దత్తపది - 54
* కట్టె, కొట్టె, తెచ్చె, వచ్చె*
ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవనములు అందించగలరు...
నానీలు, మంజులము, ఉత్సుకము, తోటకము, భద్రకము, ముత్యాల సరాలు కూడా రాసినచో మిక్కిలి సంతోషము...
వచన కవిత,
కొట్టెను వరాహమును,
తెచ్చెను పశుపతాస్త్రమును,
కట్టెను సన్యాసి వేషమును,
వచ్చెను ద్వారక కు ఫల్గుణుడు....
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగు తేనియలు
కట్టె వారధి ,చేరె లంకపురికి, పడ
గొట్టె రావణాసురుని,మగువను కూడి
వచ్చె తా నయోధ్యకు, కపి వరులు తిరిగి
తెచ్చె నదుల జలమును, మెచ్చె నపుడు
జనులు పట్టాభి షేకము గనిన పిదప
యిచ్చె నెన్నియో కానుకల్ యింతి సీత
పెట్డె మకుటము వాల్మీకి ప్రేమ తోడ
ఘనము గా నేలె ను ధరణీ కాంత నపుడు
రామచంద్రుడు రాజ్యమున్ రమణి కూడి
పూసపాటి తెలుగు తేనియలు
ఆట. ... .పాట
దర్శకుడు చెప్పిన పద్ధతిగా రాజా భవనము కట్టె
ధృఢత్వమునకు వాటికి తగినన్ని మేకులు కొట్టె
వలసిన వస్త్రములు అలంకరించి చక్కగా పెట్టె
అదనపు నటీ నటులను పిలిపించి తెచ్చె
నాయికా , నాయకులు అంతలో వచ్చె
ఇక మొదలయ్యే పాట చిత్రీకరణ !
జి మురళీ మోహన్ రావు తెలుగు తేనియలు
దశరథనందన ధర్మబంధన
ఇక్ష్వాక వంశతిలక కౌసల్యాకలల మొలక
వారధిగట్టిన దాశరథి
రావణుగొట్టిన యశోనిధి
సీతను తెచ్చిన శౌర్యాంబుధి
అయోధ్యకు వచ్చిన అమృతహృది..
జేజేలు జేజేలు రామభద్రునకు జేజేలు
వందేళ్ళు వెయ్యేళ్ళు
రామాయణము వర్థిల్లు!
రాంమోహన్ నిజామాబాద్, తెలుగు తేనియలు
ఉత్పలమాల
వచ్చెను కొట్టెదేననుచు బాపడు వీరుల త్రోసిరాజనన్
మచ్చెపు యంత్రమున్ జవిరి మాన్విని జేకొని నమ్మ యానతిన్
తెచ్చెను పంచుకొందు మను తీరును గాంచగ నబ్బురంబుగన్
మెచ్చగ దాళి కట్టె వరమీయగ నైదుగురన్నదమ్ములున్
వాణిశ్రీ నైనాల తెలుగు తేనియలు
ఉత్సుకము
సం పెగ మాలలు కట్టె గా,
కొంటె గ పూలచె కొట్టగా,
ప్రేమగ శ్రీపతి వచ్చెగా,
గుర్తుగ కానుక ఇచ్చె గా.
ఉష తెలుగు తేనియలు
బుజ్జి గాళ్ళు
మా కుక్కపిల్లని మెత్తని పొడవాటి తాడుతో కట్టె ఆ మూల
మా బుజ్జిగాడు వాడి బంతితో కుక్కపిల్లని కొట్టె
అది నవ్వుతూ బంతి తెచ్చె , బాబు కిచ్చె
ఇది నేను చూసి , వాడికి చెప్పె. బంతితో ఆడు కోవాలి,
కొట్టకూడదు నాన్న అని!
చిన్నారి పొన్నరి పువ్వు
నీకీ వుయ్యాల కట్టె
దోమలను తరిమి కొట్టే
నాన్న ఇపుడే వచ్చె
నీకీ బొమ్మ తెచ్చే
జి మురళీ మోహన్ రావు తెలుగు తేనియలు
కట్టె నురా తీరమున రామాలయము
తెచ్చె నురా చింతాకు పతకము ఆభరణముగా
కొట్టె దమురా నారికేళము నీ ప్రాంగణమున
వచ్చె నుగా ఆ రాముడు అభయముల నొసగ
వి. వి. శ్రీనివాస్ తెలుగు తేనియలు
తేటగీతి
తేనె కూర్చెడి యీగ పూదేనె తెచ్చె
గూడు పెట్టి వృధ్ధి పరచుచుండె; తేనె
పట్టు తెరువరి గాంచగ వాడి కలిగి
నంపకట్టె విసిరి కొట్టె నద్భుతముగ
నంతట వొడిసి బట్టి తా నరుసముగను
తేనె కొనివచ్చె నింటికి ధీరుని వలె
అంపకట్టె= బాణము, అరుసము= ఆనందం
వెంకట్.సి హెచ్ తెలుగు తేనియలు
కట్టెదురుగ గనపడగా
కొట్టెను పోలీసు బావ కోపముతోడన్
కట్టగ తాళినిఁదెచ్చెను
కట్టితి తన చెల్లిమెడన, కష్టము వచ్చెన్
ATVS సత్యనారాయణ తెలుగు తేనియలు
తేటగీతి
తాజమహలును గట్టెను షాజహాను
శిలలకెల్ల దెచ్చె శివము శిల్పగణము
పాలరాతిని కొట్టెర ప్రతిభ జూపి
వచ్చె కీర్తి దేశమునకు మెచ్చ జనులు
డా. నాగులపల్లి తెలుగు తేనియలు
కొట్టెను రావణుడు రోషమున
నాగాస్త్రము చేతబూని,
కట్టెను చుట్టునట్టు నాగులు
కట్టి వేయ లక్ష్మణుడు మూర్ఛ గొని మృత్యు దరిచేరె,
అంత తెచ్చెను సంజీవిని గిరిని
మారుతి చేత బంధించి,
తిరిగి వచ్చె సౌమిత్రి ప్రాణంబు
ఔషధము ప్రయోగించగ.
CA కె మల్లికార్జునరావు తెలుగు తేనియలు
అల్లరి ఆపగ కృష్ణుని రోలున కట్టెనంట
వెన్నకుండనాతను పగలగొట్టెనంట
మద్ది చెట్లకు మోక్షము తెచ్చెనంత
దామోదర మాసమిదె వచ్చెనంట
విష్ణుప్రియ తెలుగు తేనియలు
కందము
ఆకట్టెను పలువురి తా
జైకొట్టెను చెంతజేరి సైరా యనుచున్
లోకుల జూపగ దెచ్చెను
వేకువనే వచ్చియతడు వేలకు వేలున్
ఉత్పలమాల
కట్టిరి దేశమెల్ల మరి కాటును వేయగ రోగమొక్కటిన్
కొట్టిరి పొట్టలెల్లరికి కూటికి మార్గము జూపకుండగా
కట్టలు త్రెంచుకున్నదిక కార్మిక వర్గము దెచ్చె కోపమున్
మట్టును బెట్టగా తరలి మందిగ వచ్చెను లోకమేకమై
వచన తవిక
బాపూజీ పంచెను కట్టెను
సత్యాగ్రహముతో కొట్టెను
స్వాతంత్రము దెచ్చెను
జనులలో స్వార్థము వచ్చెను
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగు తేనియలు
తెచ్చెను నూతన గోవును
వచ్చెను మాలక్ష్మియంచు పరితోషముతో
మెచ్చుచు గట్టెను పాకన
పిచ్ఛముతో కొట్టె నాగ వీనుని కినుకన్
వేటూరి తెలుగు తేనియలు
మధురాక్కరలో...
కట్టె మయసభన్; కురువంశ కనులు చెదర నేర్పుతో;
కొట్టె రారాజుయహమును క్రోధాగ్ని జ్వాలతోడ
చుట్టమై వచ్చి దారుణ చులకదనము దెచ్చె నే
కట్టడమది దాయాదుల కలహంబు గొని వచ్చె గా...
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగు తేనియలు
తాజ్ మహల్ కట్టడం కట్టిన తీరు గురించి జాషువా గారి రచించిన పద్యాలు తెలుపకపోతే ఎలా...?
ముంటాజమహల్ కావ్యఖండిక నుండి
ఆటవెలది
ప్రకృతి సిద్ధమైన వన్నెతో వన్నెకు
చెలిమి గలిపి భావముల నిమిడ్చి
చలువరాతి ఫలకములు దీర్చసాగిరి
చిత్రచిత్ర గతుల శిల్పివరులు
తేటగీతి
రసికుల విమర్శనా వితర్కముల కతన
బహుకవీశాన మోహన వర్ణనముల
బుడమిగల వాఙ్మయం బెల్ల బొగరు బట్టె
పడతి ముంటాజి టాజి యై పొడము వేళ
కందము
శిలలకు బ్రాణము గలదను
పలుకు నిరుపింప నుపల ఫలకమ్ములపై
మొలిపించినారు శిల్పులు
పలు వన్నెల లతలు నేర్పు బరిమళ మొలకన్
ఆటవెలది
కలము నందుకొను కవివరేణ్యుని మ్రోల
తలలు వంచు శబ్దముల విధాన
నాటి శిల్పి చెంత నవనీతమును బోలి
మెత్త దనము దాల్చె మేటి శిలలు.
వెంకట్.సి హెచ్ తెలుగు తేనియలు
ఆటవెలది
ఉట్టికట్టెదమను నుత్సాహమే వచ్చె
నల్లనయ్య జన్మ నాటి దినము
ఉడుకుతనము తోడ నుట్టిని కొట్టెను
తెచ్చె సంతసమును తెగువ జూప
డి. వి. హేమలత తెలుగు తేనియలు
తేటగీతి
శివుని మనువు పార్వతి తోడ జేయ దలచి
మరుడు గొట్టె భవుని సుమ శరము చేత
కనలిన శివుడు మూడవ కన్ను తెరిచి
వలదొరకు ముప్పు దెచ్చెను, వగపున రతి
వచ్చిన నెగుడు కై క్రుంగి వలవలమని
కంట నీరొలికించగ కాల్వ గట్టె
అవళూరు సీత తెలుగు తేనియలు
మమతల జల్లులలను మూట కట్టే
శిష్యుని దుర్గుణాలను కొల్లగొట్టే
ఙ్ఞాన కాంతులను మదికి తెచ్చే
మోక్ష ప్రాప్తిని గరపగ వచ్చె
మంజూష ,ఇందూర్ (నిజామాబాద్) తెలుగు తేనియలు
శ్రీ రాముని మనసును ఆకట్టుకొనెను..
లంక ను జేరి అసురులను కొట్టెను..
అంగుళీకము నీయగ దెచ్చెను
సీతమ్మ దరికి తీసుకు వచ్చెను
అన్నపూర్ణ, ముంబాయి తెలుగు తేనియలు
నాయకుండు వచ్చె నాయక శత్రువున్
చావగొట్టె కసిగ బావురనగ
పసిడి తాళి గట్టె ముసినగవుల తోడ
తెచ్చె చెలి మొగమున తీపి సిగ్గు.
డి.రామ నాగేశ్వరరావు తెలుగు తేనియలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి