17, జనవరి 2021, ఆదివారం

15.01.2021, దత్తపది, కాంతి - శాంతి - భ్రాంతి - క్రాంతి



15.01.2021 శుక్రవారం దత్తపది...

కాంతి - శాంతి - భ్రాంతి - క్రాంతి

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.


తే.గీ.

పాడి పంటల తోడను పల్లెలన్ని

భాగ్యసీమలై సతతమ్ము పరగుచుండి;

అన్నదాతల మనములకతుల  శాంతి

గల్గునో యట్టి దినము సంక్రాంతి యౌను! 


నూత్న కాంతి తోడ ప్రకృతి నునుపు జూప

పల్లె లోగిళ్ళ సంక్రాంతి పరిఢవిల్లు;

పట్నవాస సౌఖ్యములందు; పర్వదినపు

కాంతి కొరకు వెదుకులాడ భ్రాంతి మిగులు!

చల్లా దేవిక



ఉత్పలమాలిక 

స్వాంతము హాయిరాగముల వల్లరులన్నియు పాడువేళ, సం 

క్రాంతుల శోభలన్ని చెలికారపు బంగరు కాంతులీనగా 

సంతసమొందు చేతనపుసత్వములన్నియు జాగృతమ్ములై 

కాంతిని నింపు కావ్యముల కైవడులన్నియు జూడగావలెన్  

పంతములేక నేర్చుకొన వాఙ్మయమే సిరులై వివేకమున్ 

సంతసమున్, మనోహరపు జావళిరాగము పంచగావలెన్    

చింతలలో మనోజవపు చెల్వపుసోనలు జిల్కగావలెన్   

సుంతయు ద్వేషభావమునుఁ జూపక స్వార్ధము వీడనాడగన్   

శాంతియు సౌఖ్యముల్ చెలగు సర్వజనాళికి, రక్షనీయఁగన్ 

భ్రాంతిని వీడి ప్రేమమయ భావనపంచుగ ! పౌష్యలక్ష్మివై !

కస్తూరి శివశంకర్



సకల కళలకాంతి సంక్రాంతి మీ ఇంట

సర్వసౌఖ్యములను శాంతినిచ్చి

నాదియనెడు భ్రాంతిపాదులే తొలగంగ

క్రాంతిపథములెదుట కదులుచుండ!


శాంతింబొందుము సత్వర

క్రాంతిన్ సౌహార్ద్రరుచిర కామ్యముదీరన్ 

భ్రాంతిన్ వీడుమ నాదను,

కాంతిన్ శ్రీపౌష్యలక్ష్మి కాలిడు వేళన్ !

రాంమోహన్ , నిజామాబాద్




కాంతి పుంజము తోడను కం బ మందు

వెడలె, శాంతము గను భక్త  వేద నుగని

భ్రాంతి తీరగ  రక్కసుని బయట లోన

కాక గడపన చీలిచి క్రాంతి నిచ్చె

సింహ ముఖముతో నరహరి  శీఘ్ర ముగను



తేటగీతి

కనుమ పండుగ దెచ్చెను కనుల కాంతి

ప్రేమ నిండిన హృదయాన వెలయు శాంతి

సాంబ శివుని స్మరణతోడ సడలు భ్రాంతి

నవ్వుచు నలుగురుండిన నవ్య క్రాంతి

రమ, కంకిపాడు.




తే.గీ.

మూగ జీవుల యెడలను మొల్లముగను

కరుణ జూపుదురెల్లరు కనుమ నాడు

బాధ్యతగ కృతజ్ఞతను జూపగను దలచ

పశుల పండుగగ కనుమ పర్వదినము!

 

సంబరముగ స్వేచ్ఛను గల్గి యంబరమున

ప్రతి హృదయ పతంగ మెగుర వలయునంచు

చదలనెగురు గాలిపటము సాటి లేక

చాటుచుండు జనుల కెల్ల చక్కగాను!


అందమైన ఆచారము లతులితముగ

మేళవించిన సంక్రాంతి మేలుగూర్చ

బంగరు భవిత కోరుచు ప్రగతి బాట

సామరస్యముగ జనులు సాగవలయు!

చల్లా దేవిక




శుభం ! 

చేయుచుంటి భౌతిక శాస్త్ర ప్రయోగము కాంతి కిరణంబులపై 

ఫలితము రాక సతమతముతో ది భ్రాంతి చెందుచుండ 

గమనించి  శాంతి శాంతి అనుచు గబ గబ వచ్చె గురువుగారు 

పదినిమి షంబులు శాంతముగా ఆలోచించుకొనుమా  , 

క్రాంతి వంతమైన ఆలోచనలే కలుగు

ఫలితము తెలియు త్వరిత గతినే అని భుజము తట్టే

జి మురళీ మోహన్ రావు



ఆ. వె.

కాంతిలీను దినము కనుమ పండుగ నేడు

శాంతితోడ జనులు శాఖ మరచి

భ్రాంతి వీడి సతము భ్రాతృత్వ బంధమున్

క్రాంతి నిండుకొనగ కాచుగొనరె.....

శాఖ = కులము / తెగ

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి




ఉత్పలమాల... (Army Day సందర్భంగా....)

శాంతిగ నుండనీయకిల, శాత్రవ సేనలు చుట్టుముట్టగన్

భ్రాంతిగ బుద్ది జెప్పగను, బాంబరు ఫైటరు తేజసొప్పగన్  

క్రాంతి పథంబునన్ దొరయ, కన్నులు గుట్టిన జందమయ్యెగా

" శాంతియు, కాంతియున్ " వసుధ సమ్మత మందగ మంత్రముగ్ధమౌ..

తేజస్.....Tejas Fiter Warplanes

భ్రాంతిగ....Surgical Strike

పి.ఎల్.నాగేశ్వరరావు 




జీవిత సార్థకత ను తెలుపు చిరు ప్రయత్నం అన్యర్థం లో

సీ.

అపరోక్ష భ్రాంతితో నానంద మొందెడు నరుల బ్రతుకు లెల్ల నటనము గద!

ఉత్క్రాంతి నెరుగక యుర్వి జనులు ధన మోహితులై వింత మోహములను

బెంచుకొని వగచి వెలయించు రీతితో జీవిత కాంతులు ఛిద్రమౌను

సమ్ముద మిచ్చెడి సాహిత్య సేవయె జ్ఞాన మోక్షములిడు సమధికముగ


గీ.

దైవ చింతన తోడ సతతము జ్ఞాన

మోహితులుగ వేదపఠనంబు సలుపు జను

లందరు ప్రశాంత జీవన మనుభవించి

జీవితఫలమ్ము  నొందురె చింత లణచి


అపరోక్ష భ్రాంతి= భ్రాంతిలో ఉండి లేననుకొను భ్రమ

ఉత్క్రాంతి= మరణం

వెంకట్.సి హెచ్




కనులని దాటని స్వప్నమా

పెదవులు విప్పని దరహసమా

చెవులకి వినిపించని సుస్వరమా

తీరం వెంటే ఎగిసే అలల కలవరమా

ఆకశానా ఎగిరే రంగుల పతంగమా

పండగ రోజున వెల్లివిరిసే ఆనందమా

క్రాంతి సంక్రాంతి మనందరి ఆకృతి

కోవూరి




పల్లవించనా నేను ...

ప్రకృతి లోని మార్పులకు ప్రతిబింబాన్ని నేను..

ఆచార వ్యవహారాలకు దర్పణాన్ని నేను..

సంస్కృతీ సంప్రదాయాలకు చక్కనైన ప్రతీకను నేను..

అంతులేని ఆనందాలకు నెలవును నేను..

దైవత్వానికి మానవత్వానికి వారధిని నేను..

సమరస భావాలకు శాంతి హారతిని నేను..

భూతదయకు మానవతకు చెరిగిపోని చిహ్నాన్ని నేను..

భావితరాలకు వెలలేని విలువల వలువను నేను..

ధర్మం గెలుపొందినపుడు ఎగిరిన పతాకాన్ని నేను..

అధర్మానికి అపజయమేనని గుర్తు చేసే హెచ్చరికను నేను..

మత సామరస్యానికి మహోన్నత సూచికను నేను..

ఆనందోత్సాహాలకు పరాకాష్టను నేను..

మానసిక ప్రశాంతతకు మహిలోన మార్గాన్ని నేను..

ఉత్తేజాన్ని పెంపొందించే చైతన్య దీపికను నేను..

ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసం కూర్చే తీపి గురుతును నేను..

వైజ్ఞానిక సూత్రాలతో అనుసంధానితను నేను..

ఆత్మీయానురాగాల కళతో అందరిలో నేను పల్లవిస్తాను..

 మతమేదైనా జనులందరి ఉన్నతిని కోరడమే నా రాక లోని పరమార్థం..

మానవత్వాన్ని  సతము విశ్వవ్యాప్తం చేయడమే

నా ఆగమనం లోని అంతస్సూత్రం..!!!

ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా...?

నేనే...సంబరంగా మీరంతా జరుపుకునే సంతోషాల పండుగను..

సంక్రాంతి అయినా.. క్రిస్మస్ అయినా.. రంజాన్ అయినా..

పేరేదైనా, మతమేదైనా మీ ఆనందానికి హేతువైన ఆత్మీయ అతిథిని నేను..

మీ అందరి హృదయాలలో పల్లవించనా పండుగనై ప్రతి వత్సరమూ నేను..!!!


సంక్రాంతి శుభాకాంక్షలతో..

చల్లా దేవిక.




(సైనిక దినోత్సవం సందర్భంగా) సైనికునికి వందనం                 

తే.గీ.

మాతృభూమిని రక్షింప మనసు పెట్టి

జన్మ నిచ్చిన వారలు చకితులవగ

ఆలు బిడ్డల వీడిన యతిని బోలి

గహనమగు చోట నుదయించు ఖగుడ వీవు!


తే.గీ. 

బాధ్యతగ నడచుకొనుచు పరగుచుండి

బడలికన్నది యెరుగక బల్లిదునిగ

శతృనివహముల ద్రుంచెడు సమరతేజ

దేశ బాంధవుడవు నీవె దివ్యచరిత! 


తే.గీ.

ఐహిక సుఖముల యెడల నాశ వీడి

అచ్యుతమగు కీర్తి బడసి యతులితముగ

నిలిచియుందువు గాదె యనిశము మదిని 

వీర సైనికా నీవేను వేల్పు యనగ! 

చల్లా దేవిక.



ఉ.

శూరమహీశ్వరుండు వలె శోభిలు వైరుల సంహరింపగన్ !

వీరజవాను క్రాంతములు ! విచ్చిన కత్తులు ! మాతృభూమినే 

ధీరతతోడ గాయుచును ! స్థేమము, ధైర్యము చాటుచుండగన్!

వారల తేజముల్ యొసఁగి, భారతమాతకి శాంతిగూర్చుమా!

క్రూరపు శత్రుమూకలను గూల్చెడి సేనకు భాగ్యమీయమా 

కస్తూరి శివశంకర్



వచనం, 

క్రాంతి తెచ్చును

కాంతి ని జీవితంలో 

భ్రాంతి కలిగించును 

అశాంతిని జీవితాంతం. 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి




వచన కవిత

పంటలెల్ల  దండిగ పండగ

పల్లెల లోగిల్లు సిరులు నిండగ

జనులకు సుఖశాంతుల్  కల్గగ

జగము నవ్యకాంతుల మెరియగ

చీకటులు దిగ్భ్రాంతి పాలవగా

వచ్చె సంక్రాంతి పండగ యనంగ.

CA కె మల్లికార్జునరావు



 తేటగీతి

దేహ భ్రాంతిని వీడిన దివ్య యోగి

జ్ఞాన కాంతులు మెరిసి విజ్ఞాన దీప్తి

వెల్లువై శాంతి స్థాపన వెలయ జేయ

జగతి సంక్రాంతిపండుగ జరుపు కొనియె

అవళూరు సీత



తేటగీతి..   ( సూక్తులు ) 

శాంతి మార్గంబె సౌఖ్యము జగతికెల్ల

భ్రాంతి యందున పచరించి బ్రతుకబోకు

క్రాంతి పథమున నడయాడు కక్షలొదలి 

కష్ట జీవుల మనుగడ కాంతులీను....

పి.ఎల్.నాగేశ్వరరావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...