21, నవంబర్ 2020, శనివారం

దత్తపది - 56, మన, వన, ధన, జన - సోమవారము 16 11 2020

 

దత్తపది -  56,

 మన, వన, ధన, జన


 తరువోజ

మువ్వాడి యీటెతో మోహము ద్రెంచి మోక్షము కలిగించు ముక్కంటి సామి!

మువ్వన్నెవిల్లు సమ్ముదముగ నిచ్చి మోమునందు నగవు ముమ్మరించు హర

నివ్వటిల్లెడి గొప్ప నిగ్రహ శక్తి  నేర్పు లిచ్చి నిలుపు నీలలోహితుడ

సవ్వాయి జీవిత సారము తెల్పి జ్ఞాన సంపద లిమ్ము చంద్రశేఖరుడ

 

మువ్వాడి యీటె= త్రిశూలం,   మువ్వన్నెవిల్లు= ఇంద్రధనుస్సు

నివ్వటిల్లు= అతిశయం/ గొప్ప,   సవ్వాయి = బంగారం

 

వెంకట్.సి హెచ్ | తెలుగు తేనియలు

 

 

మనసు పాడగ పాటను మనువు ఆడె

భవన   ములు, లేని నర్జును  భర్త కాగ

ధనము వలెనను నిలిచిన ధన్య జీవి

యజ్ఞ మందున పుట్టిన యశము ఆమె

జనము లెల్లరు మెచ్చగ జనని ఆమె

 

సాయిలక్ష్మి | తెలుగు తేనియలు

 


 

వచన కవిత,

 

జన వాసము లేని కీకారణ్యము న,

వనవాసము చేయు సమయమున,

మనశాంతి కై అర్జునుడు తీర్ధ యాత్ర సలుప,

సాధనతో అస్త్రవిద్య యందు నిపుణత బడసె....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి | తెలుగు తేనియలు

 


 

తొలిపూజ చేశానయ్య శివయ్య.

తొలిచూపు చూడగ రావయ్యా....::2::

 

కేదారి పూజ చేస్తిని శివయ్య.

నా అస్తిత్వం శుద్ధి చేయగ రావయ్యా....::2::

 

ఏ నోము నోచినా... ఏ పూజ చేసిన...

కార్తీక పూజలు... మండల దీక్షలు...

గౌరమ్మకు తులసి పూజ చేసాకే.

తొలిపూజ చేశానయ్య శివయ్య.

తొలిచూపు చూడగ రావయ్యా....

 

పున్నమి కాంతి వరకు శివయ్య.

నా పుణ్యాలు లెక్కింతువు రావయ్యా...

తొలిచూపు చూడగ రావయ్యా....

 

జలధార జూటము... గంగమ్మ స్నానము...

నా అపరాధము మన్నించగా రావయ్యా

నా పుణ్యాలు లెక్కింతువా రావయ్యా...

తొలిచూపు చూడగ రావయ్యా....

తొలిపూజ చేశానయ్య శివయ్య.

 

ఓం కార రూపము... పంచాక్షరీ మంత్రము...

నీ నామమే స్మరియుంచును శివయ్య

తొలిచూపు చూడగ రావయ్యా....

తొలిపూజ చేశానయ్య శివయ్య.

తొలిచూపు చూడగ రావయ్యా....

 

 

విభూది ధారణ... నీ రుద్ర పారాయణ...

మాసమంత పఠియించగా నేనయ్యా....

తొలిపూజ చేశానయ్య శివయ్య.

తొలిచూపు చూడగ రావయ్యా....

తొలిపూజ చేశానయ్య శివయ్య.

తొలిచూపు చూడగ రావయ్యా....

తొలిపూజ చేశానయ్య శివయ్య.!

సూర్య తాడిపూడి  | తెలుగు తేనియలు

 

 

ఉత్పలమాల

వేమన నీతులన్ వినగ వేదము రీతిగ దెల్పెనంతయున్

నీమము లన్నియున్ దెలిపె నిశ్చల భావన పొందు బర్చుచున్

నీమది నిష్టగా దలచి నింధన మౌనది నెల్లవేళలన్

కోమల మైన నట్టి పలు కొండొక రీతులు మెచ్చె నీ జనుల్

 

చంపకమాల

 

మనసున యున్న ప్రేమలను మాటల రూపున దెల్పువారలన్

ఘనముగ తోటి వారలకు గౌరవ భావన నిల్పుచున్ సదా

విన దగు బోధనల్ దెలిపి విశ్వము మెచ్చెడి మార్పు దెచ్చుచున్

జనులకు నెల్ల వేళలను సంతస మొందుచు మోకరిల్లుదున్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి  | తెలుగు తేనియలు

 


 

రామాయణార్థంలో పూరణ

 

భు(వన)మోహన సౌందర్య పుణ్య రాశి

(జన)న పరమార్థ నిర్మాణ సాధకుండు

వసు(ధ న)తిధర్మ పరునిగా వాసికెక్కె

రామ రా(మన) రక్షించు రాముడతడు

 

ఆదిభట్ల సత్యనారాయణ  | తెలుగు తేనియలు

 

 

మన ధనం !

మనమందరము వనమున

వ్యాయామము చేయుచు అచటనే

కాయ కూరలు, ఆకు కూరలు  పండించినచో 

 

వాటితో ఆరోగ్యము పొందుచూ

వైద్యులు , వైద్యశాలల కొరకు

ధన వ్యయమును తగ్గించ వచ్చు .

జన సమూహము కూడా

గమనించి అనుసరించుదురు కూడా.

 

 

 

 శ్రీరాముడు తండ్రి మాట

మనమున దాచుకొని ,

ధన సంపదలను

జన సమూహములనూ

వదిలి వనముల కేగిన

విధముగా, విద్యార్థులు

 

తమ తల్లిదండ్రుల

ఆశయాలను , ఆశలను

మనసున ఉంచుకొనుచూ

పర విషయములను

దూరము చేయుచూ

విద్య వినయ విజ్ఞాన

సంప్రదాయార్జనలో

నిమగ్నమవలె!

 

జి మురళీ మోహన్ రావు  | తెలుగు తేనియలు

 


 

కందము

మనమున జనించు భావము

జన హృదయాల గదలించి జాగృత పరచన్

ధనమాశించక కవులు క

వన సంపద నమలరీతి పనిచిన ధన్యుల్

 

వాణిశ్రీ నైనాల  | తెలుగు తేనియలు

 

 

తేటగీతి

జన కుడింటి పడతి తాను సంత సమున

వన మయూరి తీరుగ నాడి పాడె సీత

లలన మోములో యా ధన లక్ష్మి సిరులె

రమణి జానకి మన మున  రాము డుండె

 

మంజులము

 

జన మే మరచే విలువల్

ధన మోహములో శిలలై

మన మున్ వెరపే కరువై

వన ముల్ నరికే కఠినుల్

 

రమ  | తెలుగు తేనియలు

 


 

ఆటవెలది

 

కైక యాన మేర కౌసల్య సుతుడును

పురము నొదలి యేగె పుడమిజనని

వనమునందు జేరె వనవాసి సీతమ్మ

రామదరియె ధనము రమణి మనము

 

హేమలత  | తెలుగు తేనియలు

వనము =అడవిమనము =మనసు

 

 

 

అం(జన) సుతుడు గగనమందు నవిని‌ చూసి

(మన)సు లోనది ఫలమని యనుకొనుచు

ప(వన)వేగము తోడ నభస్సు కెగయ

క్రో(ధన)ము గల్గి యింద్రుడు కూల్చె నపుడు

 

ధనువు నెవ్వరు విరుచునో యనుచు  మ(ధన)

మును (మన)మున బడుచు సీత కనుచు నుండ

రం(జన)ముకల్గు రీతిలో రాఘవుండు

రాచ భ(వన)మున విరిచె రమ్య గతిని

 

ప(వన) సుతుడు దశముఖుని పడక టింట

చేరి  వీక్షణ చేసెగా స్త్రీ (జన)మును

నగ్న రమణుల కాంచి (మన)మున తలచె

 

శో(ధన)మున భాగమనుచు  చూచు చుంటి

తప్పు లేదుగా ననుచు ముదమును పొందె

 

పూసపాటి | తెలుగు తేనియలు

 

 


సర్వ లఘు తేటగీతి.

 

వనిన జనకజను గని పవన తనయుడు

సరళ వచనము బలికి దశశిరదనుజ

నిధనమునకు కపి, యనుజునిసహిత రఘు

వరగమన ముని జమగని పలికె హనుమ

 

సురే వెంకటప్పయ్య  | తెలుగు తేనియలు

 

 

ముద్ద బంతులు చూసిన ముగ్ద మోము

విరిసె, ముదితను గాంచిన విరులు ముడిచె

మోము, పూబోడి  చందము ముందు యంద.

ముతమ దేపాటి యనుచును ముదిత శిఖను

చేరి మిడిపడె తనదెపై చేయనుచును

 

మరో చిరు వచన ప్రయత్నం.

పదములు, పాదములు మూలధనం గా

తెలుగు వనమున పద్య సేద్యము చేయుచు

సుమనము తోడ పద్య కవితా సుమమములు పండించి

సాహిత్య సేవ జన రంజనముగా చేయు

తెలుగు కవి హాలికులకు వందనము.

 

సురే వెంకటప్పయ్య  | తెలుగు తేనియలు

 

 

దత్తపదికి  రామాయణార్థంలో

 

జనక పుత్రి తోడ జగతియందు కదిలి

రాముడేగె వనము రమణి తోను

మనసు నిల్పి గొల్వ మారుతి యెదనిల్చి

వరము లిచ్చు రామ వందనములు

 

 సి.హెచ్. రజిత, కరీంనగర్ | తెలుగు తేనియలు

 


 

కందం లో... కార్తీక వన భోజనము గుర్తొచ్చి...

 

మన మున శివునే దలచుచు

వన మున భోజనము కొరకు వచ్చెడు వారల్

ధన మును సైతము జూడక

జన రంజకమగు వసతికి జనెదరు జతగా.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి  | తెలుగు తేనియలు

 

 

చిరు కవిత

మన మందరము ధనమునకై వనములు కొట్టి భావితరాలకు ద్రోహము సేయక

జనులందరు జాప్యము వీడగ వనములు నాటిన మేలు కల్గునే..

 

అన్నపూర్ణ, ముంబాయి  | తెలుగు తేనియలు

 

 

మన వన ధన జన

జన రంజకంగా విరాజిల్లు మన రామాయణ

వన వాస కాండమున, పర్ణశాల యందు

పుడమి పై ప్రకృతితో మమేకమై విరాజిల్లు

ధరనిజను ధన మద అంధకారముతో అపహరించె రావణుడు

 

వి. వి. శ్రీనివాస్  | తెలుగు తేనియలు

 


 

వచన కవిత-

 బృందా వన మున మురళీధరుడు,

జగన్మోహన రాసలీలలాడినంత ,

త్రిభు వన వాస ముండు జీవులెల్ల,

మదిన్ పులకరించి పరవశించెలే.

 

శ్రీకృష్ణాం జన

ప్రభం జన మునన్,

రేపల్లె జనులెల్ల ఊగి తూగిరిలే,

ప్రభుని భక్తి జల్లులన్ తడిసిరిలే.

 

గోప గోపికలైన ముని 

 జన ముల,

 మన ము లెల్ల అహంభావం విడిచి,

ముక్తి సా ధన మున సఫలులైరిలే.

 

CA కె మల్లికార్జునరావు  | తెలుగు తేనియలు

 


 

 

18-11-2020  ఆదివారం నాటి ప్రహేళిక

 గుఱ్ఱం జాషువా గారి రచనలు

 

సమాధానాలు

 

1️ఈ క్రింది పద్యము ఏ కావ్య ఖండిక లోనిది? సందర్భం ఏమిటి

 

జీవరత్నంబు వగు  నిన్ను స్వీకరించి

వట్టి రతనాలు నా యింట వదిలినాడు

యిచ్చి బులిపించి క్రమ్మర బుచ్చుకొనుట

యేటి కలవాటు జేసెనో యీశ్వరుండు

 

జవాబు:

ముంటాజామహల్ కావ్యం లోనిది.

ముంతాజ్ బేగం మరణంతో షాజహాన్ విలపిస్తూ జీవరత్నం వంటి నా సతిని తీసుకొని నా యింటిలో వట్టి రత్నాలు వదిలినావు. ఓ ఈశ్వరా యిచ్చి బులిపించి వెంటనే పుచ్చుకొనుట ఎందుకు అలవాటు చేశావో అని అంటున్న సందర్భం లోని పద్యము..

 

2️ఈ క్రింది పద్యము పూరించండి

రాజు మరణించె నొక తార రాలిపోయె

 

జవాబు

రాజు మరణించె నొక తార రాలిపోయె

కవియు మరణించె నొక తార గగనమెక్కె

రాజు జీవించె రాతి విగ్రహములందు

సుకవి జీవించె ప్రజల నాలుకలయందు

జాషువా గారి కొత్తలోకం ఖండిక లో వ్యత్యయము లోని కవి గొప్పతనాన్ని తెలుపు పద్యము..

 

3️. జాషువా గారు గబ్బిలం ఖండ కావ్యమును ఎవరికి అంకితం ఇచ్చారు?

 

జవాబు.

ఆనాటి గుంటూరు జిల్లా బోర్డు ప్రసిడెంట్, దేశభక్తులు, కళాభి మాని అయిన శ్రీ

కల్లూరి చంద్రమౌళి చౌదరి గారికి గబ్బిలము కావ్యాన్ని జాషువా గారు అంకిత మిచ్చారు.

 

4️ఈ క్రింది పద్యము ఏ ఖండకావ్యం లోనిది

 

ధర్మసంస్థాప నార్థంబు ధరణి మీద

నవతరించె దననె నబ్జభవుని తండ్రి

మునుపు జన్మించి నెత్తి కెత్తినది లేదు

నేడు జన్మింపకున్న మున్గినది లేదు

 

 

జవాబు.

గబ్బిలము రెండవ భాగము లోనిది

పంచముని బాధలు తలచుకుంటూ ధర్మ స్థాపన కొరకు దరణిలో పుడతానని విష్ణువు అన్న మాటలను వ్యంగ్యంగా ఈ పద్యములో చూపు సందర్ఛం.

 

5️జాషువా గారు రచించిన ప్రఖ్యాత పౌరాణిక నాటకము పేరేమిటి?

 

జవాబు.

రుక్మిణీ కల్యాణము

 

6️ఈ క్రింది పద్యము ఏ ఖండ కావ్యం లోనిది ? ఎవరు ఎవరితో ఇలా అంటున్నారు?

 

" క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప

సాధ్యమే మానవున కిలాచక్ర మందు?

దాటి పోయిన యుగముల నాటి చరిత

మరల బుట్టింప గవియు సమర్థు డగును."

 

జవాబు:

ఫిరదౌసి ఖండ కావ్యం లోనిది

గజని సుల్తాన్ తన చరిత్ర ను వ్రాయమని  ఫిరదౌసి కు చెపుతూ కవి గొప్పతనాన్ని తెలుపు సందర్భం

 

 

 

7️ ముంటాజమహల్ ఖండ కావ్యాన్ని జాషువా గారు ఎవరికి అంకితం ఇచ్చారు?

 

జవాబు:

తన జనయిత్రికి (తల్లి లింగమ్మ గారికి)

 

8. హిందూ ముస్లిం మైత్రి ఆధారంగా చేసుకుని జాషువా గారు రచించిన నాటకము పేరేమిటి?

 

జవాబు:

వీరాబాయి (1926)

ఉదయసింహుని హృదయేశ్వరి వీరాబాయి శౌర్య ప్రతాపములు, కులమత ద్వేష దూషితుడు కాని అక్బరు చక్రవర్తి గుణ గ్రహణ పారీణత, మొగలు రాజును వివాహ మాడి తన సర్వ సమతా పవిత్రాశయాన్ని ప్రకటించిన మధురా దేవి శీలము నాటకంలో చూపడం జరుగుతుంది.

 

9. జాషువా గారు ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు?

 

జవాబు:

క్రీస్తు చరిత్ర

 

 

 

 

10. ఈ పద్య పాదము ఏ ఖండ కావ్యం లోనిది..

ఇట నస్ప్రశ్యత సంచరించుటకు దావే లేదు; విశ్వంభరా

 

జవాబు:

శ్మశానవాటిక కావ్య ఖండిక లోనిది

 

ఇట నస్ప్రశ్యత సంచరించుటకు దావే లేదు; విశ్వంభరా

నటనంబున్ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు

త్కటపుం బెబ్బులి తోడ మేక నొక ప్రక్కన జేర్చి జోకొట్టి యూ

రట గల్పించు నభేదభావమును, ధర్మం బిందు గారాడెడిన్

 ******

 

కరో నా విషయం లో..

జనం అంటే భయం వేస్తోంది

మనమే అని తెలిసినా.....

వనవాసమే నయమనిపిస్తోంది

ధనము వాడినా మందు వచ్చేదాకా...

ఉష | తెలుగు తేనియలు

 

 

1. తేటగీతి

 

భవుని నామము శ్రేయము, పావనమగు,

స్మరణ  జేసినంత వెతలు సంతరించు,

సతము మననము జేయగన్ శాంతి నొందు

మనము, పాపములు నిధనమగును, సర్వ

జగతి జోతలిడు జననీ జనకులకును

 

2. గేయ కవిత

 

అర్ధనారీశ్వరం, ఆనందదాయకం

అమితశుభదాయకం, మోక్షప్రదాయకం

 

తనువున సగమై మనసున నెలవై

మనువు, మనికి   ఏకము కాగా

భువనమోహనమై రాగరంజితమైన

అర్ధనారీశ్వరం, ఆనందదాయకం

 

మలి సంజ వేళలో సంజ కెంజాయలో

నిండు చందురుడే  నిక్కి చూడగా

సుజన ప్రమోదమై సురజన ఆహ్లాదమై

అర్ధనారీశ్వరం ఆనందదాయకం

 

అవళూరు సీత  | తెలుగు తేనియలు

 

 

అధిక ధనము నందు ఆశ వదులుకొని

మన వారెవరో తెలిసి మసలు కొని

తన మది లో పరాత్మను నిలుపుకొని

పరమ పావనమైన స్థితికి చేరుకోవాలి

 

మంజూష  ఇందూర్ (నిజామాబాద్)  | తెలుగు తేనియలు

 

మనమందున పవనసుతుని

ధ్యానించిననొక్కమారు భయముల్ తొలగు

కైమోడ్చి ఆతని నామ సాధన సేయ

జనమందరికీ మోక్షము కలుగు

 

విష్ణుప్రియ  | తెలుగు తేనియలు

 

కందము 

మనమున దోసపు సంశో

ధనము శివశివయనగా సతము జరుగుచు; పా

వనముగ జపించు తరి స

జ్జన మనముల సంభృతముగ శాంతినిడుగదా!

 

చల్లా దేవిక  | తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...