28, జనవరి 2021, గురువారం

దత్తపది, ఇంట - వంట -తంట - మంట 18.01.2021 సోమవారము

 


18.01.2021 సోమవారం దత్తపది...

ఇంట - వంట -తంట - మంట

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

 

కవులు/కవయిత్రులు /   ఔశ్చాహికులు  తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

ఆటవెలది

తంటవచ్చె నేడు!తమ్ముడొచ్చెను జూడ,

ఇంటనేమి గలదు శొంటి దప్ప!

వంటనేమి జేతు వట్టిబోయిన యింట

మాయదారి పరువు మంటగలిసె!!

డా. నాగులపల్లి

 

 

కం ll

ఆనందమ్ముల కవనపు 

స్వానమ్ము హృదయములందు జాల్వారగనే

మానితమైనట్టి పదము

జానుతెనుఁగు కవనమౌను ఝాన్సీలక్ష్మీ !   

 

కం ll

స్వాదురసావిష్కృతి సం   

వేదన నైవేద్యమైన పీయూషములై 

మోదంబు తెలుగు తేనెల       

నాదామృతముల విపంచి నందనవనమున్ !  

 

కం ll

కందము సందోహములే  

సుందర జిల్గుల సుమశరశోభలు విరిసెన్

డెందము పరవశమొందగ      

చందనతాంబూల పద్య సంవేద్యములై !

కస్తూరి శివశంకర్

 

 

ఇంట, వంట, మంట, తంట.

పూర్వము యింట్లోనే  పెళ్ళి బాజాలు మ్రోగేవి, గాడి పొయ్యి త్రవ్వి,

ఓహో...యిల్లు చిన్నదయినా ఆరుబయట పందిళ్ళు వేసి, ఆనందంగా, ఆత్మీయంగా పెళ్ళి వేడుకలు జరిగేవి...

పెళ్ళి ముచ్చట్లు కొన్ని నెలలు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవారు...

ప్రస్తుతం అంతా contract service ( అబ్బాయి, అమ్మాయి తప్ప ప్రస్తుతానికి ) , కల్యాణ మండపంలో   రెండే రెండు గంటలు బిజీ, తలంబ్రాలు ఎవరిపైకి విసురుతున్నామో తెలియని ఉన్మాద పరిస్తితి చూస్తున్నాము...

అనురాగాలు, ఆప్యాయతలు పుస్తకాలకే పరిమితం. యిక, సిద్దాంతి గారి మంత్రాలు, అందులోని అసలు పరమార్థం పట్టించుకునే నాధుడే లేడు....

మాంగల్యం చేతబట్టుకొని, ముహూర్తం అయిపోతున్నా, ఫొటోలకు ఫొజులిచ్చే అబ్బాయి, ఆమ్మాయిలే కనిపుస్తున్నారు..పైగా Software Employees, మందలింపులకు తావేలేదు....

... యింటి వద్ద జరిగే పెళ్ళి గురించి చిరు ప్రయత్నం..

 

తేటగీతి....

ఇంట జరిగెడు పెళ్లిళ్ల నిలను గనము

గాడి పొయ్యిన  వంటలు గాడిదప్పె

'మాట మంటల' నార్పంగ మమత లేవి

యింటి పెండిలి మరియాద తంట విడగ..

 

 తేటగీతి...

మాడి పోయిన గిన్నెను వేడిజేయ

కొంత మేరకు సడలును చింతలన్ని

పనుల యందున లీనమై పాత్ర గడుగ

"మేడమందున్న" ప్రేమయె మేలుజేయు

 

తేటగీతి..

మగల వంటల నెంచుట తగని పనియె

నలుడు, భీముడు విఖ్యాత వలలులుండ

వంట యింటిని దాటరు వనితలెపుడు

పెళ్ళి విందులు జేతురె బెట్టు విడచి....

 

ఆటవెలది...

సతియె రాణిగాదె సంసారమందున

శంకరుండు బలికె  జక్కగాను

నాతి కష్ట ఫలమె జాతికి వెలుగయ్యె

వనిత జాతికివియె వందనములు...

పి.ఎల్.నాగేశ్వరరావు


 

కందం లో నా చిరు ప్రయత్నం.

ఇంటను కూర్చుని పండుగ

వంటలు చేయుచు మరిచితి పద్యము రాయన్!!

మంటలు పుట్టెడి కన్నులు

తంటగ మారె చదువుటకు తలగాచుశివా!!

రమ, కంకిపాడు.

 

 

హాయిగా

బయట తిండి ఆశపడి మెక్కుచూ, తంటాలు పడుచు

ఉదరములో మంట కలిగించు కొనుట కంటే

ఇంట వండిన వంటలే

పరమౌషధంబులుగా భావించి

తినిన కలుగు వలసినంత ఉపశమము !

జి మురళీ మోహన్ రావు

 

 

ఆ.వె II

ఇంటి నుండి రాణి ఈశుని గుడిపోవ

వడిగ జేరినాను వంట జేయ

తంట పడుచు నేను తలపట్టి గూర్చుండ

మంట తగిలె గిన్నె మాడి పోవ.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

ఉత్పలమాల :

తుంటరి యాంగ్లపాలకులు దొల్గిన రోజు నభమ్ము నంటె నిం

టింట స్వతంత్రవాయువులు ! డెందము సంతసమొందునట్లుగన్

మింట జరించుచూ వెలయు మేలగు భారత కేతనంబదే

మింట పతాకముల్ భరతమేదిని యంతట నిక్కి యాడె  జే

గంటలు, గుండెమంటలని గల్గిన దీధితి దివ్యతేజమై !

 

ఉత్పలమాల :

తుంటరి యాంగ్లపాలకులు దొల్గిన రోజు నభమ్ము నంటె నిం

టింట స్వతంత్రవాయువులు ! డెందము సంతసమొందునట్లుగన్

మింట జరించుచూ వెలయు మేలగు భారత కేతనంబదే

మింట పతాకముల్ భరతమేదిని యంతట నిక్కి యాడె  జే

గంటలు, గుండెమంటలని గల్గిన దీధితి దివ్యతేజమై !

కస్తూరి శివశంకర్

 

 

ఇంట ప్రియమగు ఇల్లాలు చేసిన వంట

తినగ దేహమునకు  ఆరోగ్య మొచ్చు

మనమునకు  ఉపశాంతి హెచ్చు, బయటి

కూడు భుజించగ పెక్కు తంటాలు వచ్చు

కడుపు మంట కల్గించి రోగములు తెచ్చు.

 

వచనకవిత -

వంటా-వార్పు ఓర్పు- నేర్పు నెరిగిన

కోమలి ఇల్లాలు కాగ ఇంట వెలయు

శ్రీ లక్ష్మి, తంటా ల మారు లెందరున్నా

అసూయన మంట లెన్నెగసినా రాదు

నా ఇంతి విజయ కేతనము కడ్డము.

CA కె మల్లికార్జునరావు

 

 

తే.గీ.మా.

ఇంట వంట చేయదలచినింతి వలయు/

పాకశాస్త్రపు కిటుకుల బాసినంత/

వంట తెచ్చు తంటాలిక. పాట్లు పడెద/

రంత నాకలి మంటలకంత. యింటి/

జనుల నిడుముల నేమని శలవిడుదిక?

వారణాశి శ్రీలేఖ

 

 

ఉ.మా

వంట ను చేయు పల్వురికి వంకలు పెట్టెడి వారి పాటమౌ

మంట లు రేపనీ కరొన మార్చగ వారలు వీరలాయెగా

గంటలు చాలకన్ పనికి కానక దారులు తంట వచ్చెనే

యింట ను గెల్వనీశు తరమే! మగధీరులెరుంగనిత్తరిన్

వాణిశ్రీ నైనాల

 

 

అత్తింట ఇంతి వంట చేయగనెంచి

తంటమనక కూర, పులుసు చేసె

అన్నముడకనెలేదు అదియేమియన్న..

చట్టి పెట్టి కింద మంట మరచెన్!

విష్ణుప్రియ

 

 

దత్తపది పూరణ నేటి భారతం లో  సరదాగా వ్రాయు ప్రయత్నం మాత్రమే

సీ.

తంటలమారి నర్ధాంగిగ బొందిన మగవాని బ్రదుకున మహిమ యంత

మాయమౌ నన్నింట మగువ పోరు ఘనమై దినమొ కాపదగ సతి వెలయించు

కృత్యములతోడ స్వగృహపుపరువుమంట గలియు, వంటగదిలో గరిటె మగని

చేతికి జేరు విశేషమిదె! నలపాక రుచి జూపించెడి కాంతుని బ్రతు

గీ.

కంత కాంత మాయ యగునె! వింత వోలె

పలువు రూసులాడు విధంబు వ్యక్త పరచ

సాగరము నీద గలము సంసారమీద

లేమనెడు వదంతి సమకూరె నిలనందు

వెంకట్.సి హెచ్

 

 

1)ఆ.వె

ఇంటిలోని మహిళలింటను లేకున్న

వంట వండ లేరు తంట తప్ప

మంట మండు కడుపు మారాము చేయగా

కంట వెంట నీరు క్రమ్ము కొనును

 

2) ఆ.వె.

ఇంటి లోన మగడు వంటవాడైనచో

పంట పండి నట్లు పడతి కపుడు

మంటలేమి లేక తంటాలు లేవుగా

సాగి పోవు బతుకు సంతసముగ

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

కం||

ఇంటన నుండెడి వనితకు

వంటను కడు రమ్యముగను పండించుటలో

తంటా యేమున్నదకట

మంటపుడే పెరుగు సతము మన వ్యంగముతో!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

ఆ. వె.

" ఇంట" తిండి మనకు నారోగ్యమ్ము

బయట తిండి తినగ వచ్చు " తంట"

మగువ మనసు నందు" మంట" రానీయక

" వంట" మగడు సాయపడుట మేలు.

డి.రామ నాగేశ్వరరావు

 

 

స్వేచ్ఛా సమర్పణ-

ప్రకృతి నియమము -

మామిడి చెట్టు పూత విరగ పూయగ ,

పువ్వులు గనే రాలి పడు పోవు కొన్ని ,

పిందెలై గాలికి కింద పడు పూలు కొన్ని ,

పండులై పరుల మేల్జేయు పూలు కొన్ని ,

ఇదియె జగాన ప్రకృతి ప్రవృత్తి యనగ.

CA కె మల్లికార్జునరావు

 

 

శ్రీమతి ఇందిరా రాజగోపాల్  గారికి హార్దిక స్వాగత నమస్సులతో..💐🙏

సీ.

తెలుగు తేనియలింట మెలగుచు నిత్యమ్ముయే తంట రానీక నిమ్ము గాను

సాహితీ సుహృదులె సమయజ్ఞులై తాము  స్ఫూర్తి నీయుచునుండె సూనృతముగ;

లేశమైనను గాని లేవంట యలుకలు సజ్జనాళియె చూప సత్పథమ్ము ;

సొంపారు కైతల సోనలే గురియుచు  మహితమై వెల్గెనీ మంటపమ్ము !

 

తే.గీ.

ఇట్టి తేనియల సమూహ మిరవు కొనుచు

మోదమున్గూర్చగ నిట నామోద మిడగ;

స్వాగతించుచు తెల్పెద సంతసమున

ఇందిరా గారల కివియె వందనములు!

చల్లా దేవిక.

*********


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...