28, నవంబర్ 2020, శనివారం

దత్తపది - 58 “ మంకు జంకు శంకు బొంకు” 23.11,2020

 


శ్రీ విఘ్నేశ్వర నమః          శ్రీ సరస్వతే నమః            శ్రీ గురుభ్యోనమః

శుభోదయం

23.11.2020, నవంబర్, సోమవారము


తెలుగు తేనియలు

 

దత్తపది - 58


మంకు జంకు శంకు బొంకు”

 

నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవనములు అందించగలరు...


నానీలు, మంజులము, ఉత్సుకము, తోటకము, భద్రకము, ముత్యాల సరాలు కూడా రాసినచో మిక్కిలి సంతోషము...

 

 

 కార్తీక సోమవార సందర్భంగా  కేదారేశ్వరుని ఆశీస్సులు కలుగుగాక. . .

 

తరువోజ

కాలకంఠుడ! మహాకాలుడా! స్వామి!  కార్తీక మాసపు కైంకర్యములివె

నీలకంఠుడ! శివా! నీలలోహితుడ!  నిత్యపూజ లివియే నెయ్యము నిమ్ము

ఫాలనేత్రుడ! వృషధ్వజుడా! పినాకి!  పరచరించుతుమయ్య ప్రాశస్త్య మిమ్ము

శూలపాణి! హరుడా! సూక్ష్మాత్మ! మాకు  క్షోభలు తొలగించి శోభ నొసంగు.

 

వెంకట్.సిహెచ్

 

అన్నీఉన్న నీకు ఏమివ్వగలను?

 

మహాదేవా అభిషేకానికి నీళ్ళు

తీసుకుని గుడిమెట్లు ఎక్కాను.

పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది అని మర్చిపోయాను

 

మహాదేవా! హలాహలం వేడితో

నువ్వు తపిస్తున్నావని,

మంచి గంధలేపనం వేద్దాం అనుకున్నాను.

చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే, నీ వాసం

అయితే, నీ శిరసే శశాంకుడి నివాసం అని, మర్చిపోయాను.

 

మహాదేవా! మణిమాణిక్యాలతో

నిన్ను పూజిద్దాం అనుకున్నాను.

మణిరాజు అయిన వాసుకి,

నీ మెడలో కంఠాభరణం అని,

మర్చిపోయాను.

 

కందము

శుభకరముగ పరమేశా

అభిషేకమె సేయగా రయమున జలమ్మున్

విభవము తోడను దెచ్చితి

ని భవద్భక్తుండనై తనియగాన్మదియే!

 

కందము

సురగంగయె తా ప్రీతిగ

శిరమున కొలువై యనయము శీతల జలమున్

దొరకొని యభిషేకించెడి

కరణిని నే మరపుగంటి గద పరమేశా!

 

కందము

హాలాహలంబె దాచగ

తాలిమి తోడను భరించి తాపమె పరమే

శా! లోకంబుల గాచుచు

మేలొన గూర్చితివి గాదె మెయికొని నీవే!

కందము

నీలపు గళమున దాపము

మేలుగ దొలగంగ ; మేలిమిగ గంధమ్మున్

లాలస తోడను దెచ్చితి

నే లేపనముగను బూయ నిర్మల మతినై !

 

కందము

చల్లని హిమగిరి శిఖర

మ్మల్లదియే నీదు వాసమని; శశియే తా

నల్లన శిరమున వెన్నెల

వెల్లిని కురిపించు నంచు వెస మరచితినే!

 

కందము

సౌజన్యము నీయమనుచు

నోజను గూర్చెద వటంచు నోరిమి తోడన్

పూజను సేయగ నెంచితి

తేజోమయ మణుల దెచ్చి తిరమగు భక్తిన్!

 

కందము

భ్రాజిత మణులొసగెడు ఫణి

రాజల నీ గళము నందు రాజిల్లు విధిన్

నే జవమునమ్మరపుగని

పూజింపగ నెంచితి గద పూనిక తోడన్!

చల్లా దేవిక.

 

 

భద్రకము

 మంకుగా పలుక బోకుమా

జంకులేకనిల సాగిపో

శంకులో జలము తీర్ధమే

బొంకురాదనుట చోద్యమే

రమ, కంకిపాడు.

 

 

(బొంకు)లపలుకుల్ కావు ని (జం,కు)మార

తొలుత వనవాస నియ(మం కు)దురగ నొనర్చి

పిదప నఙ్ఞాత వాసము విరటు పురము

నందొనర్చిరి పాండవుల్, సందియమ్ము

లేదు ,(శంకు)నాదముతో కిరీటి వచ్చు

చుండెనని భీష్ముడు పలికె సూతు గాంచి

 

 

వచన కవిత,

 

మంకు పట్టు పట్టె కైక తన వరములకై,

బొంకు లేకపోయి దశరధుడు  ధర్మము తప్పక,

శంకు చెప్పడాయే రాముడు పితృ వాక్య పాలకుడై,

జంకు లేక వైదేహి తన పతి ననుసరించే అడవులకు.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

తేట గీతి లో..

 జంకు లేకను బొంకుచు, మంకువార

 లందలాలెక్కి, గొర్రెలమంద జేసి

 జనుల నేలుచుండెర! శంకుచక్ర

 ములయి ప్రజలు శాస్తిని జేయవలెర నేడు

డా. నాగులపల్లి

 

తేటగీతి లో

 "అశ్వద్ధామ హతః.... కుంజరః" అన్న సందర్భం ...

 

 జంకుచున్న ధర్మజుని తాబొంకుమనియె

 శంకనొదల మనియె శంకుచక్రపాణి!

 మంచి కొరకు వీడమనెను మంకుపట్టు

 ద్రోణవధ కొరకై యెంచె దొడ్డిదారి !!

 

ముత్యాలసరము

 జంకులేకను శంకలేకను

బొంకుచుందురు మంకువారలు

 మార్చ గలదే శంకు తీర్థము

 మూర్ఖజన చిత్తము

డా. నాగులపల్లి

 

 

పాంచజన్యం

మంకుతనమును తరిమి కొడుచూ

బొంకులాడు పద్ధతిని తొలగించుకొనవలె .

శంకు ధారవాడు గంభీరంగా

జంకుపడక వూరించెను శంఖము .

అవ్విధముననే యువత పాంచజన్యము

తలచు కొనుచూ సన్మార్గంలో

సత్ఫలితములు సాధించవలె

జి మురళీ మోహన్ రావు

 

వినరా నా కన్నా

నీ తనముల నుండి

కొన్నిటిని తరిమి కొట్టారా నా బిడ్డా

వేటిని ఎచటికి పంపిచాలో చెప్పమ్మా

తెలియచేసి  చెప్పమ్మా

మంకు తనము, బొంకు లాడుట దూరము చేసి,

 జంకు పడకుండ ఉండ గలగాలిరా నా తండ్రి .

 

శంకు అని పిలిచే శంకర్ లాటి బహుముఖ ప్రజ్ఞాశాలులలో నీ పేరు కూడా

చేరువరకు కష్టపడరా!

 జి మురళీ మోహన్ రావు

 

 

శార్దూలము

అంకూరించు సుమాంకురమ్ములిల సంస్థాపించు శోచిస్సులై

సంకల్పమ్ముల జంకుబొంకులొదలన్ సంసేవ్యుడై యుండ; పర్

యంకమ్మున్ తలపుల్ తరంగములలో హ్లాదంబులన్ నింపుచూ

శంకుస్థాపన జేయగావలె మదిన్ సంప్రీతితో శంకరా !!

 

కస్తూరి శివశంకర్

 

 

అశ్వత్థామను మంకు తనమున చంపితినని

జంకు టెరుగని భీమసేనుడు శంకు నాదము

వలె  ఘోషించ, దిగ్భ్రాంతినన్ సంభ్రాతినన్

మదిన్ శంకతో  నిర్ధారణ నడుగ, బొంకుటయే

ఎరుగని యుధిష్ఠిరుడు జంకు జంకునన్

అనృత మాడ, కృంగిన ద్రోణాచార్యుడు అస్త్ర

సన్యాస మొనరించి యోగముద్రలో  అసువు

లొదలగ, రయమున పోయి దుష్టద్యుమ్నుడు

సంతసమున తన పంతము నెరవేర్చుకునె..

 

వచన కవిత

మానవ, నీవు చూచు జగమంత నొక బొంకు

మంకుతనం వీడి పెంచు కొనుము వివేకము

శంకు ధరుడు శ్రీహరి పై మనసు నుంచుము

నీ జంకు లెల్ల  తొల్గ పుణ్యగతి  సాధించుము.

 

CA కె మల్లికార్జునరావు

 

 

చాకలి వాడు పలికిన  అన్యాయపు

బొంకు మాటలు విని

శంకించిన శ్రీరామచంద్రుడు

సీతను అడవి యందు వదిలిపెట్టమని ఆజ్ఞా పించగా

 జంకుతూ  మంకు పట్టు వీడమని ప్రార్థించే లక్ష్మణుడు.

దేవరశెట్టి నాగమణి

 

 

కుసోదరి సూర్పణక మంకు తీర్చ

బొంకు పలికి బేల భూజాతనేమార్చె

జంకు లేక తన లంకకు చేటు తెచ్చె ..

పాప-భీతి మరణభయమన్నదే మరచె

కామాంధుడై జనని జానకిని వలచి

భయపెట్టి బెదిరించి పెళ్లాడదలచె

మృత్యుదేవతనతడు ముద్దుగా పిలిచె

తన సమాధికి తానే శంకుస్థాపన చేయదలచె!!

విష్ణుప్రియ

 

 

రామాయణం  ఇతివృత్తంగా  నా  సమాధానం  తేటగీతిలో

బొంకు నెఱుఁగని రాముడు జంకు గొంకు

లేక నలుపుతో, వానర మూక  ప్రాపు

తోడ శంకు నూది రణము తొడగె నంత

మంకు పట్టు వీడనసురున్ మట్టి గలిపి

ధరణిజనుగాచి  నెలకొల్పి ధర్మమిలను

అవళూరు సీత

 

వంకర తోకకు వహ్నిఁ దగల్చగా  మంకుబట్టునతాను లంకఁగాల్చె

కింకర వీరుల పొంకమ ణంచగ  జంకుగొం కులులేక జగడ మాడె

శంకు నూదుచుఁ దాను శబ్దంబుఁ జేయగా   రాక్షస వీరులు రణము విడిరి

సకలభీ భత్సము శంకలే కుండగా  చిందర వందర  జేసిచూపె

నాశనమ్మొనరించెను నగర శోభ శత్రు సైన్యపు బలములఁ శక్తి మేర

మట్టుఁ బెట్టెను మారుతి మర్మ మెరిగి పూర్తి నిజమిది నమ్మగా బొంకు కాదు

ఆదిభట్ల సత్యనారాయణ

 


కందము

శంకు తడవలిక పోరిన

బొంకుట మాని, చెవి నిడరు బుద్దులు గరుపన్

మంకులు తగ్గును నేర్పుగ

జంకు విడచి బుజ్జగించ సరియగు రీతిన్

వాణిశ్రీ నైనాల

 

 

నాపూరణ(రామాయణార్థంలో)

బొంకెను రావణుడు ఆరణ్యమందున్

మంకు బట్టు బట్టి  జంకు లేక

సీతను తోడ్కొని బోవగ

శంకయు లేకను సాధ్వి వెడలెనతనితో...

అన్నపూర్ణ ముంబాయి

 

మంకు పట్టు బట్టి  జంకు లేక గంగను 

భగీరథుడు భువి పై దెచ్చిన వేళ 

శంకరుడు బలికెను యిది 

సత్యమే గాని బొంకు కాదు

 అన్నపూర్ణ ముంబాయి

 

దత్తపది సుభాషితముగా

ఉత్పల మాల

 మంకు తనంబు వీడు,మన   మర్మము లెవ్వరి తోటి జెప్ప కన్

బొంకులు మాటలాడకు, సు బుద్ధిగ సుద్ధులు నేర్చు బాలకా!

జంకును శంకనూ వదిలి సంతస మానస మొందుతూ (వీధినిన్) సదా

శంకును,చక్రముల్ హరిని సంగతి బాయని దివ్యతా కృతిన్.

శిరీష

 

మంకు పట్టు తోడ మంగిన పూడికై

జంకు లేక మేము జనితిమదిగొ

శంకు కుప్ప జూచి సంబర పడినేను

బొంకు లాడి గొంటి బొజ్జ కొరకు.

 

మంగినపూడి=మచిలీపట్నం బీచ్ పేరు; శంకు= ఒక విధమగు చేప

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

తేటగీతి

సర్వ శ్రేష్ఠమయిన ప్రజాస్వామ్య పాల

నంత యునికి కోల్పోతుండె నతిరథులగు

రాజకీయ నేతలు సదా రచ్చకెక్కి

కీచు లాడుట పాలనా క్రీడ లయ్యె

 వెంకట్.సిహెచ్

 

కలియుగ భారతము గా... నేటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నా పూరణ – సీసము

 జంకేమి గలదోయి బొంకు లాడెడి నేటి  పాలక వర్గాల ప్రభవమునకు

మంకు పట్టుం బూని శంకుపథము నందు పయనించు నేతలు భయమెరుగక

జేసెడి యవినీతి శ్రేష్ఠ మనుచు వెల యించెడి పాలన యేవగింపు

రామరాజ్యమనుచు రాక్షస పాలన  నెరపుట నేతల నేర్పులయ్యె

 

నిన్నే నిన్నే

ఎగిరే రెక్కల గుర్రం కలకన్నది

ఎదిగే సూరీడు తిమిరం తరిమింది

ఎగిరే ఎదిగే నా మనసు నీకై ఊగింది

సాగే నా ప్రయాణం నీకై ఉరికింది

తరచి తరచి నిన్నే చూస్తుంది

మరచిమరచి నిన్నే గుర్తుచేస్తుంది

ఎదలో దాగిన గురుతులు చెరప లేక

కనుల ముందు తారాడుతున్నా

గతం మరువలేక నిన్నే నిన్నే తలచి

కాలాన్ని వలచి ఋతువులును మనువాడనా

నీలో మమేకమై తమకం విడిచి కదలాడనా!

-కోవూరి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...