14, జనవరి 2021, గురువారం

10 01 2021, ప్రశ్నల ప్రహేళిక, ఆదివారము

 


ప్రహేళిక సంఖ్య -41

ది.10.01.2021

అంశము: సుమతీ శతకము

 

ప్రశ్నలు - జవాబులు

 

1. "తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!" దీని ఆధారంగా పద్యము వ్రాయండి

జ:

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

 

2. "కార్యేషు మంత్రి, కరణేషు దాసి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ".. ఈ శ్లోకము భావన గా ఉన్న  పద్యము తెలుపండి

జ:

పనిచేయునెడల దాసియు

ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్

దన భుక్తియెడలఁదల్లియు

యనఁదన కులకాంత యుండనగురా సుమతీ!

 

3. మిత్రులు శత్రువులవుతారు అనే భావనగా ఉన్న పద్యము తెలుపండి

జ:

కమలములు నీటఁబాసినఁ

గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్

దమ దమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

 

4.  "వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!" ఈ పద్యంలోని  భావన ఏమిటి?

జ:

హీనుని ఉన్నత స్థానమున కూర్చొండబెట్టిననూ అతని బుద్ధి మారదు 

 

5.బంధువుల రాక గురించి తెలియచేసే పద్యము ఏది

జ:

ఎప్పుడు సంపద కలిగిన

నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగఁజెఱువు నిండినఁ

గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ!

 

6.తామరలు లేని కొలను, చంద్రుడు లేని రాత్రి వ్యర్ధము లని తెలియజేయు పద్యము తెలుపండి.

జ:

తమలము వేయని నోరును,

విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,

గమలములు లేని కొలనుకును,

హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ

 

7. ఈ పద్యము పూరించండి

ఏరకుమీ కసుగాయలు

.................. మేదిని సుమతీ

జ:

ఏఱకుమీ కసుగాయలు

దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ

పాఱకుమీ రణమందున

మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

 

8. ఎవరు చెప్పినా విని, ఆలోచించి నిజానిజాలు తెలుసుకోగలవాడే నీతి పరుడు అనే భావన గల పద్యము తెలుపండి.

జ:

వినదగు నెవ్వరు సెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

గని కల్ల నిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ

 

9. సుతుడు కీర్తి గడించి నప్పుడు తండ్రికి సంతోషం కలుగతుంది అనే భావంతో ఉన్న పద్యము ఏది?

జ:

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

 

10.సిరి సంపదల రాక పోకడల గురించి తెలిపిన పద్యము ఏది?

జ:

సిరి తా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరి తా పోయిన పోవును

కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

 

వెంకట్.సి హెచ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...