29, నవంబర్ 2020, ఆదివారం

చిత్రానికి పద్యం - 67, 24.11.2020

 



పై చిత్రానికి పద్యాలు/కవనములు అందించగలరు...

చిత్రానికి పద్యం - 67

24-11-2020 మంగళవారము

పై చిత్రానికి పద్యాలు/కవనములు అందించగలరు...

నానీలు, మంజులము, ఉత్సుకము, తోటకము, భద్రకము, ముత్యాల సరాలు కూడా రాసినచో మిక్కిలి సంతోషము...

నేటి చిత్రానికి పద్యము ఆట వెలది లో నా ప్రయత్నం 

 

గురువు గారి కొరకు గురుకులము వలదు 

దండి గాను డబ్బులుండవలెను

రాసి కొద్ది నీవు రాధస్సు పోయరా 

చదువు కొనని వాడు చవట యిలను

రాధస్సు = ధనము

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

ఈరోజు చిత్రానికి ఉత్సుకము లో నా చిరు ప్రయత్నము

బరువైన పుస్తకాల సంచులు మోసే పిల్లల కోసం ఇలా

 

వీపున సంచుల భారమే

మోపుల తీరుగ మోయుచూ

పాపము పాపలు డస్సిరే

లోపము బాపుము ఈశ్వరా

 

 

పిల్లలకోసం సంచులతో డబ్బులు గుమ్మరించే తల్లిదండ్రుల కోసం

 

సంచెడు సొమ్ములు పోసినా

కొంచెము విజ్ఞత నేర్పరే

కించితు ధర్మము లేదుగా

వంచన లాపుము కేశవా

 

రమ,కంకిపాడు.

 

 

సంస్కారం నేర్పు చదువులను

పక్కకునెట్టి సంపాదన కూర్పు

చదువులన్ పిల్లల కందించుటకు

అమ్మానాన్నలు ఉవ్విళ్ళూరగన్

విలాస వంత భవంతులనందు

సౌకర్యములు చేసి అతి ఖరీదు

రుసుముల వసూలు చేయుచు

పాఠశాలలు నడుపుటకు వర్తక

పండితులు ఉత్సాహ పడగన్

విద్య వ్యాపారం కాక మరేమి?

స్కూల్లు అంగళ్లు తప్ప మరేమి?

 

CA కె మల్లికార్జునరావు

 

 

బడి చదువులు పోయి బండ చదువులాయె

గురుకుల చదువు నేడు సంకుల సమరమాయే

బట్టీల విద్య బుర్రను మూణ్ణాళ్ళకే వదిలిపాయే

డబ్బు తూకాన ఎదిగి బిడ్డ డాబు మనిషిగ మారె

పటాటోపపు విద్యకు విజ్ఞత కరువాయే

పటారపు పాఠశాల లొటారపు చదువులాయె

 

విష్ణుప్రియ

 

 

మునిసిపాలిటీ బడుల యందు చదువు అనగా

విద్య యందు ఉపాధ్యాయుల యందు చులకన భావం కలిగె.

 

అధిక సదుపాయంబులు చూపంగ

హంగులకు ప్రలోభము చెందంగ

కష్టమైనా కాసుల తో చదువులను కొనంగ

విద్యార్థులు  దుర్వినియోగం చేయంగా

చదువు సట్టు బండలాయె

తల్లిదండ్రులు అప్పులపాలాయె

 

దేవరశెట్టి నాగమణి

 

 

 

తులాభారం

 

కొందరు తల్లిదండ్రులు

తమ పిల్లల ప్రవేశము

కొరకు కొన్ని బడుల

మోజుతో ఆత్రుత పడుదురు

 

తులాభారం పద్ధతిన

అధికమైన డబ్బులతో

రుసుము సమర్పించి

సంతసింతురు .

 

విద్యార్థులు లందరూ  ,

బడికే వెళ్ళలేరు

బడులు వున్నవి

ఎన్నో అచటచటా .

 

బడి మూల వున్నా ,

పేరుతొ వున్నా

కష్టపడి చదివి కృతార్ధులై

వున్నత ఉద్యోగములు చేయువారెందరో !

 

జి మురళీ మోహన్ రావు

 

 

ఈ ప్రశ్నకు బదులేది?

 

ధనపు సంచులతో విద్యను కొనవలెనా?

పుస్తకాల సంచులతో పిల్లలు కుంగ వలెనా?

నార్జనకే గాని జ్ఞానార్జనకు కాదా?

ఇంత వ్యయం చేసినా ఫలితం దక్కేనా?

సంస్కార విలువలు లేని చదువెందుకో?

నేటి విద్యలు వేటి కోరకో????????

 

ఉష

 

 

ఉత్పలమాల

 

శారదచంద్రికాస్ఫురిత సన్నుతికోరుచు జ్ఞానధామమున్ 

సారతరార్ధ సంపదలు ఛాత్రులకున్ నొసఁగంగ నేర్పుగన్  !

గారపు మేటివిద్య నవకైవడులెన్నియొ పంచుచుండగా          

సారము లెంచి బేరముల సంగతమౌ చదువుల్ విచిత్రమే !    

భారతి ముద్దుబిడ్డలకు, ప్రాజ్ఞులకున్ వరమీయు శంకరా !

 

కస్తూరి శివశంకర్

 

 

కందము 1

చదువులు కొరకని నీకున్

అదనముగా ధనము యున్న నదియిక చాలున్

మెదడనునది లేకున్నను

చదివింపగ వత్తురెల్ల సంతసముగనే!!

 

కందము 2

చదువులు వ్యాపారమనుచు

చదివించెడి వాడు నేడు సజ్జనుడనుచున్

చదువును నమ్మితి విజ్ఞులు

చదువుల నమ్మిరి వెధవలు సంశయమేలా?

 

కందము 3

దేవాలయ మిదియను యా

భావనలేమైనవిపుడు పండితులారా

వేవేలుగ సొమ్ములడిగి

యా వాణీ విలువ చంపు టన్యాయమెగా!!

 

కందము 4

చేరుటకై తరగతిలో

కోరును నీ సొమ్ములన్ని కొనుటకు విద్యన్

భారము నేడిది జనులకు

వారింపగ వచ్చువారు పదుగురు లేరా?

కందము 5

కొనగల వానికి చదువులు

ఘనముగ నవి వచ్చి నిలుచు కలికాలములో!

ధనమును గుప్పించితివా

కనగలదా వాణి నిన్ను కానక బుద్దుల్!!

 

కందము 6

కలికాలపు చదువులలో

విలువలు శూన్యంబులయ్యె విపరీతముగన్

కలిగిన లక్ష్మిని మెండుగ

నలవోకగ చదువులబ్బు నది సాధ్యంభౌ!!

 

కందము 7

మెదడున్నను లేకున్నను

చదువులకది కొలత గాదు సందేహంబా

మదిలో కోరిక గల్గిన

యది సాధ్యంభౌను నీకు యాస్తిని యమ్మన్!!

 

కందము 8

శారద దరి చేరుటకై

వారధి యీ బడులు మనకు వారింపనెటుల్

దారుణముగ ధనము నడిగి

దూరము జేయకు చదువులు దుశ్చర్యదియే!

 

కందము 9

డాలర్లను పొందగ, భళి,

వేలకు వేలుగ ధనమును వెచ్చించుదురే

చాలవు బడులకు సొమ్ములు

బేలా! నీ యాస్తులన్ని పీడింతురహో!!

 

కందము 10

ప్రకటన లిచ్చెడి చదువులు

వికటించును విశ్వమందు విపరీతముగన్

అకటా! ఏమిది ఖర్మర

సకలము నిల సొమ్ముతోడ సాధ్యంబగునా?

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 వైభవము కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వము పటిష్టమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ విద్యకు పట్టం కట్టాలని విన్నవించుకుంటూ....

 

నేటి చిత్రమునకు నా భావన సీసమాలికలో...

 

సీసము

విద్యార్జన సలుపు విద్యార్థులకు నేటి   విద్యలన్ని సతము విత్తమయమె

పూపవయసు నుండె పొత్తముల కొరకు  పుస్తెలమ్మెడి విద్య భోగ మయ్యె

సర్కారు బడులందు చదువు కొదవ యను  వాదు ఘనంబవ్వ ప్రభుత జేష్ట

లుడికి వేడుక జూడ నుద్భవించెన్ ప్రభు త్వేతర బడులెన్నొ సాతి కొరకు

రుసుము లెన్నింటినో రొక్కముగ వసూలు చేయుచు హంగుల జిమ్మలన్ని

జూపెడి బడి పైన చోద్యంబుగ ప్రజకు మోజు కలుగుతుండె మోహముగను

మార్కుల జిమ్మికు మహిమ లెన్నో జూపి ఛాత్రుని రహి నంత సన్నగిల్లు

నట్లు గణించెడి యధమ జ్ఞాన మెరుగుల్ వ్యర్థంబు యిలనందు పరికరింప

 

తేటగీతి

జ్ఞాన సంపద లంగడి సరుకులయ్యె

పుట్టగొడగులవలె బడులు పుట్టి సొత్తు

కొరకు విద్య జెప్పెడి వింత గురుకులముల

కృత్యములతోడ జ్ఞానంబు మృగ్యమయ్యె

 

వెంకట్.సిహెచ్

 

కందము

సుజ్ఞాని కాదలచినన్

విజ్ఞతవిడు వ్యయములేల విచ్చలవిడిగా

నజ్ఞానము పోగొట్టెడి

సుజ్ఞానినిధి కొనుగోళ్లు జోరుగ తగునే?

 

వాణిశ్రీ నైనాల

 

ఉత్పలమాల

సుద్దులు సూక్తులన్ గరపు సుందర విద్యల తావులే మయెన్

 బుద్ధికి తోడుగన్ తనువు పుష్టికి నేర్పెడు విద్యలేమయెన్

 బుద్దిగ మెండుగన్ ధనము పోసిన మెచ్చెడి పాటశాలలే

 మొద్దుల కైన నేర్పెదరు ముద్దుగ విత్తపుటార్జనల్నహో

డా. నాగులపల్లి

 

 

అయ్యవార్లకు సరిపడు నైదు వరహ

ములనియడివారు, నేడది మూటలవ్య

యముగ మారి యాకశమును యతిశయించె

చదువు మారె నంగటియందు సరుకు గాను.

 

వెంకటప్పయ్య సూరె

డప్పు వాయిద్యాల చదువు

 

డబ్బుతో మా అమ్మాయి

చదువంతా వాళ్ళే చూసుకుంటారు

హమ్మయ్య అని చెప్పుకొనే

అల్ప సంతోషులు ఎందరో

 

ఇంట్లో లాంతరు వెలుతురులో ,

వీధిదీపం కింద వెలుగులో

చదివి విద్య , జ్ఞానము

సంతృప్తిగా పొందిన వారెందరో

 

వీధిబళ్ళో కొందరు , పెద్ద

పాఠశాలలో కొందరం

చదువుకున్నా అందరికీ ఆవే

పుస్తకాలు , పాఠాలు , పద్యాలు , శాస్త్రాలూనూ .

 

విద్య ఎవరి సొత్తు కాదు కానీ సద్వినియోగం చేసుకుంటే పెరుగును గానీ ఎవరు దొంగ తనం చేయరు .

 

జి మురళీ మోహన్ రావు

 

 

కందము

భారమయినను చదువుకొన

బేరము లాడుచు తొడరిన విత్తము నంతా

కూరిమి మీరగ నిడుకొన

సారము లేని చదువులవి సమకొనె సుమ్మీ

 

తేట గీతి

 

 పిన్న వయసు చదువు లైన పెద్ద యెత్తు

విత్త మిచ్చి చదువు కొన విద్య లోన

సార మేమియు లేకయె నీరు కార

బాలల భవిత యేరీతి బాగుపడును?

 

అవళూరు సీత

 

ఆటవెలది  

విపణివీధియందువిధిగానుగొనుటకు                                                     ధనముఁబోసిజదువుదక్కినాను

అదియెభాగ్యమనుచుఆశగాజూచుచు                                                     కొనగకొలువుదీరుకొందరేమొ

 

హేమలత

 

ఆటవెలది

విభను గూర్చునట్టి విద్య నేర్వంగను

విత్తమున్న చాలు నిత్తరియని

నర్మభాషణంపు నానుడి వినబడ

విస్మయమ్ము గాదె విజ్ఞులార!

 

ఆటవెలది

డాబు దర్పమున్న డాంబికంపు బడుల

చదువు నేర్చిన యెడ సార్థకమని

తల్లిదండ్రులెల్ల దలపోసి నన్నాళ్లు

విపణి సరుకు గాదె విద్య యనగ!

చల్లా దేవిక.

 

 

ప్రభుత్వ పాఠశాల

ఆటవెలది

విద్యలెల్ల నేర్పు విబుధులు కొలువైన

భవ్యమైన యట్టి పాఠశాల

చెంత నుండె నిదియె చేర్చగ బాలల

తల్లిదండ్రులార తరలి రండు!

 

ఆటవెలది

పలుచనగ తలచకు ప్రభుత బడినెపుడు;

నాణ్యమైన విద్య నయము గాను

అర్హులైన యట్టి యధ్యాపకులు గూడి

పూని సేయుదురిట బోధనమ్ము!

 

తేటగీతి

ఒత్తిడిసుమంత లేకను యొజ్జలంత

విద్య నరయ జేయుదురిట విపుల రీతి

భావి పౌరుల ఘనమైన భవిత కొరకు

చేరి మీరెల్ల యోచించి చేర్చ రండు!

 

ఆటవెలది

సుద్దులన్ని జెప్పి సుజనత్వమును బెంచి

సకల సద్గుణముల సమధికముగ

అమ్మ వోలె నేర్ప యాదరమును జూపి

నిశ్చయముగ నిదియె నెలవు గాదె!

 

ఆటవెలది

విరిసి మురిసె మున్ను విద్యా సుమంబులు

చదువులమ్మ ఒడిని చక్కగాను

కన్నవారి కలల కల్ల కానీయక

విద్య నేర్చిరిచట వినయముగను!

 

ఆటవెలది

నెరిగురి తెలిసికొని నెర వేర్చుకొనగాను

దారి చూపునట్టి ధామమిదియె

ఈ బడి యుపయోగ మింతింత గాదయా

సుముఖులుగను రండి సుజనులార!

 

ఆటవెలది

ఆంగ్ల తెలుగు మాధ్యమాల బోధ నెరపి

ప్రభుత బడియె జూపు ప్రగతి బాట

ఉచితమిట విద్దెయును దుస్తులింకను

పుస్తకముల తోడ భోజనంబు!

 

ఆటవెలది

క్రీడలందు పాల్గొని జూప పాటవమ్ము

తనువునకు మేలు గూర్చుచు తగిన రీతి

మానసికమౌ యశాంతియె మట్టువడగ

బాల బాలికలకు శక్తి ప్రబల మగును!

 

ఆటవెలది

చక్కబెట్ట పనులు సహకారమును గల్గి

బాలలకును ప్రజ్ఞ ప్రజ్వరిల్లి

కార్యకుశలతనిట కల్గిన వారుగ

రూపుదిద్దుకొందురు జడత విడి!

 

తేటగీతి

దాతల సహకారముతోడ తలమగువిధి

వసతులన్నియు సమకూరి వావిరిగను

దినదిన ప్రవర్ధమానమై తేజరిల్లి

పసను జూపుచుండె ప్రభుత్వ పాఠశాల!

 

ఆటవెలది

ధనము విలువ దెలియు దాతృత్వమలవడు

సత్ప్రవర్తనమది సంచితమగు

శ్రమను గారవించి సానునయమ్ముగ

సాటి వారికెపుడు సాయపడును!

 

తేటగీతి

 కుదురుగ ప్రభుత్వ బడి యందు చదువుకొనగ

ఆత్మవిశ్వాసము బెరిగి యద్భుతముగ

కష్ట మెదురవగాను క్రుంగకయె తాము

ఆటుపోట్లను సమముగ నవధరించు!

 

ఆటవెలది

ప్రభుత పాఠశాల ప్రాభవమ్ము నెఱిగి

సముచితమగు రీతి సాగివచ్చి

విద్య నెల్ల నరసి విజ్ఞులౌ విధమున

బాలలనిట జేర్చ బడికి రండు!

చల్లా దేవిక.


 

వచన కవిత,

చదువు కుందాం రోజుల్లో,

చదువు కొందాం రోజుల్లో,

విద్య జ్ఞాన సముపార్జన కోసం అప్పట్లో

విద్య ధనార్జన కోసమే ఇప్పట్లో....

 

గాంగేయ శాస్త్రి రాజమండ్రి

 

తూగుడు బల్ల తూగలేదు

పొసే డబ్బులు అసలే చాల్లేదు

కనుల గుడ్డులు గిర గిర తిరిగేను

ఎక్కే ప్రతి మెట్టు డబ్బుతో తూగేను

వేసే ప్రతి అడుగు పచ్చనోటయ్యేను

పిలిచే ప్రతి పిలుపు ధన ధ్వని అయ్యేను

డాబు దర్పం చూసి మోసపోకురా

చెప్పే మాటలో నిజాయితీ చూడరా

కార్పొరేట్ ర్యాంకులు నీటిమూటలు

చిన్నతనమే ఐఐటీ లేల...............

విశ్వదాభిరామ అనుట చేతకాక

నీతిచంద్రిక చదువలేక................

చిన్నయసూరి వేసుకునే నోటిమీద వేలు

పెద్దబాలశిక్ష తనకు తానే విధించుకునే శిక్ష 

 

కోవూరి

 

 

ఏ నిబద్ధతా.. బంధాలూ  లేని నాను-సెన్సు ఉచిత కవిత..

 

ప్రస్తుతమున్న  విషమయమైన విషమ పరిస్థితితులో...

ఇటలి వాడనెను ఇదిగొ చచ్చుచుంటిననుచు;

అమెరికననెను తాను చనిపోయితినని;

ఇంగ్లీషు వాడనెను ఇదిగొ అంతము వచ్చివేసినదనుచు;

మరి..చదువుల సంతల భారత విక్రేత వ్రాకుచ్చె నిటుల.... "తల్లితండ్రులార ! మీదు పిల్లల      "ఫీజులు" కట్టి వేసి పొండు,, మీరు పోక మున్నె"

 

రమణ

 

సేకరణ:

*కరోనావ్యాధి  కేవలం మానవులకు తప్ప మరే జీవికి లేదని తెలియజేస్తూ ఒక వ్యంగ్యాత్మక సీసపద్యం.*

   

కాకికక్కర లేదు గద! ఐసొలేషను కోతికి లేదయ్య  కొవిడు బాధ

లేదు గద! కరోన లేదయ్య కుక్కకు మదపుటేనుగునకు  మాస్కు లేదు

మరి చీమకేది సామాజిక దూరమ్ము టాంకు చేపకు శానిటైజరేది

పాము జాతికి యేది హోము క్వారంటైను నక్కలకేదయ్య లాక్కుడౌను

కోడికి లేదయ్య కోవిడు పాజిటివ్ గొర్రెకు గ్లౌజేది వెర్రివాడ!

పిట్టకు లేదయ్యె చట్టమొక్కటియైన  ఏ జీవికిని లేదు యింత దిగులు

 

 

జీవులన్నియు తమతమ జీవితమును

ధర్మమార్గాన ప్రకృతిన దనరుచుండ

మనిషి యొక్కడె మితిమీరి మసలుకొనుచు

ఇట్టి దుర్భర దుస్థితి నేడ్చుచుండె.**

 

చిత్రానికి కవిత

 

ప్రకృతి ఎరుగని బాల్యం

ప్రశ్నగ మిగిలెను యిదిగో

ఆకృతి పోవఁగ తనువే

వికృత మవ్వగ వరమే

జాగృత మవరే మతులై

సాకృతి కోరగా హితులై

మీ కృప జూపుము బాలలే

సుకృతి ఇదియే సఖులే

ఆతృత వీడుము మదిలో

సంస్కృతి నేర్పుము ముందుగా

దుష్కృతి చేష్టలు ఏల?

జ్ఞానం కోసం చదువులు

శున్యములాయెను మనసులు

ఆర్ద్రత కరువై బాల్యము

చెల్లింతురు తగు మూల్యము

భవిష్యద్దర్శనమూహలు

బంగారు భవిత కు మార్గ దర్శులు కాగలవారెవ్వరు?

 

శిరీష


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...