25, నవంబర్ 2020, బుధవారం

పురుషుల దినోత్సవపు శుభాకాంక్షలు 19.11.2020

 


పురుషుల దినోత్సవపు శుభాకాంక్షలు


కందము 

మగువలు కొనియాడవలెన్

నగవులు చిలుకు మలయ పవనాంకురములుతో

మగవారి ఘనత తెలుపుచు

తగువారని పలుకమంటి ! ధన్యులమాయెన్ !

 

భుజమిచ్చి ఓదార్చడమే తప్ప

తనకొక భుజమడగని బేల తాను

కన్నీరు పెడితే నవ్వుతారని

నవ్వుమాటున నీరు దాచే చెలమ తాను

తనవారి బాగు ఎరిగి తన స్వార్థమెరుగని

తాపత్రయ జీవి తాను..

తపమైనా , జపమైనా తనవారి కోసమే...

ఏడడుగులేసిన రాణి కోసం సర్వం ధారపోసే బలి చక్రవర్తి తాను...

తన వారి వరమే తప్ప తన వరాలడగని

పిచ్చి మారాజులందరికీ .....

పు'ఋషులదినోత్సవ శుభాకాంక్షలు

విష్ణుప్రియ 

*పిచ్చి మారాజు అంటే జాలి తప్ప తిట్టు కాదు, గమనించగలరు!!



పైపైనే   ధీరతనం  మనసులో బేలతనం

కుదిరితే చూపించు ఆగ్రహం  కుదరకపోతే అంగలార్చు

అనుగ్రహం కోసం

ఇంటికి పెద్ద దిక్కు దిక్కులే చూసేను పెళ్ళాం ఊరెడితే

అందరి కడుపులు నింపాలని తాపత్రయం

తన కడుపు నింపుకోవడం తెలియని  కష్ట జీవి

అమ్మానాన్నల వరపుత్రుడు అక్కయ్యల ప్రియ తమ్ముళ్లు

చెల్లెళ్ళకు ప్రియమైన అన్నయ్య కూతుళ్ళ రోల్ మోడల్

మరి భార్యలకి ??????

ఇలా వ్రాస్తూ పోతే , మీకే కష్టం   తమ్ముళ్ళందరికి, మీ అక్క శుభాశీస్సులు 


విష్ణుప్రియ


 

మనం ఎదుగుతున్నాం...!

నిజంగానే మనం ఎదుగుతున్నాం !

 

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం... ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం... అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం

 

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...  నేనే హీరో... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

 

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం... అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

 

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం... ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం... ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం... ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి... కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం...! కానీ... మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...! మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..! మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం...! నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం...!

ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!!

నిజంగానే మనం ఎదుగుతున్నాం !!! 


రమ

 


పురుషుల దినోత్సవపు శుభాకాంక్షలు

కందము

 

పరుషపు మాటల నాడక

యరుదౌ నొక జీవితమ్ము నందించుచు తా

గరళము మ్రింగుచు నవ్వెడి

పురుషుల కొక దినము నేడు పుడమిని మనసా

 

కందము

 

నిరతము ప్రేమను బంచుచు

చిరునవ్వుల యందు వారు సిరిగల వారై

బరువులు బాధ్యతల సఖులు

పురుషుల కొక దినము నేడు ముదమున మనసా!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

మగువ జీవితంలో

అంతర్భాగమై

అన్ని దశలలో  కలసి

నడిచే మగధీరు లందరికోసం నా అక్షరాక్షితలు

 

వేలుపట్టి నడక నేర్పే నాన్నలు

అమ్మ నాన్నను మరిపించే అన్నలు

చిలిపి అల్లరిలో తోడుండే తమ్ముళ్లు

కన్నె హృదయాలు కొల్లగొట్టే కలల రాకుమారులు

 

మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి

ఇక ఏడు జన్మలూ నీతోనే అనిపించి

నా అన్న పదం మరిపించి

మనం అనే

మంత్ర జలం జల్లి

అప్పటివరకూ వున్న అందరినీ

మర్చిపోయేలా చేసే ఋషులు మీరే

 

మీ కూతుళ్ళని యువరాణులు గా

చూసేవేళ మనసున్న మహారాజులు మీరే

ఒక్క మాటలో చెప్పాలంటే

పురుషులు లేని చోటు

పుడమిలో లేదు

 

నా జీవన యానం లో ఈనాటి వరకు

అడుగడుగునా అండ దండ గా నిలిచిన పుణ్య

పు ఋషులందరికీ

పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు

 

రమ, కంకిపాడు.

  


అమ్మ, నాన్నల పున్నామనరకం తప్పించు

వంశం పెంచే వారసుడై వచ్చు

అక్కచెల్లెళ్ళ కభయమిచ్చు

అన్నదమ్ముల కండగా నిల్చు

బంధుమిత్రుల తల్లోనాలుకై గెల్చు

పిల్లల కుయే లోటు లేకుండా పెంచు

ఆలికి అన్నీ తానై మెప్పించు

సభ్యసమాజపు మార్గదర్శియై నిల్చు

భావి తరాలకి వెలుగురేఖలు చూపించు......

 

పొగడ్తలకు లొంగని మగమహరాజని

మెచ్చుకొలే మర్చిపోయాం

బీజం లేకుంటే క్షేత్రం విలువ

శూన్యమని గుర్తు చేద్దాం....

 

 నారు, నీరు పోయగల వాడవు ప్రతిరోజూ నీదే నోయ్!

పురుషుల రోజుతో సరిపెట్టుకో బనిలేదొయ్!

డాళ్ళ రాజ్య మయిందని చింత వలదొయ్!

వాళ్ళకీ రోజు వచ్చిందని భుజం తట్టవోయ్!

పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు

వాణిశ్రీ నైనాల 

 

 

పురుషుల దినోత్సవ శుభాకాంక్షలతో

కందము 1

 

నిరతము ప్రేమను బంచుచు

చిరునవ్వుల యందు వారు సిరిగల వారై

బరువులు బాధ్యతల సఖులు

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా!!

 

కందము 2

పరుషపు మాాటల నాడక

యరుదౌ నొక జీవితమ్ము నందించుచు తా

గరళము మ్రింగుచు నవ్వెడి

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా

 

కందము 3

సిరియున్నను లేకున్న

పరిమితమైనట్టి బ్రేమ పంచెడి వారల్

విరుపుల పలుకులు బలుకని

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా

 

కందము 4

ధరణిని యద్భుత జన్మము

వరముగ పొందంగ గూడ పలుకక నెపుడున్

నిరతము వరములనిడు ఘన

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా

 

కందము 5

చుర చుర కోపము జూపక

నరకొర మావేసబడుచు నాప్తుల పైనన్

సరియగు దారిన నిల్పెడి

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా

 

కందము 6

జరిగిన కాలము దల్చక

వరముగ మార్చుటకు భవిత బ్రతుకుచు నెపుడున్

చిరునవ్వులు చిందించెడి

పురుషుల కొక దినము గలదు ముదమున మనసా

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...