20, జనవరి 2021, బుధవారం

17. 01. 2021 , ఆదివారము , పుస్తక సమీక్ష



 17. 01. 2021 , ఆదివారము 


పద్య విద్య నేర్చుకునే తొలి రోజుల్లో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చిన విషయము తెలుపు చిరు ప్రయత్నం.... నవయుగ కవి చక్రవర్తి శ్రీ జాషువా గారి ఆత్మకథ లో తాను వ్రాసుకున్న కవిత ఆధారంగా.. వారి భాషా పరిశ్రమ లో రెండు పద్యాలు పరిచయం చేయబోయే ముందుగా నా అనుభూతి

 

తేటగీతి మాలిక లో

 

పద్యవిద్య నేర్చెడి కవి పడెడు బాధ

లెన్నియో! గణములు గూర్చి యెసగ పాద

ముల ననువుచేయ యతిగాడుబుంగమూతి

పెట్టి నసపెట్టు, యతులల్లి బెంగ దీర్చ

ప్రాస కనులెర్ర చేయునె రక్కసి వలె

ప్రాస కొరకు వేదన పడి ప్రాస కూర్చి

పద్యరచన జాలించగ భావమెల్ల

భంగమయ్యె; భావము గూర్చ, పండితునిగ

వ్యాకరణ తల్లి తెగడునె, యతి, గణముల

దాడితో రసాభాసయ్యి దారితప్పి

ప్రాస, భావము లొసగంగ పక్కదారి

పట్టిన కవితా భావము, వ్యాకరణము

గూర్చగ జిలుగు పోయి దుర్గుణపు భావ

రూపము జతపడినె; కవితే రొచ్చులోన

పడిన "సూకరము"గ మారి పరిఢవిల్ల

కవియె వికృత రూపము దాల్చి కల్లువడినె

 

సూకరము= పంది

కల్లువడు= స్తంభించు

వెంకట్.సి హెచ్

 

 

నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుఱ్ఱం జాషువా గారు నా కథ అనే కావ్యంగా తన ఆత్మకథ వ్రాసుకుంటూ భాషా పరిశ్రమ అనే శీర్షికన వ్రాసిన కొన్ని పద్యాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.

 

సాధారణంగా ఆత్మకథ వ్రాయాలంటే తన జీవితంలో జరిగిన నిత్య సంఘటనల అనుభూతులను నిజాయితీగా వ్యక్తపరిచ వలసి ఉంటుంది. అలాంటి కవి దిగ్గజడు తన జీవిత సంఘటనలను చదువుతుంటే ఆశ్చర్యం కలుగాక మానదు.  తాను పద్యాలు వ్రాసే తొలి రోజుల్లో తన అనుభవాలను ఈ విధంగా తెలిపారు.

 

సీ.

నాతోడి బాలురందరు పృచ్చకులుగాగ తలతోక లేని పద్యములు చెప్పి

కుతితీర కనుపట్టు ప్రతిపదార్థము మీద కృతులల్ల కలము గాకితము దడవి

ఆలకింపుడు పద్దియములు నల్లితి నంచు వలదన్న వారి వీనులకు బులిమి

పదిమంది గల రచ్చపట్ల నల్లన జేరి కవితా ప్రసంగంబు గదలు వైచి

 

ఒక్కపదము సాగి తక్కిన పాదముల్

పెకలి రాక, ధార బిగిసి పోవ

చెలులు పరిహసింప, జెప్పితి నాష్టావ

ధానములను, శతావధానములను.

 

ఓహో! అంతటి గొప్ప కవి విశ్వకవి సామ్రాట్ జాషువా గారు తలతోక లేని పద్యములు  చెప్పానని, నీ పద్యాలు వద్దు సామీ అన్న వారి చెవులలో కూర్చి హింస పెట్టానని, ఒక్క పదము చెప్పి మిగిలిన పదాలు రాక నోరు తెరుచు కోక స్నేహితుల ముందు నవ్వుల పాలయ్యి అష్టావధానాలు, శతావధానాలు చేశానని ఎంత మాత్రం సంశయం లేకుండా తెలుపడం వారి యొక్క నిజాయితీకి నిదర్శనం.

 

మరొక పద్యం

సీ.

గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ "తగ్గవో" యని యతిస్థాన మురుము

యతిని మచ్చికజేసి యడుగు ముందుకుసాగ ప్రాసంబు కుత్తుక బట్టి నిలుపు

ప్రాస వేదన దాటి పయనంబు సాగింప భావంబు పొసగ కిబ్బంది పెట్టు

భావంబు పొసగించి పద్యంబు ముగియింప రసలక్ష్మి, కినిసి మారాము సేయు

 

ఇట్టి ప్రతిబంధకంబుల నెల్ల గడచి

గట్టు కెక్కుదమన్న, వ్యాకరణ శాస్త్ర

మాదరింపదు శబ్ద మర్యాద గాన

రాక కవిగాని బ్రదుకు శ్రీరామ రామ!

 

మధుర శ్రీనాథ, కవికోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అనన్య సామాన్యమైన బిరుదులు పొంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,  గండ పెండేరాలతో అనేకానేక సత్కారాలు సన్మానాలు పొంది పగటి దివిటీల నడుమ గజారోహణము గావించిన శ్రీ గుఱ్ఱం జాషువా గారు తన సాహిత్య ప్రస్థానం లో ఇలా కావ్యములు వ్రాయుటకు అష్టకష్టాలు పడ్డారని తన ఆత్మకథ లో వ్రాసుకోవడం నివ్వెరపాటు కల్గించి నప్పటికి ఇది అక్షర సత్యం. పద్య విద్య నేర్వడం ఏదో అదృష్టం అనుకోవడం కాకుండా సాధన చేస్తే ఎంతటి విద్య అయినా వస్తుందని "సాధనమున పనులు సమకూరు ధరలోన" అని యోగి వేమన తెలిపినట్లు తేటతెల్లం చేయడమే జాషువా గారి ఆంతర్యం..

 

ఆ దిశగా నేను, మీరు మన సమూహ కవులు ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ, మహాకవి జాషువా గారి పద్యాలు పరిచయం చేసినందుకు తాదాత్మ్యం పొందుతూ.....

వెంకట్.సి హెచ్

 

 

ప్రార్థన

 

ప్రభూ! ఈ నా అల్పుని పూజ స్వీకరింపు.

నా ఆనంద బాష్పములచే నీ చరణములు కడిగెద,

నా ప్రేమ యను చందనము నీ దేహమునకు పూసెద,

నా విశ్వాసమనే వస్త్రమును నీ శరీరముపై కప్పెద,

నా అష్ట మదములనే పుష్పములను నీకు సమర్పించేద,

నా ఏకాగ్ర చిత్తమనే ఫలమును నీ హస్తము కందించేద,

నా భావములను పన్నీరు చేసి నీ శిరముపై జల్లెద,

నా ధృఢ భక్తి యను మొలతాడును నీకు కట్టేద,

నా శిరస్సును నీ పాదము బొటనవేలు పై నుంచెద,

నా మనసును అంతర్ముఖ మవునటుల చేయుము,

నిత్యానిత్య భేదము తెలుసుకొను వివేకము నివ్వుము,

మాయాసక్తిని పోగొట్టి ఆత్మ సాక్షాత్కారము కల్గించుము.

 CA కె మల్లికార్జునరావు

 

 

ఆటవెలది....

సుమతి శతకము జగతికి సుధలు బంచు

వేమ నార్యుని పలుకులె వేదమయ్యె

భాస్కరుని బాట పయనించు భావితరము

పట్టు వీడక చదువుడీ పద్యములను.

పి.ఎల్.నాగేశ్వరరావు

******


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...