14, జనవరి 2021, గురువారం

06.01.2021, సమస్యా పూరణం, నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

 


06.01.2021 బుధవారం

ప్రణాళిక - సమస్యా పూరణం

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

సమస్య పాదం తేటగీతి లో.. 

ఇదే పంక్తితో పద్య / వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు.

 

 

తేటగీతి 

నాకు రాజకీయాలలో ఎటువంటి ఆసక్తి లేదు. కేవలం సమస్యాపూరణ వస్తువుగా మాత్రమే ఎంచుకొంటిని.....

ఎన్నికల సమయమునందు ఎన్ని పాట్లు

పడెను చంద్రబాబు తుదకు పాఱి పోయె

ముఖ్యమంత్రి పదవి కోరి మూల పడగ

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

క్యూబా పోరాటయోధుడు చెగొవీర స్నేహితుడు ఫిడల్ కాస్ట్రో తో కలసి పోరాడి గెలిచిన తరువాత అమెరికా కుట్రతో బొలీవియన్ ఆర్మీ వల్ల చంపబడతాడు... ఇతివృత్తంతో

స్నేహితుని తోడ పోరాట చేవ జూపి

శక్తియుక్తులొడ్డి పరాయి శాసనముల

తీరు మార్చి ప్రజకు స్వేచ్ఛ తెచ్చి తాను

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

వాణిశ్రీ నైనల

 

 

సకల శాస్త్రపు విద్యలు చాల తెలిసి

లంక పట్టణ అధిపతి  లక్ష  మణుగు

కనక ముండగ  నారిని కాం క్ష తోడ

తెచ్చి రాముని తోడను తేరు  నందు

యుద్ద మునుచేయ జాలక ,యోధు చేత

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

సాయి లక్ష్మి

 

 

సురలు  సేవింతురందురు సుధను దివిని

భరణి నెవ్వరెరుగరట్టి బ్రహ్మరసము !

నిత్యయవ్వన పేరాశ నిండి యొకడు

నిర్జరమ్మును సేవించి నిహతుడాయె !!

 

లక్షణ యుతుదౌ శిష్యుడు లక్ష్యమెరిగి

మోక్ష విద్యకై గురువుకు మోక రిల్లె !

జ్ఞానియౌ గురుకరుణచే జ్ఞాన మార్గ

నిర్జరమ్మును సేవించి నిహతుడాయె!!

డా. నాగులపల్లి

 

 

విచిత్రంబు

పిల్లల వ్యంగ్య చలన చిత్రములు చూచినచో

వాడు వీడని కొట్టుట వీడు వాడిని కొరుకుట

వాడి తోక వీడు పీక వీడి జడలు వాడు లాగ

వీడు తొక్కగా వాడు బక్కగా నగు

కాలు తీయగా బండలా బలుచు

మన పొట్ట పగులు నవ్వుల పువ్వులే కురువు

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె అను

ఆలోచనలే కలగవే చిత్రములలో

జి మురళీ మోహన్ రావు

 

 

గజనీ మహమ్మద్ చరితను తెలుపు మహోన్నతమైన షాహనామా గ్రంథం ను పిరదౌసి వ్రాయగా,  బాదుషా  ముందు ఇచ్చిన మాట తప్పగా పిరదౌసి రాజును దూషించడం చివరకు పిరదౌసి మరణానికి గ్రంథ రచన కారణం అయ్యే ఇతివృత్తంగా నా పూరణ

తే.

షాహనామా కృతి కవికి సంకటమయె

మాట తప్పిన బాదుషా మట్టుపెట్టు

తలపు నందు జిక్కినె పిరదౌసి, కైత

నిర్జరమ్మును సేవింప నిహతు డాయె

వెంకట్.సి హెచ్

 

 

తేటగీతి

క్షీర జలధిని చిలికిరి కేళిగాను

సుధలు పొంగగ ద్రావిరి సురలు జేరి

అసురు డొక్కడు దాగుండి యాశ తోడ

ద్రావ బోవ హరి దునిమె, దానవుండు

నిర్జరమ్మును సేవింప నిహతు డాయె.

హేమలత

 

 

వచన కవిత

కామ రాహిత్యమే అమరత్వ కారణం

మోహ వశమే  మృత్యువు సంవరణం

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

పండితుడైననూ దశకంఠుడు, సీతను

కామవశమున వంచించి అపహరించ

CA కె మల్లికార్జునరావు

 

 

తే.గీ.

భాగవతమననమృతమై పరగుచుండ

అరయ నొక్క దుష్టాత్ముడొనరుగ చదివె

భక్తిభావ విలసితమౌ భాగవతము;

సంచలించి లోలోపలి స్వార్థజీవి

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె!

చల్లా దేవిక.

 

 

1) తేటగీతి

కాంత కాదన్న వినకుండ కాముకతను

రక్తి కోసము నాశతో రాత్రి పూట

సింహ బలుడేగి నర్తన శిబిర మందు

నిర్జరమ్మును సేవింప నిహతుడయ్యె

 

2) తేటగీతి

నటన మందున మేరువ నగము యతడు

ముసలి తనమున తరుణిపై మోజు కలిగి

పుత్ర సంతతి బడయంగ బుద్ధి పుట్టి

నిర్జరమ్మును సేవింప నిహతుడయ్యె

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తేటగీతి

దొరల వోలె నమృతమును దొంగిలించి

దాచి పెట్టగ రాక్షసుల్., పొంచియుండి

మధువు గలిపెనందొక్కడు మరులు గొలుప

నిర్జరమ్మును సేవించి నిహతుడాయె....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

తే.గీ

కచుడు మృతజీన నార్ధిని కౌతుకమున

విద్య నేర్వగ వచ్చెను వినతి తోడ

గురువు సేవను జేయుచు గురుతు గాను

నిర్జరమ్మును సేవింప నిహతుడాయె

గీతాశైలజ

 

 

ఇతివృత్తం: ఈనాడు సమాజంలో జరిగే అర్థం పర్థంలేని ప్రేమ వ్యవహారాలు, పెంచిన తల్లిదండ్రుల మాట వినక, చదువు పక్కకు పెట్టి, జీవితపు విలువ తెలియక మొగ్గలోనే హతులయ్యే వారిని దృష్టిలో పెట్టుకొని

ప్రేమ మత్తులో మునిగిన ప్రియుడొకండు

పెద్దల పలుకుల్ పెడచెవిన్ బెట్టి మకురు

తనము నవలపు సాగించ దలచినంత

కోపగించిన పెద్దలు కూర్మి లేక

తగవులాడి వేటునువేయ దయిత వలపు

నిర్జరమ్మును సేవించి  నిహతుడాయె

అవళూరు సీత


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...