14, నవంబర్ 2020, శనివారం

చిత్రం పై పద్యం - 64

 


 

చిత్రం పై పద్యం  - 64 

ప్రరబ్రహ్మ జ్యోతి దీపం

లక్ష్మీదేవి కొలువై ఉండే దీపం

తిమిరాంధ కారాన్ని తొలగించే దీపం

సర్వజ్ఞాన ప్రదం దీపం

అగ్ని శిఖ వోలెవెలుగునిచ్చే దీపం

అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే దీపం

జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం

దేవతలు వేదాలు దాగి ఉండే దీపం

సకల దోషాలను అనారోగ్యాలను పారద్రోలే దీపం

ప్రమిద ఈశుని గా  మధ్య స్థితి కర్తగా  కుందు కింద సృష్టికర్తగా వెలిగే దీపం

లక్ష్మీదేవి కొలువై ఉండే దీపం

ఉన్న వారి ఇంటి లోనైనా లేని వారి ఇంటి లోనైనా సమానంగా వెలిగే దీపం

ఆవు నెయ్యితో ఆరోగ్యాన్ని ఇచ్చే దీపం

నువ్వుల నూనెతో నిత్య శోభలు కలిగించే దీపం

కోటి వత్తుల వెలిగించిన కోటి కాంతులు వెదజల్లే దీపం

అఖండ దీపం ఇంటిలో వెలిగించిన లక్ష్మీదేవి

కొలువై ఉండి మనశ్శాంతిని కలిగించే దీపం.

దీపావళి పండుగ రోజున దీపకాంతులు

గృహమునందు  ప్రసరించు దీపం

కార్తీకమాసమందు దేవాలయము నందు

ముదితలందరూ నిత్యము వెలుగించు దీపాలు

 

దీపకాంతులు ఇంటికి శోభనిచ్చే అందాలు.

 

నాగమణి .డి

 

 

అరులు లేనట్టి బ్రతుకు దానమివ్వు  ఆరోగ్యమైనట్టి స్నేహమివ్వు

అమృతమంటి మంచి మనసునివ్వు  ఆయువు పెంచేటి నవ్వునివ్వు

అత్తమామల కూర్మి వరమునివ్వు  ఆలుమగల మధ్య సఖ్యతివ్వు

అమ్మానాన్నల తోడు దీవెనివ్వు  ఆటలాడు మంచి బాలనివ్వు

అతిథులను ప్రేమించు బుద్ధినివ్వు  అక్షయమగునట్లు జీవనవృద్ధి నివ్వు

 

విష్ణుప్రియ

 

 

ఉత్పలమాల

అక్షయ భావలాహిరులు నక్షరమై నిను పూజజేయగా 

మోక్షమదే సదా భువనమోహనమై నను రక్ష జేయగా 

లక్షణమైన పాదముల లాస్యములన్ సుమనోహరంబుగా 

వీక్షణ జేయగా ! కుసుమపేశలమౌ సిరి పంచగావలెన్ !     

 

ప్రతి అక్షరంలో శారదాదేవిని దర్శించుకోవడమే అలవాటు చేసుకుంటున్నాను..

ఈ అక్షయ తృతీయ పర్వదినాన ... అక్షర సిరులను అనుగ్రహిస్తే చాలు తల్లి అక్షరార్చన తప్ప దేవతార్చన విధానాలు పూర్తిగా తెలియని నిస్సహాయుడను.   

 

కందము

అక్షయ తృతీయ విభవము 

లక్షణమై లోకములన లాస్యమునిండెన్ 

తక్షణమే మా మనసుల్  

ప్రక్షాళన జేయు తల్లి! పరిపుష్టముగా !     

 

శార్దూలవిక్రీడితము 3

 అసలు సిరులంటే ఏమిటి అన్న భావనలో.. (నా అభిప్రాయమే)

శ్రీభావార్ధము హేమకుంభములుగా చిచ్ఛక్తి  తేజంబులై  

యే భావంబుని గొల్చినన్ ! పదములే హేమాంబుజాపీఠమై

స్వాభావ్యంబుగఁ రాగరంజితములే  స్వాంతమ్ములో భద్రమై     

శోభాలేశములౌ విలాసములతో శోభించు భావంబులై !! 

 

కస్తూరి శివశంకర్

 

 

వచన కవిత,

 

దివ్య లక్ష్మీ, దీపలక్ష్మి,

మా లక్ష్మీ, మహాలక్ష్మీ,

ధనరాసులు మాకొద్దు,

సుఖ శాంతులు మాకిద్దూ !

దీపాలను వెలిగించేము,

పాపాలను తొలగించుము,

సర్వ విధముల పూజించేము,

సకల జనుల కాపాడుము తల్లీ !!!

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 సీసము

పంచ భూతాత్మక సంచరపు సిసలు లక్ష్యము నెరుగుటె లక్ష్మియనగ

చాలునన్నది నేర్చి సంతృప్తి పొందుచు లాలస విడుచుటె లక్ష్మియనగ

రుజ రహితమగు నారోగ్య కాయము, నమ లహృదయాత్మలవియె లక్ష్మియనగ

విజ్ఞత నేర్పెడి విద్య యేకాగ్రత ల్లఘిమల్బడయుటయె లక్ష్మియనగ

సేవానిరతినెంచి శివుని రూపముగ ద లచి యాదరించుటె లక్ష్మియనగ

నమ్రత నొలికించు నడతయు వినయశీ లతలె మనుజునికి లక్ష్మియనగ

 

తేటగీతి

 

మోహముల్దీర్చ చెల్లించు మొక్కుబడులు

నూరు కోర్కె లీడేరగ నోమునోచ

లక్ష్మికోరి లక్ష్మిపతికి లంచమిడుట

భక్తియని నమ్ము వానికి ముక్తి గలదె

వాణిశ్రీ నైనాల



నవరస చంపకమ్ములు మనంబున మోదపయోధి నింపగా

భవతరనవ్య భాషణ విభావ విశేష పదోత్పలమ్ములన్

ధవళ పరాగ సారస సుధారస తప్త మనోభిషేకమౌ

కవన మనోజ్ఞ భావపరికల్పిత శక్తిననుగ్రహింపుమా

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

ఆటవెలది

లక్ష్మి పూజ జేసి లక్షలు కోరకు

సంత సమును పొందు చక్కగాను

తల్లి పైన భక్తి యెల్లలు దాటిన

కనక రాశి నీకు కాణి యగును

 

కందము

పూజలు సే యుచు లక్ష్మికి

తేజస్సును బొందు నీవు తెలియుము నిజమున్

రోజులు చక్కగ నుండిన

రాజీ పడకుండ బ్రతుకు రామణీయమగున్ !!

 

కందము

రంగుల దీపావళి కై

సింగారము నింపి యింట జేతురు పూజల్

బంగారపు భవిత యెదుట

బంగారము ప్రియము గాదు పడతుల కెపుడున్!!

 

కందము

సిరికై బూజలు సేయుచు

సిరి కోరిన సంత సముగ సిద్దించునుగా

తరియించెడి విధముగ శ్రీ

హరి సతికై మ్రొక్కులిడగ నది సాధ్యము లే!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

ధన త్రయోదశి,దీపావళి  శుభాకాంక్షలు

 

నూనెలు పోయండి దీపాలు వెలిగించండి

టపాసులను తుస్సు మనిపించండి

శుభ్రంగా ఉంచండి జాగ్రత్తగా వుండండి

ధ్వనులొద్దు , పొగలొద్దు .

అమ్మా మమ్ములను  దీవించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను

ప్రసాదించు తల్లీ !

జి మురళీ మోహన్ రావు

 

 

తేటగీతి

ధనము ధాన్యంబు మిత్రులు దాసులునను

చరులు పుత్రులు సౌఖ్యపు శయువు బంధు

జనులనెడెనిమిది  సిరులొసగెదవమ్మ

మహిమయు యనిమయును గరిమ లగిమలను

ప్రాప్తి యీశత్వసిస్త్వములను పటిమలొ

సగెదవమ్మ నినుకొలువ జలధిజమ్మ

యిన్ని భాగ్యములన్ బొంద నిలను తల్లి

సాటిదగు జన్మము మరి యెంచదగదమ్మ

డా. నాగులపల్లి

 

 

క్షీరసాగరమునుండి

శ్వేతగజములతో స్వర్ణాభిషేకమును చేయించుకొనుచు

క్షీరాబ్ది తనయ జనియించిన దినము

 

ఆమహావిష్ణువే ఐశ్వర్యానికాధినేతగానలరింపజేసే

దివినుండి భువికి సిరితానుచేరి

కొల్హాపురమునందు కొలువైయుండే

ఆతల్లి మనయింట అలరారవలెనన్న.........

 

దివ్వెలవెలుగులతో ఆరాధించిన

సిరిమువ్వల సవ్వడితో అరుదెంచునాదేవి 

పసుపుకుంకుమలు దండిగా బెట్టిన

పసిడిజల్లులు మెండుగా కురిపించు నాతల్లి

 

కరములతో మ్రొక్కుచు సుమపూజచేసిన

కనకపు చూపులతో కటాక్షించు కమలవాసిని

 

క్షీరాన్నమును నైవేద్యమెట్టిన సిరులిచ్చి తీర్చును

ఎనలేని కోరికలా హేమమయి

 

భక్తిభావముతోపూజలొనరించి

బాధలెన్నడును దరిచేరనివ్వదా  భాగ్యలక్ష్మి.

హేమలత

 

 

ఈ రోజు చిత్రానికి తేటగీతి లో నా చిరు  ప్రయత్నం

 

ధనము లకురాణి వీవెగా ధైర్య మిడుము

చిరునగవుల సిరులొసగు శ్రీకరముగ

వ్యాధి బాధలు వేదనల్ బాపుమమ్మ

కలతలసలు లేనట్టి లోకమును జూపు

చిద్వి లాసమొసగు నీవు చింత దీర్చి

సకల సౌభాగ్య ములనివ్వు చంద్ర సహజ

విష్ణు కోరిన వన్నియు  వేగిరమిడు

 

 

ధనత్రయోదాశి ఆంటే ధన్వంతరి పుట్టినరోజు కూడా అని చదివాను.  ఆ భావాన్ని తేట గీతి లో ఇలా. . .

 

పుట్టె సాగరమ్మ చిలుక పుణ్య తిధిన

అమృత కలశమ్ము దెచ్చెనా రోగ్యమిచ్చు

వైద్య మున కాద్యుడైన ధన్వంత రపుడు

లక్ష్మి తోపాటు పూజించ రమ్య ముగను

 

రమ, కంకిపాడు.

 

 


పద్యం కాదు ....అలా మది నుండి వచ్చిన ఆలోచనా సరళి...

(మాయా బజారులోని పాట వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా...చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా....లాగా మనసులో పాడుకొనగలరు)

 

మంచి బంగరు బొమ్మ మా లచ్చివమ్మ 

దురితములు తొలగించి కరుణించవమ్మ

మంచి మనసులనిచ్చి మమ్ము కాపాడి

మానవాళికి మంచి దారి చూపించు

మాయరోగమును రూపు మాపి

మహిమ చూపించి మట్టుబెట్టి మమ్ము రక్షించు 

అహమును తొలగించి అంధకారము త్రుంచి 

మదములనణచి మమతపెంచు.

తెలుగు తల్లికి చెప్పి దీవెనలు కురిపించి

తెలుగు తేనియలను కడుపులో నుంచుకొని

కనిపెట్టుకొనగ  వెలుగును ప్రసరించి

వెలుతురునిచ్చి వేవేల కవులతో

వర్ధిల్లునట్లుగా మురిపించి

ఆలించి పాలించి ఆదుకో వమ్మ.

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

మత్తేభ విక్రీడితం

 

సరసీజాసన సింధుజాత వరమౌ సౌభాగ్య సంధాతవై

సిరియున్ సంపదలివ్వగా సుఫల యాశీర్వాదముల్ యిచ్చి, యా

దర లీలన్, క్షమ నోర్వగన్ జనులకున్ ధైర్యంబు దారత్వ, సు

స్థిరమౌ బుధ్ధిని,జ్ఞాన సంపదను,సౌశీల్యాత్మలీయంగదే! 

 

శిరీష

 

 

సీసము

పాలకడలి నుండి పావనముగ జనించి ధనాధిదేవియై సిద్ధి నొసగు

విష్ణు వల్లభ సర్వ వెతలు దీర్చి నరజాతికి నద్భుతమయిన దీప్తి నివ్వు

భోగ భాగ్యము లిచ్చి పుత్తడి చూపుల మగువ హ్లాదము గూర్చు మహిమ జూపి

కనక ధార లొసంగు కలిమిచెలిని కొల్చి వైభవ మొందు సర్వ జనులంత

ధనలక్ష్మి నర్చించి ధరణి జనులు తేజరిల్లి రాజసముగ వెల్లి విరియు

సర్వ సంపదలకు స్థావరమై నష్ట లక్ష్ములన్ పూజింప రహి కలుగునె

 

 

తేటగీతి

లోకమాత! ప్రణతులమ్మ లోక జనని!

భక్తి తోడ నారాధింప వసువు లిచ్చి

మమ్ము కరుణించి కాపాడు ముమ్మరముగ;

పద్మ లాంఛన! రమ! నీకు వందనంబు.

వెంకట్. సి హెచ్

 

 

వచన కవిత

మాతా మహా లక్ష్మీ ! విశ్వ జననీ!

నాకు ఐశ్వర్యములు ప్రసాదించు

కానీ పదుగురితో  పంచుకొను

నటుల  నన్ను దీవించు

 

నాకు అష్ట సంపదలనుగ్రహించు

అవి నాలో గర్వము పెంచకుండు

నటుల ఆశీర్వదించు

 

వాటిపై మోహములు కలగకుండు

నటుల నన్ను కరుణించు

 

సంపదల జత కూర్చి ఆత్మశాంతి

మెండుగ నాకు కటాక్షించు

 

ఆయురారోగ్యములు హెచ్చుగ

నాకు అనుగ్రహించు

 

సతము నీ భక్తి  విడవ నటుల

నాకు నియమము నివ్వు

 

నా హృదయాన జ్ఞాన దీపలక్ష్మివై

స్థిరముగా కొలువు సేయు.

 

CA కె మల్లికార్జునరావు

 

 

వచనము         

హే భువనేశ్వరీ, సింధుసుతా...

నీ దయ ఉన్నవాడె ఉన్నవాడందురు... నీ దయ లేనివాడు లేనివాడగు నీలోకమున

 

పాలకడలిని ఉద్భవించిన నాడు నీ చూపు పడినంతనె, దుర్వాసుశాప విముక్తుని గావించితివిన్ద్రునికి

నీవు ఆగ్రహించినంత శ్రీనివాసుడై భూవికేతెంచె ఆ శ్రీమహా విష్ణువు

సాక్షాత్ త్రిమూర్తులను సైతము అనుగ్రహించి సృష్టిస్థితిలయలను గరపుటకు కారణమైతివి

నీవనుగ్రహించని వస్తువేది ఈలోకమున విష్ణువక్షస్థల నివాసినీ

 

అందుకే అందురుగద నిన్ను శ్రీ యని. ( శ్రీ అనగా తనను సేవించువారలను సేవించునది అని అర్ధం)

 

వారణాశి శ్రీలేఖ

 

 

 

గేయ కవిత

అమ్మరో కనుమంటిని

అమ్మరో  కనుమంటిని

కొమ్మను, పసిడి  బొమ్మను

ముత్యాల రెమ్మను,  మా ముద్దు గుమ్మను

అమ్మరో  కనుమంటిని

 

ఎల్లవేళల యందు  కమలనాభుని

పదకమలముల నర్చించు 

కమలవాసిని  అయిన  కమలాక్షిని

జగద్రక్షకుడు జలజాక్షు వక్షమును 

అలరించి  భాసించు  మహాలక్ష్మిని

 

అమ్మరో  కనుమంటిని

అందాల కొమ్మను

అపరంజి  బొమ్మను

మా  పూల రెమ్మను

మనసున్న  అమ్మను

అమ్మరో  కనుమంటినీ

 

పదునాల్గు  భువనాలు పట్టంగ

పాలించు  పన్నగశయనుని పట్రాణివే

క్రీగంటి  చూపుతో  సౌభాగ్య సంపదల

నొసగేటి మాతల్లి  మహాలక్ష్మివే

అమ్మరో  కనుమంటిని

అమ్మరో  కనుమంటిని

 

అవళూరు సీత

 

 

సౌభాగ్యదాయినీ శుభప్రదాయినీ

కలశాన పుట్టావు కలిములూ ఇచ్చేవు

నీరజాక్షవు నీవు నీరాజనము లందేవు

సిరి మహాలక్ష్మీవి శ్రీహరిని చేపట్టేవు

బ్రహ్మాండ నాయకుని హృదయాన నిలిచావు

శ్రీవారి పై అలిగి భువికి దిగి వచ్చావు

గోవిందుని పెండ్లాడి గోవులందు నిలిచావు

రామావతారాన జనకీమాతగా

కృష్ణావతారాన రూక్మిణీదేవిగా

అష్ట లక్ష్ముల అంశ దీపాలనిలిపి

ధన త్రయోదశిని సిరులెన్నోకురిపించి

ధన,కనక, వస్తు, వాహనాలన్నీ

మెండుగా ఇచ్చి ఇంటింట కొలువుండి

పూజలందుకోవమ్మా జయమంగళం

 

నిత్య శుభమంగళం

రాజ రాజేశ్వరి

 

 

 

సీసము

 

క్షీరమందున బుట్టి క్షితినేలు మాతవు

నీ నివాసము మాకు నిత్య సుఖము

కాముని తల్లివి కళల నింపుగొనగ

చంద్ర సహోదరీ శాంతినిమ్ము

వేదము జదివిన వేద మాతవు నీవు

జగముల నేలేవు సొగసు గాను

హరి మెచ్చు హృదయంపు యంతరంగము నందు

పట్టపు రాణిగ వరలుచుందు

 

తేటగీతి

పద్మమును జేత బట్టిన పావనాంఘ్రి

సర్వ కళలకు నెలవైన సౌమ్య మూర్తి

అమరు లెల్లరు కొనియాడు యాది లక్ష్మి

మదిని ధ్యానింతు నీరూపు  మరువ కుండ

 

పద్మలత మున్నంగి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...