4, జనవరి 2021, సోమవారం

01.01.2021, దత్తపది, "నూతన - చేతన - జ్ఞాతము - ద్యోతము"

 


01.01.2021

దత్తపది...

"నూతన - చేతన - జ్ఞాతము - ద్యోతము"

 కొత్త సంవత్సరం... నూతన ఆశలు, తెలుసుకోవలసిన, తెలియజేయ వలసిన విషయాల సంగ్రహంగా.....

 

*****

 

.మా

నూతన వర్షమే రయము నొచ్చెను! నిబ్బరమిచ్చి నిత్యమౌ

నూతన వెల్గు దానొసగునో? మరి భారము బెంచ నొచ్చెనో?

చేతన కల్గెనా జనుల చేతలలోనని జూడ నొచ్చెనో?

ద్యోతము నీయుమా! జనులు తుల్యపు జ్ఞాతమెరింగిరే వ్యధన్!!

డా. నాగులపల్లి

 

 

తే.

నూతన శకము లిఖియించి పాత జ్ఞాప

కముల మధురిమ ల్వారధి కట్టి, నీవు

చేతనం బొంది వెలుగు, మజ్ఞాతము విడి

ద్యోతముగ ప్రజ్వరిల్లు విద్యుల్లత వలె

వెంకట్.సి హెచ్

 

 

తే 

ద్యోతముగ ప్రజ్వరిల్లు విద్యుల్లత వలె

కాంతితేజములని పంచి కరుణ జూపి 

సత్యమార్గమున్ చేతనా ముత్యములని 

కమ్రముక్తాఫలమలమౌ ఖ్యాతి జూపి 

కందువగు వాక్కుల వరమౌ జ్ఞాతమందు  

నూతనంబగు స్ఫూర్తియే కేతనంబు   

తెల్గు కైతలు వచయించు తీయగాను

 

ఉత్పల మాలిక

నూతన వర్షమందున వినూత్న ప్రమోదము తేజరిల్లుచున్

చేతనమిచ్చుగాక నవశీతల మోహన పద్యధారలై

జ్ఞాతముగాగ నెల్లరకు నవ్యసు కోమల సారసమ్ములై

ద్యోతములై ప్రభా ప్రకటితోత్సవ సంబర వైభవమ్ములై

జ్యోతల కాలవాల వికసోజ్వల మంజుల నీరజమ్ములై

శ్రోతల మానసంబుల విశోభిత పద్యపు తోరణమ్ములై

మ్రోతలు మోగుచున్ నుతుల మోహన రాగపు రంజితమ్ములై

వ్రాతల తేనెలం జిలుకు భాసిత మాధుర భావనంబులై

కైతలు తేజరిల్లు తెలుగు గౌరవ ప్రాభవ సౌరభమ్ములై

మాతలు శారదాంబ యుమ మాధవి పాద సుపూజితమ్ములై

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

నూతన చేతన జ్ఞాతము ద్యోతము

నూతన వత్సర దినమిది

చేతనతో కూడినట్టి చిత్తమునంతన్

జ్ఞాతంబగు పనుల ప్రతిభ

ద్యోతంబౌరీతి నడుప యోచించు సఖా!

రాంమోహన్ నిజామాబాద్

 

 

కాల ప్రవాహమున  ప్రతి క్షణమొక  నూతన దృశ్యం

బ్రహ్మాండమందునన్  ప్రతి కణమొక  బృహత్ చేతనం

ప్రతి చేతన యందునన్  అచేతనుడౌ వసించు విశ్వాత్మయే జ్ఞాతము

ప్రతి దృశ్యమందున ప్రద్యోతమై  స్థిరమౌను సచ్చిదానందము.

మాయ కమ్మగ అ జ్ఞాతము న మ్రగ్గు మానవ జాతికి వినూత్న మేలుకొలుపు ఈ నూతన ఇరవై ఇరవై యొకటి వర్షపు అభిమంత్రణము.

కాలమానమునకు కొలమానములుండవు,

వయసెరుగని బ్రతుకుకు వర్తమానముండు,

వత్సరములు తెలిసిన సోమరి తనముండు,

మనుజులందరు  ప్రస్తుతమునందు జీవించగ లోకమున శాంతి వెలసి నిశ్చింతగయుండు.

CA కె మల్లికార్జునరావు

 

 

నూతన వత్సర సమయము

చేతన వీడిన విషయము చేదని విడువన్

జ్ఞాతము కోరిన జనులకు

ద్యోతము వెతికిన దొరకును దోరగ మదిలో.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

నూతన నమ్మిక తోడన్

చేతన నింపగ  ప్రజలకు స్మృతులను బాపన్

జ్ఞాతము నొందిన గతమున్

ద్యోతమువ్యాపింపబూనె ధ్రువ  వర్షమునన్

ఆత్రేయ

 

 

బుర్రకి పదును

తేలికగా ఉపయోగపడు

నూతన పద్ధతులను

అలోచించి కనుగొనిన

 

కలిగించు ఆ శుభవార్త

ఎందరికో చేతనము

 

  జ్ఞాతమును తెలిసికొనుచూ

పెక్కుమంది పొందుదురు అపారమైన దోఁత్యము

జి మురళీ మోహన్ రావు

 

 

మధురాక్కర మాలికలో

భీతి గొల్పి నబ్ధమునకు వీడ్కోలు బలికి నీవు

స్వాతి చినుకుల సాలుకు స్వాగతం బలకవోయి

చేతనవడి భవిత సాధు జేసుకొని వెలుగొంది 

ప్రీతిగ కృషీవలుని వోలె వేసరి గరిమ నొందు

నూత నాశయములతో  వినూత్న రీతిగను ప్రతి

జ్ఞాతమున్ బూని శ్రమపడి సంతుష్టి నొందవోయి

ద్యోతముగ పాటవము జూపి యోగ్యుడై నిలువవోయి

ఖ్యాతి నొందెడు జ్ఞానము  నార్జించి, సర్వ శ్రేష్ఠ

కైత లందించి విజ్ఞాన గరిమ నీవు నెరపంగ

మాతృ భాష వెలుగులిడి మహిలో విభవ మొందునె

వెంకట్.సి హెచ్

 

 

కం"

 

ద్యోతము గావించ మదిన్

జ్ఞాతము లల్పము తొరగిడు జ్ఞాన సరిత్తున్

చేతన నొందిన హృదికిన్

నూతన తీర్మానముల్ వినూత్న గతులిడున్

వాణిశ్రీ నైనాల

 

 

కందము

నూతన కాంతులు చిందెడి

చేతన కల్గిన తలపులు చింతలు దీర్చున్

జ్ఞాతము లయ్యెడి బాసలు

ద్యోతము నిచ్చిన మనసుకి దూరము కలదా

 

ఉత్సుకము లో ఇంకో ప్రయత్నం

 

నూతన వత్సర వేళలో

చేతన కల్గిన ఉహాలే

జ్ఞాతము పెంచెడి సత్క్రియల్

ద్యోతము దెచ్చిన మోదమే

రమ, కంకిపాడు

 

 

 

సీసము

కాలగతినబడి కమిలి కుమిలియున్న మనసుల వెతలన్ని మఱుగునబడ

నిత్య నూతనములై నెమ్మినీయు తలపుల్ ద్యోతము లైమది ద్యుతులనొంద

చేతనత్వమెగసి నూతన సృజనవి  లాసముల్ ప్రభవించి లాస్య మాడ

జ్ఞాతము లాయెనజ్ఞానపుమాయలు  విడివడి బ్రదుకుల విలువ తెలియ

 

నిత్య చైతన్య దీప్తులు నివ్వటిల్లి

 హరువు నొందుచు.మనసులు మురిసి బోవ

నీదు పదముల కడచేరి నెనరుతోడ

మ్రొక్కితిని భారతీనిను ముదముగాను

అవళూరు సీత


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...