2, జనవరి 2021, శనివారం

సమస్యా పూరణం - స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు 30.12.2020

 


సమస్యా పూరణం

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

సమస్యాపాదం తేటగీతి లో.. 

ఇదే పంక్తితో పద్య / వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు.




తే.గీ

కామ, క్రోధ, మోహాలాదిగా గల రిపు/

లారుగురును మదిని నిండ రాదెవరికి/

నిదుర, శాంతి క్షణికమగునె దొరకైన/

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతిలేదు

వారణాశి శ్రీలేఖ

 

 

అన్న వస్త్రాలు భోగాలు నధికమయ్యు

రాణి వాసాన జీవిత రశ్మి లేదు

కనక మున్నను దాంపత్య కాంతి లేక

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తే గీ.

అంతు లేని సిరి,పదవి చెంతనున్న

కూర్మి భార్యయు,చక్కని కొడుకు లున్న

తిరముగా మది నిం డుగ తృప్తి లేక

స్వర్ణ సౌ ధాన బ్రతుకంగ శాంతి లేదు.

డి.రామ నాగేశ్వరరావు

 

 

కాపాడు కొనవలే

కొందరికి స్వర్ణ సౌధాన

బ్రతుకంగ శాంతి లేదు

గమనించవలెనిది నెందరో

 

చేయవలె తగినంత వ్యాయామము

భావించి , సాధించవలె

ఆరోగ్యమును మహాభాగ్యముగా

 

పొందవలె మనః శాంతి

దైవ చింతన సత్సంగములతోను

 

జి మురళీ మోహన్ రావు

 

 

కోరి వినజాలక పులుగు కూజితములు

యూసులాడలేక ప్రకృతి యొడినిజేరి

మిన్ను మన్నుకు దూరమై మిధ్య మిడుకు

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతిలేదు

వాణిశ్రీ నైనాల

 

 

 

కన్నబిడ్డలు కడు దూరాన ఉండిన

రక్తపోటు,మధుమేహాలు నేస్తాలయిన,

చివరకు వృద్ధజంట మాత్రమే మిగిలిన,

స్వర్ణసౌధాన బ్రతుకంగ శాంతి లేదు(కదా).

ఉష

 

 

వచన కవిత-

అంతిమ యుద్ధమాసన్నమగు  వేళ,

సంధి యొనర్చుకొని రఘు రాముని

శరణువేడు మని కుల సతి మండోదరి

ప్రార్థించగవీరుల్  సుతులు పోయిరి,

తోడ్పడు శూరుల్ గతించిరి, నే నొక్కడు

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేద

ని ఘోషించి రణమున కేగె లంకాధిపతి

 

వచనకవిత -

హృదయము లేని మనుజులు వసించు

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

శాంతి లేని జీవితమున పురోగతి లేదు

దీని నెరుగక మనిషి జన్మకు ఫలం లేదు

CA కె మల్లికార్జునరావు

 

 

తే.

రాణి ముంతాజ్ మరణముతో రాజు షాజ

హాను ఖిన్న మనస్కుడై యటమటించి

ప్రణయ భామ నిష్క్రమణతో ప్రాభవముగ

నింపు జార్చుకొని కళావిహీనమైన

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

నాకు యనె తలంపుగ కడు శోకితుడయె

వెంకట్.సి హెచ్

 

1

పన్ను కొఱకునాదాయపు పన్ను శాఖ

వెంట బడుచు నామాత్యుల వెంబడించె

వెతికి వెతికి బయటకీడ్చి చితకబాద

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

 

2

ధార్త రాష్ట్రుడు మయసభ దవురు గాంచి

సభను కృంగెను పాండవ విభవము గని

రగిలి పోవగ కౌరవ రాజ రాజు

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

 

దవురు = శోభ.

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తేటగీతి 1

మనసు కోర్కెల వాపిక యనిమరువకు

యొకటి వెంటమరియొకటి యూరు చుండు

కోర్కెల సుడిలో తిరుగుచు కులుకు చుండి

తనివి తీరక జీవించు మనుజులకును

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

 

2️

అంతు తెలియక వేధించ వింత రోగ

మొకటి, బ్రతుకు లస్తవ్యస్తములయి జనులు

దారి గానక తపియించు తీరు చూడ

సిరులు సంపదలన్నియు చెనటి కాగ

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

అవళూరు సీత

 

 

మధురాక్కర

అర్ణవముతీరమునకడు హరువునొసంగునొక

పర్ణశాల నేర్పరచంగ బందుర మొసగి సప్త

వర్ణ శోభితమై వెల్గు, ప్రకృతి వన్నెలెరుగని

స్వర్ణసౌధాన బ్రతుకంగ శాంతిలేదు జయకరా!

వెంకట్.సి హెచ్

 

 

తేటగీతి....

రాజ సూయము జూడ రారాజు వెడలె

మయ సభను గాంచ కించిత్తు మత్తులోన

దురభిమాన రారాజున తుచ్చముబుక

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు.

 

దైవము......శ్రీకృష్ణుడు

స్వర్ణ సౌధము.....విరాటుని కొలువు

 

తేటగీతి

వీర పాండవుల్  జేరగ విరటు కొలువు

దుష్ట కీచక దుశ్చర్య  ద్రుంచివేయ

సహన మంతయు గోల్పోయి సతులు నిల్వ

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు.....

 

స్వర్ణ సౌధము.....విరాటుని కొలువు

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

తేటగీతి

కాయమంతయు గాయాల గాను మారి

కనులు గానక యుండియు కలత జెంది

సేవజేయుట కెవరును చెంత రాక

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు.

హేమలత

 

 

భార్య పుత్రుండు తనమీద శత్రులైన

అన్నదమ్ముల మమకార మినీ మింత లేక

ఆప్తులెవ్వరు  తన బాధ చూడకుంటే

స్వర్ణ సౌధనా బ్రతుకంగ శాంతి లేదు

మంజూష,  నిజామాబాద్

 

 

దాన ధర్మము లేకను ధనము బెంచ...

భాగ్య మొచ్చె.. కోల్పోయితి భందుమిత్ర

పుత్రుల నడుమ వైరము బుట్టి బెరిగి.

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

శ్యామల

 

 

తే గీ

తాజు హోటలు నందున రోజు గడిపి

వాడు జేసిన బిల్లుల దాడి జూచి

కూడ బెట్టిన సొమ్ములు తోడు పోయి

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

తే.గీ.

దండిగ పరిమళము బంచు బొండుమల్లె

మధుర భావముల జిలుకు మాతృభాష ;

అట్టి మల్లె పందిరి విడి ; యాంగ్ల మనెడు

స్వర్ణ సౌధాన బ్రతుకంగ శాంతి లేదు!

చల్లా దేవిక

 

 

అర్హతలు లేకనె,తనదు స్వార్థముగొన

పదవి; పరదార జననుల  పెదవి గోరి,

మానవత్వపు విలువలు మంట గలిపి,

రావణాంశచే బుట్టి, కర్కశుల వోలె

దుష్ట జీవము సాగించు దుర్మతులకు,

కట్టుకున్నట్టి కలుషముల్ కట్టి కుడుప,

నాత్మ సాక్షియే నిలదీయననవరతము,

పరుల బీడించి పేర్చిన పాపపు నిధి

యాదుకొనగ జాలదనుచు  నర్థమవగ,

స్వర్ణ సౌధాన బ్రతుకంగ, శాంతి లేదు !

వట్టెం వెంకట రమణ

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...