13, నవంబర్ 2020, శుక్రవారం

సమస్యా పూరణం, 11.11.2020

 

 

సమస్యా పూరణ

              దేవ దేవుని కైనను దెలియ కుండు

                    సమస్యాపాదం   తేటగీతి లో..  

జయము లభించి దర్పము న చంపిన దైత్యుని మాంస ఖండముల్

రయముగ కొండ పైన విసరన్ ముని‌ శాపము వాలి‌ పొందెగా,

నియమము వీడి యెన్నడును నిన్ను వధింపగ చేర బోడుగా

భయపడి ఋష్యమూకమున వాలియె,దాగెను ప్రాణ రక్షణకై,

దయను పొసంగి కాచుము ముదంబుగ నన్నని తెల్పి వేడినీ

వయమును పొందుమా‌ యను చు నంజని పుత్రుడు పల్కెరాజుతోన్ 

 

అయము   =  శుభము

 

అలిగిన సత్య భామను గాంచి కృష్ణుని మనోగతము

 

తిరిగి కుందేటి కొమ్ముసాధించ గలము

తిరిగి యిసుకబ  నూనెను‌ తీయ గలము

నలక పాన్పు నెక్కుచు నుండు చెలియ మనము

దేవ దేవుని కైనను‌ తెలియ కుండు

పూసపాటి | తెలుగు తేనియలు

 

తేటగీతి

 

ఏమి దుస్థితిది చరిత నెంచిచూడ

గడియ గడియొక గండమౌ ఖర్మ మిదియె

మాయ రోగమే రీతిగ మట్టిగరచు

దేవదేవుని కైనను దెలియకుండు

 

వాణిశ్రీ నైనల | తెలుగు తేనియలు

 

తేటగీతి

మూడు వర్షములు ముగిసె ముచ్చటగను

కొంటె జూపులు జూచెడి తుంటరామె

మనసు దోచినామె మనసు మర్మ మేమొ

దేవదేవుని కైనను దెలియకుండు

డా. నాగులపల్లి | తెలుగు తేనియలు

 

అత్యాశ

మంచి చదువులు చదివి

ఉన్నత పదవులు పొందుతూ

కొందరు ధనార్జన సమ్మోహనులై

అవినీతి మార్గములో , తమ తప్పిదములు

ఆ దేవ దేవునికైనను తెలియ కుండు గాక

అని చెరసాల చేరు వరకు ఆ విధమే వాడుదురు !

 

ఎవడు పట్టించుకునేది

ధర్మము , న్యాయము , నీతి

వినయము , సత్ప్రవర్తనము లాంటి

సద్గుణములను ఎన్నో తెలుసుకొనుచు

ఎంత చదువు చదివి , జ్ఞానము పొందినా

తమ స్వార్ధము కొరకు కొందరు

వీటిని సమయాను కూలముగా

అతిక్రమించుచూ , దేవ దేవుని కైనను

తెలియకుండు గాక , అనుకొనుచూ

ప్రజలను ముప్పతిప్పలు పెట్టుదురు!

జి మురళీ మోహన్ రావు | తెలుగు తేనియలు

తేటగీతి

 

భూరిదక్షణ లొసగుచు భూతదయయె

లేక, పంచ భక్ష్యములిడి కాక పట్ట

పట్టు పుట్టంబుఁ గట్టంగ భక్తుడౌన?

దేవదేవుని కైనను దెలియకుండు

 

వాణి | తెలుగు తేనియలు

 

తేటగీతి

 

భార్య భర్తల మధ్యన వాదులాట

లేల వచ్చును దెలుపగ నెవరి తరము

కాదు కాదని బల్కిన చేదు కాదు

దేవ దేవుని కైనను దెలియకుండు

 

తేటగీతి

నోటు జూచూకు వేసిన యోటు విలువ

మాట మంచిగ జెప్పిన మంత్రి మనసు

గెలిచి జేసెడి బనులకు కొలతలిలను

దేవ దేవుని కైనను దెలియకుండు

 

తేటగీతి

విద్య కొరకని గట్టెడి ఫీజు విలువ

బుద్ది వీడుచు నాసించు వృద్ది విలువ

దొంగ పూజలు జేసెడి దొరల మనసు

దేవ దేవుని కైనను దెలియకుండు

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి | తెలుగు తేనియలు

 

 

 

తేటగీతి

కపట ప్రేమ నటించెడి కరుణ లేని

ప్రియుని మనసు రీతి గణించు వీరు డెవరు

దేవదేవుని కైనను దెలియ కుండు

కపట ప్రియుని బుద్ధి సతము కఠినము గదె

 

 

తేటగీతి

వలపు జూపిన కలకంఠి తలపు నందు

నేమి జరిగినో మరలి తా నెలిమి నంత

ద్వేషముగ మార్చుకొని నేస్తి వేద నిచ్చు

చెలియ మనసు లోతు గనుట సృష్టి జేయు

దేవ దేవుని కైనను దెలియ కుండు

 

అల్లసాని వారి భావన గా

తేటగీతి

కొసరి కొసరి నవ్వుల తోడ కోమలాంగి

యొక పరి చెలిమి బంచు సయోధ్య లేక

నొక పరి వికటముగను కంటకము జూపు

క్షణమొక విధము నుండెడి కాంత తలపు

దేవదేవుని కైనను దెలియకుండు

 

వెంకట్. సి హెచ్ | తెలుగు తేనియలు

 

నిత్యమొక పూరణయనెడి నియమముగని

తెలుగు తేనియలు మహిని వెలుగు చుండ

రేపు యిచ్చెడిపూరణ రూపు జూడ

దేవ దేవుని కైనను దెలియకుండు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి | తెలుగు తేనియలు

 

శరదృతువు సోయగము 

తేటగీతి

అలరు తెలికల్వచెంత రాయంచ గుంపు 

విరివియగుశోభ సొంపారువిహగమందు 

కలువలన్ గూడి చల్లగా గాలివీచె 

రమ్యకుముద ద్యుతిగల శరత్తు సొబగు,

స్వర్గ ధామమునన్  మేటి సౌరుగనక   

దేవదేవుని కైనను దెలియకుండు 

 

వర్షఋతువు వైభవము - సమ్మోహనము

 

తేటగీతి

ప్రావృషము వచ్చెప్రేయసీ ! రంజనమ్ము

దూపవగబూని చాతకస్తోమమెంత 

వేడగా నీటిబరువున వేడ్కలు గని 

ధారలొలుకుచూ చెవుల కింపార నుఱుము

జలధరమ్ములు మెల్లగా పిలిచినంత  

చుంబనాశ్లేష సంభ్రమస్ఫురితమాయె

దేవదేవుని కైనను దెలియకుండు

 

కస్తూరి శివశంకర్ | తెలుగు తేనియలు

 

 

అత్త-కోడళ్ల మైత్రి కలగవచ్చు

జాబిలందు మచ్చ చూడవచ్చు

నీతిగల నాయకుడు ఉండవచ్చు

పక్షులల్లె పలికి పాడవచ్చు

భాషలెల్ల మర్మమెరుగ వచ్చు

ఏమి మాయో ఏమో మరి మగువ మనసు

దేవ దేవుని కైనను దెలియ కుండు !!

 

విష్ణుప్రియ | తెలుగు తేనియలు

 

 

 

ఈ రోజు దత్తపది కి ముత్యాలు గుచ్చడానికి ప్రయత్నిస్తున్నాను.

అమ్మ మనసు

 

ఎవ్వరి మాటలు గ్రుచ్ఛకున్నా

తనపిల్లల పరుషపు మాటలు

గ్రు చ్చినచొ,అమ్మబాధ,దేవ

దేవునికైన తెలియకుండునా...

 

ఉష | తెలుగు తేనియలు

 

 

 

 

శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు

భాగవత చారిత్రమ్ము

దివ్య భగవద్గీత సృష్టికర్త అని తాను తనకొడుకు బ్రమలో

యమునను దాటించు సమయమున

సామాన్య మానవుని వలె నుండే గాని

వాసుదేవ దేవునికి దెలియకుందే

తన వద్ద నున్న  బాలుడు ఆది

మద్యాo త రహితుధని

 

మంజూష , ఇందూర్ | తెలుగు తేనియలు

 

1.

ఇసుకను పిండి తైలము తీయవచ్చు,

మృగతృష్ణ నందు నీరు నింపగవచ్చు,

దేవదేవుని కైనను దెలియకుండు

మూర్ఖుని మనసు రంజింప నెటులో,

జవరాలి వలపు గెలుచు కొనెటెటులో.

 

2.

హరుని వరంబులు తనకున్నవని,

దేవదేవుని కైనను దెలియకుండు

తన మరణ గుప్తమని భ్రమియించి,

కపటాన సాధ్వి సీత నెత్తుకొని పోయే,

దశకంఠుడు. కడకు భీకర రణమున,

హరి శరమున దిక్కులేనివాడై చచ్చే.

 

CA కె మల్లికార్జునరావు | తెలుగు తేనియలు

 

అస్తమానము వేధించు యత్త  మనసు

మాటిమాటికి మెచ్చెడి మామ మనసు

నీవె నాసర్వ మనెయిడి నెలత మనసు

మనసు నీపైన నేయను మగని మనసు

దేవ దేవుని కైనను దెలియకుండు

 

(కెట్లైన దెలియుచుండు)

 

ఆదిభట్ల సత్యనారాయణ | తెలుగు తేనియలు

 

 

ఇంతి కష్టము లవియెన్నొ యెరుగువారు

 భువిని పుట్టగ లేరంచు కవులు తెలుపు

 మాటలవియేను సత్యమే, బోటి బాధ

 దేవదేవుని కైనను దెలియకుండు

 

ఆత్రేయ | తెలుగు తేనియలు

 

 

వచన కవిత,

దేవదేవుని కైనను తెలియకుండుఅను

భావన పిల్లి కళ్ళు మూసుకొని పాలు,

త్రావు చందము, సర్వాంతర్యామి ఐన,

దైవము పాపము  పండు వరకు నిరీక్షించు చుండు...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి | తెలుగు తేనియలు

 

 

తేటగీతిలో  

ఇతివృత్తం: తల్లి మనసు

 

స్వచ్ఛమగు యమ్మ  ప్రేమకు సాటి లేదు

పట్టి యభివృద్ధికై పాటు పడుట  తప్ప

వేరు తలపుల నెరుగని  వెర్రి  తల్లి

యెదిగిన నిసుగుల కొరకు యెదురు జూచి

తపన నొందుచు దుఃఖించు తల్లి మనసు

దేవ దేవునికైనను  దెలియకుండు 

 

అవళూరు సీత | తెలుగు తేనియలు

 

 

తేటగీతి

రాముడనుమానబరచిన రాణిసీత

మౌని యాశ్రమవాసియై మసలుచుండి

జగమునేలేటి సుతులకు జన్మనిచ్చె

దేవదేవునికైననుదెలియకుండు 

 

హేమలత | తెలుగు తేనియలు


 

ఇలను ధన్య జీవులన

సమయాన్ని పాటించలేక

కదిలేకాలాన్ని ఆపలేక

ఘనమైన విద్యలు నేర్వాలేక

వలసినంత సంపద కూర్చలేక

కష్టాలు, కడగండ్లు చెప్పిరాక

మనమున వేదన మనవారలే మాన్పక

మూఢుల మూర్ఖత్వం భరింపలేక

కన్నవారి యోచన మార్చలేక

కన్న బిడ్డలు లక్ష్యం చేరుకోక

ఆలు,మగల యుద్దాలు ఆపలేక

పరి,పరి విధాల పలుమార్లు

పలుకుతారు

దేవ దేవునికైనను దెలియకుండు

నా ఈతిబాధలు

రాజ రాజేశ్వరి | తెలుగు తేనియలు


 

 

ముత్యాలసరము లో చిరు ప్రయత్నం

పచ్చని పైరు గాలికి వూగ

నెచ్చెలి మోమున మెరియు నవ్వు

యిచ్చెడి సంత సమ్మును జూప

దేవ దేవుని కైనను దెలియ కుండు

 

తేట గీతి లో ఇంకో సరదా ప్రయత్నం

 

కోర్కె లేని మానవుడిని, గుడులు లేని

వూరు, నోటుకమ్ముడవని వోటరులను,

ఫోను చూడని బుడతలన్, పుష్కరాల

కొరకు పరుగులెత్తనివారి గొప్ప జెప్ప

దేవ దేవుని కైనను దెలియ కుండు

 

రమ | తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...