14, జనవరి 2021, గురువారం

08 01 2021 దత్తపది, భరణము-కరణము- మరణము-చరణము

 


దత్తపది - 08 01 2021

భరణము-కరణము- మరణము-చరణము

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

 

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

మూట నందున యాభరణములను విసరి

సీత త్రికరణముననే శీల వతిగ

రామ చరణము మదినందు మణి నిలిపి

రక్కసుని,భావిమరణము రామ బాణ

మే,తెలుపగా ముదముగ మెరిసె కనులు

రేవూరు సాయి లక్ష్మిముంబయి

 

 

వచనం.

స్త్రీ కి సిగ్గే ఆభరణము,  అంతేకాదు,

త్రికరణము శుద్ధిగా పతి దేవుని,

చరణముల కడ నే తను

మరణము చెందాలని కోరుకుంటుంది...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

సీ.

నలువ రాణీ! నీదు నామస్మరణము బ్రాభవము గూర్చి రహిగ వరములిడునె

మంగళాచరణము మహిమగ జేసి సుకవులెందరో శ్రేష్ఠ కవితలల్లి

గణుతి నొందిరి, బ్రహ్మ కన్యకా! నూతనా విష్కరణము తోడ బిరుదుకెక్కి

నీదు వైశిష్ట్యమున్ నింగికెక్కించిన కవుల గరిమకు టెంకణములివియె

 

గీ.

వ్యాకరణములన్నియుగూర్చి పలుకుకలికి!

జ్ఞానమనె డాభరణములన్ సమధికముగ

నొసగిమముగాంచవోయమ్మ!యొరిగములివె

వాణి! యంతఃకరణముల వాసి నిలుపు.

వెంకట్.సి హెచ్

 

 

వచన కవిత 1

సద్గుణ కాంతియే మనిషి భరణము

అంతః కరణమే భగవన్నిలయము

సద్గురు చరణమే సతము శరణము

త్యాచరణమే జీవన సాఫల్యము

పుట్టగ, వెతలు తప్పవు మరణము

మరణమే జీవుల జన్మకు గమ్యము.

 

వచన కవిత 2

మరణము నెరుగని ఉనికి నాది

పల్లవి చరణము ల్లేని పాట నాది

ఉప కరణము ల్లేని సాధన నాది

భక్తియే భరణమై సేవ నాది

 

వచన  కవిత 3

నీ పవిత్ర ప్రేమకు భరణమే మివ్వగలను,

భరణము లేమివ్వగలను చెలీ?

మరణము  వరకు నీనామ స్మరణము వీడ కుండుట తప్ప

జన్మజన్మలకు నీ ప్రేమ నావి ష్కరణము చేయు

చుండుట తప్పనా అంత రంగమున నీ

చరణము ధ్యానము చేయుట తప్ప

నీవు కవితవైన నేను వ్యా కరణము రూపు దాల్చుట తప్ప.

CA కె మల్లికార్జునరావు

 

 

 ll

వ్యాకరణమ్ములాభరణ భానువులై మధురోహలైనచో  

వీఁక హసించు సత్వర కవిత్వపు మాధురి మాణికంబు  

వ్యాకృతి జిల్కు వెన్నెలల భావపుసీమ రణమ్ములై సదా    

ప్రాకటభావగర్భితము భాసురమౌ కురిపించు వేళలో          

స్వీకరణమ్ము జేయుటకు శ్రీచరణమ్ముల గొల్చు భారతీ !

కస్తూరి శివశంకర్

 

 

రణములు

సత్ప్రవర్తన , సదుణంబులు ఆభరణములుగ

మరణము గురించి ఆలోచింపక ,మాటలాడు కొనక

పెద్దల ఆచరణముల నాదరించుచూ, అనుకరించుచూ

నీ త్రికరణములను శుచి , శుభ్రతలతో ఉంచుకొనవే .

మనిషి అంటే ఇలా , నీలా వుండాలని అనిపించుకోవే మనసా !

జి మురళీ మోహన్ రావు

 

 

ఉత్పలమాల

ఎక్కడ రాజ్య సంపదలు,యెక్కడ నాచరణమ్ములౌ స్థితుల్

ఎక్కడ  పండితుల్ పుడమి,యెక్కడ నాభరణంబులౌ కవుల్

ఎక్కడ  కోవిదుల్, కరణమెంచగ లెక్కిల లేఖకోత్తముల్

ఎక్కడ పాలకుల్, సొగసు నేలగ నామరణంబుగా నిలన్...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

మధ్యాక్కర

కరణములేమి చేసితినొ కారుణ్యసింధువై బ్రోచు

చరణముల్ వీడకయుండి, చంచలభావముల్ మదిని

వరణమై తల్లడిపెట్ట, భాసించుసద్భక్తియె భవ

హరణమొసగు తరణమయి హరువు నాభరణములైన

మరణభయము వీడి నీదు మహిమలు మననమ్ము చేతు

 

తేటగీతి

నిర్మలాంతఃకరణములఁ నీదు పూజ

సల్పి నారాయణా నీదు స్మరణమదియె

తళుకు లిడునాభరణములై తనరుచుండ

నీదు చరణముల్ పట్టితి నెనరు తోడ

మరణము వరకు వీడక మనుదునయ్య

అవళూరు సీత

 

సీసము

నాగాభరణములు నందివాహ నమును రుద్రాక్ష మాలల రోచులమర

రుద్రగణములెల్ల రుద్రాక్ష పూసల లంకరణముఁగల్గి యండనుండ

కైలాస శిఖరాన గౌరీసమాయుక్త నిత్యనాట్య క్రియా నిర్మలాత్మ

నీస్మరణముననే నిశ్చల చిత్తమై నిత్యదాసోహమై నిలుచు నట్లు

నీయందు నాభక్తి నిత్యా చరణముగ వరము నొసంగుమా పరమశివుడ!

భక్త వరదుడ! శంభుండ! భవుడ! హరుడ!

విశ్వ నాథుడ! రుద్రుడ! వేదవేద్య!

యోగిపుంగవ వాంఛిత యోగగమ్య!

శరణు శరణము శరణము శరణమయ్య!

ఆదిభట్ల సత్యనారాయణ


 

తేటగీతి

నామకరణమునుండియునాతి

బతుకు మరణమువరకును ;సుగుణ

మార్గ మెంచి శీలమాభరణముగను

జేసుకొనిన ఆదరింతురుజనులును యాచరణగ.

హేమలత

 

 

వచన కవిత....

1. రాజభరణముల నొక్కపోటున రద్దు జేసె ఒకప్పుడు మహామంత్రి.

 

  భరణములు, ఆభరణములన్నియు బోవు పిదప, రాజులేలు రాజ్యంబు  లవియూ బోయె...

 

2.  పూర్వ కరణములందుండె మెండుగా కార్య దీక్ష....వారి వర్కుకెపుడు రిమార్కులేదు.

తెల్లదొరల సామ్రాజ్యపు రుచులనెరిగి కొంతమంది వికృత చేష్టలు ఖండితంబు...

వారు నేర్పిన, వ్రాసిన ,మెరుగులద్దిన అడంగళ్ళులే మనకు,మనవారికెప్పటికీ

శ్రీరామరక్ష....లేకపోతే, లెక్క తప్పుటకు అవకాశములు కోకొల్లలు...

 

3.   ఆచరణమ్మున  త్రికరణశుద్ధి లోపించిన ఎందరెందరో

రాజవరేణ్యులు కారడవులబాలైన రీతి, ఎప్పటి పాలకులకైననూ

తప్పక పాటించవలసిన సద్ధర్మ నీతి యిదియే..

 

4.  కీర్తి, ప్రతిష్టలు అంగడి సరుకులు కావన్న నీతిని ఒంట బట్టించుకొని,

ఆమరణము పాలితుల కష్టసుఖముల నెరిగి పరిపాలన చేయుటయే పాలకుల పరమధర్మము...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

కందం లో...

భరణము నాధారముపడి

కరణము తనపని చురుకుగ ఖాతరు జేయన్

మరణము సులువుగ కలుగదు

చరణము కూడ శుభమౌను సారస నేత్రీ.....

భరణము = ఆహారము,  కరణము = శరీరము,   చరణము = నడవడిక

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

స్వేచ్ఛ సమర్పణ-

మనుషులంతా సాధారణంగా స్వార్థపరులు వంచన పరులు

అయినా ద్వేషించకు ప్రేమిస్తూనే ఉండు

గెలిస్తే బూటకపు మిత్రులు నిజమైన శత్రువులు తయారు

అయినా గెలుపుకే ప్రయత్నించు నేడు నీవు చేసిన మంచిని

రేపటికి మరిచిపోతారు

అయినా మంచినే అభ్యసించు నీవు నాటిన చెట్టు పండ్లు

వేరెవరో తినవచ్చు లేక తుఫానుకో చెట్టు రాలి పోవచ్చు

అయినా నిత్యం  శ్రమిస్తూ ఉండు

నీవు చేసిన త్యాగానికి జవాబుగా వెన్నుపోటు పొడుస్తుంది లోకం

అయినా త్యాగ మార్గాన్ని విడవద్దు

సత్యాన్ని అవివేకంగా అహింసను పిరికితనంగా

ధర్మాన్ని చాందసంగా జమ కడుతుంది లోకం

అయినా వాటికి చేరువగానే జీవించు.

CA కె మల్లికార్జునరావు

 

 

 ఎదలో తొలిచిన ప్రేమ

మదిలో నిలిచిన ప్రేమ

ఉవ్వేత్తున ఎగసిన ప్రేమ

నీ రాకకై చూసిన కనులు

నీ మాటకై వినిన చెవులు

నీ పలుకుకై కదిలిన ఆధరాలు

సాగే కాలాన్ని సాగనీ

వేదనలన్నీ ఆవేదనలై

నీ కోసం చూడనీ ప్రియా!

 

రమ్యసౌధాగ్రములలోన రాత్రులందు

కడు వినీతోత్పలాఛ్చద కాంతులందు

చుంబనాశ్లేషసంభ్రమ స్ఫురణలందు

ప్రణయ దరహాసవీచికా వలపులందు

స్వాదుగీతికల సిరుల వాంఛలందు

మధురరీతుల పొంకంపు సుధలుపొంగు

 

చల్లని వేళ

చెలి నడిచొచ్చిన హేలా

సాగర తీరం పిలిచిన వైనానా

హైనా కుహు కుహు పలికేనా

మైనా మరీ మరీ పిలిచేనా

నా ఎదలో నీవు మెరిసేనా

ఆకసంలో మెరువు మెరిసేనా

నా హృదయం పరవశించేనా

కోవూరి

 

 

మధురాక్కర :

వెన్నెలొలుకు వేళలలందు ప్రేమామృతము జిల్కగన్

కన్నెమనసు లోని వలపు కళకళలని గాంచినన్ 

చిన్నెలని వొల్కి పిలువగా  సిగ్గులమొగ్గలాయె

కన్నె అధర మధువులకు కందువములు జూపగన్

కస్తూరి కవనం

 

 

నన్నుగాచినదేవత

సీసము

పసితనముననేనుపక్కతడపగానె యోర్పుతోబట్టలనుతుకుచుండె

స్నానంబుచేయించిచలువబట్టలు వేసి సాంబ్రాణిపొగవేయుసంబరమున

లాలించిపాలిచ్చిజోలపాటలు పాడి యుయ్యాలలోనన్నునూపుచుండె

మలమూత్రములగడ్గి మదినోర్చుకొనునట్టి సహనమందునధాత్రిజనకమాత

 

తే  గీ

దోమలీగలుదోలుచునామెనాకు

దాసివలెసేవజేసినత్యాగజీవి

పనులుచేసినన్ దిరిగినన్ బండుకొనిన

నన్నెనిరతముకనిపెట్టు నాయనమ్మ

 

సీసము

 

కన్నీరుతోనేడ్వకరిగిపోయెడిదామె నవ్వుచునాడనానందమొందె

బోరగిలబడగబులకరించెడిదామె పాఱాడుచుండదాబరవసించె

తప్పటడ్గులువేయనుప్పొంగి పోయెను జారిపడగజూచిజాలినొందె

బుడిబుడినడకలుపొందుగా నేర్పించె ముందునన్ నడిపించిమురిసి పోయె

 

తే గీ

ముద్దుచూపులదిలకించి ముద్దులిడెను

యేడ్పుమొగమునుబెట్ట నన్నెత్తుకొనెను

ఊమనియెడుముచ్చటలకు నుబ్బిపోయె

ఆమెకానందలోకమేయన్నినేను

అచ్యుతానందబ్రహ్మచారి, పాల్వంచ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...