10, నవంబర్ 2020, మంగళవారం

చిత్రం పై పద్యం - 63, 10.11.2020

10.11.2020 


చిత్రం పై పద్యం  - 63

తన తండ్రి

తనకు చెప్పిన కధ

ఏనుగు మీద రాముడు

ఎంతో చక్కని దేముడు 

తను తండ్రిగా తన కొడుకును

ఆ ఏనుగు మీదే రాముడిని చేసాడు 

స్పందించే హృదయం ఉంటే 

సృజనాత్మకత దృగ్గోచరం

రంగుల ఏనుగు పై

చిరునవ్వులు చిందు

చూసే చూపరులకు కనువిందు

అంతలేసి పెద్ద రూపానికి

ఇంత చిన్నికన్నులు

అన్నులు మిన్నుల

చిన్ని గోపాలునికి తగిలినే

లోకమంత దిష్టి అయినా తనే శ్రేష్టి

 కోవూరి తెలుగు తేనియలు

 

 

ఏనుగు బొమ్మకు నా  చిన్ని కవిత

 

హయము నెక్కించ పరుగిడు రయము గాను,

సింహ‌మెక్కించ దలచిన చేటు కలుగు,

చలి మొదలుగును వెన్నులోన్ పులిని‌ కాంచ,

చిలుక నెక్కించ  గా చేరు చెట్టు చెంత,

కోతి నెక్కించ చేయును గొడవ లెపుడు,

పిల్లి నెక్కించ పరుగిడు పెరుగు చూడ,

నెమలి నెక్కించ నర్తించు నీరు కనిన,

ఖరము నెక్కించ నోండ్రించు శిరము‌ నెత్తి,

యెలుక‌ నెక్కించ దూరుగా కలుగు లోన,

పాము నెక్కించ బుసగొట్డు పడగ నెత్తి,

ఒంటె నెక్కించ నడుచుగా కుంటి నడక,

కుక్క నెక్కించ విడుచును కూడు దొరుక,

గజము నెక్కించ బుడతను కాచు చుండు,

చేయు చుండును పనులను చెలిమి తోడ,

హాయి నిడునుగా నంబారి ననవ రతము,

రాజు లెక్కి నారుట నాడు రమ్య గతిని,

గజము నెక్కి తిరిగి నంత ప్రజలు మెచ్చు,

 

కట్టి వేసిన నుండుగా  కదల‌ కుండ,

నడచు చుండుగా  నెమ్మదిన్ బుడత డెక్క,

పడగ బోరుగా నెప్పుడున్ భరణి పైన,

మంచి వాహనం బిది  గాదె నెంచి చూడ,

ననుచు నొక్కడు ముదముతో మనసు బెట్టి,

హస్తి బొమ్మను చేయించి నాట లాడ,

పూసపాటి   తెలుగు తేనియలు

 

 

బాల్య మందు ఏనుగు అంబారి అనిన ముదము గలగు

వీధి యందు మావటివాడు గజంబును తోడ్కొని రాగా

అది గాంచిన చిన్నారి రయమున పరిగెత్తి తండ్రి ని తీసుకొని రాగ

చిట్టి తల్లిని అంబారీ పై కూర్చోబెట్టంగ

మహారాణి లాగా వెలుగుతున్న ఆ దృశ్యము గాంచి

 పీతృ హృదయము  ఆనంద డోలికలూగె

నాగమణి దేవరశెట్టి తెలుగు తేనియలు

 

 

శార్ధూలము 

రావోయీ ! కరిరాజ ! సంభ్రమములన్, లాస్యంబునే జూపఁగా 

భావోద్వేగములౌ విలాసములతో భాసిల్లు చిత్తర్వులై 

ప్రావీణ్యంబది కుంజరంబు హరువుల్ ప్రహ్లాదమీయంగనే    

భావార్థంబులు గాంచినన్ వలపు సంప్రాణించు భావమ్మిదే !

 కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు

 

 

మత్తేభము 

గజరూపంబును గాంచి సంభ్రమము సింగారించె మోదంబుతో 

విజయచ్చందము సంతరించి మనసున్ ప్రేమన్ ప్రదర్శింపగా

భుజకీర్తుల్ ధరియించి చిత్తరువునన్ పొంకంబులన్ జూపఁగా  

సృజియింపంగప్రమోదముల్ హృదయమంజీరంబు రాగంబులై 

కస్తూరి శివశంకర్ తెలుగు తేనియలు


 

 

భద్రకం

గోడపై యిభము చోద్యమే

చూడగా మదిని దోచెనే

వేడుకే యనుచు బాలుడే

ఆడుతూ మురిసి పోయెనే

 సతీష్ తెలుగు తేనియలు


 

 

ఏనుగమ్మ ఏనుగు

వాడికి చిన్నప్పటి నుండీ చేసిన సంబరాలు , సరదాలు ,

ఏనుగు సవారీలు బాగా గుర్తుండి పోయాయి

వాటి వెనక వాడిపై నా ఆశలు , ఆశయాలు

కూడా వాడు గ్రహిస్తూ  పెరిగాడు .

వాడి బొమ్మలన్నీ ఇప్పుడు నిశ్చలంగా ఉంటున్నాయి.

 

వాడిప్పుడు ఉన్నత పదవిలో ఉత్తమ సేవలతో నిమగ్నమయి

అపుడపుడూ అడుగుతూనే ఉంటాడు

నాన్నా ఏనుగు ఎక్కుతావా , విమానం ఎక్కుతావా అని ముద్దుగా .

నేను నవ్వి సుఖీభవా అంటాను !

 జి మురళీ మోహన్ రావు  తెలుగు తేనియలు

 

 

 

 వచన కవిత్వం 

పుత్రునికై ఏనుగు సవారీ ఏర్పాటు చేసిన తండ్రి ప్రేమ మధురం...

గజారాజును సజీవంగా చూపించిన చిత్రకారుని కళ మధురం...

నేను ఏనుగునెక్కానోచ్ అంటూ మురుసుకునే బాలుని ఆనందం

మధురం...

 

పుత్రునికోరిక నిజం చేయటానికి వచ్చినాలోచన అతి మధురం...

చిత్రంలోనూ పుత్రుడు విజయపథం వైపే వెళ్లాలన్న తండ్రి కోరిక

అత్యంత మధురం....

 

ఉష తెలుగు తేనియలు

 


 

 

తేటగీతి 

ముద్దు బిడ్డను ప్రతిరోజు మోయలేక

తనయు డే డ్వంగ  చూచుచు తాళలేక

ఏన్గు శిల్పము నిర్మింప నెక్కి యాడ

కొడుకు ముచ్చట తీర్చెను కూరిమి (దండ్రి.

రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు

 

 

రంగుల ఏనుగును రమ్యముగా సృజియించి రంజింపజేసెను కొమరుని మనసును ఏనుగెక్కిన కొమరుడు ఏలికనేననుకొని అంబరమంత సంబరముతో ఆనందపడెను అదిగాంచినతండ్రి తనసృజన ఫలితము తనయునికి దక్కెనని తృప్తిగా మురిసే కొమరునికోరికను కొత్తతీరున దీర్చిన తండ్రి గొప్పమనసు పొగడతరమా !

హేమలత తెలుగు తేనియలు

 

 

ముత్యాల సరములు

బిడ్డ మీద మహ దొడ్డ ప్రేమ

సామజము గీయించెను దండ్రి

కుడ్య చిత్రమలరె కుదురుగా

నంబారి నెక్క కూన మురియ

 

చుక్కలు చక్కిలి గిలి పెట్టగ

పున్నమి జాబిలి పలుకరించు

చలికాచ రవి నింగి దిగడా!

సృజనాత్మకత కడ్డు కలదా!

వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు

 

 

 

కందము

ఏనుగు నెక్కగ కొడుకుకు

తానొక మార్గమ్ము జూపె తండ్రిట భళిరా!

కానగ నివ్విధమున్ వి

జ్ఞానమిచట ఖచ్చితముగ సాయపడెనుగా!!

 


 

ఉత్పలమాల 

కల్లిది కాదులే యనుచు కష్టము జేసెను కన్న దండ్రి తా

నిల్లుని మార్చుచున్ సతము నింతయు నెంచక కన్నబిడ్డ కై

థ్రిల్లుగ తోచునే కొడుకు దీక్షగ నేనుగు నెక్కు చుండగా

వెల్లువ లెత్తునే మదిని ప్రేమలు ప్రెక్కుగ నివ్విధమ్ముగన్

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు

 

 

 

సీసము

బిడ్డల కోర్కెల వింత రీతి తెలుప తర మొకపరి యొక తలపు దలచు

ఏనుగు యంబారి నెక్కించ మని కోర గ నొక జనకుడు తా గరిమ తోడ

సృజన వెలికితీసి సృష్టించె నద్భుత కుడ్య చిత్రము; జూడ కొమరు చుండె

ప్రతిరూపమొక యేన్గు ప్రతిమవోలె శిశువు  యానంద భరితుడై యాటలాడ

 

తేటగీతి 

జనకుడు మురిసిబోవునె సమ్ముదముగ,

కోర్కె దీర్చెడి జనకుడు కొమరునికి నొ

క విభు డగునె; కన్పించు గగనకుసుమము

తెచ్చెడి దిటవు కల్గిన ధీరుని వలె

వెంకట్.సి హెచ్ తెలుగు తేనియలు

 

 

ఆటవెలది లో...

 సుతుడు తాను గన్న సుందర స్వప్నమున్

వీలు జూచి పితకు విన్నవించె

మురిసిపోయి బీజి ముచ్చట దీర్చగన్ 

భిత్తి మీద కరిని హత్తు కొనెను 

 

బీజి = తండ్రి ; భిత్తి = గోడ

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు



ఉత్పలమాల

పిల్లలు కోర్కెలాజ్ఞలుగ  పెద్దలు శీఘ్ర ము దీర్చుచుండిరే

తల్లికితండ్రికిన్ తమకు తాహతు మించిన భారమే యహో

యెల్లలు దాటుచుండె గద యీ పసిబిడ్డ ల వింతకోర్కెలే

యిల్లున చిత్రమై యొదిగెనేనుగు బిడ్డడు సంతసించగన్

 

ముత్యాల సరము

ముద్దుల బిడ్డ ముచ్చట దీర

బొద్దుగ కరి బొమ్మను గీసెను

పెద్దల ప్రేమకు లేమి లేదు

హద్దులు లేవు సృజనల కెపుడు

 

 నానీ

 సిద్ధార్థుడు పొందె

కర్రబొమ్మగ కరిని

చిన్నో డెక్కేను

చిత్రపు కరియే

 డా. నాగులపల్లి  తెలుగు తేనియలు

 

 

 

తేటగీతిలో

తనయుని యితము దీర్చగన్ తండ్రి తానె

కుంభి చిత్రమున్ గీసెను గోడ పైన

వింత కోరికల్ కొసరిన బిడ్డల హిత

వచనముల బోధ జేయుచు భద్ర  భవిత

పొంద మార్గ నిర్దేశము పొడమ జేసి

అవళూరు సీత తెలుగు తేనియలు

 

 

అమరేంద్రుడి ఐరావతాన్ని

అంబారి కట్టి ఆటలాడింతురు

అమ్మా,నాన్నలు

కోవెల వాకిట కరిరాజు నోట

కదళీ ఫలములిచ్చి

దీవేన లిప్పింతురు

కొమరుడి కోర్కెమరి, మరిదీర్చ

చిత్రలేఖనము చిత్రించి

కుంజరము మూపున

కుమారుని కూర్చుండఁబెట్టి

తనువెల్ల తన్మయమున

తరియింతురు

తనయుని ఠీవి చూసి

వాసికెక్కిన నృపుల నామాన్ని

తలపోయుదురు

దొడ్డ మనసున్న తల్లిదండ్రులు

రాజరాజేశ్వరి తెలుగు తేనియలు

 

 

 

ఉత్పల మాల

చిన్ని కుమారు కోరికను చిత్రపు రూపము దీర్పగా యిలా

వన్నెల ఏనుగే సుతుని వాహన మయ్యెను సంతసాన,యా

కన్నుల కాంతులే విరియ కాంచన స్వప్నము గాంచగా సదా

అన్నుల మిన్నగా తనయుడా విధి యాడుట రమ్యమేగదా!

శిరీష తెలుగు తేనియలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...