14, జనవరి 2021, గురువారం

11 01 2021 సోమవారము, దత్తపది - కరము-వరము- శిరము - పురము

 


11 01 2021,   సోమవారము

దత్తపది - కరము-వరము- శిరము - పురము


వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.


 

 ఆట వెలది

శిశిర మందు వీచె శీతల గాలులు

కలవరమ్ము గాగ కాపురములు

కనికరమ్ము లేని కాముని శరములు

క్రొత్త జంట లందు గ్రుచ్చు కొనగ

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తథాస్తు !

శిరము నటునిటు తిప్పుచు

కాదనక, కుదరదనక

వరము లెన్ని వున్నను ,వచ్చినను

కరములతో కడవరకు చేయు సేవయే

తెచ్చు మంచి పేరు పురము నందు!

జి మురళీ మోహన్ రావు


 

వరము పొందిన ధనువుని  వరుడు విరిచి

కరము నందున మాలను కన్య సీత

శిరము దించగ వేసెను శీఘ్ర గతిని

పురము నందున కురియంగ పూల వాన

సాయి లక్ష్మి

 

1

మార్గ శిరమునందు మల్లన్న సేవకు

కాపురమ్ము తోడ కలసి వెళ్లి

వరము గోరి భక్తి కరముల మ్రొక్కగ

శంకరుండు జూసె జల్లగాను...

 

తే. గీ.

వరము లొసగిన రాముని కరములలర

ధనసు విరుగగ., జనకుడు, ధరణి పతులు,

పురమునంతయు హర్షము పులకరించ

సీత ముదమొంది ప్రణమిల్లె శిరమువంచి

 

3  తే. గీ.

కండ కా" వర" మెక్కగ కా" పుర" ముల

గూల్చ భీ" కర" యోచనల్,కుటిల యత్న

ములను చేయు దుర్మార్గాధములకు బుద్ధి

చెప్పి " శిర" ముల దించుకో జేయ వలయు.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

కరమొప్పును దానమ్మును

వరమొప్పును క్షేమకాంక్ష వసుధకునెపుడున్

శిరమొప్పును విజయమ్ముల

పురమొప్పును తప్తశరము పొడవకయుండన్ !

రాంమోహన్,  నిజామాబాద్

 

 

కాశీ పురము నందున్న విశ్వేశ్వరుని

కరములతోక్షీరాభిషేకము గావించి

శిరమువంచి భక్తితో స్తుతియించిన

అడిగిన వరములనిచ్చి ఆనందింప జేయు.

హేమలత

 

 

కరము బారినపడి గజ రాజము

తల్లడిల్లి  శక్తులుడుగి బ్రోచుమని

శ్రీహరిని ప్రార్థించ, వైకుంఠ పురము

వడివడిగ వదిలి, రయముగ నట

చేరి మకర శిరము ఖండించి , తన

భక్తుని ఆపదల దీర్చి ప్రాణ వరము

నొసగి వెను తిరిగె నా దేవ దేవుడు.

CA కె మల్లికార్జునరావు

 

 

మార్గశిర మాసము గురించి దత్తపది పూరణ

సీ.

మార్గశిరము జూడ మంచు కురియుచు సోయగ మొలికింపంగ హరువు గూడు

గోపురముల యందు కొలువు దీరిన హరి మహిమ జూపెడు ధనుర్మాసమిదియె

సాతమొసగెడు నిశాపుష్పపు జడియె మురిపించి రహిగ సమ్ముదము గూర్చు

మంజులకరమైన మధుకరముల సుస్వ రములె హ్లాద మొసంగు సమధికముగ

 

గీ

నరులు కరములు జోడించి హరిని వేడ

శిరములన్ దించి ధ్యానింప శ్రేష్ఠమైన

వరము లొసగునె వైకుంఠ పురము నుండి

పద్మపాణి ధనుర్మాస వైభవముగ

వెంకట్.సి హెచ్

 

 

తేట గీతి

భూమి తల్లి శిరము వంచి భూతలమును

గాయ మని వరమడిగెనో కమల నాథ!

శుభ కరములు జనులలో శూన్య మాయె

పురము లందు మనుగడ కోల్పోయి జనులు

వగచుట కరో న సృష్టి యే పద్మ భవుడ!

ఉష

 

 

కం - 1

కరములు మోడ్చగ వరములు

మురియుచు వాఙ్మయఝరులవి ! మోహనమయమై  

సురుచిర మార్గశిరమునన్       

పరవశమౌ నూపురముల భాగ్యమ్మిదియే !

 

కం - 2

శిశిరములందున వరమై

ప్రశస్తమౌ నూపురముల స్వరసంగతమై

శశికిరణమ్ముల విరులై  

నిశిరాతిరి వెన్నెలలవి నీహారంబై !

కస్తూరి శివశంకర్

 

 

దత్తపదికి వరహావతారము ఇతివృత్తంగా

తేటగీతి లో నా సమాధానం

ప్రళయ జలముల మునిగిన వరను పైకి

నెత్త సూకరముగ మారె నేక పొత్తు

బ్రహ్మ వరములనీయగన్ బలుపు గొన్న

రక్కసుని శిరమును ద్రుంచి రక్షచేసి

తనదు దంష్ట్రల పైనుంచి ధరణి నెత్తె

పురపురమను జీవులగాచి పురుషవరుడు

శ్రీవరాహావతారుడై చెంగలించె

 

పురపురమను  =బాధపడు

పురుషవరుడు= విష్ణువు

అవళూరు సీత

 

 

శుభకరమగు లగ్నమందు

మంగళవాద్యాలు మ్రోగ

శిరము వంచి సిగ్గుపడె

ముద్దుల వధువు

కల'వరమగు'చున్న వేళ

సప్తపది అడుగులేసి

కాపురమున కాలుపెట్టె

కౌసలేయుని సతిగా

విష్ణుప్రియ

 

 

కరమున పద్య రచనయే

వరముగ గల్గిన సమూహ వర పుత్రులకున్

శిరమును వంచి నమనమిడి

పురమున సత్తువ గలిగిన పూజలు సేతున్.....

పురము = శరీరము

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

జనవరి 12( రేపు) స్వర్గీయ యల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా

సీ.

ట్రాపికల్ స్ప్రూ వ్యాధి ఠారెత్త ఫోలికు యాసిడు కనుగొన్న యాత డెవరు?

కాన్సరు వ్యాధిని కడ తేర్చగా టెరొవ్ టిరి నును వాడుక తెచ్చె నెవరు?

బోద కాలరికట్టి పోద్రోల హెట్రజాన్ మందును తెల్పిన మాన్యు డెవరు?

ప్లేగు వ్యాధి నిలలో సాగనంపగ టెట్ర సైక్లిను పసిగట్టు చదువరెవరు?

ఆంటి బయొ టికు ను,ఆరియోమైసిను కనిపెట్టి మేల్ గూర్చు గణ్యు డెవరు?

 

తే. గీ.

ధనము లేకున్న, తండ్రియు చని 

పోవ కష్ట నష్టములకు జావగార

కుండ లక్ష్యమున్ సాధించు నిండు మనిషి 

ఎల్ల ప్రగడ సుబ్బారావు కాక నింక నెవరు?

 

సుబ్బారావు గారి పై పేరడీ పాట (" భార్యా బిడ్డలు" చిత్రంలో " చక్కనయ్యా చందమామా!" ట్యూన్)

పల్లవి:

యల్లాప్రగడ సుబ్బారావు! ధన్యజీవి వయా!

వైద్య రంగ పు నింగిలోన ధృవతార నీవయ్యా!

 

చరణం:

పేదయింటను పుట్టినా నువు మెడిసిన్ కోర్సు కోరినావు

హార్వర్డ్ కాలేజ్ చేరి చదువుకున్నా వూ పరిశోధకుడ వైనా వు

 

చరణం:

రక్త హీనత,కాన్సరుబోదకాలు,ప్లేగు వ్యాధి ని

నిర్మూలింపగ డ్రగ్స్ ఎన్నో తెలుసుకున్నావూ ప్రజల కాచావు

 

చరణం:

హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఎన్నొ పదవుల వెలిగినావు

లెడ ర్లి ల్యాబుకు అంతు లేని సేవ లిచ్చావూ ఘనకీర్తి పొందావు

 

చరణం:

 చదువుకొను విద్యార్థులనుపరిశోధకు లైన సహచరులను

ఆర్థికంగా ఆదుకుంటూ మానవత చూపావూ మాన్యుడైనావు.

డి.రామ నాగేశ్వరరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...