2, జనవరి 2021, శనివారం

చిత్రానికి పద్యం - 74, 22-12-2020



 చిత్రానికి పద్యం - 74

22-12-2020 మంగళవారం

పై చిత్రానికి పద్యాలు/కవనములు అందించగలరు... 



తనదు లక్ష్యము సాధింప ధరిన చేర

రొండొకండును. లోకంబు లోన గెలుపు

దరిని జేరగ  జతనము తనదె వలయు.

తనదు శిల్పంబు చెక్కంగ తానె దగును.

 

సూరే వెంకటప్పయ్య

 

 

తేటగీతి...

తనదు  రూపంబు నచ్చక ధరణి లోన

బ్రహ్మ సృష్టికి  ప్రతిసృష్టి జేయ దలచి

నులియు, సుత్తియు చేబూని తొలియుచుండ

దృష్టి బెట్టంగ తెలిసొచ్చె సృష్టి మహిమ.......

 

పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

తేటగీతి...

స్థూలకాయమున్ గరగించు సుళువు లేదు

మందుమాకులున్ చెడఁగొట్టు మాయఁ జేసి!

శ్రమయు నాహారనియమాలె చక్కబఱచు,

సౌష్టవంబగు దేహము స్వాస్థ్యమొసగు!!

 

డా. నాగులపల్లి

 

 

ఉత్సుకం

ఎవ్వరు సాయము రారులే

నవ్విన నవ్వును లోకమే

నువ్వె నినున్ సరిదిద్దుకో

అవ్వల మెప్పులు తథ్యమే.

 

డి.రామ నాగేశ్వరరావు

 

 

శిలవై పడి ఉండరాదు

శిథిల ఆలోచనలతో

మనసు ఉలి చేసుకుని

మరి వ్యర్థాలను చెక్కితే

శిల్పమై వెలుగుతావు

అనల్పమై మిగులుతావు!......

 

రాంమోహన్ నిజామాబాద్

 

 

వచన కవిత

బండరాయిని  ఉలితో చెక్కి చెక్కి

మంచి  శిల్పము చేయు నటుల

దేహమునం దెక్కువగు కొవ్వును

ప్రయాస కోర్చి కరగించుట నటుల

జ్ఞానముతోడ అజ్ఞానము తీసివేసి

గుడిలో మూర్తిగ మారుమో మనిషీ.

 

మనిషి జన్మను ఎత్తి నావు

బండ రాయిగా మారినావు

ఆనాటి రాముడిక్కడ లేడు

నిన్ను మనిషిని చేయుటకు,

స్థపతివి నీవే  రాయివీ నీవే

రాయి లోని బొమ్మవూ నీవే

అంతర్నేత్రములు తెరుచుకో

కష్టాలను రాతి ఉలిగ చేసుకో

నిన్ను నీవే శ్రద్ధగా తొలచుకో

హేయ బుద్ధులు విదుల్చుకో

మళ్లీ ఒక మనిషిగ మలచుకో

కర్మ యోగమిదే నని తెలుసుకో

 

CA కె మల్లికార్జునరావు

 

 

కందము

నీవే శిల్పివి నరుడా

నీవే మౌనివి సతతము నీదు భవితకున్

నీవే శక్తివి నిత్యము

నీవే యుక్తిగ మరల్చు నీదగు మేనున్.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తేటగీతి

మేను బరువును తొలగింప మేలు యనుచు

చేతబట్టెను యులియేను చేవ తోడ

సుత్తి గట్టిగ గొట్టుచుజూచు  కొనెను

తానె శిల్పిగ మారెను తనువు తరగ.

 

హేమలత


 

శిల్పి శిల్పం తెలిపే

సన్మార్గంలో స్వశక్తితో నడిపించుకో నీ జీవితాన్ని

చతురత, విజ్ఞానాన్ని నిత్యం నవీకరించుకో

నిరాశా,బడలికలను తొలగించుకో రోజూ

స్వీయవిశ్లేషణ చేసుకో అనుదినం

అసాధ్యమవదేది అన్నీ నీ పరమే !

 

జి మురళీ మోహన్ రావు

 

 

మనిషి నిరంతరం పరివర్తన చెందుతూ, తనని తానూ మార్చుకుంటూ సమాజంలో అభ్యుదయం నింపాలి అన్న భావనతో 🙏

చం ll  

లలితకలాపధామము విలాససులాలిత దీక్షజూపఁగన్   

జ్వలిత తపమ్ముచే సతత సాధనతో సుమనోహరంబుగాఁ 

జిలుగులు కోలుపోక ఒక జీవితమంతయు మేటిశిల్పమై  

వెలుగుల తేజమందు సుమపేశల భావము పంచగావలెన్ 

 

కస్తూరి శివశంకర్

 

 

శిల్పీ నీవెంత ఘనుడ వయ్య

బండ రాళ్లను సజీవ శిల్పా లుగా

తీర్చి దిద్ద గ నిన్ను నీవు మలచుకొనగా

నీకు సాటి ఎవరు గలరు ఈ అవని యందు 

 

మంజూష, నిజామాబాద్

 

 

తే"

శిల్పముగ మారని శిలలు ఛిద్రమౌను

మొలక లెత్తని బీజము విలువలేదు

కదల కుండిన జలమౌను కల్మషంబు

చేర కొవ్వు కాయమ్మున చేరు రుజలు

 

తే"

శిలకు మహిమల నొసగును శిల్పి చెక్కి

జ్ఞానమార్గమున గురువు ఛాత్రు నడపు

తనను మించగా తనయుల  దండ్రి మలచు

ధన్యుడౌ మలచుకొనును దనను దాను

 

వాణిశ్రీ నైనాల

 

 

 

తన వ్యక్తిత్వమును తనకు తానే నేర్పుగా దిద్దుకోమనే స్ఫూర్తిదాయక వాక్యములుగా

మధురాక్కర మాలిక

 

ఎదురు చూడకు పరులకై యెసగ  నీవే తలచి

నిదుర మత్తు వీడి భవిత నిగ్గుగ సవరించుకో

మదన పడుతు రోధించక మహిమ జూపి ప్రభవించి

కదలవోయి నరుడ ప్రతి కదలికన్ పొంకించుకో

కదన రంగ సైనికుడివై కష్టముల నెదిరించి

వదన మందు చిరు నగవు వాసిగ వెలిగించుకో

ముదము లేక వగచకోయి ముమ్మరముగ కదిలి

పదము పదము నందున నీవు పరిణతి చూపవోయి

అదరకోయి బెదరకోయి యజ్ఞకర్తగ నిలిచి

నుదుటి రాత నీవు లిఖించి నూత్న బాటలు వేసుకో

 

వెంకట్.సిహెచ్

 

 

వచనం,

కండలను కరిగించ ఉలి, సుత్తి వల్ల కాదు,

బండలను పగులగొట్ట సుత్తి చాలు,

శిల్పాలు చెక్క వలెనన్న ఉలి యే కావాలె,

కల్పనలు అల్లవలెనన్న కలము కావలె !!

 

గాంగేయ శాస్త్రి రాజమండ్రి

 

 

ఉత్పలమాల

శిల్పులు జూడగా శిలను చేతన మూర్తిగఁ దీర్చిదిద్దు , సం

కల్పము చేతనే దృఢత గాంచును దేహము కష్టబెట్టగా

నల్పము గాదులే కఠినమౌ తన కొవ్వును దీసివేయగా

సల్పుము దీక్షతో తనువు సన్నగఁ జేసెడి మార్గవర్తివై

కల్పనఁ జేయగా తగును కల్మష హేతువులన్ తొలంగగన్

బాల్పడు చేతనం బునను భాసుర మానస తేజమూర్తివై

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

కాల ప్రవాహానికి.. బద్ధకం  తోడవ్వగా.. కోల్పోయిన పూర్వపు శరీర సౌష్టవ వైభవాన్ని ... ధృఢమైన పట్టుదల పూనితే.. మరలా,ఇప్పుడైనా.. పునర్ప్రాప్తి పొందడం అసాధ్యం ఏమీ కాదు.. నిను నీవే అందంగా, ఆరోగ్యంగా  మలచుకోగలవ్.. ఆలా మలచుకొని నిను నీవే దిద్ది తీర్చుకోవాలి సుమా ! అనే సందేశం నాకు ఇస్తున్నట్లు ఉన్న ప్రబోధాత్మక చిత్రానికి నా చిరు ప్రయత్నం...

 

తే. గీ

కండ దేరెను సౌష్టవ కాయమపుడు;

కదలలేదనునది నేటి కఠిన నిజము !

కొఱవడగ శ్రమమును,సాముక్రొవ్వు పొరలు

కప్పబడి మారె గుండుగా కాయమెల్లఁ;

స్లిమ్ము దేహమూరి, గొనెను  సూమొ సైజు !

చేయి దాటివోయెననుచు చింత వలదు;

 

బద్ధకపు నిరాశలనెల్ల పారద్రోలి,

చేసి నీదు ప్రాత మనోజ్ఞ చిత్రమొండు

ఫోను వాలుపేపరుగ, నా ఫోటొ గనుచు,

చేసుకొని ప్రతిన, ధృతితో, శిల్పి వోలె

నుద్యమింపు కసరతనే యులిని గొనుచు,

సాధనమున వెండి గొనుమా సౌష్టవంబు !

సాధనము సేయఁ నరునకసాధ్యమైన

కార్యమొండయిననునిల గలదె యరయ ?

 

( వెండి... తిరిగి, మరలా)

వట్టెం వెంకట రమణ

 

 

శిల్పి తానైచె క్కుచును శిల్పముగను

దేహ ముననుండు భారము దీక్షతోడ

తీసి వేయుచు ఉలితో తీవ్రముగను

సృష్ఠి కర్తగ మలచుచు శుద్ది జేయ

 

తోలు తిత్తియే యిదియని తొలుచుచుండె

ఆరు గుణముల తోనిది అలరుచుండు

బుద్ది నులిగా మలచితాను  బొమ్మగాను

దేహమంతయు జక్కగా దిద్దుచుండ

ఆత్మ దర్శ నముజేయ అభినయించి

 

గీతాశైలజ

 

 

శిల్పం

యోగా యనుచు, జిమ్ములనుచు

ఏరోబిక్సనుచు, డైటింగనుచు

ఎంతెంటూ కష్టపచు,

శిల్పి చెక్కినటుల కాన్పడు,

ఆశాశ్వత బాహ్యసౌందర్యము కొరకు,

కాదుసుమీ జన్మించితివీవు.

శృతిస్మృతిపురాణేతిహాస శాస్త్రధర్మాదుల,

ఙ్ఞానమనెడి ఉలిని బూని,

పరమాత్మను అణువణువున నింపుకొనుచు,

పద ముందుకు, పద సాగుచు,

కనపడునపుడు నీలోని నిజమైన

మూర్తీభవించిన ఆత్మసౌందర్యపు

ముగ్ధమోహన శిల్పము.

పరమాత్మకు సైతము ప్రియమగు భువనైకమోహన శిల్పము

వారణాశి శ్రీలేఖ

 

 

తేటగీతి 1

 

ఊబకాయము నొసగదు వూరి మెప్పు

ముప్పు తప్పదు, వేగమే మేలుకొనుము

శ్రమను యులిగచేసుకొనుచు క్రమముగాను

సాధనల చేయ సర్వము సాధ్య మౌను

 

తేటగీతి 1

దీక్ష యనెడు యులినిబట్టి తెఱకువగను

నిన్ను నీవు దిద్దుకొనుము నెరవు తోడ

నిరత సాధన వలననే నిత్య ముక్తి

కలుగు, నిక్కమిదియెగదా కర్మ జీవి

 

అవాళూరు సీత

 

 


 

గణిత దినోత్సవ శుభాకాంక్షలు

 

తాను ఒంటరైన వేళ తన విలువ శూన్యమైనా..

కలవరపడి కలత చెందక..

అక్కున చేర్చుకున్న వారి విలువను అమితంగా పెంచుతూ..

వద్దు పొమ్మని తీసివేసినవారిని తానసలు పట్టించుకొనక తటస్థమై..

అహంకారంతో విర్రవీగుతూ గుణకారం చేసినవారి విలువను

అంతా శూన్యంగా మార్చి..

ప్రేమతో కోపావేశాలను భాగించుకొని అనుబంధాల విలువను

గ్రహించుకొన్న వారికి ఆనందమనే నిశ్శేషంగా

తాను మిగిలి నిశ్చింతనే గూర్చి..

నిర్భయంగా నిర్వికారంగా నిలిచి ఉండే సున్నాతో మొదలిడి...

జగతికి వెలుగునిచ్చే సూర్య భగవానుడొక్కడు..

లోకాన్ని అవలోకించే నయనాలు రెండు..

సృష్టి స్థితి లయకారులౌ వేల్పులు మువ్వురు..

ధర్మాన్ని బోధించే వేదాలు నాలుగు..

చేతనత్వము గూర్చే ఇంద్రియాలు ఐదు..

రసనకు అవగతమయ్యే రుచులేమో ఆరు..

శ్రవణానందం గూర్చే సుస్వరాలు ఏడు..

లోకానికి హద్దులైన దిక్కులు మూలలు ఎనిమిది..

అనుభూతిని వెల్లడించే భావాలు తొమ్మిది..

అని అందరితో లెక్కించబడుతూ.. అలా అంకెలన్నీ కలగలిసి

సంఖ్యలుగా అవతరించి..

సంకలన వ్యవకలనాలుగా గుణకార భాగహారాలుగా

పలు ప్రక్రియలుగా వ్యాప్తి చెంది..

గణితంగా పిలువబడుతూ నిత్యజీవనంలో భాగమై..

ఎల్లరికి తెలిసినవై.. అందరికి అవసరమై..

గణితం లేక గమనం లేదని

లెక్కలు లేని జీవితం లెక్కలోనికి రానిదని..

జగతిని శాసిస్తున్న గణితాన్ని..

ఆశగా శ్వాసగా ధ్యాసగా అభ్యసించి ఆస్వాదించి

అద్భుతాలు సృష్టించిన అనుపమాన గణితమేధావి

శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా

గణిత ఉపాధ్యాయులు, గణిత మేధావులు,విద్యార్థులు,

గణితంపై ఆసక్తి అభిరుచి గల ఆత్మీయులందరికి...

గణిత దినోత్సవ శుభాకాంక్షలు

 

చల్లా దేవిక. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...