4, జనవరి 2021, సోమవారం

01 .01 .2021 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2021

 


తెలుగు తేనియలు సమూహ సభ్యులందరికీ

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2021

 

రేయి గడవనీ..  నిన్నటి గాయాలకు,

రేపటి భరోసాకు  మధ్యలో నిలిచిన

రేయి గడవనీ..

 

అచ్చిరాని అంకె   నిష్క్రమిస్తున్న ఖాళీలో..

ఆశల అశ్వారూఢియై వస్తున్న

కొత్త అంకెను కూర్చోబెడదాం..!

 

క్యాలెండర్ మారుతున్న వేళ..

కలతల జీవితాలూ మారాలని శుభాకాంక్షలు చెప్పుకుందాం..

 

■ #Be happy

■ #Be Safe

 

సంగెవేని రవీంద్ర

 

కం||

రోతగ నుండిన గతమిక

నీ తరమునకంతమనుచు నివ్విధముగనే

చూతము మంచిని నిక్కము

నూతన సంవత్సరమున నూటికి నూఱే

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

ఎన్నో ఊహలతో ఎన్నో కొంగొత్త ఆశలతో

2020 సంవత్సరం అడిగిడిన మనం

కరోనా కాటుకు ఉక్కిరిబిక్కిరి అయిపోయాము.

ఎందరివో జీవితాలు అతలాకుతలం అయిపోయాయి.

చేసుకున్న పాపమో ప్రకృతి వైపరీత్యమో చేదు జ్ఞాపకాలను మనకు  వదలి

 2021 కి స్వాగతం పలకండి అని 2020 వెళ్లిపోతుంది

మనమందరము ఆశావహ దృక్పథంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.

దేవరశెట్టి నాగమణి

 

 

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021

మూడువందల అరవై ఐదు రోజులు

తన ఒడిలో సేద తీరుస్తుందని..

ఆకుపచ్చని అనుభూతులెన్నో

ఆప్యాయంగా అందిస్తుందని..

సంబరంగా స్వాగతించిన సకల జగతికి..

 భూగోళపు సరిహద్దులన్నీ చెరిపి..

జీవన్మరణాల మధ్య ఊగిసలాటతో

గుండె గుండెనూ గుభిల్లుమనేలా చేసి..

విరిగిపడ్డ కెరటం వంటి విషాదాల

చేదు జ్ఞాపకాలను చరిత్రగా అందించి..

తన గడపను దాటిపోతున్న

మనలను తదేకంగా చూస్తూ..

కాలగర్భంలో కలసిపోయేందుకు

నిర్వికారంగా సిద్ధపడిన 2020 సంవత్సరానికి

భారమైన మనసుతో వీడ్కోలు పలుకుదాం... !!

 

అర్థం లేని ఆరాటాలను వదులుకొని..

అర్థవంతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని..

అనుబంధాల విలువను అర్థం చేసుకొని..

అసహజమైన భయాలను తొలగించుకుని..

మేలు చేసిన ప్రతి మనిషిని కొలుచుకొని..

విమర్శించిన ప్రతి హృదయాన్ని గెలుచుకుని..

ఆత్మీయులుగా ఎల్లరిని మలచుకొందాం..!

గతంలోని అనుభవాలను స్మరించుకొని..

వర్తమానం లోని వాస్తవాలను గ్రహించుకొని

భవిష్యత్తుపై భరోసాను పెంచుకొని..

అపజయాల నుండి పాఠాలను నేర్చుకొని..

విజయతీరాలకు బాటలు పరుచుకొందాం..!

అణువణువునా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని..

కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నడచుకొని..

సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని..

కాలప్రవాహంలో మన ఉనికిని చాటుకుందాం.!

ఉన్నంతలో ఉదారత చూపుతూ..

ప్రకృతి కనుసన్నల్లో మసలుకొమ్మనే సందేశంతో..

కొత్త ఆశల సుమహారాలను తన వాకిలికి తోరణాలుగా కట్టి

సరికొత్త శుభోదయంతో మనల్ని సాదరంగా స్వాగతిస్తున్న

2021 సంవత్సరం ముంగిటిలో ఆశావహంగా అడుగిడుదాం..

అప్రమత్తతే శిరోధార్యమని అందరమూ అంగీకరిద్దాం..!!

చల్లా దేవిక

 

 

రోతగు క్లబ్బులన్ దిరిగి రోడ్డుకు నడ్డుపడంగ తూగుచున్

వ్రాతలు మార్చగన్ భటుల రచ్చకు తప్పక గాలినూదగన్

యాతన జెప్పజాలనిక నాయువు నిల్పగ ఫైను కట్టితిన్

నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

వాణిశ్రీ నైనాల

 

 

సమస్య

 నూతన సంవత్సరమున నూటికి నూఱే     (లేదా…)

నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

 

కందము

గతమున వేతన మందక

బతుకుల భారముగ గడుపు బడుగుల్లారా

వెతలను విడువుడు మీరిక

నూతన సంవత్సరమున నూటికి నూఱే

 

ఉత్పలమాల

మూతికి గుడ్డఁగట్టితిమి ముందుకు పోవగ మానుకొంటిమే

చేతుల శానిటైజరును జేబునఁ బెట్టుకు పోవుచుంటిమే

తాతల నాడులేని కడు దైన్యపు రోగము కష్టఁ బెట్టగా

నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

క్రొత్త యడుగు వేయ కోర్కెల పుట్టయె

వెలికి తీసి చూడు వెలితి లేక

కష్ట సుఖము లనగ కావడి కుండలె

సంత సంబు విడక సాగి పొమ్ము.....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

కాలగమనమందు క్యాలెండరై మీరు

కొత్తదనము దాల్చి చిత్తమందు

ఎన్నొ ఆశలుంచి పన్నెండు పత్రాల

ప్రగతిగీతికొకటి పాడరండి!

రాంమోహన్ నిజామాబాద్

 

 

కందము:

ఇయరది మారగ కోవిడ్

ఫియరది పోవంగ క్రొత్త వింతల వైరస్

క్లియరయి పుడమిని ఎట్మాస్

ఫియరది మారంగవలయు, విష్ ఆల్ హ్యాపీ.

గోలి

 

అందరికీ ఆంగ్ల నూతన వర్ష శుభాకాంక్షలు 2021

(పద్నాలుగు పాదముల ఉత్పలమాలిక) 

నూతన వత్సరంబున మనోహరభావము లాస్యమాడగన్ 

కైతల కూజితంబులకు కమ్మని మాధురులద్దినట్లు ని

ద్ధాతర భావమాలికలు ధన్యత పొందెను సుందరంబులై    

కైతలు గూర్చు ధీమతులు కమ్రపదంబుల జూచినంతనే

ద్యోతము, దివ్యకేతనముతో హృదయమ్మున నూత్నతేజమై  

భూతలమందు వల్లరుల మోహనరాగము పాడినట్లుగన్         

పూతపు పద్యరుచ్యముల పొంకపురాగము గూర్చినట్లుగన్  

చూతఫలమ్ములై జిలుకు చొక్కములన్ సృజియించినట్లుగన్

శీతలచందనాదుల వశీకరణమ్ము నితాంతభావముల్ 

వాతెఱ పంచుపద్యముల వైభవముల్, రసధారలై సదా 

భూతలమందు హాసములుపొంకపు భావనలద్దినట్లుగన్ 

భాతపు వెండివెన్నెలలపై మధురోహలు పారిజాతమై   

చేతన పొందు మానసము జిల్గుల వెల్గుల వాఙ్మయంబులై  

జ్ఞాతము పంచగావలెను ! చైత్రములన్ వరమీయు భారతీ !

కస్తూరి శివశంకర్ 

 

 

ఆంగ్ల నూత్న వత్సరం 2021 కి సాదర స్వాగతం....

 క్రిందటి ఏడాది 2020... మనతో, "20--20 TWENTY TWENTY Match", ఆడుకుని, మనని ఎంతో టెన్షన్ కి... ఎంతో మానసిక క్షోభకి, అంతులేని ఉద్విగ్నతకి గురిచేసి ....గమ్మత్తుగా...మనల్ని  కదలనీయకుండానే.. ఇళ్లక్రీజుల లోపలే బంధించేసి కూడా..మనల్ని విపరీతంగా  పరుగులు తీయించి,అలిపించి, ఎవరు గెలిచారో అనేది డిక్లేర్ చెయ్యకుండానే, నిశ్శబ్దంగా నిన్నలలోకి జారి, నీరవ నిశ్శబ్దాలలోకి కనుమఱుగై, నిష్క్రమించింది.

 

ఈనాడు.. సందేశం నేను  వ్రాయఁగలుగుతున్నాను, మీరు చదువుతున్నారు అంటే.. మనమే గెల్చినట్లు.. అని ఏకపక్షంగా నేనే  డిక్లేర్ చేస్తున్నా..

ఏమైనా, మనని సజీవులుగా ఉంచిన 2020 కి

కృతజ్ఞతాభివందనం !

 

నూత్న వత్సరమైనా,

ఉల్లాసోత్సాహాలతో, రసభరితంగా, ఆనందంగా పరువెత్తాలని,...సారీ... సాఫీగా నింపాదిగానే  సాగిపోవాలని, ఆనందం, శాంతి, ఆరోగ్య, ఐశ్వర్యాలు

Square లాగా వృద్ధి పొంది, మిమ్మల్నీ, మీ వాళ్లందరినీ అలరించాలనీ,... అలాగే, గత సంవత్సరంలో మనకి ఎదురయిన చింత, వంత, వగపు, నలత, బాధ.. SQUARE ROOT లాగా తరిగిపోయి, గతించి, అంతరించి పోవాలని.. మీ జీవితం, మన పోతన మృదుమధుర పద్యాలలాగా..

 "బాల రసాల సాల నవపల్లవ కోమలంగా...., మందార మకరంద మాధుర్యతుల్యం" గానూ,

 

మనోస్వాంతనమిచ్చే ఘంటసాల గానామృతాలాపనలాగానూ తీయగా, ఇంపుగా కొనసాగాలని.. మీ జీవితంలో ఆనందమే శేషం అవ్వాలని ఆకాంక్షిస్తూ

 

 "2021" ఆంగ్ల నూత్న వత్సర శుభాకాంక్షలు..నమస్సులు/  శుభాశీస్సులు..

"చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది.. జనమ జనమకది మరీ గట్టి పడతది "!

 

జగమే మారినది మధురముగా నాడు...

నిజమగు చెలిమి.. సాటి లేని కలిమి! అని...మీరు నామదిలో మెదలగా... పాడుకుంటున్నా ...

 

స్వల్ప కాలంలోనే మీ అందఱి ఆత్మీయతతో,నాకు దక్కిన,

నాలో పదిలంగా దాచుకున్న తీయని జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే...

 

మీ భావి "జీవితమంతా చిత్రమయిన పులకింత " గా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా !

 

నాకు స్నేహమాధుర్యాన్ని చవిచూపిన నా సహ వయస్కులకు, పిన్నలకు శుభాశీస్సులు..

 

గురువులుగా ఎన్నో క్రొంగొత్త విషయాలు అనుదినమూ నేర్పి, నను దిద్దితీర్చిన గురుతుల్యులు.. పెద్దవారందరికీ,అలాగే  అక్కలందఱికీ  వినమ్రనమస్సులు.

 

ఏమిచ్చి తీర్చుకోగలను మీ అందఱి ఋణం....

నెయ్యపు తేనెలు జాలువారు మన ఆత్మీయ సమూహం లో  మీరందించే సాదర సహచర్యానికి?..నా ఎద చప్పుడు మీతో పంచుకోవడం తప్ప ?  

ధన్యోస్మి....

వట్టెం వెంకట రమణ

 

 

2020

అంతరిస్తున్న నిన్నటి కరోనా జ్ఞాపకాలు

నీడలా మదిలో చేసిన మరపురాని సంతకాలు.

 

2021

నడుస్తున్న నేటి క్షణాలు

నవ్వుల పువ్వులు

సంతోష కిరణాలతో ఉదయించే

నేఢే మన నూతన సంవత్సరం

కొత్త ఊహలకు కొత్త ఆశలకు ఊపిరి  పోస్తూ

అందరి అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ

కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు

కొత్త నిర్ణయాలు, కొత్త వేడుకలు

కొత్త కలలు, కొత్త ఉత్సాహం

కలకాలంఉండాలని

మీ కొత్త కలలు సాకారం కావాలని కోరుకుంటూ

కష్టాలు ఎన్నైన ఎదురు కానివ్వండి

కలిసి నడుద్దాం కలిసి వాటితో కలపడదాం

 

సంవత్సరం అప్రతిహతమైన సంవత్సరం కావాలని కోరుకుంటూ 

సమూహ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

వి.విజయ

 

 

 

2020 చెడ్డ సంవత్సరం ఎంతమాత్రం కాదు.. చక్కటి గురువు.

నాకైతే రిటైర్మెంట్ నేర్పింది, ధైర్యం నేర్పింది, ఒక్కణ్ణే బతకడం ఎలా? ఒక్కడై చావాల్సొస్తే ఎలా? నిజమైన హీరోయిజం ఏమిటి? ధ్యాన్నం ఎలా? దైవం ఎలా...??

కాలచక్రంలో ఓ ఏడాది గిర్రున తిరిగింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. మనం కొత్త ఏడాదిలోనే కాదు, కొత్త దశాబ్దంలో అడుగుపెట్టాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. గడిచిన ఏడాది పేరు చెబితే ఎక్కువ మంది ఏం గుర్తు చేసుకుంటారు? కరోనా వైరస్, లాక్‌డౌన్, మాస్క్, ఫిజికల్ డిస్టాన్స్.. ఇంతే అంటారు. వరెస్ట్ ఇయర్ అని తిట్టుకుంటారు కూడా. కానీ, ఇంతే జరిగిందా? 2020 మనకు ఏం నేర్పలేదా..? ఎన్నో నేర్పింది.. ఎన్నడూ లేనంత సంతోషాన్ని ఇచ్చింది.

మనిషికి క్రమశిక్షణ నేర్పింది. పరిశుభ్రత నేర్పింది. సమాజంతో సంబంధాలు కొనసాగిస్తూనే భౌతిక దూరం పాటించాలని చెప్పింది. అంటువ్యాధుల గురించి, రోగనిరోధక శక్తి గురించి, మనం తినే తిండి గురించి కొత్త పాఠాలు నేర్పింది.

కుటుంబసభ్యులతో ఆనందంగా గడపటానికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. పుట్టి పెరిగిన ఊరులో జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం ఉండే అవకాశం ఇచ్చింది.

పర్యావరణాన్ని కాపాడితేనే మనిషి మనుగడ సాధ్యమని చెప్పింది. మనుషులందరూ క్రమశిక్షణతో ఉంటే.. ఈ ప్రకృతి ఎంత సుందరంగా, రమణీయంగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పింది. కాలుష్య కాసారమైన గంగానది సైతం స్వచ్ఛమైన నీటితో పరవశిస్తుందని తెలిపింది.

మనిషికి పోరాడే శక్తిని నేర్పింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులకు చెమటోడ్చి కష్టపడితేనే ఆనందం దక్కుతుందని చెప్పింది. విధి ఉన్నపలంగా రోడ్డున పడేస్తే.. బతకడానికి కొత్త దారులు చూపింది. అన్నింటికంటే మించి నీకు నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో చెప్పింది.

భారత్ ఒక దేశం మాత్రమే కాదని.. అదొక జీవన విధానమని ప్రపంచానికి చాటిచెప్పింది. మన జీవనవిధానం, మన ఆచారాలు, మన యోగా, ధ్యానం గొప్పదనాన్ని తెలిపింది. భారతీయుల శక్తి .. మనం పడే కష్టంలో, తీసుకునే ఆహారంలోనే ఉందని ప్రపంచ దేశాలకు చెప్పింది.

ప్రపంచానికంతటికీ ఒకేసారి జబ్బు చేసినా.. భారత్ ఔషధాలను అందించి ఆదుకోగలదని చాటిచెప్పింది. మన ఆయుర్వేద శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది.

శత్రువులు మారణాయుధాలతో దాడికి తెగబడినా.. మన సైనికులు వట్టి పిడికిళ్లతోనే మట్టి కరిపించగలరని ప్రపంచానికి చాటిచెప్పింది. దేశం కోసం మన జవాన్ ఎంతటి త్యాగానికైనా తెగిస్తాడని గల్వాన్ ఘటన నిరూపించింది. ఇండియన్ జవాన్ శక్తి ఏమిటో, రక్షణ పరంగా భారత్ ఎంత బలమైందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. కుట్రలతో భారత్‌ను దెబ్బ తీయాలని చూస్తే.. రెట్టించిన శక్తితో పైకి లేస్తుందని శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది.

ఇంటి నుంచి పని చేస్తూ కూడా అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది. కొన్ని రంగాలకు కొత్త దారులను చూపింది.

మారుమూల గ్రామాలకు కూడా సాంకేతిక పాఠాలు నేర్పింది. శానిటైజర్, క్వారంటైన్ పదాలను పరిచయం చేసింది.

కాలం నేర్పిన పాఠాలతో ముందుకు సాగాలి. ఆలస్యమైనా, మంచే జరుగుతుందనే ఆశతో అడుగేయాలి. ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవాలి. అదే జీవితం. చేసే ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుంటే విజయం అదే వరిస్తుంది. కొత్త సంవత్సరం మరింత ఆనందాన్నిస్తుంది..

దీనని అందరికీ తెలియజేసి వారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపండి!!


2020 ******** 2021

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...