14, జనవరి 2021, గురువారం

10 01 2021 ఆదివారము _ పుస్తక సమీక్ష

 


 10 01 2021 ఆదివారము_పుస్తక సమీక్ష

సభకు, సభ్యులకు నమస్కారం.

 వారం రోజుల తర్వాత ... డిజిటల్ కలం పట్టుకున్నాను... బుఱ్ఱలో cartridge అయిపోతే , రంగుల ఆలోచనలు, బ్లాక్ అండ్ వైట్ అక్షరాలు కరువయ్యాయి... గ్యాప్ ఇచ్చాను/వచ్చింది ..

ఇప్పుడు మళ్ళీ రిలోడ్ , రిసెట్ చేసి... కథా పరిచయం చేస్తున్నాను.

ఈరోజు నేను బహు క్లుప్తంగా చెప్పబోయే కథలు.... అమరావతి కథలు పుస్తకం నుంచి...

పుస్తకం , రచయిత  శ్రీ శంకరమంచి గారితో మంచి పరిచయం మీ అందరికీ ఉండే ఉంటుంది , అందుకే కథలు మాత్రమే పరిచయం చేస్తాను!!

నా మాట , నా భాష, నా భావాలకి మల్లే..నేను చెప్పే కథలకి వరస ఉండదు,అందుకే, అక్కడక్కడవి ఎంచుకున్నాను !!

 

మొఠ్ఠ మొదటిది :

అటునించి కొట్టుకురండి :

 

చింతపల్లి అడవుల్లో ఉండే క్రూరమృగాలను మించిన వారు అక్కడ ఉన్న చెంచులు, అడవిదారిని ఎవ్వరినీ వెళ్లనీయక వచ్చిన వారిని వచ్చినట్టుగా గండ్రగొడ్డళ్లతో నరికి చంపి దోచుకోవడం వీరి పని .

 

ఏలిక వెంకటాద్రి నాయుడు, వారినెదుర్కోవడానికి పంపిన వందల సైన్యం విగత జీవులయ్యారు..మర్నాడు దారిన వెళ్లిన పెళ్ళి వారిని కూడా చంపి వారి ఉసురు పోసుకున్నారు !!

అడవుల్లో చెంచుల్ని జయించడం కష్టం , కాబట్టి .. మొసలిని ఒడ్డుకు లాగాలి  అని పథకం వేసి.. చెంచుల్ని రాయబారానికి పిలుస్తారు !

బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోమని,తమ మీద కత్తెత్తవద్దని, వారికి కూడు దొరికే దోవ చూపించమని వేడుకుంటాడు వచ్చిన చెంచుల నాయకుడు.

సరేనని , ఘనముగ పట్టము గట్టిన అన్నట్టు , తన సైన్యంలో చేర్చుకుంటాడు వెంకటాద్రి నాయుడు..

సుఖం కూడా ఎక్కువైతే చేదుగా ఉంటుందన్నట్టు, చెంచులకి సుఖం మీద చిరాకు పుట్టి, చిన్న చిన్న దొంగతనాలు చేయడం నుంచి నెమ్మదిగా అడవుల్లోకి వెళ్లి మామూలుగా దోపిడీలు, దారుణాలు చేయడం మొదలు పెట్టారు..వెనుకటి గుణమేల మాను ?

దారిన పోయేది నెత్తిన పెట్టుకున్నట్టయింది, మళ్ళీ మంతనాలు జరిపి మంత్రాంగం సిద్ధం చేసి... ఇంటి శత్రువుకి మరణమే మందని తలచి!!

విందుకి పిలిచిచెంచుల చేతుల్లో ఆయుధాలని దూరంగా ఉంచి, ఆఖరి భోజనం సుష్టుగా పెట్టి పెడరెక్కలు విరిచి మోకులతో కట్టి వరసగా నిలబెట్టి ఊరంతా చూస్తుండగా తలలు నరకమని ఆదేశిస్తాడు .

దొరా, కన్నబిడ్డల కుత్తుకలు కోస్తావా? అని అడిగిన చెంచు నాయకుడిని, తమ్ముళ్ల నెత్తురు పారించిన కిరాతకులు , నూటొక్క తప్పుకాసానురా, తల్లికి ద్రోహం చేసిన వారి తలలు తెగాల్సిందే , నరకండని ఆజ్ఞాపిస్తాడు నాయుడు.

మొదట నిలుచున్న చెంచు నాయకుడ్ని నరకబోగా, విధంగానైనా జాలి తలుస్తాడేమోనని ఆశతో..అటునుంచి నరకండి దొరా అని కోరతాడు.

నాయుడు సరేనని , అటునుంచి కొట్టమంటాడు, ఏదేమైనా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి, అది చూసే దురదృష్టం నాయకుడికి కలిగింది...

(అటునుంచి కొట్టుకురండి, అనే సామెత వెంకటాద్రినాయుడు కాలం నుంచే ప్రచారం లోకి వచ్చింది)

నీతేమిట్రా అంటే...

 

1.పుట్టుకతో వచ్చిన బుద్ధి అన్నట్టు, కొందరు మారరు .

 

2. అవకాశం అనేది ఒక్కసారే ఇవ్వాలి, రెండో సారి ఇస్తే అలుసు అవుతుంది.

 

3.అక్రమాలు చేయడం అలవాటైన వాడు , అథాటున మారిపోయాడంటే , నమ్మేయకూడదు...కూసంత ఆలో....సించాలి.

 

4. నాకేం తోచడం లేదు... మీకు తోస్తే చెప్పండి, బట్....ఒకటి ..నన్ను మాత్రం తోసేయకండి...

 

ఒఖ్ఖ కథకి ఇంత సుత్తా?? అనుకునేలోగా.... రెండో కథతో వస్తా , నా పేజీల ప్రహసనం అనేది తడవల వారీగా అందిద్దామని ఆశ

కాసేపట్లో కలుద్దాం.......

 

 

స్వేచ్ఛ  సమర్పణ -

మనిషి ప్రకృతి

 

నది తన జలము తను తాగదు

తెమ్మెర తన కొరకు తాను వీయదు

చెట్టు తను కాసిన పండ్లు తను తినదు

పూలు తమ గంధం తాము ఆఘ్రానించవు

చంద్రుడు పరుల కొరకు వెన్నెల ప్రసరించు

సూరీడు లోకం కొరకు వెలుగు  ప్రకాశించు

సకల జీవులకై బ్రతకడమే ప్రకృతి రీతి

కష్టమెంత ఎదురైన తప్పదు తన నీతి

మానవ జాతి కిదియె సరియగు ధర్మము

ఆచరించిన, జగమగును నందనవనము.

CA కె మల్లికార్జునరావు

 

 

కథ సేకరణ.

బ్రహ్మగారు భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.

 

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

 

అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).

 

వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).

 

చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.

 

అందుకే:

మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.

 

తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.

 

ఇక తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే కాపలాదారుగా మారిపోయి

వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.

 

ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.

 

"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".

 

మళ్ళీ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.

 

 ( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

*******

 

 

తిలక్ గారి అమృతంకురిసిన రాత్రి నుండి

చిన్న కవితను ఈరోజు మీ అందరి తో పంచుకుంటున్నాను.

గత కొన్నివారాలుగా సాహితీ సమీక్ష లో పాల్గొనలేకపోయి

నిస్తేజంగా ఉన్న నాకు కవిత తిలక్ గారు నన్నుత్తేజ పరచడానికే చెప్పినట్టు అనిపించింది

 

చిన్నారికి చిన్నమాట

 

జీవితం సంగీతం పెట్టె మీద

చిగురుటాకు అంగుళులను కదలినీ

పలుకుతుంది హిందోళ

ఓలుకుటుంది నవహేల

అప్పుడు

బ్రతుకే ఊగే ముత్యాల ఉయ్యాల

 

జీవితం నవనీతం పాత్రమీద

చెదరిపడనీకు రాయినీ రప్పనీ

పగులుతుంది స్వప్నం

రగులుతుంది దుఃఖం అందుకే

బ్రతుకే ఉలిపిరి కాగితం చందం

జీవితం దేవతల దరస్మితం

చిన్నారీ ! పెడవిమీద సింగారించు

కలతవద్దు కొలతవద్దు

అలసట అలజడి వద్దు బాల !

అపుడు బ్రతుకే లలిత లలిత

లతాంతమాల.

 

రమ,కంకిపాడు.

 

 

నా ఆత్మీయులకు శుభ సాయంతన నమస్కారాలు.

 

సాక్షి.... అదేనండి...ఈనాడు.. అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం.. ...

అందుకే.. అందమైన ఆదివారం సాయంత్రం,మిమ్మల్ని  slateరించి, కాస్త నవ్వించే ప్రయత్నం చేద్దామని....

 

ఏంటీ...

మన సమూహంలో పులుసు వత్తర పుస్తక సమీక్షలు, సాహితీ church aలు జరుగుతుంటే ... in the middle...వీడు,

 Twig in Jaggery solution లాగా... Dung-cake chase in Ramayanam లాగా విసిగిస్తున్నాడనుకుంటున్నారా ?

మన్నించండి..

 

"Don't teach coughs to grandpa!" అంటున్నారా ?

"Your dhaals(pulses) will not boil near me!"  అనేశారా?

నిన్న కాస్త బిజీగా ఉండి... Spun దించ లేకపోయా... నిన్న........

పెళ్లికి వెళ్ళా...  అక్కడ, Marriage-son............  Tues Formula..... build డం అయ్యేసరికి ఆలస్యం  అయిపొయింది..అందుకే నిన్న గైర్ హాజరు.

జండూబామ్ వదిలితే.. అమృతాంజనం write చేసుకుందాం అనుకుంటున్నారా ?

సరేనండి..ఇలా rub చేస్తూ పోతే Diameter కి అంతూ పొంతూ ఉండదు...

మరి I wl take holiday near you ..    Give me holiday   Holiday వా మరి !!

 

వేళ,  అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం కాబట్టి,నేను జంధ్యాల జోక్స్ 2 (ఎమెస్కో వారి ముద్రణ) అనే పుస్తకాన్ని పరిచయం చేస్తాను....అనను,ఎందుకంటే...జంధ్యాల హాస్యం రుచి ఎరుగని తెలుగు వారెవరుంటారు ?

 

పొత్తము నుండి, నాకు, head చుకుంటేనే  laugh coming కొన్ని జోక్స్ మీతో punch కుంటాను..  కానీ, దానికి front గా... నేనే cook చేసిన 2,3 saw-fodderలు... ఇవిగో...

 

No wife.. No stomach... son's name Somalingam

అన్నదానికి......

Potato  లేదు... చూలూ లేదు.... సారీ... ఆలూ లేదు.. చూలూ లేదు..

అల్లుడి పేరు అమితాబ్ బచ్చన్..

కోడలి పేరు కల్పనా రాయ్ అన్నాట్ట నాలాంటి వాడెవడో !

 

As if Mother-in-law property, son-in-law donating..

Eraseకురా... Badఏవు...

 

ఓకే... మరి స్వర్గీయ జంధ్యాల గారిని పిలిచేద్దామా ?

మీ స్టొమక్ స్ కి... నా గారంటీ లేదు మరి !!

************

 

ఇక్కడ నించి(సేకరణ మాత్రమే)

ప్రమోషన్

"ఐదు సంవత్సరాల నుంచి నిన్ను ఇదే కోర్టు లో చూస్తున్నా.. సిగ్గు లేదుటయ్యా ?" అన్నాడు జడ్జి జేబు దొంగని చూసి.

"మీకు ప్రమోషన్ రాకపోతే నాకెందుకు సార్ సిగ్గు ?" ప్రశ్నించాడు జేబుదొంగ.

************

 

సిగ్గు

 "ఇన్నిసార్లు కోర్టుకి వచ్చావు.సిగ్గు లేదా నీకు ?" అడిగాడు జడ్జి ముద్దాయిని.

 కోర్టుకు రావడం సిగ్గుమాలిన పని అంటారా ?"..అడిగాడు ముద్దాయి.

"కాదా మరి ?"....తీవ్రంగా అన్నాడు జడ్జి.

"మరి లాయర్లు, మీరూ  ప్రతిరోజూ వస్తున్నారు కదా ?" అన్నాడు ముద్దాయి.

************

 

దయ

"పట్టపగలు గేటు తాళం పగలగొట్టి, డోరు విరగ్గొట్టి, తలుపులు తెరిచి, బీరువా పగలగొట్టి, నగలు, డబ్బు దొంగిలించావట. నిజమేనా ?" ప్రశ్నించాడు జడ్జి.

"సిత్తం దొరా... శానా కష్టపడాల్సి వచ్చింది. ధర్మ పెబువులు.. కొంచెం దయ సూపించాల" దణ్ణం పెడుతూ అన్నాడు గంగన్న.

************

 

ఫొటో

"మా అమ్మ తప్పి పోయి నెల దాటి పోయింది.. టీ వీ లో ప్రకటిద్దామంటే కనీసం ఒక్క ఫొటో కూడా లేదు. ఛీ.. ఛీ.." దిగులుగా అన్నాడు మనోహరు.

"పోనీ.. నా ఫొటో ఇచ్చి, ఈవిడ అత్తగారు కనిపించడం లేదు అని చెప్పించండి టీ వీ లో.." చెప్పింది జమున, అద్దంలో అందం చూసుకుంటూ..

*************

 

బలి

"ఏవండోయ్.. రోజుకు మన పెళ్ళై సంవత్సరం నిండింది.. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పులావ్ చేసు కుందాం" చెప్పింది సుగుణ.

 

"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలి చెయ్యడం ?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

*************

 

ప్రేమ

"నేను నా నలభై సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఒకే ఒక్క స్త్రీని గాఢంగా ప్రేమించాను." శాస్త్రితో చెప్పాడు ఆచారి.

"చాలా గోప్ప విషయం.." అన్నాడు శాస్త్రి.

"అవును. పొరపాటున కూడా విషయం మా ఆవిడతో చెప్పవాకు" ముక్తాయింపిచ్చాడు  ఆచారి.

*************

 

ప్రమాదం

"డాక్టరు గారూ.. ఇది చాలా ప్రమాదకరమైన కేసులా ఉంది.." అన్నది నర్సు.

"అబ్బే.. ఇది చాలా సింపుల్ కేసే సిస్టర్. ప్రమాదం లేదు." చెప్పాడు డాక్టరు.

"సార్... రోగి అన్నయ్య లాయరట. తమ్ముడు సర్కిల్ ఇన్స్ పెక్టరట, బావమరిది పెద్ద రౌడీ షీటరట. తోడల్లుడు బాక్సరట.. మామగారు మ్మె ల్లేనట. దన్నా జరిగితే మనకు చాలా ప్రమాదం" వివరం చెప్పింది నర్సు కంగారుగా.

************

 

పవర్

"మా ఆవిడ కన్నా నాకే పవర్ ఎక్కువ" గర్వం గా చెప్పాడు చలపతి.

"వెరీ గుడ్. చాలా గోప్ప విషయం.. ఇన్నాళ్ళనుంచీ నాకు తెలియదు" అన్నాడు తిరుపతి.

"నాకూ తెలియదు.... మొన్న కళ్ళ డాక్టరు చెప్పిందాకా" ముక్తాయించాడు చలపతి.

*************

 

పొగడ్త

కోర్టులో.. "రఘురాం అనబడే ముద్దాయి చాలా తెలివిగలిగినవాడు. భార్యను చంపితే ఎవరికీ అనుమానం రాగూడదని తన సైన్స్ విజ్ఞానాన్ని, తెలివైన మెదడును, కనీసం వేలు ముద్రలైనా కనపడకుండా చేసే తెలివితో, కడు చాకచక్యంగా, అత్యంత సునిసితత్వంతో, అసమాన మేధాశక్తితో....." జడ్జిమెంట్ చదువు తున్నాడు న్యాయమూర్తి.

 "సార్.. సార్... నన్ను మరీ అంత పొగడ్తలతో ముంచెత్తకండి... నాకు చచ్చే సిగ్గుగా ఉంది." ముడుచుకుపోతూ అన్నాడు ముద్దాయి రఘురాం.   

************

ఎవరినీ కించపరిచే, బాధించే ఉద్దేశ్యం ఏమీ లేదని సవినయంగా, జంధ్యాల సాక్షిగా మనవి చేసుకుంటున్నాను.

ప్రత్యేకమైన రోజున,మిమ్మల్ని, 2,3 సార్లు నవ్వించగలిగినా, నా జన్మ ధన్యం అయినట్లే..

 ఎందుకంటే...

Laughter is the Best Medicine ... అని నేను గాఠిగా నమ్ముతాను మరి.

స్వర్గీయ జంధ్యాలకి స్మృత్యంజలి తో......

 

వట్టెం వెంకట రమణ

10.01.2021


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...