2, జనవరి 2021, శనివారం

దత్తపది - 65, కలికి - చిలక - పలుకు - కులుకు, 28.12.2020

 


దత్తపది - 65, 

 కలికి - చిలక - పలుకు - కులుకు, 

 28.12.2020


తేటగీతి..

 

చిలక పలుకులు వద్దంటె చింతయేల ?

కలికి కులుకులు నమ్మొద్దు కచ్చితంగ

మోసపోబోకు ముద్దుల మురిసిపోయి

గూబ గుయ్యనిపించుము ఘొల్లుమనగ

 

 

తేటగీతి....

రామ చిలకను వారించె రామదాసు

కష్ట సుఖముల కలికియు కలిసి యుండ

రామభద్రుని గుడిగట్టె రమ్యముగను

కులుకు గౌతమి జిలుగులు పలుకు లాయె...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

తేటగీతి

ప్రియసఖికి దాసుడనయితి ప్రేమతోను

కలికి చేసిన బాసతో కలలుగంటి!

చిలుకపలుకులవియని నే దెలియకుంటి

కులుకులాడి పలుకులకు నిలకడేది?

డా. నాగులపల్లి

 

 

అలక బూనితిరేమొ అహ్లాదమేది ?

పద్య కవుల మంజులమైన పలుకులేవి ?

పలుకులందు పల్లవములు బాసలేవి ?

చిలుక పలుకుల మేల్మి మంజీరమేది ?

కువలయంబైన కలముల కులుకులేవి ?

సాహితీ సుధలందించు సమయమేది ?

కలికి స్పందనా విచలిత కమ్ర మేది ?

తెలుగుతేనెల ధారల తేకువెచట ?

 

 

తే.గీ

కలికి మనసేమొ‌ వెలలేని కాసుపంట

సర్వకార్యములు చిలుక సదనమందు

మదిని దోచెడి పలుకులే మధువులొలుకు

నేల వర్ణింప కులుకులనింతియందు

 

ఆత్రేయ


 

తే.

కులుకు లొలుకెడు సుందరి కూర్మి పలుకు

లన్ని వలపు చిలకరించి హరువు గూర్చు

సఖుడు మురిసినంత చెలియ సంజ్వరము

జూపె, కన్నుల కలికితో క్షోభ యిదియె


 

ఫలితాల తల్లి

అధికారిణి నిక్కచ్చి కలికి

చిలక పలుకులతో ఎటులనూ సరిపుచ్చదు

లొంగదు  ఎవ్విధంబుగా మన కులుకులకు

సమస్యలు సవ్యమై, నిజమైనచో

చమటలు కారుస్తూనైనా సంతకంబు చేయును,

చిరునవ్వులు పంచున్ అవ్విధంబుగా మనకు !

 

జి మురళి మోహన్ రావు

 

 

వచన కవిత 

పలుకులు నేర్చిన రా చిలకలా

కులుకులు బోవు కలహంసలా

వచ్చింది కలువ కన్నుల కలికిఐ

చెంత చేరింది నా ప్రియ సఖిఐ

 

 

వచన కవిత

దేవ దేవుడు మహాదేవ వరప్రభావమై,

ఆరణి మథన సమయమున గాంచిన

కులుకుల కలికి అప్సరస ఘ్నతాచిన్

వేద వ్యాసుడు కామించి మోహింపగ

చిలుక రూపుడై శుక మహర్షి జన్మించె,

జనక నృపుని జ్ఞాన పలుకులు  వినంగ

మోక్షమార్గము బడసి ఖ్యాతిని పొందె.

CA కె మల్లికార్జునరావు

 

 

వచన కవిత-

 

శయన గది యందు రంభలా కులుకుల నొలికించి,

కార్యములన్ మంత్రిలా చిలక పలుకుల సలహాల నిచ్చి,

కరణములయందు దాసిగ సేవల చేసి  మెప్పించి,

భోజనానంతరం తాంబూల చిలకలు చుట్టి ఇచ్చి,

సతము  నీదు క్రోధమును సహించి సహకరించు ,

నీ సతి కలికి కను కొలకుల నీరు కార నీయకుమా!

 

CA కె మల్లికార్జునరావు

 

 

ఆటవెలది

చిలక నవ్వు తోడ చిలిపిగ జూసిన

కలికి చూపు జూసి కదిలె మనసు

ఉలుకు పలుకు లేక నురికెను వయసును

కులుకులాడి చెంత కూడి చేర.

 

హేమలత

 

తేటగీతి

తరువు,జంతుజాతులు,తేలు దానమిచ్చు

తాను చచ్చిన తర్వాత త్యాగనిరతి

శాశ్వతమ్మగు మానవా చావు లేక

తరతరాలకు యశమౌను దానగుణము!!

 

రాంమోహన్ నిజామాబాద్

 

 

వచన కవిత,

 

కలికి నవ్వుల కనుల మెరుపు,

చిలక వన్నెల మేని విరుపు,

పలుకు తేనెల పదముల సొంపు,

కులుకు నడకల కోమలాంగి, ఆ నాయిక.

 

గాంగేయ శాస్త్రి,

 

 

కలికి సీతపతిని గని కాముకి, చిల/

కపలుకుల కులుకు నడల కపటి రూపు/

దాల్చి రాముచెంతకు జేర, తమ్ముని కడ/

బంపె. దానవినణచగ పన్నగవిభు/

నంశజుండు దండన జేసె నామెనంత

వారణాశి శ్రీలేఖ

 

 

తరువోజ

కన్నుల మెరిసిన  కలికితనముల కనకాంగిసరసంపు కలహాలవన్నె

చిన్నెలువిరియగ,చిలుకలకొలికి  చిత్రంపుపలుకులు చిత్తముదోచ

అన్నువ కులుకులె యాదటపెంచి యందియ సవ్వడై యలజడి రేప

సన్నని వలపుకే సచివుని మనము సంతసమందుచు సౌఖ్యముబడసె

అవళూరు  సీత

 

 

ప్రణయ భావనగా తరువోజ లో పూరణ

తరువోజ

చిలక పలుకుల నెచ్చెలి పేర్మి తెలిపి చెంత జేరి మురిసి సిగ్గు లొలికెనె

కులుకులాడి వలపు గుణము దెలుపగ గోదారి వాహినై కొమరాడు సిరిగ

వెలది తనువు యంత విమల మోహనపు  విరపూసిన వనమై వెల్లి విరియునె

కలికితనమొలికి  కనువిందు జేయు గంధర్వ నగరపు కాంత రూపమిదె

వెంకట్.సి హెచ్


 

కందము.

చిలక యొకటి, "యనుకరణపు

పలుకు ల" నాంగ్లపు  గులుకు ల  బహువిధ చేష్టల్

కలికి తనంబున జూపన్,

దల ద్రిప్ప మరిచి, గనె ప్రజ తన్మయమతియై !

వట్టెం వెంకట రమణ

 

 

కలికి శుకము నేర్వగ వాణి గాయనిగను

చిలుక వలెనుచిన్మయమునను చిందులేస్తు

పలుకు మురిపెముగ ఫణితి పట్టుబట్టి

కులుకు రామరామయనుచు గుడిగదిరుగు

గీతాశైలజ

 

 

కం

కులుకుల చిలకయె నొచ్చిన

యలుగును మదియే కలవర మదియొక వింతౌ,

పలుకులు బ్రియముగ దోచును

కలికియె మనసార పిలువ ఘనముగ దోచున్

 

చం"

కులుకు మనోజ్ఞ సుందరియె కోరగ, పాపము విస్మరించగన్

కలికియె మెచ్చెనంచు నొక గాటపు బ్రేమన  రామదాసయో!

చిలుకను బట్టితెచ్చెనిక చింతల  బాలవ నష్టకష్టముల్,

బలుకును కర్మ సారములు భారము దొల్గగ ముక్తి నొందగన్

 

వాణిశ్రీ నైనాల

 

 

 

కలికి చకోరాక్షి పలికె

చిలక పలుకులవి నిరతము చింతలు దీర్చన్

పలుకున తేనెలొలుకు చెలి

కులుకులొలుకు లలన రాణి కులుకుల రీతిన్.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తేటగీతి

 

కలువ కన్నుల పడతి ఆ కలికి నన్ను

దోచె, నడకల కులుకులు దోచె మదిని,

చిలుక పలుకుల మాటల చేత నామ

నస్సు ఊగెను ఆనంద నందనమున.

 

ఉష.

 

 

కలికి శుకము నేర్వగ వాణి గాయనిగను

చిలుక వలెనుచిన్మయమునను చిందులేసి

పలుకు మురిపెముగ ఫణితి పట్టుబట్టి

కులుకు రామరామయనుచు గుడిగదిరుగు

 

గీతాశైలజ

 

పలుకుల్ తేనెల పూతలే కలికి యింపారంగ భాషాడినన్

చిలకల్ చూపెడి ముచ్చటే లలన సత్శీలా ప్రభా పుంజముల్

కులుకుల్ జూడగ దివ్యమౌ మనము నిష్కోపంపు భాస్వంతమై

వలపుల్దీర్చగ భవ్యమౌ జనన సాఫల్యంబు లీడేర్చగాన్

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

శ్రీ

 

పేరంటానికొచ్చా పారాణి రాయండర్రా అంటూ

తెలుగు చావిడి లోనికి చాప తెచ్చుకుని మరీ వచ్చి కూర్చుంది

పాదాలు చాచి వారగా వయ్యారంగా ఓ తొలి ముత్తయిదువ.

ఆహా ఏమా వర్ఛస్సూ! ఏమా తేజస్సూ!

నేనెంత పొగుడుతున్నా సిగ్గులు మొగ్గలై ముడుచుకుపోవటంలేదు.

అవును మరి! ఈ పొగడ్తలేమైనా ఆమెకి కొత్తా?

తెలుగు సుమాలు మొగ్గ తొడగక మునుపు నుంచే  విరాజిల్లుతోందామె.

అలా అని ఆమె ముదుసలి ముత్తయిదువా కాదు

పసిడి వర్ణాల పడుచు ముత్తయిదువ.

ఇది విచిత్ర వర్ణన కాదు పవిత్ర వర్ణన!

ఈ పవిత్ర వర్ణన నా కల్పన కాదు  

ఆమెలో ఉన్న పవిత్రతను వివరిస్తున్నానంతే!

ఎవరెంత వర్ణిస్తున్నా...నేనింతగా వివరిస్తున్నా...

అలా వారగానే కూర్చుని తెలుగు సుమాల మధ్యన గుబాళిస్తోంది.

ఇంతకీ ఆమె ఎవరని అడిగితే  ఇక వర్ణించక తప్పదు

మీరు గమనించకా తప్పదు.

ఆమె పేరంటానికి తెచ్చుకున్న ఆ చాప

చాప కాదు....చావిడి! మన తెలుగు చావిడి!!

వర్ణిస్తే తెలుగు చావిడి! లేకపోతే వొట్టి క్రావడే!!

ఆ బాసరలో 'గుడీ' ఆ దేవతదే!

నా భాషలో 'గుడీ' ఆ దేవతదే!!

వర్ణిస్తే ఆమెది అందమైన తల కొప్పు!

లేకపోతే అది గుడి దీర్ఘమనడమే ఒప్పు!!

ఇలా నా తెలుగు చావిడిలో పేరంటానికి

తరలి వచ్చింది ఆ 'శ్రీ' దేవి

ఎన్నటికీ మరలని మరచిపోలేని అక్షర సిరి దేవి....

...శ్రీ....

----అ.అ----

అత్తిలి అనంతు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...