14, జనవరి 2021, గురువారం

04.01.2021, దత్తపది, చింత - వింత - చెంత – సంత

 


04.01.2021, దత్తపది

చింత - వింత - చెంత సంత

*******

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ అంతరంగంలో దాగిన సుమధుర భావనలను వెలికి తీసి తేనియల గరిమ తెలిపెడి కవితలల్లి, సమూహానికి హరువు గూర్చగలరని విన్నపము.

****

 

.మా.

చింతయె దీరునా మదిని చెల్లనికోరిక పెచ్చరిల్లగన్

వింతగు క్రోధమే మిగులుఁ వేదనతోడను యాశదీరకన్!

చెంతన ప్రేమతో చెలియ చేరిన క్రోధము దూరమౌనులే

సంతసమొందదే మది వసంతముఁ జూడగ గ్రీష్మమందునన్ !!

 

తే.గీ

చెంతఁ చరవాణి బలుకని చిట్టడవిన

జేరితిగొలువున్ చింతూరుఁ చింతతోను!

వింతయది యేమొ! నామది బిత్తరించె

సంతసముతోడను ప్రకృతి చెంతఁ జేరి !!

డా. నాగులపల్లి

 

 

వచన కవిత

తన మనసెరిగిన  ఇష్ట సఖి చెంతన

గడుపు కాలము కూసంతయే చాలు

కలిగించును వింతగ పులకింతలు

తొలగించును చింతలనన్నియును.

CA కె మల్లికార్జునరావు

 

 

తే.

మనసెరిగి నిష్టసఖి చెంత మైమరచెడి

కాలమదియె కవ్వింతగ గగురుపొడుచు

తనువు, సంతస మొందెడి తన్మయతన

చింతలన్నియు చెదరు విచిత్రముగను

 

వచనకవిత

దొంగ సంత లోన కొన్న ప్రశ్న పత్రము

చెంత తెచ్చుకొన ,  ని శ్చింత  యవును

పరీక్ష వ్రాయుటకు , మారిన యెడల

ప్రశ్న పత్రము ,పరీక్ష హాలున విద్యార్థి

వేయు బిక్కముఖము వివిధ రసముల

ప్రహేళికవలె వింత గొల్పి గనిపించును.

CA కె మల్లికార్జునరావు

 

చింత లెల్లను బాపగ చిరున గవున

వింత రూపున బాలుడు వీధి నిలచి

చెంత చేరిన జనులతో చెలిమి చేసి

సంత సమును,కలుగజేసె సాయి నాధు

RSL

 

ఉత్సుక ఛందస్సులో

చింతలు పోవును వెంటనే

వింతగ వీడుము ద్వేషమే

చెంతను పంచుము ప్రేమనే

సంతసమే యిల పొందుమా!

 

అశోక వనంలో శోకిస్తున్న సీతమ్మతో హనుమ మాటలు.

తే.గీ.

మాత! నిశ్చింతగా  నుండు మహిత చరిత!

వీర రాముని చెంతకు చేరగలవు

వింత కాబోదు రావణు డంత మగుట

సంతసించును మనసార జగములెల్ల.

డి.రామ నాగేశ్వర రావు.

 

 

ఆటవెలది...

చింతలన్ని తొలగ సంతసంబలరించు

చింత బోవ చెలియ చెంత జేరు

వింత విద్యలెల్ల వీడక యుండిన

శీఘ్ర మొచ్చి జేరు చింతలన్ని ......

పి.ఎల్.నాగేశ్వరరావు   

 

 

నా ప్రయత్నం..

చింతలు మొత్తమున్ జనులు చిత్తము నందున మర్చిపోతిరా?

వింతగు రోగమొక్కటియు విశ్వము నంతయు వ్యాప్తి జెందినన్

చెంతకు రాదులే యనుచు శీఘ్రము వీధిన జేరుటెట్లురా?

సంతస మొందగా తగదు శాంతము ద్రోలక నెల్లరొక్కటై

 

వె

చింత దీరినట్టి చిత్తమ్ము లేదురా

వింత గాదు నిజము విశ్వమందు

చెంత జేరమనము శ్రేయస్సు కోరినా

సంతసమ్ము తుదకు సాధ్యపడదు

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

 

 

కం.

శ్రీరామా!నమ్మితిమిలలో

ధీరత్వము నొసగు మాకు దీనత దొలగన్

క్రూరత్వము బాప జగతి

భారము వహియించి గాచు పావననామా!

మహేశ్ ముత్యాల

 

 

రామాయణం లో హనుమంతుని‌ గూర్చి చిన్ని‌ ప్రయత్నం...

కంII

చింతను దీర్చగ రాముని

వింతగ రూపమ్ము మార్చి విషనిధి దాటెన్

చెంతకు జేర్చెను సీతను

సంతసమే రామనామజపమని‌ పలికెన్

ఆత్రేయ..

 

 

వింత చింత  చెంత సంత

 చింత లన్నియు తీరిపోవు

వలచిన చెలి చెంతనుండ

మది సంతసమందె

వింత అది ఏమిటో

ఇదియే ప్రేమ మహిమ కద.

దేవరశెట్టి నాగమణి

 

 

పద్య కవిత

ప్రేమ వింత యిదియె! చెంత వెలది జేరి

వలపు తెలుపగ హ్లాదమే! యలరు చేయు

చెలియ చెంత నుండ సతము చింతలన్ని

సమసి సంతసంబమరు ప్రేమ మహిమ యిదె

 

 

ఉత్పలమాలిక

సంతసమొందు చేతనపుసత్వములన్నియు జాగృతమ్ములై 

కాంతిని నింపు కావ్యముల కైవడులన్నియు జూడగావలెన్  

పంతములేక నేర్చుకొన వాఙ్మయమే సిరులై వివేకమున్ 

సంతసమున్, మనోహరపు జావళిరాగము పంచగావలెన్    

చింతలలో సుమాళములు శీకరముల్ వొలికించగావలెన్   

సుంతయు ద్వేషభావమునుఁ జూపక స్వార్ధము వీడనాడగన్   

శాంతియు సౌఖ్యముల్ చెలగు సర్వధరిత్రిని, సీమలన్నిటిన్

భ్రాంతిని వీడి ప్రేమ, మురిపమ్ములు సూనృతముల్ ప్రవాహమై 

స్వాంతములో కవింత సిరులై వరమై సృజియించినట్లుగన్   

కస్తూరి శివశంకర్ 

 

 

మధురాక్కర

సంతసమదియె మది వేదసంత  యందు మురియంగ

చింత లన్నియు నెడలి నిశ్చింత కూరునె దైవము

జెంత నుండ పావనముగు  జీవన మంతయు,

వ్వింతలు నెరపెడు ఖలుల వింత చేష్టలు చెదరి

శాంతి సంఘటిల్లి మదిలో  సమ్మోహదము విరియున్

వెంకట్.సి హెచ్

 

 

చింత నేల నీకు చెంతన నేనుండ

వింత లెన్నొ గలవు పొంత లోన

చెంత చేరగ రమ్ము చెలియరో వేగమ్మె

సంత సమ్ము గలుగు సార సమున

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

మత్తు వదలరా !

చెంత లేదని తగినంత జ్ఞాన సంపద ,చింత పడుచు

వింత చేష్టలతో కాలంబును వృధా చేయుటకంటె

కష్టపడి, ఇష్టముతో పుస్తక పఠనము చేసినచో

కలుగును అపార సంతసంబు

జి మురళీ మోహన్ రావు

 

 

ఆటవెలది

తనయ చింత తీర్చ తండ్రి తపన జెంది

వింత బొమ్మ లన్ని విక్రయించు

చెంత ;దీసు కెల్లెచెలిమిని జూపుచు

సంత శింప జేయ సముచిత మని.

 

ఉత్పలమాల

చెంతటనున్న మాధవుని చెల్వములే యెద కూజితమ్ములై

వింతలు గొల్పుచుండమది వేదన విస్మృతి చెందినంతనే

చింతలు దూరమై మనసు చింతన చేయగ గోపబాలునిన్

సంతసమొందుచున్  తనువు సంగడి మంపుల సోలిపోయెనే

అవళూరు సీత

 

 

తేటగీతి

చింత దీర్చెడి దైవము శ్రీహరియని

సంత సమ్ముగ నమ్మిన జనుల కెపుడు

చెంత నిలుచును విష్ణువు చిన్మయముగ

వేడు కొనినవర మిడుట వింత కాదు

భక్త సులభుడై గాచును భవహరముగ

రమ,కంకిపాడు

 

 

కందము

చింతన జేసిన నాత్మను

వింతగ నరిషట్కములును వీడును మనకున్

చెంతన విష్ణువు జేరియు

సంతస ముగమో క్షమిచ్చు స్వాహా పతియున్

గీతాశైలజ

 

 

. వె.

తనయ చింత తీర్చ తండ్రి తపన తోడ

చెంత జేర దీసి వింత బొమ్మ

లన్ని విక్రయించు యంగడి దరికి తీ

సుకొని పోయె నంత సురత మొందె

హేమలత

 

 

వచన కవిత

సంత కెళ్ళంగా సంతసంబాయే

చెంత సొమ్ములేక నిశ్చింత లేదాయే

చింత కాయలు కొనలేక చింత మెండాయే

వింత యిదియె కవ్వింత లేదోయి..

మంజూష నిజామాబాద్

 

 

.మా

చెంత కు జేర సంపదలు చేకురు బీరమునాదిసత్వముల్

సంత మొంద చొక్కముగ సాగిన లౌకిక  జీవనమ్మునన్

వింత గు రాకపోకలిల వేడుక నొందుచు పుట్టిగిట్టుటల్

చింత జేయకన్ తరమె జిక్కగ చేతన బూర్ణరూపమున్

వాణిశ్రీ నైనాల

 

 

.

వింతగు బొమ్మనే కొనగ వీలుగ తల్లి నడుంగ లేకనే

చింతను బొందు బాలునకు; శీతలమౌ  హసితంబు జిల్కుచున్

చెంతకు బిల్చి తా జనని; చెన్నుగ కోర్కెను దీర్చ సంతుకున్;

సంతసమొంద బాలకుడె చంద్రికలే విరిసేను మోమునన్!

చల్లా దేవిక.

 

 

తేటగీతి

చింత పడుచు శోకించగనంతరమున

వింత మానసి సీతను వేడుకొనుచు

చెంత జేరియంగుళికము చేతబెట్ట

సంత సించెను హనుమను సుంత పోల్చు

కొనుచు రాముని బంటుగ కోతి వచ్చి

సేమ సందేశమివ్వగ సీత మురిసె...

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

 

 

( మంచి స్నేహితులు చెంతనుండ చింతలేల? )

ఉత్పలమాల....

చింతలు, బాధలున్ మదిని జేరగ, బావురు మందురెందరో

చెంతన మిత్రులున్గలువ,చీకులు దీరగ సంతసంబుగన్

వింతగ  చేష్టలుండినను, వియ్యము కయ్యము గాకపోవునే

పంతపు మాటలన్విడువ, భాసిలు మెండుగ  స్నేహహస్తమున్.

 సిరుల చెంత బోవ, చింతలధికమయ్యె

తృప్తి కేది సాటి దృష్టి బెట్ట

వింత చేష్టలెల్ల విడువగ శీఘ్రమ్ము

సర్వ జనుల కబ్బు సంతసమ్ము.....

పి.ఎల్. నాగేశ్వరరావు

 

******


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...