14, జనవరి 2021, గురువారం

07.01.2021 చిత్రమునకు కవిత

 

07.01.2021 చిత్రమునకు కవిత

 

చిత్రము మీద మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు

కవులు/కవయిత్రులు తమ అంతరంగంలో దాగిన సుమధుర భావనలను వెలికి తీసి తేనియల గరిమ తెలిపెడి కవితలల్లి, సమూహానికి హరువు గూర్చగలరని విన్నపము.

 

 

భోగి మంటల వెలుగున పొగడ పూవు

పట్టు చీరల పడతులు పటిమ చూ

రంగు రంగుల రతనాల రంగ వల్లి

ఆలు మగలకు మురిపెపు పగడ పూస

పాల పొంగుల జవరాలి పాల వెల్లి

మకర సంకుర శకటపు మరకతమణి

బంధు వర్గము పాలిట పంచ దార

వచ్చె శుభధనుర్మాస ము వరము లివ్వ

రేవూరు సాయి లక్ష్మి, ముంబై

 

ఉదయభానుడు నులివెచ్చని  కిరణాల మునివేళ్ళతో

మంచు పరదాల మేలిముసుగు తొలగించి

ప్రకృతికాంత చెక్కిలి మీటు సుప్రభాత వేళ

సదతులందరు కూడి ముంగిళ్ళలో

రంగవల్లులు దిద్ది, హరివిల్లు వర్ణాల రంగులద్ది

హరినామ సంకీర్తనాలపించెడి

హరిదాసుకి మొక్కి ఆశీస్సులందేరు.

ముగ్గుల నడుమ కొలువైన గొబ్బెళ్ళు ,

గొబ్బెమ్మ సిగలో ఒదిగిపోయిన

ముద్దబంతుల సోయగాలు చూడ మనోహరం !!

ముంగిట ముగ్గులతో పసుపురాసిన గడపలతో

కళ కళ లాడెడి లోగిళ్లలో నిత్య సంక్రాంతియే కదా !!

రమ,కంకిపాడు


 

ll

పెక్కువ కార్యముల్ నడుమ "వేంకటసత్కవి" ఆనతీయగన్  

మక్కువ మీఱుగన్ కవన మంజువులన్ కురిపించు సత్కవుల్

చిక్కపు వెన్నపూసలు రుచించు పదమ్ములు నిత్యనూత్నమై

చక్కని రంగవల్లికలు; సౌరుసరోజములన్ సుమాళముల్

చక్కెరపాకముల్ జిలుకు సౌరభముల్, మధురోహ పంచగన్ !

 

వచన కవిత

మబ్బులెల్ల  విరిసి భానుడుదయించంగ

రమణులంత మురిసి రంగవల్లులేయంగ

పూల ముగ్గు లిళ్ల ముంగిట మురిపింపంగ

చేయంత గొబ్బిళ్లు ముగ్గుల నలరించంగ

పాడిపంటలు లోగిళ్ళ సిరులు కురియంగ

పుడమి కాంత మేను మెరిసి పులకించగ

సంకురాతిరి సంబరాల సమయమాయె.

CA కె మల్లికార్జునరావు

 

 

రంగులద్దుకొనెను సింగారిసిరి నేల

ముంగురుల వలె తన ముగ్గులొలుక

సంబరముల చీర సంక్రాంతిని వరించి

సస్యలాస్యములను సరిధరించి!

రాంమోహన్, నిజామాబాద్

 

 

వచన కవిత

మల్లికలల్లినరంగు రంగుల

రంగ వల్లికల సోయగమును గన

ఘల్లుఘల్లు మను యందియ రవళులు

ఉల్లములలరగ ఝల్లనిపించెను

కల్లబొల్లి మాటలల్లుకొను యల్లరి పిల్లల

చేతిలోన కళ కల్లకాదు...

ఎల్లలుదాటగ వెల్లివిరిసెను

మల్లియ సౌరభమును గుభాళించెను

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

రంగులు పూసిన వల్లరిదేమో

రమణులు రాసిన కావ్యమిదో

భానుని భాసపు కాంతిని తాకి

నేలే సుమమై నవ్వినదో

ధనుర్మాసమని ఇంద్రచాపమే

భువిపై చాపను పరచినదో

మెచ్చిన వాడిని ముగ్గులొ దించగ

ముదిత ముద్దుగా రంగులు అద్దిన

ముచ్చట గొలిపే ముగ్గుగ మారిన

మకరధ్వజుని దుశ్శరము

విష్ణుప్రియ

 

 

రంగులు పులిమి విరిసిన రంగవల్లి

రమణులు సమకూర్చిన కావ్య రచన వోలె

భానుని కిరణములు దాకి ప్రాభవముగ

సుమమయి హాస మొలికించి సుందరముగ

శోభి తమయెనో! పొలుపుగ క్షోణి మీద

మబ్బురవుతు చాపము ధనుర్మాసపు మహి

మగ నమరినో! వలచిన యనుగుని కొరకు

నతివ రహిగ కూర్చిన మ్రుగ్గు లద్భుత మిదె

 

 

వంద వందనాలు

వందనాలు వనితలందరికీ

అవయవాలతో చేస్తూ తగినంత కసరత్తు

సరైన ప్రణాళికతో గణిత, భౌతిక శాస్త్రాల జ్ఞానాన్ని

ముగ్గులో   మిళితం చేస్తూ పలు విధముల

వివిధ రీతులలో చుక్కలు పెడుతూ

వాటిని చక్కగా కలుపుతూ 

ఓపిగ్గా రంగులతో నింపుతూ తీర్చిదిద్దే

 

ఒంపు సొంపుల సౌందర్యాల రంగవల్లిని

ఆవిష్కరించే వనితలదరికీ వందనాలు !

జి మురళీ మోహన్ రావు

 

 

ఇంపుగా ఇంతులు తమ నేర్పు నంతా

కలియ బోసి ధనుర్మాసము నందు

ముంగిటి లోన పౌష్య లక్ష్మికి ఆహ్వానము

పలుకనెంచి ఉదయాత్పూర్వమే ఒక వ్రతము నెంచి

వేయుదురు రంగురంగుల తోడ రంగవల్లులన్

మంజూష, నిజామాబాద్

 

తెలుగువారి రంగవల్లులు

కం ll

ముగ్గులతో వాకిళ్ళకు

నిగ్గులు, చెంగల్వములవి నీలాంబరులై

సిగ్గులమొగ్గలు చిలుకగ

బుగ్గన ధరహాసములవి మోహార్ణవమున్

 

కం ll

జిలుగులు, సుమాళపు సిరులు

సలలితముల రంగవల్లి సందోహములీ

తెలుగుల కళ్ళాపి విరులు

విలసితమై జీవనమున వేడుక తోడై

 

కం ll

చెంగావుల వాకిళ్లకు

రంగులనే మేళవించి రమణీయముగన్...

ముంగిలిలో ముచ్చటపడి

చెంగలువల రంగవల్లి జెన్నుగ దీర్చెన్!

 

తే.గీ ll

తెలుగు వాకిళ్ళ కళ్ళాపి వెలుగులందు 

రంగవల్లుల దరహాస లాస్యమందు 

కలువఱేకుల మంజుల కాంతులందు  

కనులపండుగై ముగ్గులు కలువలందు 

నేత్రనీలాబ్జమున వెల్గు నివ్వటిల్లు   

కస్తూరి శివశంకర్

 

 

వచన కవిత

అరుణవర్ణము అంబుజాప్తుడు అందించినట్లును

హరితవర్ణముపత్రహరితము  అందించినట్లును

 

నీలివర్ణమును మేఘమాలలు అందించినట్లును

హరిద్రమును పూల పుప్పొడి అందించినట్లును

కొలనులోని తామరలు కొలువుదీరినట్లును

ప్రకృతికాంత అవనిపై రంగవల్లిగ శోభతో

రమ్యముగా నుండి పౌష్యలక్ష్మిని పండుగకు

ఆహ్వానించుటకు ముంగిట వెలసి

కనువిందు గొలుపు తున్నట్లుండే.

హరిద్రము = పసుపు రంగు.

హేమలత

 

 

సీ"

భూమాత మేనుకు భోగాల కళ్ళాపి సింగారమొలికించు సిరులముగ్గు

శుచ్యమ్ము గోరుచూ శోభాయ మానమౌ వాకిళ్ళ, కిండ్లకు వన్నె గూర్చ

రంగవల్లులతో లలాటీకము  భువికి నెచ్చెలుల్దిద్దునే నెమ్మిజూప

నుర్వి భోగమ్మున కుస్సురనగ నింగి  యూసులాడంగ తానూరడించె

గవనులున్నట్టి సువిశాల గయములేవి!

రంగవల్లులు దిద్దెడి రమణులేరి!

చిలుకరించగ జలములు పులకరించ

పుడమి తల్లికి మొక్కెడు పుణ్యమేది?

వాణిశ్రీ నైనాల

 

 

ఉత్పలమాల..

రంగుల చీర కట్టియట రంజిలు వర్ణపు రంగవల్లులన్

కొంగున సొంపుగా ముదిత కోర్కెల మల్లెలు దాచిరిచ్చటన్

చెంగున గంతులేయుచును చేర్చగ రంగుల సంచులన్నియున్

అంగనలందరున్  తళుకు లందము జిల్కుచు ముగ్గులేయగన్

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

సీ.

ముత్తెయిదువులు సమ్ముదముగ నింటి  ముంగిట ముత్తెపు బొట్టు లెట్టి

ముగ్గుపిండి గెరల ముగ్గులెట్టి సొబగుల్ గుమ్మరించెడి భువి కొమరు లివియె

హరివిల్లు సమకూరి యవని నలరుచేయు రంగవల్లుల రహి లక్షణమిది

హేమంతఋతువులో హిమముకురిసెడివేళ చెలువ బొంగించెడు చెలువ మిదియె

గీ.

జిలుగు లొలికెడు మ్రుగ్గుల జిలిబిలిజిగి

యల్లికల ధనుర్మాసపు హరువు యిదియె

గొబ్బెయల నెట్టి మహిలోన కోమలాంగు

లల్లరులు జేయు పండుగ యబ్బురమిది

వెంకట్.సి హెచ్

 

 

తే.గీ.

నింగి నింద్రధనస్సున రంగులేరి,

భూమి యద్దమందునతివ పొందుపరచె!

రంగులందమాస్వాదించ పోంగదె మది ?

రంగవల్లులు సంస్కృతిన్ చెంగలించు!!

డా. నాగులపల్లి

 

 

దేవకాంతలు బూని దేవేంద్ర లోకాన సృష్టిఁజేయగలేని చిత్రమిదియె

మగవారు చేకొని మర్మమ్ముఁ దెలియక నలసి తొలగిబోవు యాట యిదియె!

తెలుగు పడుచులకు ధీటైన విద్యరా రంగ వల్లికలల్ల రమ్యగతిన

యేవీధిఁ జూచినా యిండ్ల ముంగిళ్ళలో ముగ్గుల మురిపాలు ముదముఁ గూర్చు

 

రంగు రంగుల ముగ్గుల రాజసములు

హంగుఁ దెచ్చెను హృదయాలఁ హత్తుకొనగ

సంద డంతయు సంక్రాంతి సంబరాన

అంద మంతయు పడుచుల డెంద మందు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

రంగవల్లి

అతివ అభిరుచి కి తార్కాణమిదియే

మగువ మదిలో దాగిన కళకు తార్కాణమిదియే

సబల సహనానికి తార్కాణమిదియే

పడతి పట్టుదలకు తార్కాణమిదియే

నెరజాణ నైపుణ్యానికి తార్కాణమిదియే

వనిత వయ్యారపు హంగులు తార్కాణమిదియే.

ఉష

 

పైరులెల్లఁ ముగ్గగ మంచి ఫలమునిచ్చి,

సస్య సంపద హేలల సంబరములు

తెలుగునాటెల్ల నుప్పొంగి దివికెగయగ,

పుష్య డోలికన్, హరివిల్లు భువికి దిగగ,

నింగినేలల సంగమ నెలవునందు,

సంకురాతిరి పండుగ సందడించ,

సస్య పౌష్యముల యనుంగు సాహచర్య

మునకు గురుతుగా దీర్చిన ముగ్గులవిగొ !

రంగవల్లుల రంగుల హంగులెల్లఁ

ధాన్యలక్ష్మికొసఁగు స్వాగతముగఁ దోచె !

పైరు ముగ్గుట = పైరు పరిణతికి వచ్చి, కంకులు పూర్తిగా ముదిరి, ఫలించడం (ఫలము బాగా పక్వానికి వచ్చి, ముగ్గి నట్లు)

హేల = విలాసము, సంతోషము,లీల, వెన్నెల

పుష్య డోలిక=పుష్య మాసపు మంచు పల్లకి, మేనా

నెలవు=ఉనికిపట్టు,

(వాస) స్థానము, చోటు, చనువు, నెనరు, పరిచయము

వట్టెం వెంకట రమణ

 

 

వచనం,

రంగుల రంగవల్లి,

మమతల పాలవెల్లి,

ప్రేమానురాగవల్లి,

ఆనందాల హరివిల్లు,

కలబోత మన సంక్రాంతి

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

సాయి చూపు... పిలుపు

ఏమి  చూపు అది నా సాయి చూపు,

ప్రేమామృతమును నాపై చిలుకు,

ఏమి  పిలుపు అది నా సాయి పిలుపు,

సేవాభావము  నాలో రేపు...

 

నిరాడంబరత మూర్తీభవించగ,

శ్రద్ధ, సబూరీలు మనలో కలిగించ,

మానవసేవే భగవాను సేవయని,

జగతికి బోధించిన సద్గురు వాతడు...

 

ఎంత గడించిన, ఎంత దాచినా,

అంతా చివరికి వదిలేదేనని,

మిగిలేది తుదకు పుణ్యమేనని,

మానవాళి కి బోధించిన సాయి....

 

నమ్మినవారిని ఎన్నడు వదలక,

సమాధి నుండే ఆపదలు బాపి,

కష్టాల నన్నీ కడతేర్చుతాడు,

ఇష్టదైవమే అందరి కతడు...

 

రచన. చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

స్వేచ్ఛ సమర్పణ -

అర్థం……..   అర్ధమయ్యే లోపే... దూరమయ్యేది కల.

అర్ధం అయినా... ఒప్పుకోలేనిది వాస్తవం.

అర్ధం అయ్యేకొద్దీ... దగ్గరయ్యేది స్నేహం.

అర్ధం తెలిసీ... సరికొత్త అర్ధం వెతికేది ప్రేమ.

అర్ధం అయినట్టే ఉంటుంది కానీ...

ఎప్పటికీ అర్ధం కానిది జీవితం !

 

విచిత్ర స్వభావం.

ఇసుకలో... సౌధం చూస్తాడు.

రాయిలో... శిల్పం చూస్తాడు.

లోహంలో... ఆభరణం చూస్తాడు.

ఆకులో... ఔషధం చూస్తాడు.

వ్యసనంలో... ఆనందం చూస్తాడు

విగ్రహంలో ... దేవుడిని చూస్తాడు

శూన్యంలో ... తత్త్వాన్ని చూస్తాడు

ఇన్ని అందాలను గాంచిన మనిషి....

సాటి మనిషిలో మాత్రం

మనిషిని చూడలేడు. ఎందుకో..!?

CA కె మల్లికార్జునరావు

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...