతి పుడమి నందు తేజరిల్ల,

పశువులు కుటుంబ సభ్యులై పరిఢవిల్లు


తే.

పర్వదినమున జంతు జీవముల కెసగ

పూజ చేసెడు సంస్కృతి పుణ్య మొసగ,

భరతభూమి నందు సతము మరులుగొల్పు

తెలుగు వారి వైశిష్ట్యంబు దీప్తి కూర్చు.

వెంకట్.సి హెచ్ 




పల్లె టూరులె  పట్టుకొమ్మ , పాడి పంట

కలుగ జేయగ మనలకు కలిమి బలిమి

పూజ సేయగ కనుమన పుణ్య కార్య

మదియు ప్రీతిని పొందగ  మడిని దున్ను

పశువు లెల్లకు మేలగు  పండుగ ఇదె

రేవూరు సాయి లక్ష్మి



కవిత

ప్రతి ఇల్లూ పచ్చని తోరణమై

హృదయాలన్నీ సంతోషమయమై

ఆనందాలన్నీ కలబోసుకునే పండగ 

మూడు రోజుల సంక్రాంతి పండుగ 

కన్నుల పండుగై గడిచే పండుగ


ఈ పర్వం ఒక సందడుల పుట్ట 

సరదాల గుట్ట, తీయని స్మృతుల తుట్టె

వ్యవసాయానికి సాయము చేసిన

 పశువుల నలంకరించి పూజ చేసి

రైతన్నలు వాటి యోగక్షేమము కోరి

ప్రార్థించి ముదముగ కృతజ్ఞత చెప్పు 

అవకాశమిచ్చునీ  ఘనమైన పండుగ

CA కె మల్లికార్జునరావు 



తే.గీ.

జాగృత మొనర్చుచుండి తా జగతి నెల్ల

ఉత్తరాభిముఖుండవ నుద్భటుండు

మకర సంక్రమణమ్మది మహిత మనుచు

జరుపుకొందురు సంక్రాంతి జనత యెల్ల!


రంగవల్లుల ప్రమదలు రమ్యముగను

ముంగిటను దీర్చ గాను ప్రమోదమగుచు

గొబ్బి పాటలందున తెలుగు దనమదియె

పరవశింపగ జేయుచు పల్లవించు!


మధుర భక్ష్యము లెల్ల నమందముగను

వండి పంచిపెట్ట జనులు పరవశించు;

బంధు మిత్రుల తోడను భాసురముగ

సంస్కృతి పరిఢవిల్లు సంసక్తమవగ!


తర్పణములిడి పితృదేవతలకు సంతు;

పెద్దలకు నివేదించి నైవేద్యములను

సద్గతులొసంగు మనియంచు శరణు వేడి

చాటుదురు కృతజ్ఞతలను సముచితముగ!


వర్షమెల్ల కష్టించిన కర్షకులకు

ధాన్యరాశులు నిండగా తమగృహాల;

ప్రాణికోటికెల్లను పూని ప్రణతులిడుచు

క్రాంత దర్శులై జరుపు సంక్రాంతి నెపుడు!


పాడి పంటల మూలమౌ పశువులకును

కొమ్ములకు రంగులను బూసి కోర్కె మీర

పూవులను జుట్టి భక్తితో పూజ సేసి

ప్రీతి తోడ జనపదులె పేర్మి జూపు!

చల్లా దేవిక.




తే. గీ. మా

భోగి పండుగ తెచ్చెను భోగ భాగ్య/

ములను, మకరరాశి ప్రవేశ మును సలుపగ/

మంథి యయ్యె మకరసంక్రమణపు సుదిన/

ము, కనుమ దినమున కొలుతుము పసరముల,/

బొమ్మల కొలువులకు తోడు భోగిపళ్ళు/

వేడుకల్ జేయ గొబ్బిళ్ళు పెంపుగ కళ/

నింపె రంగవల్లికలింట, నిండె బంధు/

జనుల సందడి ప్రతియింట, జక్కగ కరు/

ణించగ ప్రకృతీమాత శోభించ గవలె/

రైతు యింట పంటలు సిరులై,  యిక సలు/

వలెను ప్రతియింట జనులు సంబరములంత

వారణాశి శ్రీలేఖ




తే.గీ.

దీవెన లొసగంగనేతెంచె నావయౌచు

బోగి యనురాగమందింప సాగె ముందు

మకర సంక్రాంతి శోభతో మమతగూర్చి

కనుమ జగతిన మనుజుల కలిమి బెంచె

మహేశ్ ముత్యాల




పసిడి పంటల సిరులన్ని వాసమునకు

జేర్చి కొత్తకాంతులెగసి జీవనమున

మెండుగా సుఖశాంతులు నిండ జేసి

మానవుని జీవనాధారమగుచు, మూగ

జీవులకు పూజ జేయగన్ సిరులు పంచు

పండుగ యనగ సంక్రాంతి ప్రభలు విరిసె

అవళూరు సీత




సీసము

కథ: మహారాష్ట్రలో సాంప్రదాయం: సంక్రాంతి రోజు సూర్య భగవానుడు తన తనయుడు శని దేవుని మన్నించి  ఇంటికి తిరిగి రమ్మని ఆహ్వానింపగా.. 

శని దేవుడు సూర్య భగవానుని ఇంటికి విచ్చేస్తారట. అందుకని ఇక్కడ ప్రజలు శని ద్వారా సంక్రమించు వ్యతిరేక తరంగాలను (నెగటివ్ vibrations)

త్రిప్పి కొట్టాలని సంక్రాంతి రోజు విధిగా నలుపు దుస్తులను ధరించి ఒకరి కొకరు నువ్వులు బెల్లం పంచుతూ నువ్వులు, బెల్లం తినండి తీయ తీయగా మాట్లాడండి

(Til gul ghya aani gode gode bola) అని సంతోషిస్తారు. చలి కాలం కాబట్టి నల్ల దుస్తులు సూర్యరశ్మిని స్వీకరించి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది 

అనేది నిగూఢముగా నున్న scientific reason. 


సీ.

మందసానుడు తాను మకరరాసిని జని సిరి సంపదలు నింపె నరుల యింట

దినకర తనయుని దిననాధుడే క్షమించి పిలిచి సదనము జేరనిచ్చి

సాదరమున తాను సత్కార మొనరించి తనయుని గాంచెను తనివి తీర;

ఆ యుదంతము నిల నాచరింతు రిచట నలుపు దుస్తులు దాల్చి నగరమందు


ఆ.వె.

సంక్రమించునుగద సంక్రాంతి శోభలు

దేశమందు నాల్గు దిశల లోన

వివిధ ప్రాంతములను వేర్వేరు రీతిగ

నాచరింతురు ప్రజలాదరముగ

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి


********** 




 




 

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...