21, నవంబర్ 2020, శనివారం

దీపావళి ప్రత్యేకం 1 శనివారము 14.11.2020

 


దీపావళి శుభాకాంక్షలతో

 

శ్రీకృష్ణుడు ఒకసారి అద్దం ముందు నిల్చుని బాగా అలంకరణ చేసుకుంటున్నాడు.

బాగా ఆలస్యం అవుతోందని రథసారథి లోపలికి వచ్చిదేవా ఇంత అలంకారం ఏమిటిమీరు ఎవరిని కలవాలి అని అడుగుతాడు.

నేను దుర్యోధనుని కలవడానికి వెళ్ళాలిఅతను నా పైన వున్న అలంకారం చూస్తాడు కానీలోపలి దైవాన్ని చూడడు అంటాడు.

మీరు మాకు దైవం  దుష్టుడైన రారాజు వద్దకు మీరు వెళ్ళవద్దు అంటాడు సారధి.

అప్పుడు శ్రీకృష్ణుడు చెపుతాడు, "చీకటి ఎన్నడూ వెలుగు దరిచేరదువెలుగే చీకటిని వెలిగించాలి"

మరి దీపావళి అర్థం అదే కదా!     దీపావళి శుభాకాంక్షలతో

 

సతీష్ | తెలుగు తేనియలు

 


 

దీపావళి :శుభోదయంఅందరికీ దీపావళి శుభాకాంక్షలు.

 

ఈ పండుగని ఇష్టపడని భారతీయుడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టి ఉండడని నా నమ్మకం.

 

మతాబులుపెన్సిళ్లుసిసింద్రీలుటపాకాయలు,తారాజువ్వలు....

 

పండక్కి వారం ముందే నేను మాతాత కలిసి ద్రాక్షారాం నించి మతాబు గుల్లలుమతాబు మందుసిసింద్రీ గుల్లలుదానికి మందు మోసుకొచ్చేవాళ్ళం రోజూ పొద్దున్నే కాఫీ తాగి కూర్చుని ఓ పళ్ళెంలో మతాబులు మందు వేసి ఒక కఱ్ఱపుల్లతో కూరడం మొదలెట్టేవాళ్ళంఒక పది కూరిన తర్వాత ,నాకు మా బాబాయ్ కి డౌటు వచ్చేదికాల్తాయా లేవా అని ట్రైల్స్ వేసేవాళ్ళం అలా ట్రయిల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో సగం పైనే కాల్చేసి ,విసుగొచ్చాకా సిసింద్రీ పని (ఐస్క్రీమ్ కోన్ షేప్ లో ఒక అంగుళం సైజు పేపర్ మౌల్డ్ లో తారాజువ్వ మందు కూరుతారు),అవి కూడా ట్రైల్స్ వేసేవాళ్ళం కానీ ఇందులో ఒక చిక్కుంది పేరుకి తగ్గట్టుగా దాని ఇష్టానికి తిరుగుతూ మూడు బాగుంటే ముంగిట్లోతిక్కరేగితే పక్కింటి అన్నారం నట్టింట్లోనూ దూరేది. అలా ఒకసారి నేను వేసిన సిసింద్రీ మా బాబాయ్ గుండె మీద వాలింది( ఏ రోజు వాడని పువ్వై నిను చేరు వరమివ్వు అని పాడి ఉంటుందని నా నమ్మకం). నాకొక నీతి తెలిసింది విశ్వాసం అనేది ఏ కుక్క సొత్తో కాదు సిసింద్రీ కి కూడా ఉంటుందని.

 

రెండు పులిహోర పళ్లాలు నిండినా ,ఇంకా వెలితి అనిపించి మా నాన్న కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళ చేత కూడా సిసింద్రీలుమతాబులు కూరించే వారువాళ్ళు కూడా ట్రైల్స్ వేయగామా నాన్న సిసింద్రీ దానంమతాబు దానంఅవి చేయగా ఓ వందో యాభయ్యో మిగిలేవిఅయినా మాకు తుత్తి అనేది ఉండేది కాదుఅందుకే నల్లకోమటి కొట్టునించి పెన్సిళ్లు ఇంకొన్ని సిసింద్రీలు ఇంకేమైనా ఉంటే అవి (రేసిజం అనుకోకండి అది అతని ముద్దు పేరు ,కృష్ణుడిని అనమా ఏంటి? ).జిల్లా ఫేమస్ పెద్దిరెడ్డోళ్ల షాప్ నించి మట్టి చిచ్చుబుడ్లుతాటాకు టపాకాయలుపేక తారాజువ్వలు.

 

ఈలోగా ఇంకేమన్నా కొత్తగా దొరికితే అవిఅన్నిటికన్నా అసహ్యకరమైన పాము బిళ్ళలు దోమలు ఛస్తాయ్ అనే వంక పెట్టి మా నాన్న కొనేవారు అదొక రకం హింసఇంటికి పెద్దకొడుకు కదా అని ఏం అనలేకపోయేవారు ...

 

పండగకి రెండు రోజుల ముందు నించే మిట్టమధ్యాహ్నం పూట మా చాకలి సత్తెమ్మ ,పళ్ళాలుగొల్లాడు ఇంకా ఎవరెవరో వచ్చే వారు ,వాళ్ళు రాంగానే మా బామ్మ నాకు ఏదో పని చెప్పి లోపలికి పంపేయడమోలేక.తాతగారితో కూర్చో అని.వీధిలో పొగడచెట్టు దగ్గరికి తీసుకెళ్లడమో చేసేదిఏదో జరుగుతోంది అని డౌటొచ్చి తలువువారా చూస్తే..మా బామ్మ చేసిన స్కామ్ ,నా కాకరపువ్వొత్తులుఅగ్గిపెట్టెలుడబ్బాలు డబ్బాలు దానాలు చేస్తోందని తెలిసింది.

 

కారణం అడిగితే : నీకేమో బాబాయ్ లు ,నాన్నతాత తెస్తారు కదేమరి వాళ్ళకి ఎలాగూ పాపంఆఖరిరోజున ఎలాగూ అన్నీ వేస్టుగా కాలుస్తావ్ ,వాటిలోవే ఇవి అనుకో సిసింద్రీలు మొత్థమ్ నీకే !!!

 

అప్పట్లో అందరివీ తాటాకు నేసిన కప్పులు అవ్వడం వల్ల రెండురోజుల ముందు నించే ఇంటి కప్పులు తడుపుకునేవారు. (ముందుజాగ్రత్త చర్య).

 

"దిబ్బి దిబ్బి దీపావళి   మళ్లీ వచ్చే నాగుల చవితి "

 

గోగుకఱ్ఱలు వెలిగించి కొట్టిన తర్వాతఅగ్గిమీద గుగ్గిలం వేసిబామ్మ పెట్టిన స్వీట్స్ తినేసి ఏ కాటన్ ఫ్రాకో వేసుకుని "మిషన్ మందుగుండు కాల్పుడు " కి రెడీ అయ్యేదాన్ని.

 

అప్పట్లో నాదే ఏకఛత్రాధిపత్యం కావడం వల్ల మొదట్లో ఒక్కొక్కటి తర్వాత రెండు చొప్పున నెమ్మదిగా నాలుగు (సగం కాలినవి నేలమీద ,రెండు నా చేతిలో) లాస్ట్ లో ఓ అరడజను గడ్డిలో పేర్చి కాల్చేసేదాన్ని.

 

ఎప్పుడైనా చెయ్యి ,కాలు కాలితే ఆ ఒక్కరోజు మాత్రం అస్త్ర సన్యాసం చేసి మర్నాటి నించి దీక్షగా సిసింద్రీలు వేసుకోవడం కంటిన్యూ చేసాను...

 

జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయ్ అక్కడే ఆగిపోకూడదు ముందుకు సాగిపోవాలి "సిసింద్రీలా".

 

ఎన్ని బాంబులు, 1000వాలాలు వచ్చినా తాటాకు టపాకాయల దారే వేరు ,ఒకసారి పేలిందంటే ఊరి చివరి చెవిటి తాత చెవుల తుప్పు వదలాల్సిందే.

 

ఆఖరుగా సభ్య సమాజానికి నేను చెప్పొచ్చేదేంటంటే చక్కగా చేసుకోవలసిన ఒక్కగానొక్క పండగ మరీ మానేసేకన్నా హాయిగా  కనీసం రెండు కాకర పువ్వొత్తులైనా కాల్చి పండగ చేసుకునిఒక వారం పాటు ధూమయంత్ర శకటం (రైలు బండంత పొగ వచ్చే) నడపటం మానేయొచ్చని నా అభిప్రాయం !!

 

Ps: నా అభిప్రాయం తప్పని ప్రయివేట్ చెప్పరని/చెప్పొద్దని ఈ అర్భకురాలి యిన్నపం.

దీపాల శోభ తెచ్చు

ఇంటికి వెలుగు

 

మతాబుల మెరుపులు తెచ్చు

ఇంటిల్లిపాది ఆనందాలు

లక్ష్మీదేవిని పూజించు

రకరకాల పిండివంటలతో

ఆనందాలతో కేరింతలతో

దీపాల వరుస తెచ్చే

దీపావళి పండుగ

 

డి. నాగమణి తెలుగు తేనియలు

 

 

చిన్నతనంలోనే కాదు ఇప్పడికీ సందడిగా పలకరించే వేడుక మాత్రం నాకిప్పటికీ గుర్తే..

అదే 'దిబ్బు దిబ్బు దీపావళి..పొడవాటి గోగు కర్రలుగోంగూర కాడలు కొత్త తెల్లటి వస్త్రంతో చేసిన నూనె వత్తులు....

మీ పూర్తి జ్ఞాపకాలన్నీ చదవగానే బాల్యం నాటి జ్ఞాపకాలు భూచక్రాల్లా గిర్రున నన్ను చుట్టుకున్నాయిపలకరించాయి  

గంధకం కలిపి తయారు చేసే చిచ్చుబుడ్లుమతాబులుసిసింద్రీలూచిన్న రేకు తుపాకిదానికోసం గుళ్ల ఎర్ర పిస్తోలు బిళ్ళల డబ్బాలు... రీలు చాలా రేటు ఎక్కువండి మరి కూడా అలా జ్ఞాపకాల వీధుల్లో గిర్రున తిరిగాయి 

తాతగారి కాఫీ ఘుమఘుమలు,  

మీ ఊళ్ళో కోమటి గారినిబాబాయ్ గుండెల్ని స్పృశించిన అల్లరి సిసింద్రీఅన్నారం నట్టింట్లో దూరి హడావిడి చేసిన సిసింద్రీ.... భలే ఉంది మీ జ్ఞాపకాల సంభ్రమం.

కస్తూరి శివశంకర్  తెలుగు తేనియలు

 

 

Shubha #Deepavali....

దుబ్బూ దుబ్బూ #దీపావళి...నాల్గోనాడు నాగులచవితి  అని తులసికోట ముందు కూర్చుని కార్యక్రమం చెఱకులకి దివ్వెలు కట్టి ఫేమిలీ లోని మగరాయుళ్లందరూ కొడితే...పక్కన పూజాకార్యక్రమాలు మా మామ్మ అమ్మ తీసుకుంటే... దీపాలు వెలిగించడాలు మా అక్కచెల్లెళ్లు చూసుకునేవారు.

అప్పట్లో తుంపాల వెళ్లి చెఱుకులు తెచ్చుకొనే వాళ్లం.ఇప్పుడు  చుట్టుపక్కల తోటలన్నీ కోలనీలైపోయాయిఇప్పుడు బొంబాయిలో చెఱుకు రసం అమ్మే షాపు దగ్గర కొంచెం మంచిది చూసుకొని కొంటున్నాం.

తర్వాత కార్యక్రమం  కర్రకి గుడ్డచుట్టి వెలిగించి ఇల్లంతా తిప్పి  ప్రతీ గదిలో మంట మీద గుగ్గిలం వెయ్యడం...ఈలోగా మా మామ్మ ఆరోజు కాల్చవలసిన టపాకాయల కోటా తయారు గా పెట్టేది.

దివ్వెలు కొట్టిన చెఱకుని మేం విష్ణు చక్రాలని పెద్ద కాకరపువ్వొత్తులని కాల్చడానికి వాడే వాళ్లం.

మేం కుక్కుకున్న సిసింద్రీలు గిరగిరా తిరుగతూ ఉంటే...వెన్నముద్దలు డబడబా రాలుతూ ఉంటే...చీనాకాకర్లు చిటపటమంటుంటే భలేగా ఉండేది.

నేను నా స్నేహితులు దసరా అవగానే ఊరిచివర్న సంతబయలు దగ్గర మందుగుండు సీతారాం అని మా ఊరు చుట్టుపక్కల "ఓల్ ఫేమస్అక్కడనుంచి మందు పాళ్లు ముందుగానే చర్చించుకొని కొనుక్కెళ్లేవాళ్లం.

పురుషోత్తంఓంశివల దగ్గర అవసరమైన సలహాలు తీసుకొని ,ఎన్నిరోజులు ఎండాలి,సిసింద్రీ మందులో నిమ్మరసం కలిపితే ఏమౌతుందిసోవియట్ భూమి పుస్తకాలు ఎక్కడదొరుకుతాయి లాంటివి చర్చించుకొని పని మొదలెట్టేవాళ్లం.దాదాపు సగం శాంపిల్కి తగలేయగా మిగిలిన సగం కార్తీక పౌర్ణమి దాకా అరా అరా కాల్చేవాళ్లం.

ఇప్పుడొస్తున్నాయో లేదో గానీ కమ్మరేకు బాంబులు గోడ కాయలూ వచ్చేవి.అవన్నీ మా నాన్నగారి స్పెషల్ మెనూ.

కటకటాల లోపల కూర్చుని కాలిన కాకరపువ్వొత్తు తీగ చెఱకుకి గుచ్చి తీగకి ఇంకో చివర కమ్మరేకు బాంబు గుచ్చి వత్తి వెలగగానే దూరంగా పెట్టేవారు పేలితే సరే లేకపోతే దులిపేయడమే.

ఆరోజు కోటా అయిన తర్వాత మరి అట్టపెట్టెలు వేసి కాల్చడం....అదో ఆనందం....వాటిలో ముందు పేలనన్న బాంబులు పడేసే వాళ్లం...పేలితే మాత్రం తెలుగు సినిమా లో బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్టొచ్చేది.

నాగులచవితి దాకా మళ్లీ  మందుగుండు సామాను ముట్టుకొనేదిలేదు.కేపులు మాత్రమే పేల్చుకోవడం.

మేం బోల్టులలో పెట్టి పేల్చేవాళ్లం.బోల్టు వాషర్ మధ్య కేపులు పెట్టి బోల్టు టైటుచేసి పై నుండి కింద పడేస్తే...ఢాం...!!!

హై స్కూల్లో ఉన్నపుడు మా ఫ్రెండు శేషుగాడొక ఇన్వెన్షన్ చూపెట్టాడు.వెదురుతో చేసే గన్!!!.పొలాల పక్కన పెరిగే బొంత రివ్వలు  (సన్నటి వెదురురబ్బరు బేండు , మేకు ఉంటే చాలు...అంతే...కేపులు పేల్చే గన్ తయార్...     సరేలెండి

ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి... ప్రస్తుతానికి ఆరోజులని తలచుకోవడమే గానీ మళ్లీ తెచ్చుకోలేం....

 

(నా హార్ట్ స్ట్రోక్స్ 2016 పోస్ట్)

 

కన్నాజీరావు తెలుగు తేనియలు

 

 

 

సీసము:

చిచ్చుబుడ్డియె నీదు జీవితమ్మును బుగ్గి

జేయగా మండుచు చిచ్చుబెట్ట

సీమ టపాకాయ చిన్నినీతలకాయ

ప్రేలిపోవగ కాలి కాలుడవగ

చేరితారాజువ్వ మీరునీ బ్రతుకును

పైకి జేర్చుచు నింగి బాతిబెట్ట

విష్ణుభూచక్రాలు విరిచినీకొమ్ములు

వీరంగమాడుచు విసరివేయ

 

ఆటవెలది:

నేటి దీపప్రభలు నిండగాబ్రతుకుల

కోరుకొనుచు లేచి కోలుకొనుచు

అందరమ్ముగలసి మందులన్ గాల్చుచు

బొంద బెడుదుమింక పోకరోన!

 

కందము:

 కోవిడ్ నరకునిపై

టీకాలను వేసి గ్రుచ్చుటెన్నడొనాడే

మాకౌ దీపావళియని

లోకమ్ములు వేచియుండె లోకేశహరీ!

 

గోలి తెలుగు తేనియలు



 

కందము:

దీపావళి కాంతులతో

పాపాలను దొలగించుము పావన జననీ!

సోపానమునై జగతిని

కాపాడుము సిరులతల్లి కల్పలతికవై

దీపావళి కాంతులతో...

 

మహేశ్ ముత్యాల తెలుగు తేనియలు

 


 

కందము 1

దీపమ్ముల కాంతులులో  

దీపించెడి తలఁపులందు దీధితులవలే !

దీపావళిలో శాంతికి  

సోపానములన్ కనుగొని శోభించగనే !

 

కందము 2

తిమిరమ్మున కాంతులలరు 

సుమనోహర భావములవి ! జ్యోతిర్మయమై 

రమణీయపు తలపులతో 

విమలములై హృదయమందుప్రేమనుపంచెన్  

 

కందము 3

వెలుఁగునుఁ జూపెడి మనుజుల

తలపుల దీధితులకాంతి ధరలో కఱవై !   

మలినము "క్షాళన జేయగ"

కలతలు లేని మనసులుకు కైమోడ్పులిడెన్ !

 

కందము 4

తామస గుణములు వీడుచు 

ప్రేమను పంచే తలపులు పీయూషములై !  

కామితములన్ తెలుసుకొని;

శ్రామికుఁ జీవనములోన సౌహార్ధములై !

 

కందము 5

నరకుఁడు కొఱకు వెదకుచూ   

పరిపరి విధములగ నీవు పరికించకుమా 

ధరపైఁ ధూర్తులు సమసిన

వరముల దీపావళి ధరపై సురుచిరమై  ! 

 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

శాంతి సౌఖ్యాలు సామరస్యమ్ము కురిసి

విశ్వ మానవ ప్రేమమ్ము వెల్లివిరిసి

అంతరంగాల తిమిరమ్ము నణచివైచి

వెలుగుదివ్వెల పండుగ వెలయుగాత!

 

దీపము ప్రతీక శాంతికి;

దీపము విజ్ఞానమునకు తిరమగు గురుతౌ

దీపమె ఆనందమునకు

ప్రాపగునా దీపమునకు ప్రణతు లొనర్తున్.

 

విజయ వట్టెం తెలుగు తేనియలు

 

 

శాంతి సౌఖ్యాలు సామరస్యమ్ము కురిసి

విశ్వ మానవ ప్రేమమ్ము వెల్లివిరిసి

అంతరంగాల తిమిరమ్ము నణచివైచి

వెలుగుదివ్వెల పండుగ వెలయుగాత!

 

దీపము ప్రతీక శాంతికి;

దీపము విజ్ఞానమునకు తిరమగు గురుతౌ

దీపమె ఆనందమునకు

ప్రాపగునా దీపమునకు ప్రణతు లొనర్తున్.

 

మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి తెలుగు తేనియలు

 

 

తేటగీతి

మనసు లందు నజ్ఞానము మాయ వలయు

భూమి జనులెల్ల నవ్వుల పూలు పూయ

వలెను కోవిడు నరకుడు పారిపోయి

భయము తొలగిన దీపావళి యగు నిజము.

 

రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 

 


దీపావళి సందర్భంగా లక్ష్మీదేవికి నా ప్రార్థన

వచన కవిత:

 

మహాలక్ష్మీనారాయణీ,

క్షీరసాగర మధనమునన్,

ఉద్భవించు దాది ఊరట,

లేక విష్ణు పాదము లొత్తగ,

శ్రమపడి అలసినావే  తల్లి,

 

ఆర్తిగా యాచించునుంటి,

నా ఆత్మసీమలోన నీకున్

స్థానమొకటి కావించినాను,

జాగు సేయక రావే అమ్మా!

వచ్చి విశ్రాంతి పొందుము..

 

అలవి గాని కోరికల నడిగి,

ఎన్నడూ నిను విసిగించను,

హద్దులంటూ నీ  స్వేచ్ఛకు,

కలనైనా దోషము చేయను,

నవ్వుతూ నా లోగిలినందు

నీవు మసలిన చాలు నమ్మా

నా జన్మ తరించి పోయెనులే

 

CA కె మల్లికార్జున రావు తెలుగు తేనియలు

 


 

గృహాణ మంగళం దీపం

త్రైలోక్య తిమిరావహం

 

ప్రథమం ధన త్రయోదశి

ద్వితీయం నరకచతుర్దశి

తృతీయం దీపావళి

చతుర్థం బలిపాడ్యమి

 పంచమం యమ విదియ 

ఐదు రోజుల పండుగ .

 

సకల ఐశ్వర్యాలను కలిగించి

తమస్సును పారద్రోలి

ఉషస్సును  జగతిలో

నింపే పండుగ

 

రాక్షసత్వం మీద

 దైవత్వం సాధించిన

విజయానికి చిహ్నం

ఈదివ్వెల పండుగ

 

సకలైశ్వర్య ప్రదాయిని

శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన

దీపాన్ని వెలిగించి

మనలోని చీకట్లని

ప్రకృతిలోని విలయతాండవాలను

తొలగించాలని ప్రార్థిద్దాం.

 

డి. నాగమణి తెలుగు తేనియలు

ఆటవెలది 

 

 

దీప కాంతులందు దేదీప్య మానంగ

నీదు జీవితమ్ము నిలుచు నెపుడు

లక్ష్మి తోడు మీకు లక్షణముగ నుండు

సంతసమును బొందు చక్కగాను

 

ఉత్పలమాల

బాపును నమ్ము దైవమని పండుగ సేయగ నెంచిరెల్లరున్

చూపులు సంత సమ్మునకు శోధన సేయుచు వెద్కుచుండగన్

మాపటి వేళకున్ జనులు మందులు కాల్చగ నెంచినన్నహో

దీపములెల్ల వెల్గినవిదీప్తియె సుంతయుఁ గానరాదిటన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

ఆటవెలది

భూమిసుతుని జావు భువినందు పండుగ

దీప కాంతితోడ దివిగమారు

బాణసంచ గాల్చి బాధలు మరతురు

చిన్నపెద్దలందు చింత దొలగు

 

హేమలత తెలుగు తేనియలు

 

 

కందము 1

మంచికెపుడు విజయమ్మని

యంచితముగ జాటు పర్వమరుదెంచంగా

సంచితముగ దీపావళి

నెంచి సతము స్వాగతింతు రెలమిని జనులే!

 

కందము 2

డెందమలర జేయునటుల

నందముగా కొల్వుదీర నమవస దినమున్

సుందర దీపావళులే;

సందడి జేయుచు జనులిల సంతస మొందున్!

 

కందము 3

విమల మనమ్ము నొకతరిన్

తిమిరమది యలముకొనంగ తేజము దొలగున్;

అమవస నిశిని వెలుగు లీ

ను మహిత కాంతు లిరులనిట నురుమాడవలెన్!

 

కందము 4

కాకర పూవొత్తుల వెలు

గే కమనీయతను గూర్చ నెలమి నిశీథిన్

ఆకరమై చిరునగవులు

శ్రీకరమగు మోము నెపుడు చిందాడవలెన్!

 

కందము 5

తారాజువ్వల వోలెన్

మారాముళ్లు దొలగంగ మగుడక నెగయన్

తోరపు స్ఫూర్తిని బంచుచు

ధీరోదాత్తులుగ సతము దీపించ  వలెన్!

 

కందము 6

దివ్యమగు దీప శోభన్

సవ్యమ్ముగ మానసమున చక్కని తలపుల్

నవ్యముగా దీపించగ

భవ్యముగా జీవనమ్ము భాసింపవలెన్!

                                  

చల్లా దేవిక తెలుగు తేనియలు

 

 

వచన కవిత,

 

దీపావళి....

దీ పాలను వెలిగించుముఅది

పాపాలను తొలగించును,

వరముల కురిపించునుసంతోషకే

ళి లో నిను ఓలలాడించును... ..

 

గాంగేయ శాస్త్రిరాజమండ్రి

 

 

కరోనా మహమ్మారి విలయతాండవ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం గా పర్యావరణాన్ని హాని చెయ్యని గ్రీన్ క్రాకర్స్ కాల్చమని చెప్పిన సందర్భంగా...

మీ కోసం  గ్రీన్ క్రాకర్స్

 

పాపాల పటాకులు

మాటల మతాబులు

వ్యంగాల బాంబులు

చిరాకు భూచక్రాలు

నింగినంటే కోపాల రాకెట్లు

అసూయ  కాకరొత్తులు

కాల్చే పండగ సందర్భంగా...

 

ప్రేమల ప్రమిదలలో

ఉత్సాహ జ్యోతులను వెలిగించండి.

 

దీపావళి శుభాకాంక్షలతో....

రాంమోహన్, నిజామాబాద్ తెలుగు తేనియలు

 

 

 

దీపావళి వింత చేష్టలు 

నరక చతుర్దశి దాకా ఆగలేక కొత్త బట్టలు రెండురోజులు ముందే ఎవరికీ తెలియకుండా వేసుకొని చూడ్డం...

 

వాటిని తిరిగి సరిగా మడత పెట్టడంరాక అమ్మకు దొరికి పోయి దేభ్యం మొహం పెట్టడం.

 

లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాకే కజ్జికాయలు తినాలి అని అమ్మచెప్పడం.  ఆమె బాణలిలో నూనె తగ్గింది అని నూనె డబ్బా కోసం వెళ్ళినప్పుడు చిన్నగా ఒకటి లాక్కొచ్చేయ్యడం.  అమ్మకు తెలీదాఅన్ని లెక్కే.... ఇట్టే పట్టేసేది మన ఘనకార్యాలు.

 

టపాసులు కొనడానికి నాన్న బడ్జెట్ ఇంతే అని చెప్పి దుకాణానికి వెళ్ళినపుడు  కొంత  కొంత కలిపేసి  బడ్జెట్ని రెండింతలు చేసి గర్వం గా గెలిచినట్లు పోసు కొట్టడం.  నాన్నగారు 'ఓరి వెధవనాకు తెలీదా... నేను అనుకున్నది ఇదేలేనీకు సగం బడ్జెట్ చెప్పాలేఅన్నట్టు మనవంక చూడడం.

 

డాబా మీద ఎండలో పెట్టె ముందుపెట్టిన తరువాత మతాబులుసాదారజను కాకర పువ్వొత్తులువెన్నముద్దలుసిసింద్రీలు లెక్కలుచూసుకోవడంఏనాడూ వడియాలు కాకులు తినకుండా చూసుకొన్న పాపాన పోలేదు కానీ దీనికి మాత్రం పది సార్లు తెగ హడావుడిగా డాబా పైకి క్రిందకి నేలకేసి కొట్టిన బంతిలాగా తెగ తిరిగేయ్యడం.

 

నరకుని కథ ఎంతవరకు తెలుసో తెలీదు కానీ అతగాడి మీద తెగ ఎనిమిటి పెంచేసుకొని బొమ్మలు గీసేసి నరకుని తెగ నరికే ప్రయత్నం చేసెయ్యడం.

కాకరపువ్వొత్తి దీపం నుండి వెలిగేటప్పుడు దీపం ఆరిపోవడందాన్ని వెలిగించే ప్రయత్నం చెయ్యక ఇంకో దీపం దగ్గరకు వెళ్లడం.  ఆలా అన్ని దీపాలు ఆరినాక అమ్మ చెళ్లు మనిపించాకే మళ్ళీ  దీపాలు వెలిగించే ప్రయత్నం చెయ్యడం.

పాము బిళ్లలతో గట్లు అన్ని మచ్చలు చేసి  పొగ లో దాక్కోవడం.

వెన్న ముద్దల వెలుగు తదేకంగా చూసి 5 నిముషాల పాటు ఏమి కనపడట్లేదని action చెయ్యడం.

కాలిపోయిన చిచ్చుబుడ్డిలో రాకెట్ వంకరగా పెట్టి అది వంకరగా ఎదురింట్లో పోయినప్పుడు లోపలికి పారిపోవడం

పిచ్చుకలుపచ్చిమిరపకాయలుఉల్లిపాయలు కాల్చేటప్పుడు వంకాయ బాంబు కాల్చేటంత పోసు కొట్టడం.

భయపడే ఆడపిల్లల్ని ఎక్కువ భయపెట్టే ప్రయత్నం చెయ్యడం.

అతి ముఖ్యమైన ప్రణాళిక : మరునాడు ఉదయం కాలిపోకుండా ఉన్న టపాసులు ఏరుకోవడం.  అందుకు ముందు రోజు ఉదయం సెలవు లేక పోయిన ఫర్వాలేదుట్యూషన్ మాస్టర్ ను మరునాడు ఉదయం సెలవు కోసం బ్రతిమిలాడుకోవడం.

 

ఇంకా చెప్పాలంటే బోలెడు చేష్టలు....దీపావళి సంబరాలే మిన్నంటే జ్ఞాపకాలు.

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పెథానేముంబయి తెలుగు తేనియలు

 

 

మీరు పంచిన మీ  మధురానుభూతులకి.. జతగా..నా తీయని జ్ఞాపకాలు.. మరి కొన్ని...

దీపావళికి నెలరోజుల ముందునించే... అద్దు రూపాయ్రూపాయ్.. పెట్టి గంధకంసూరేకారం లాంటి మందుగుండు సామగ్రి .. భద్రం కొట్లో కొని,తేలికగా ఉండే జాజి చెక్కని కాల్చిబొగ్గుని తయారించిఇస్రో కేంద్రాన్నికుటీర గృహ పరిశ్రమలాఇంట్లోనే నెలకొల్పిస్కూల్ లో నాకు రెండేళ్లు సీనియర్ శరత్ సాంకేతిక సహాయంతో..పర్యవేక్షణలో..సిసింద్రీల,జువ్వల తయారీకి  యత్నించడం.

దీపావళి ముందు,రోజూ వానలు పడుతున్నాయనిటపాకాయలు సరిగ్గా కాలవేమోనని దిగులు పడడం.

దీపావళి సామానురోజూ ఎండ బెట్టిబాగా ఎండాయో లేదోనని,రోజూ శాంపిల్ కాల్చి చూసుకోవడం.

దీపావళినాడు సాయంత్రం మాత్రం, "వాన రాకూడదు దేవుడా!"  అని మనకిష్టమైన,మనకి భరోసా ఉన్న దేవుడ్ని వెదికిముందునించేరోజూ ప్రార్ధించిమొక్కుకోవడం.

దీపావళినాడుసాయంత్రం పెందరాళే అన్నం తినేసి,అప్పట్నుంచినాన్న బజారు నించి వచ్చాక  మొదలు పెట్టే టపాకాయలు కాల్చుకునే కార్యక్రమం టైమ్ వచ్చేవరకు,  కాలుకాలిన పిల్లుల్లాగా ఇంట్లోకివీథిలోకీ  తిరుగుతూఅసహన విరహవేదనతోనాన్న రాకకోసం ఎదురు చూడడం.

 

దీపావళి రాత్రివాళ్ళింట్లో టపాకాయలన్నీ ముందే కాల్చేసుకునిఖాళీ చేసేసిమన ఇంటికిమన టపాకాయలు కూడా కొద్దిగా కాల్చిఎక్సట్రా మజా పొందుదామనే మాస్టర్మ ప్లాన్ వేసిమన ఇంటికి వచ్చిన  స్నేహితుడు రామ కృష్ణ  (ఇప్పడు సర్జన్)ప్రాణ స్నేహితుడే అయినా సమయంలోవాడికి,మన టపాకాయలు షేర్ చెయ్యాలంటేతెగ బాధ పడిపోవడం.. "ఇప్పుడెందుకొచ్చాడురా నాయనా!"  అనుకోవడం.

 

దీపావళిసేఫ్ గానే చేసేసుకునిమర్నాడు పొద్దున్నేకాలకుండా మిగిలిపోయిన టపాకాయలు అన్నీ  పోగు చేసుకునివాటన్నిట్లోనుంచీ.. మందుని  కాయితంలోకి పిండి,దాన్ని వెలిగించిభగ్గుమనిపించిఅప్పుడు,వేళ్ళకంటుకున్న  సిల్వర్ కలర్ పొడి కూడా భగ్గుమని కాలితే చిన్ని చిన్ని వేళ్ళు కాల్చు కొనిఊదుకుంటూఅమ్మ చూడకుండా దాచుకోవడం.

 

దీపావళి మర్నాటినించేవచ్చే దీపావళి  తారీఖున అయ్యిందాఇంకా ఎన్ని రోజులుందా అని లెక్క పెట్టుకోవడం.

 

ఇంకా.....

 

 రోజు మన బాల్యపు దీపావళి జ్నపకాలు పంచుకోవాలి అనుకున్నాం కదా !!

మన తరం వారికి మాత్రమే సొంతమైన అందమైన బాల్యం లో ఎన్నో పసిడి జ్నపకాలు

నేను నాదైన బాణీలో జరుపుకున్న చివరి దీపావళి నా నాలుగో తరగతి లో అనుకుంటా !!

ఎందుకం టే  5,6,7 తరగతులు మా నాన్న దగ్గర చదివానుమళ్ళీ 8 కి అమ్మమ్మ దగ్గరకి వచ్చాను కానీ చదువులు స్నేహితులు ట్యూషన్స్ అలా ....... అల్లరి కాస్త తగ్గింది అన్నమాట

 

నా చివరి దీపావళి జ్నపకాలు కొన్ని

 

తమ్ముళ్ళు శివ ,కన్నజీ,  జైకర్వెంకట రమణ మన విష్ణు చెప్పినట్టు తయారీ కార్యక్రమాలు ఏమీ లేవుఎందుకం టే  నాకు కాస్త ఊహ తెలిసేటప్పటికే మా మామయ్య ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్లిపోయాడు. మా తాతయ్య తమ్ముడు అంటే మా చిన్న తాతయ్య కి  తాతయ్యకికలిపి ఒకటే పెద్ద ఇల్లు మద్యలో గోడ ఒకటే ఉండేది అరుగుకి మాత్రం గోడ లేదు కనుక అరుగు  చివర నుండి  చివరి వరకు నా సామ్రాజ్యంచిన్న తాతయ్య వాళ్ళ పిల్లలు అంటే మా పిన్ని మామయ్యలు బందరు కాలేజీలో చదువుకోడానికి అక్కడే రూమ్ తీసుకుని ఉంటూ అప్పుడప్పుడూ వచ్చేవాళ్లు అందువల్ల  రెండు ఇళ్ళకి నేనే మహారాణి అన్నమాట.

 

ఆనందోబ్రహ్మ నవల్లో యాజీ కి తాతయ్యతో స్నేహం ఉన్నట్టే నాకు మా చిన్న తాతయ్య తో స్నేహం ఎక్కువ . కాకపోతే మా తాతయ్య వేదాలు నేర్పించలేదు కానీ చక్కని పాటలుతో స్నేహం కుదిరేలా చేశారు.

తనకి చిన్నతనంలో పోలియో వస్తే పట్టుదలగా టైలరింగ్ నేర్చుకుని ఇంటి అరుగుమీద షాప్ లా పెట్టి కుట్టేవారురెండు సంవత్సరాల క్రితం వరకూ నా బాల్యం లోని ప్రతి క్షణాన్ని నాకు పరిచయం చేసి ఇక శలవు అంటూ నా బాల్యాన్ని కూడా తీసుకెళ్లిపోయారు

 

ఇక దీపావళి విషయానికి వస్తే దీపావళి 10 రోజులు ఉంది అనగా మా ఇంటి దగ్గర ఉన్న భాస్కర రావ్ బడ్డీ అతను టీవీ లో

కొత్త సినిమా ప్రోమో కట్ చేసినట్టు రేపు బందరు వెళ్ళి దీపావళి సామాను తేవాలి అనేవాడు . డబ్బులు సిద్దం చేసుకో అని అన్యాపదేశం గా చెప్పడం అన్నమాట .  

 బడ్డీకి నేను రెగ్యులర్ కస్టమర్ ని మరి ) .

ఇక అసలు హడావిడి అప్పుడే మొదలు . సంక్రాంతి కోడిపందాలు దగ్గర అమ్మే సీతాఫలం ఆకారంలో ఉండే హుండి (కిడ్డీ బ్యాంక్ )ని వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు వసూలు చేసినట్టు సంవత్సరం అంతా పోగు చేసి నింపిన హుండీ పగలుకొట్టేదాన్ని.

అప్పుడు మన్మోహన్ సింగ్ గారి లేవల్లో ఆర్ధిక ప్రణాళిక వేసుకునేదాన్నిదీపావళికి ఎంత వాడాలి  రాబోయే న్యూ యియార్ కి , సంక్రాంతికి గ్రీంటింగ్స్ కి ఎంత వాడాలో చాలా తీవ్రం గా ఆలోచించి మూడు భాగాలు చేసుకుని ఇక అప్పుడు షాపింగ్ మొదలు పెడతానుపిస్టల్ బిళ్ళలు కొన్ని పెట్టెలుకొన్ని ఉల్లిపాయలు (ఉల్లి పాయ  బాంబులు అని పిలిచే వాళ్ళు వాటినే)  కొనేదాన్ని. (మతాబులు అవీ అమ్మమ్మ చిన్న తాతయ్య వాళ్ళు కొంటారు కాబట్టి అవీ నా బడ్జెట్ లో కొననుఇక కొన్న రోజునుండి స్కూల్ నుండి రాగానే వాటిని పెట్టుకుని మా ఎత్తు అరుగుల మీద స్తంభం పక్కగా కూర్చుని  గత సంవత్సర కాలం గా ఆయా సందర్భాలలో నన్ను చిన్నబుచ్చిన వాళ్ళన్నమాట  నేను వచ్చేవరకు ఆగకుండా వెళ్లిపోయిన అయిసు బండి అబ్బాయి గానీజిలేబి బండి చింతాలువాడుక గా పూలు ఇవ్వడం మర్చిపోయిన పూల చిట్టెమ్మ ఎన్ని సార్లు చెయ్యి ఊపినా సిటీ బస్సుని మా ఇంటిముందు అపకుండా రెండిళ్ళ అవతల ఉన్న భాస్కర రావ్ బడ్డీ నే ఆఫీషియల్ బస్ స్టాప్ గా డిక్లేర్ చేసిన కండక్టర్ చిన్నరావ్ వీళ్లలో ఎవరో ఒకరు వచ్చేవరకు ఆగి వాళ్ళు దగ్గరకు రాగానే ఉల్లిపాయ గట్టిగా రోడ్డుకెసి కొట్టడమో,

పిస్టల్ బిళ్ళ రాయితో గట్టిగా కొట్టడమో చేసేదాన్ని  ఏదో పరధ్యానం గా వెళ్ళేవాళ్లు ఉలిక్కి పడే వాళ్ళు . సిటీ బస్సుకి అయితే రెండు మూడు ఒకేసారి వేశాను  శబ్ధం విని పాపం టైరు కి ఏదో అయ్యింది అని డ్రైవరు కండక్టరు బస్సు ఆపారుమా ఇంటి ముందు బస్సు ఆగింది అన్న సంతోషం లో  స్తంభం చాటునుండి బయటకి వచ్చి

చేతిలో ఉల్లిపాయ తో దొరికిపోయానుకానీ పాపం నన్ను ఏమీ అనలేక  అక్కడే అరుగుమీద కూర్చున్న మా చిన్న తాతయ్య దగ్గరకి వెళ్ళి కృష్ణమూర్తి గారు  ఉల్లిపాయ రౌడీ ని కాస్త కంట్రోల్ చెయ్యండి అని వెళ్లిపోయారుకానీ  తరువాత నాకు జ్వరం వచ్చి ఒకవారం కనిపించకపోతే తాతయ్యని  ఎక్కడండీ  మా ఉల్లిపాయ రౌడీ అని అడిగి  నాకు జ్వరం అని తెలిసి బందరు నుండి బ్రెడ్ తెచ్చి ఇచ్చి ఫ్రెండ్ అయిపోయాడుఅవన్నీ చేసింది నాలుగో తరగతి పిల్ల కాబట్టి మీరు కూడా మనసులో ఏమీ పెట్టుకోకండి  🙏😊

 

రమ తెలుగు తేనియలు

 

 

కందము

దీపావళి కాంతులతో

పాపాలను దొలగజేయు పావన జననీ!

సోపానమునై జగతిని

కాపాడుము సిరులతల్లి కల్పలతికవై

 

మహేశ్ ముత్యాల తెలుగు తేనియలు

 

 

మీ కన్నుల ప్రమిదలలో

ఆశలు దీపాలుగా

మీ సాధనమార్గం లో

ఆశయాలు కాంతులుగా

వెలిగించేందుకు వచ్చిందీ దీపావళి

రేపటి మీ విజయాలకు నిలువెత్తు రూపావళి!

 

రాంమోహన్,  నిజామాబాద్ తెలుగు తేనియలు

 

 

 

లక్ష్మీ సరస్వతుల కటాక్షం సొంతమై

అజ్ఞానపు తిమిరం అంతమై..

ఆత్మీయతా ప్రమిదలో

అనుభవాల తైలంతో

మీ కలమనే వత్తి నుండి

వెలిగిన కవితా దీపాలు..

కమనీయ కాంతులతో

పఠితల హృదయాకాశంలో

వెలుగులను విరజిమ్మాలని..

 ఆనంద దీపావళి

సంబరాల శోభావళిగా

సుసంపన్నం కావాలని

మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తూ..

ఆత్మీయ శుభాకాంక్షలతో...

చల్లా  దేవిక తెలుగు తేనియలు

 

 

 

కరోనా తో

 

కరోనాతో కష్టకాలమొచ్చే........

పండగలకు శలవులొచ్చే............

పూట గడవటమే కష్టమాయే..............

పండగలన్నీ ఒకయెత్తు ఆయే......

దీపావళి పండుగ విభిన్నమాయే....

టపాసులు మతాబులు ఖర్చు కదా.....................

పిల్లలు సరదా పెద్దల తీర్చాలి కదా...........

ఉన్నోడి సరదా ఆకాశంలో హరివిల్లు..................

లేనోడి ఆసరా అవని పై తిరగల్లు.............

నోటిలోకి నాలుగు ముద్దలు లేవురా...............

ఇంటిలోన సరుకులు నిండుకున్నవిరా.................

మధ్యతరగతి జీవితాలు ఇంతేనురా

మధ్యలోనే కడతేరునురా !

 

కోవూరి తెలుగు తేనియలు

 

 

 

రచయిత మనోగతం:

మానవతకు మూర్ఖత్వానికి మధ్య ఊగిసలాడే మనిషి మనుగడ ఈనాటిదికాదుఎన్నోనాగరికతలు ఒక వెలుగు వెలిగి అంతరించడానికి నాడు ప్రక్రుతి వైపరీత్యాలే కాకుండా మానవత్వం వెర్రితలలు వెయ్యడముకూడా ఒక కారణమేఎప్పడో అంతరించిన నాగరికల సంగతి పెరుమాళ్ళ కెరుక కానీనేడు కూడా ప్రమాద భరితమయినవిఫలమయిన ప్రదేశాలు మరియు దేశాల స్థితిగతులు చూస్తేఅక్కడ ఉండేది కూడా మనలాంటి సాధారణ పౌరులేకాకపొతే తేడా అల్లా తమ కనులముందే కుప్పకూలుతున్న సామాజికమరియు నైతిక మరియు రాజకీయ పతనాలను జాతిమతవర్ణలింగ తదితర కోణాలలో చిట్టచివరి వరకు సినిమాలు చూస్తూ మేధావులు మెదడుని పక్కన పెట్టటమేమోనని నా అనుమానంఅందుకే మనిషి మెదడుఫై మంచు పొరలులా కమ్ముకొంటున్న  ఇజాలు మధ్య మరుగవుతున్న నిజాన్వేషణ కోసం ఒక చిరు ప్రయత్నం. 

 

తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి

 


 

కవితా స్రవంతి

ఏది నిజం

తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి

 

నీదే ఇజం  నాదే ఇజం    ఏది నిజం?

 ఇజాల మధ్య   నలిగేదే నిజం

 

మనుషుల్లో పోయిన మానవత్వం

జనాల కొచ్చిన జడత్వం

తంత్రాలతో కుతంత్రం

వ్యాకోచిస్తున్న సంకుచితత్వం

 

సుత్తి కొడవలి  నెత్తిన టోపీ

ఖాకి నిక్కరు  చేతిన లాఠీ

బొడ్లో కత్తి  బుగ్గన గాటు

మెడలో మాల  చేతిన శంఖం

చంకన గ్రంధం  వక్తలు ప్రవక్తలు

ఇజాలు వేరట  నిజాలు వేరట

వారిదో ఇజం  వీరిదో ఇజం

ఏది నిజం?   ఇజాల మధ్య

నలిగేదే నిజం

 

మసిదు మాటున నక్కే ముష్కరులు

గుడి నీడన చేరిన గాడ్సేలు

చర్చి చావిట్లో చైల్డ్ యభ్యుసర్స్

అడవుల్లో అతివాదులు

మన మధ్య మితవాదులు

ఎవరివాదనలు వారివి

నిజవాదం నేడో వివాదం

నీదే ఇజం   నాదే ఇజం

ఏది నిజం?   ఇజాల మధ్య

నలిగేదే నిజం

 

ఇజాల నీడలో  నిజాలు దాగవు

నిజాల వెలుగులో  ఇజాలు ఇమడవు

నిజాన్ని చూడలేని అంధులు

సాటి మనిషిలో శత్రువుని చూడగా

మానవత్వం ఎండమావే

మనుషులంతా ఒక్కటనే మిద్య

మన మద్య అద్దంలో వెక్కిరించదా

మాటలు రాని మేధావులు   చేతకాని చవటాయిలు

ఉగ్రవాదానికి వీరే   ఉత్సవ విగ్రహాలు

మానవత్వానికి మచ్చలు

ఆలోచించలేని  ఆనాగరికులు

నాగరికతకు జాడ్యాలు

 

నిజాలు మరచి  ఇజాలకోసం

కుతుకలు కోసే  కసాయి మనుషులు

పలికే పలుకులు  విష తుంపరులు

చేసి పనులు  రాక్షస క్రీడలు

జాతులు పేరిట  మతాలూ పేరిట

భాషలు పేర  యాసలు పేర

ఇజాల నీడలో  నిజాలు మరచి

మృగాల మాదిరి  మొరిగే వాదం

అతివాదం  మితవాదం

ఆదో ఇజం   ఇదో ఇజం   ఏది నిజం

 

తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి  తెలుగు తేనియలు

 

 

నా బాల్య జ్ఞాపకాలు.

 

దీపావళి మతాబులుకొంచెం పెద్దదిరాయటం సరిగా రాదుచిన్న ప్రయత్నం

 

దీపావళి 10 రోజుల ముందే హడావుడి మొదలునాన్నా మతాబులు ఎప్పుడు చేద్దాంచేద్దాంలేరాఇంకా టైం ఉన్నది కదా అని నాన్న సమాధానం

 దిరోజులేదా అని మెల్లగా సణగటంసరే వెళ్లి మోహనరావు గారి దగ్గర పాత వీక్లీ పుస్తకాలు పట్రా పో అని నాన్న చెప్పటం తోటే సందడి ప్రారంభంఒక కిలో వీక్లీ పుస్తకాలు తెమ్మంటే రెండు కిలోలు తెచ్చి పని మొదలు పెట్టడంఅంటే మతాబు కర్రలతో గొట్టాలు చుట్టి అమ్మ ఉడకబెట్టిచ్చిన మైదా పిండి తో అంటించి జాగ్రత్తగా ఎండలో ఆరబెట్టడంపొరబాటున నాలుగు చినుకులు పడితే అవి తడవకుండా హంగామాచెప్ప నలవి కాదు గానీ దీపావళి సందడి మొదలు.

 

ఇక రెండవ ఘట్టం మతాబుల మందు తెచ్చి కలపడంనాన్న మందు ఎప్పుడు తెద్దాంమళ్ళీ సణుగుడునే తెస్తాలే రా నాన్న సమాధానంనిన్న కూడా మీరు మర్చిపోయారని గుర్తుచేయ్యడంసర్లే రా  రోజు తెద్దాం అని నాన్న చెప్పడంస్కూల్ నుండి వచ్చి అమ్మా మతాబుల మందు తెచ్చారా నాన్న అని అడిగితే ఇంకా లేదురా అని అమ్మ సమాధానంనాన్న ఎప్పుడూ ఇంతే అని అమ్మ దగ్గర ఏడుపుసర్లే నాన్న వచ్చాక చెప్తాలే అని అమ్మ ఓదార్పుఇక ఎదురు చూపులుకాళీ చేతులతో నాన్న రావటం తో మళ్ళీ టెన్షన్మెల్లగా మళ్ళీ నాన్నా ఇంకా వారం కూడా లేదుమళ్ళీ మతాబులు ఎండక పోతే బాగా కాలవుపువ్వులు బాగా పడవు అని చెప్పటంనాకు తెలుసులేరా నాన్న సమాధానంమళ్ళీ నాన్న పిలిచి రెడ్డిగారి రాతిండి కొట్టు తెలుసా అని అడిగితే  తెలుసు అక్కడే కదా మనం మతాబులు మందు కొనేది అని నా సమాధానంసరే వెళ్లి నేను చెప్పిన లిస్ట్ ప్రకారం సామాను పట్రా డబ్బులు నేనిస్తానని చెప్పుసరే కానీ నాకిస్తాడా అని సందేహంనాపేరు చెప్పు ఇస్తారులే అని నాన్న సమాధానంనాన్న లిస్ట్ చెప్పు అని పెన్ను పేపరు తెచ్చి రాయటంగండకంరజనుసూరే కారం అనగానే నవ్వటంఇక్కడ నవ్వటం ఎందుకో తెలుసా మా ఇంటి పేరు సూరేలిస్ట్ అంతా చూడమని నాన్న కిస్తేలిస్ట్ చూడకుండా ఏంట్రా  దస్తూరి అంటేలిస్ట్ చూడునాన్నకంగారులో

 వ్రాసానులే అని సమాధానంఅమ్మ నడిగి సంచి తీసుకొని రెడ్డిగారి కొట్టుకు పరుగెత్తడం.

 

రెడ్డి గారి కొట్టుదగ్గర చాలా మంది జనం ఉండటం చూసి నాకు ఇస్తాడా లేదా అని సందేహంనెమ్మదిగా రెడ్డిగారి దగ్గరికి వెళ్లి లిస్ట్ లో సామాను ఇవ్వండి అనిడబ్బులు నాన్న ఇస్తారు అంటేఎవరబ్బాయివి నువ్వు అని రెడ్డిగారడిగితే సత్యం గారబ్బాయినండీ అంటే సరే అని లిస్టు ప్రకారం సరుకులు సంచి లో సర్ది జాగ్రత్తగా తీసుకెళ్లు బాబు అంటే సరే అని రయ్యిన ఇంటికి చేరటం.

నాన్నా తెచ్చాను సామాను అంటే నాన్న చూసి అన్ని జాగ్రత్తగా ఎండ బెట్టు రేపు చూద్దాం అంటే మళ్ళీ రే పా అంటేఅవి ఎండితే బాగా కాల్తాయిరా అంటే సరే అని సర్దుబాటు.

 

మర్నాడు వీడి సణుగుడు తట్టుకో లేకపోతున్నానురాత్రికి మందు కలిపిస్తాలే  అని అమ్మ తో చెపుతూంటే ముసి ముసిగా నవ్వటంసాయంత్రం నాన్న వచ్చేప్పటికి పెద్ద రాతిండి బేసిన్ మతాబులు కూర్చే కర్రలుఎండిన గొట్టాలుమతాబులు సామానుతో రెడీ గా ఉండటంనాన్న వస్తున్నాడా లేదా అని వీధి గుమ్మం వైపు చూస్తూ ఉండటందూరంగా నాన్న కనపడగానే కళ్ళల్లో మతాబులుహమ్మయ్య అని ఉత్సాహం.

 

నాన్న తెచ్చిన సామాన్లు సరి చూసిఒక్కొక్కటి గా కలుపుతూ ఉంటే జాగ్రత్తగా పరిశీలించడంఅన్నీ అయ్యాక కొన్ని మతాబులు మందు కూరి నాన్న చూపిస్తేనాన్న బాగా కాల్తాయా అని ప్రశ్నిస్తేకాల్తాయి లేరా అంటేఒకటి చూడనా అని నాన్న సరే అంటే ఒకటి కాల్చి నాన్న బాగున్నాయి అని మతాబులు కూరటంలో తలదూర్చడంకొన్ని కూర్చిన తరువాత నాన్న చూసి లూజ్గా ఉన్నాయి గట్టిగా కూర్చండి అంటేగట్టిగా కూరిస్తే మందు ఎక్కువ పడుతూందితక్కువ మతాబులోస్తాయి అంటే నాన్న నవ్వి అలా అయితే బాగా కాలవురా అంటే జ్ఞానోదయం అయ్యి గట్టిగా కూర్చడంఎంత టైం అయినా పూర్తి అయ్యేవరకు నిద్ర రాదు ఎందుకోరోజు పుస్తకం పట్టుకొంటే వచ్చే నిద్ర ఈరోజు రాకపోటం ఎందుకోఅన్నీ అయ్యాక లెక్కపెట్టి నిద్ర పోవడంమర్నాడు లేచి ఎండలో పెట్టిఅమ్మ వర్షం వస్తుందేమో చూస్తూ ఉండని జాగ్రత్తలు చెప్పటంస్కూల్ కి వెళ్లి మిత్రులందరికీ అంతా పూసగుచినట్లు చెప్పటం.

రోజు ఒకటో రెండో కాల్చి కాలుతున్నాయా లేదా అని చూడటంనాన్న కలిపితే బాగా కాల్తాయని గట్టి నమ్మకంపక్కింటి పిల్లోడు తెచ్చిన మతాబులు సరిగా పూలు రావట్లేదంటేరజను తక్కువ కలిపారని నాన్న చెపితే ఓహో అని ఎదో అర్ధం అయినట్లు తలూపడం.

 

ఈలోపు  రాము అన్నయ్య  విజయవాడ  కిరాణా కొట్టు సామాన్లు కొనటానికి వెళితే విజయవాడ నుండి నాలుగు దీపావళి సామాన్లు తేరా అంటే అన్నయ్య రాత్రికి తెచ్చి అట్ట పెట్టెలో తెచ్చి ఇంట్లో పెట్టడంతెల్లారి అన్నయ్యని అడిగి సీక్రెట్గా చూడటంఎందుకంటే అన్నయ్య కొంచెం ఎక్కువే తెచ్చాడునాన్న తిడతాడాని భయంఇక దీపావళి కోసం ఎదురు చూపులు.

 

దీపావళి ముందు రోజు నుంచి పనివాళ్లకుచాకలి వాళ్లకువీధి ఊడ్చే వాళ్లకు కొన్ని మతాబులిస్తూంటే ఎందుకు అన్ని ఇచ్చేస్తున్నారంటేఅందరూ పండుగ  చేసుకోవాలని అమ్మ చెపితే అర్ధం కాకమాకు తక్కువైపోతున్నాయని ఫీల్ అవ్వటంమళ్ళీ అంతలోనే సర్దుకోడంముందు రోజు నరకచతుర్ధి కొన్ని కాల్చండి అని చెబితే పొద్దున్నే మొదలెట్టడం.

 

అసలు సందడి సాయంత్రం మొదలుఅమ్మతో కలిసి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లిపూజ చేసి కొన్ని మతాబులు ఇత్యాదులు కాల్చి పండుగ సంబరాలు మొదలుఅన్నయ్య గారి పిల్లలుమేము అందరం సందడే సందడిఒకరి వెనుక ఒకరు కాలుస్తూ సందడే సందడి హడావుడిలో అన్న గారి కొడుకుబుడ్డోడు అందరినీ చూసి ఒక టపాకాయ ఇంట్లోనే కాల్చడంఅందరం అదిరి పోవటం.  ఎప్పుడో రాత్రికి కొంచెం తిని అలసి నిద్రించడం.

 

 మధుర జ్ఞాపకాలు మళ్లీ రావాలని ఆశకొన్ని సాధ్యం పడవు (అమ్మ నాన్న ఇప్పుడు లేరుగా 😢కనీసం ఊహల్లో సాధ్యమే కదా.

 

వెంకటప్పైయహ సూరే తెలుగు తేనియలు

 

 

 

ఉత్పలమాల

 

కోపము జూపుచున్ జనుల కొంపలు ముంచెడి రోగమొక్కటిన్

శాపము బెట్టినట్టులిట శాంతిని మొత్తము పారద్రోలగన్

పాపమువచ్చు జీతమున వందలు వేలుగ కోత వేయగన్

దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

 

కందము

మంచికెపుడు విజయమ్మని

యంచితముగ జాటు పర్వమరుదెంచంగా

సంచితముగ దీపావళి

నెంచి సతము స్వాగతింతు రెలమిని జనులే!

 

కందము

డెందమలర జేయునటుల

నందముగా కొల్వుదీర నమవస దినమున్

సుందర దీపావళులే;

సందడి జేయుచు జనులిల సంతస మొందున్!

 

కందము

విమల మనమ్ము నొకతరిన్

తిమిరమది యలముకొనంగ తేజము దొలగున్;

అమవస నిశిని వెలుగు లీ

ను మహిత కాంతు లిరులనిట నురుమాడవలెన్!

 

కందము

కాకర పూవొత్తుల వెలు

గే కమనీయతను గూర్చ నెలమి నిశీథిన్

ఆకరమై చిరునగవులు

శ్రీకరమగు మోము నెపుడు చిందాడవలెన్!

 

కందము

తారాజువ్వల వోలెన్

మారాముళ్లు దొలగంగ మగుడక నెగయన్

తోరపు స్ఫూర్తిని బంచుచు

ధీరోదాత్తులుగ సతము దీపించ  వలెన్!

 

కందము

దివ్యమగు దీప శోభన్

సవ్యమ్ముగ మానసమున చక్కని తలపుల్

నవ్యముగా దీపించగ

భవ్యముగా జీవనమ్ము భాసింపవలెన్!

 

చల్లా దేవిక తెలుగు తేనియలు




 

 

దీప గర్భ రథ చిత్ర బంధ సీసము    శ్రీ హరి ప్రార్థన

కపి!విధి!ప్రణవము!క్రతువు!మరుని పిత! వనమాలి!లక్శ్మీశ !వర్ధమాన!

కేశవా!కుస్తుభా!గిరిధరా!నంద తనయ!దీప్తి వితరణా!నాగ శయన

పార్ధ సారధి! చక్రి!పావనా! శ్రీధరా! మురళీధరా! సౌరి! విరజ!శుధ్ధ 

వదన!హరీ!హరీ!భానువా!శేషి!షి!కాంతిదాత!అదోక్షజా!నగధర!!హలధర       

అక్షధర!తోయనాభ!విశ్వాత్మ! పూజ

నీయ!ఋతధామ!త్రికపాత్తు!నీరజాక్ష

పద్మనాభ !సదాగతి!పాండవహిత

పాధి!మల్లారి !కరటి జీవ తెగు దారి

 

చింత బాపి యివ్వవలయు శాంతి యెపుడు

కరుణ జూపి యీ  దీనుని కాచ వలయు

గరుడ వాహనా  మ్రొక్కితి శరణు యనుచు

పూజ లుసలిపి వేడెనీ  పూసపాటి

 

పద్యము చదువు విధానము

 

పైన  ఉన్న () తో మొదలు పెట్టలి   ( కపి)అని చదివి   ( విధి) అని మరల క్రిందకు దిగి  తర్వాత (ప్రణవము) అని కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి  చదివి    ఆఖరున  తెగు దారి  తో  రధములో  పూర్తి చేయాలి   అప్పుడు సీస పద్యము ఎత్తు గీతి పూర్తి అవుతుంది     తర్వాత  ఇంకొక తేట గీతి దీపములో ఇమడ్చ బదినది. అది ( చింత బాపి )అను పాదము దీపము కుడి ప్రక్క (మనకు ఎడమ ప్రక్క)  తర్వాత   (కరుణ  జూపి)  జూపి)అను  పాదము  కుడి ప్రక్క  ఉంటాయి  ప్రమిదలో రెండు  పాదములు ఉన్నాయి.  దీనిలో విశేషము  రధములోని   మధ్య  పసుపు  పచ్చ గడిలో  (కవివరులకు దీపావళీ  శుభాకాంక్షలతో   పూసపాటి) అను  వాక్యము బంధించ బడినది.

 

చిత్ర బంధ కవి  పూసపాటి | తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...