14, జనవరి 2021, గురువారం

13.01.2021, ప్రణాళిక - సమస్యా పూరణం, “కాంతు లానంద హేల సంక్రాంతి క్రీడ”





13.01.2021 బుధవారం

ప్రణాళిక - సమస్యా పూరణం

 

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రణాళిక

 క్రింది మకుటము తో తేటగీతి లో పద్యములు వ్రాయవలెను.

కాంతు లానంద హేల సంక్రాంతి క్రీడ

ఇదే పంక్తితో వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో వ్రాయగలరు.


 

భోగి పండ్లు గురియ రోగమొదవె

ఆటవెలది..

 

భోగి పండ్లు దెచ్చి బుట్టలో  పెట్టగ

చిన్న పిల్లలచట చెరుపు జేసె

కంటి ముందు లేని కరొనాను మరువగ

భోగి పండ్లు గురియ రోగమొదవె...

పి.ఎల్.నాగేశ్వరరావు

 


తే.గీ ll

భోగి మంటల శుభములు పుంజములగు

విక్రమంబగు సంక్రాంతి వెల్గు నింపి

కలతలన్ని సమసిపోయి కనుమ నాడు

ప్రగతి సురభిళమ్మౌచు నీ జగతియందు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

 

కం ll

తొలకరి శుభములు పంచగ

తొలంగు తిమిరమ్ములన్ని ద్యోతనములలో

తొలిగాబులలో హేలలు !

తొలగవలెను ఖేదనములు దురితమలన్నీ !

 

సీ ll

భోగభాగ్యమ్ములు పోహళించెడి వేళ భోగి పండుగ హేల సాగవోలె

రంగవ ల్లికలు విభ్రాజితమౌ వేళ సురభిళమ్ము సిరులు విరియవోలె

రంగు రంగుల ముద్దు గంగిరెద్దులుతోను హరిదాసు కీర్తన హాయి గొల్పు

వెలుగులు పొంగారు తెలుగు లోగిళ్లలో శాంతి సౌఖ్యమ్ముల కాంతి నింపు 

 

గీ ll

సంబరమ్ముల శోభలు సంభ్రమించు

ధాన్యరాశుల స్తోమముల్ తనరవోలె

నూత్న కాంతులతో సుమనోజ్ఞ సరణి

కాంతులానంద హేల సంక్రాంతి శోభ

కస్తూరి శివశంకర్

 

 

నిస్సహాయ నిరాశలన్ నివురు జేసి

భోగ భాగ్య శుభములిడు భోగి వచ్చె

నిరుటి ఆందోళనలు వీడి నిండుమదిన

జరుపుకొనుడు సంక్రాంతిని సంబరముగ

 

హరిలో రంగ హరి యనుచు

పిల్లలకు చూపి చెప్పవలె

ముగ్గులు , పూల గొబ్బెమ్మలు

హరిదాసులు , గంగిరెద్దులు

గాలిపటాలు , తిండి వంటలు

 

అలా చెప్పుకుంటూ వెడుతుంటే

వారి కొత్త బట్టల సంబరం తో

సంక్రాతి సందడి విను చుండ , చూచు చుండ

వారి కనులు కనులానంద హేల

సంక్రాంతి శోభ

జి మురళీ మోహన్ రావు

 

 

పుష్య సుప్రభాతమ్మున పుడమి వెలుగు

మంచు తెరలమాటునదాగి మల్లె నవ్వె

 సుమవనమ్ముల విరివాన శోభ చూడ

హృద్య మౌను స్పందించని హృదయ మేది

కాంతు లానంద హేల సంక్రాంతి క్రీడ

రమ, కంకిపాడు

 

 

సీ"

భోగి మంటల శోభ భోగపు కూడళ్ల కూడంగ బంధువుల్ కూర్మితోడ

ధాన్యంపు రాశుల ధాత్రికి మ్రొక్కంగ పాడిపంటల వెల్గు పసిడిపల్లె

సాలుకు సరిపడు సంతృప్తి నొందుచు సంఘజీవికి పంచు సౌరభంబు

జంగమ, హరిదాసు సంస్కృతి నిలుపంగ గంగిరెద్దుల క్రీడ ఘనత జూపు

 

రంగవల్లుల లోగిళ్ళు పొంగు జూడ

సంప్రదాయంపు వేషాల సౌరుజూడ

నరుగులందు క్రొత్తల్లుడి హంగుజూడ

సంకురాతిరి తెచ్చు భల్సంతసంబు

వాణిశ్రీ నైనాల

 

 

వచన కవిత

సకల జీవకోటికిన్ కోట్లాది శుభము లొసగ

గృహలక్ష్మిలు ముంగిళ్ళ ముగ్గులు వేయగ

ధాన్యలక్ష్మి రైతుల ఇళ్ళు సిరులు కురియగ

చలి భోగిమంటల చుట్టు అనంగుడు తిరగంగ

గంగిరెద్దుల గిట్టల సవ్వడితో ధరణిమాత పులకించగ

హరిదాసుల కీర్తనల సౌరభము పల్లెలందు పరిమళించగ

భాస్కరుడు మకరమున మహోజ్వలముగ ప్రవేశించగ

వచ్చింది వచ్చింది దివ్య కాంతులానంద హేల సంక్రాంతి శోభ

CA కె మల్లికార్జునరావు

 

 

కో.. కో.. కొక్కోరో.. కో..కో..కో.. కొక్కోరో....

భోగి పండగే... గొబ్బిళ్ళ సందడే...

మరదళ్ళ హడావిడి సాగేలే..

భోగి మంటలే... పందిట్లో సందడే...

అల్లుళ్ళ హడావిడి కొనసాగే...

కో.. కో.. కొక్కోరో.. కో..కో..కో.. కొక్కోరో....

సంక్రాంతి లోగిళ్ళలో గంగిరెద్దుల భాజాలే

సందడి చేసేద్దాం పద పద పదరోయ్...

కోడి పందాలు సరదాగా చేసేద్దాం

గోల చేసేద్ధం పద పద పదరోయ్...

గోదారి గట్టంత, గుమిగుడి సాయంత్రం ..

ఈత కొట్టేద్దాం చలో చలో చలొరోయి...

కో.. కో.. కొక్కోరో.. కో..కో..కో.. కొక్కోరో....

అమ్మమ్మ వంటింట్లో.. పిండివంటల గుమాయింపు

పాతింటి వసారాలో .. తాతయ్యల ముచ్చట్లు..

హాలంతా చుట్టాలతో ముస్తాబు లోగిళ్ళు

చుట్టూతా మనవాళ్లే... తిరనాళ్ళ హుషారే...

సాగే సంబరాలు సంక్రాంతికి వేడుకలే...

నా ఇంటి పొదరిల్లే.. ఆనందానికి పుట్టిల్లే...

కో.. కో.. కొక్కోరో.. కో..కో..కో.. కొక్కోరో....

భోగి పండగే... గొబ్బిళ్ళ సందడే...

మరదళ్ళ హడావిడి సాగేలే..

భోగి మంటలే... పందిట్లో సందడే...

అల్లుళ్ళ హడావిడి కొనసాగే...

కో.. కో.. కొక్కోరో.. కో..కో..కో.. కొక్కోరో....

 

 

వచనం

మంచు తెరలు కష్ట సుఖాల సంకేతమవగ

భోగి మంట లందిక్కట్లు దగ్దమవగ

రంగవల్లుల హరివిల్లు ముచ్చట గొల్పగ

హరి దాసు కీర్తనలు హాయి నొసగ

డూ డూ బసవన్నలు తలలూచగ

పుష్యలక్ష్మి మనయింట కొలువు దీరగ

కాంతు లానందహేల సంక్రాంతి శోభ.

 

ఉష.

 

 

1. తేటగీతి..

విభవ, శుభముల సంక్రాంతి వెలుగు నింప,

భోగ భాగ్యాలు, పంటలు వేగ రాగ,

సంతసంబున పండుగ జరపుకొనుడు

 కాంతులానంద హేల సంక్రాంతి శోభ..

 

2. తేటగీతి..

తెలుగు వారింట సంక్రాంతి తేజరిల్ల

తెలుగు తేనియల్ గురియగ తెప్పరిల్లి

తెలుగు కవితల నందించి వెలుగు జూపు

మిత్రులందరి కివియెనా మెచ్చుగోలు..

 

3. ఉత్పలమాల

పల్లెల శోభయున్, సిరులు, పందెపు కోళ్లను జూడముచ్చటన్

చల్లగ జూడమంచునట , జక్కగ పూజలు, వంటవార్పులున్

ఘల్లున గంగిరెద్దులును, కాపుగ నబ్బిన పంటనూర్పుడుల్

యెల్లలు లేని సంతసము, యెచ్చట జూచిన భోగి మంటలున్...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

సీ.

హేమంత తుహినమ్ము హేలను గూర్చగా పుష్యమాసమ్మెల్ల పోహళించు;

రమణీయ వర్ణాల రంగవల్లుల తోడ ముంగిళ్ళు నిత్యమ్ము ముఱియుచుండు;

హరిదాసు కీర్తన ల్నాధ్యాత్మికత విరియ గంగిరెద్దుల శోభ కడిమి జూపు;

ఉత్తరాయణమందు నుద్భటుండు కడగి మకర రాశిని జేరి మసగుచుండు;

 

.వె.

కర్షకాళి కెల్ల హర్షమ్ము గూర్చెడు

సంకురాత్రి యనగ సంబరమ్ము;

మూగ జీవులనును మోదము న్పూజించి

గుండెలన్ని మురియు పండుగిదియె!

 

.

చెంతకు భోగభాగ్యములు సేమము గూర్చగ పౌష్యలక్ష్మి తా

నెంతయొ మోదమున్నిడుచు నిక్షురసంపు గడల్ కరంబునన్

సంతసమున్ ధరించి యిట సౌహృదయమ్మున రాగ ; స్వాగత

మ్మెంతయు పల్కగా ప్రకృతి యింపెసలారె మనోఙ్ఞమౌ విభన్!

 

తే.గీ.

సంప్రదాయములెల్లను సంవదించి

పెద్ద పండుగిది యంచు పేర్మి తోడ

మూడు రోజుల వేడ్క ముచ్చటగను

రూపుదాల్చె తెనుగు నేల రూఢి గాను!

తే.గీ.

పాతవౌనట్టి తలపుల బాపుకొనుచు

భావి యందు నవ్యత కోరు పగిది; జనులె

పాత వస్తువు లెల్లను పారవైచి

భోగిమంట కాహుతి జేయ పూర్ణముగను

కాంతులానంద హేల సంక్రాంతి శోభ!

చల్లా దేవిక.

 

 

తేట గీతి

1. సంకురాతిరి దినముకు సంబరముగ

ధాన్యసిరిగ వెలయునన్నదాత యిల్లు

కొత్తబియ్యపు పొంగళ్ళు కోరి చేయు

గొబ్బియమ్మగ గౌరినిగొలుచు కొనును

కాంతులానందహేల సంక్రాంతి శోభ

 

2.  గంగిరెద్దుల విన్యాస గారడియును

కోడిపందాలసందడికూత లుయును

కొత్త యళ్లుళ్ల సరదాల కొంటె పనులు

రంగుల పతంగములు గొన్ని నింగి నెగుర

కాంతులానందహేల సంక్రాంతి శోభ

హేమలత

 

1

మంచు కురిసెడు తరుణంబు మది మురిసెడి

మార్గశిర మాసపు చలిలో మధురమైన

తలపు లందు శుభ మొసంగు ధరణి లోన

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

2

భోగి మంట లెగసిపడి నింగినంట

పల్లె జనులంద రెలిమిగ పరవశింప

ప్రకృతి రమణీయ మొనరించు పర్వదినపు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

3

అవని మంచు వస్త్రము గట్టి నలరుచేయ,

పల్లె భోగిమంటలు తోడ బాంధవముగ

నైక్యత తెలిపెడు బలిమి హరువుగూర్చు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

4

బోసి నవ్వుల శిశువుకు భోగి పండ్లు

పోసి, పీడను దునుమాడి, భోగ భాగ్య

ముల నొసంగెడు దీవెనల్ ముదము గూర్చు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

5

భక్తి తన్మయత్వము నొంది ముక్తి నొసగు

కీర్తనల తోడ హరిదాసు నర్తనములె

దైవ దీవెన లొసగి తనరు చేయు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

6

గంగిరెద్దు మేళము లాట కనుల కింపు

కలుగ జేయ, పిల్లలు జేరి గంతులేయు

పోడిమియె పిన్న పెద్దల మోము లందు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

7

వెగ్గలముగ సత్కారముల్ ప్రీతి తోడ

జంగమయ్యలకు నొసంగి సమధికముగ

దీవెనలు బొందెడి ప్రజల దీప్తి పెంచు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

8

ఇంద్ర ధనుసుగ ముగ్గుల నింపుగాను

తీర్చెడు వనితలద్భుత దిటవు మెచ్చి

వరము లిచ్చెడి విష్ణువు ప్రభ తెలిపెడు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

9

పిల్లలు పతంగు లెగుర వేసె డల్లరి కను

విందు చేయ, బంధువులంత పేర్మి తోడ

మెలిగెడు నగర, పల్లెల మేళవించు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

 

10

కోడి పందెము లొనరించి కొప్పరముగ

పల్లె సంస్కృతి వెలయించు పర్వదినపు

మధురమైన కృత్యములన్ని మహిని నింపు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

11

కొత్త యల్లుళ్ళ యలకల గుణము లెరిగి

నత్తవారు జరిపెడు మర్యాదలన్ని

యశము గూర్చ సంసారంబు నడరు చేయు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

12

రతనముల ధాన్యపు సిరులు రైతు నింట

జేరి ధనలక్ష్మి నృత్యము జేయ పల్లె

సిరులు దేశ సౌభాగ్యమై చెంగలించు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

13

పల్లె పడుచులు రహి పెంచు పట్టు చీర

లు ధరియించి కన్పించెడు విధము జూడ

దేవతలు భువికి తరలి దివ్య తార

వలె మురిపించు హేతువై రమణ మొలుకు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

14

పిండి వంటల ఘుమఘుమల్ పెంపు మీర

బంధు మిత్రులందరు సహ పంక్తి విందు

చేసె డాచరణము లన్ని జిలుగు లొలుకు

కాంతు లానంద హేల సంక్రాంతి శోభ

వెంకట్.సిహెచ్

 

 

అప్పట్లో

తెల్లార్తే  తలంట్లు

తరవాతే కొత్త బట్టలు

 

ఎగరెయ్యాలి గాలి పటాలు

చూడాలి కోడి

పందాల హుషారు

 

చెబితే వినే

గంగి రెద్దులను ఆడించాలి

హరి దాసులతో హరీ అనాలి

 

రంగు రంగులతో ముగ్గులు వేయాలి

రంగ వల్లుల్లో గొబ్బెమ్మలు పెట్టాలి

 

తింటూనే వుండాలని పించే

పిండి వంటలన్నీ వండాలి

 

అలా మూడు రోజులూ

కాంతు లానంద హేల

సంక్రాంతి శోభ మనందరికీ !

జి మురళీ మోహన్ రావు

 

 

ముగ్గులనలంకరించిరి ముచ్చటపడి

గంగిరెద్దునాడింప రాగాలు తీసి

గాలి పటములెగురవేయ కాపు కాచి

క్రొత్త బట్టలు వేస్కొని కోడె గాళ్ళు

కాంతు లానందహేల సంక్రాంతి శోభ

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, ముంబయి

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...