దత్తపది - 52
* భారము. సారము. వారము. దూరము *
ఈ నాలుగు పదాలతో ఏదేని ఇతివృత్తం లో, రామాయణం/భారతం/కలియుగ భారతం గాని, మీ పద్యాలు/కవితలు
తేటగీతిలో
సారము గనని బ్రతుకును సైప లేక
భారముగ తోచ వేడితి భవుని దయను
వెతల దూరము జేయగ విభుని కోరి
వరములను పొందగా సోమ వారము శుభ
దినమనుచు పూజ జేసితి త్రినయనునికి
అవళూరు సీత తెలుగుతేనియలు
భారము సారం వారము దూరము
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదుగు బొదుగులేని జీవితం నిస్సార మాయె
భార మాయె బ్రతుకు కడు దూరమాయె వెలుగు
కూటి కోసం వలస వెళ్లే కార్మికుల కష్టాలు చూచు వారమే గాని
తీర్చు వారము కాము కదా.
దేవరశెట్టి నాగమణి తెలుగుతేనియలు
ప్రైవేట్ ఉపాధ్యాయుల మనోగతం :- (దత్తపది)
భారము సారం వారము దూరము
భారమాయెను బ్రతుకు బహుదినములనుండి, ని
స్సారమాయే సంసారం,పూట గడచుట కష్టమైయ్యే
మెమెచ్చటికి పొగలవారము,యిన్ని దినములు వూడిగము చేసినారము, ఈ విద్యాలయములకు,బహు
దూరమయే మా జీవితములు జీతాలు రాక,భిక్షమెత్తగా
మాకు మనసురాదు.
సంతానము కాదు తల్లికి భారము
వారిని పెంచిపోషించుట సం సారము
పిల్లలకొఱకు చేయును ఉపవాసము ప్రతి వారం
కానీ నేడు పిల్లలు అవుతున్నారు తలిదండ్రులకు దూరము
బివిఎస్ తెలుగుతేనియలు
ఆటవెలది లో....
బాధలు మిగులునిల భారము మన్మధా
వెచ్చపఱచు సారమి చ్చముగను
వాచును మరి వీపు వారము ఖ్యల మేప
దూక వలదు గోడ దూరము నిడు
వెచ్చపఱచు = ఖర్చుపెట్టు, సారము = ధనము , వారముఖ్య = యోగ్యతను బట్టి జనుల చేత సత్కరింపబడిన వేశ్య (మధురవాణి)
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి తెలుగుతేనియలు
ఉందిలే మంచి కాలం
కూలి పనికి దిన దినము దూరము పోవువారము
పనులు లేక బ్రతుకాయే భారము
సారములు లేని ఆహారముతో గడుపు ఈ రోజులు
తొందరగా మారి మంచి రోజులుగా జనులందరికీ కలుగవలె మేలు !
జి మురళీ మోహన్ రావు తెలుగుతేనియలు
ప్రస్తుత కరోనా రోజుల్లో
గృహానిర్బంధం అనిపించేను
మనుషులకు భారం.
జనులకు అర్థం కాలేదు
నియమాలవెనుక ఉన్న సారం.
ఎదురు చూసేరు జనులు
వ్యాక్సిన్ కై ప్రతి వారం.
కరోనాతో పెరిగిన దూరం
సాంకేతిక జ్ఞానం తగ్గిస్తోంది దూరం.
ఉష తెలుగుతేనియలు
తేటగీతి
ఏడుకొండలు దూరమునెంత యైన
వాసుదేవుని దర్శనం భారమైన
వేడుకొనుటకు వారము వెతలు పడిన
భక్తి సారము గ్రోలిన ఫలము గలదు.
హేమలత తెలుగుతేనియలు
1
పని భారము పంచుకొను
పరివారమున్న చాలు యిక
మధురమౌ జీవన సారము
కష్టాలిక దూరము దూరము
2
కాదెప్పుడు మగువకు పని భారము
తెలిసినపుడు సంసార సాగర సారము
చేయించిన భర్తతో వంట వారం వారము
అప్పుడిక వంటింటి కష్టాలన్నీ దూరము దూరము ..
విష్ణుప్రియ తెలుగుతేనియలు
ఈరోజు దత్తపది కి మంజులము
పెనుభారపు వారములో
ఘన సారములౌ రచనల్
కనరాదని ఫోనుని నా
కనుచూపుకు దూరముగా
తనుదాచిరి నాపతియే
ఉత్సుకము
దూరము బెట్టుచు నిద్రనే
వారము కొక్కరు తమ్ములే
భారము మోయుచు రాతలో
సారము దెల్పును నాప్తులై
రమ తెలుగుతేనియలు
1.
సంసారము నిస్సారమయ్యేనని,
తలచి హుషారొనరించు నెపమున,
దూరమున్ననూ వారము వారము,
శ్వశుర గృహంబు బోవుచుండన్ ,
మా సంసారం బహుసారమయ్యే,
మామ గారికి మాత్రం భారమయ్యె,
నిస్సారమాయే తీవ్ర నీరసమాయే.
2.
ఉమ్మడి కుటుంబములు మృగ్యమై,
స్త్రీకి సంసారము పెనుభారమయ్యే,
ఆదివారముననూ సెలవు లేకపోయే,
విరామమను మాట సుదూరమాయే.
CA కె మల్లికార్జునరావు తెలుగుతేనియలు
ప్రా(క్భారము) పడుచు పాండవులు విరటు నగరమునన్ దాగినారు గాదె,
గోవుల సంపదన్ కొల్లగొట్ట వలయు, కా(సారము)లచెంత గడ్డి మేయు
వాటిని తరలించ వలయు సుయోధనా, ముందుగా దక్షిణమున, తదుపరి
నుత్తర మందు సాయుధులెల్ల దాడిచే యంగ గో గ్రహణము నాప దలచి
కలుగు లోని యిం(దూరము)ల్ వలె బయటకు
వచ్చు పాండవుల్ రయముగ, వారలను మ
రల వనమునకు యాయ(వా రము)లు చేయ
పంప గలమని సభలోన పలికె శకుని
కాసారము= కొలను , ప్రాగ్భారము = అతిశయము, ఇందూరము = ఎలుక
యాయవారము =బిక్షాటన
పూసపాటి తెలుగుతేనియలు
తేటగీతి
చిన్న సవరణతో...
భ్రాంతిని బ్రతుకువారము పామరులము
సారము నెఱిగి మెలిగిన సాధువువలె
తామరాకున బిందువై తనరు నపుడు
దుఃఖ సంసార భారము దూర మగును
డా. నాగులపల్లి తెలుగుతేనియలు
కందము
భారము గాదిక మాకున్
సారమ్ముగ నిట సమీక్ష సాధ్యము జేతున్
వారము నొక్క దినము నే
దూరము పోకుండ జేతు దుస్సాహసమే!!
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగుతేనియలు
కందము
భారము గాదు బ్రతుకు సం
సారము చక్కగ నెపుడును సాగగ నిల మీ
వారము మేమనుచున్ బహు
దూరము నుండంగ నేమి దోచగ మనసుల్!!
ఆటవెలది
భారమనుచు ప్రభుత పనులను జేయదు
సారమెరుగరేమి జనులు యిలను
వారమనుచు పలికి వందేళ్లు చేతురే
దూరమైన కలలు దుర్భరమ్ము
ఉత్పలమాల
భారము జీవితమ్ము మరి బాధయు హెచ్చుగ పొందినంతనే
సారము లేకనే తుదకు జానకి వేడుక శూన్యమవ్వ మీ
వారము మేములే యనుచు వానర సైన్యము సాయమీయగా
దూరము నుండినన్ సతికి తోడుగ బంపెను నంగుళీకమే
కందము
భారమె యని దలచక సరి
సారము నెరుగుచు సతతము సంతసముగ మీ
వారము మేమని దెలుపుచు
దూరము లెంతైన నేమి తోడు నెరుగుమా!!
ఉత్పలమాల
భారము లౌనులే మనము భాషను వీడగ నెల్ల వేళలన్
సారము తగ్గునే సతము చక్కగ మెచ్చక మాతృభాషనే
వారము వర్జ్యముల్ యనుచు వంకలు బెట్టుచు బల్కకుండినన్
దూరము నుంచినన్ బ్రతుకు దుర్భర మౌనుగ శాశ్వతమ్ముగా
కందము
వారము కొకపరి చేయగ
భారము గాదుగ సమీక్ష భాసిల్లునుగా
దూరము నుండక మేమిక
సారము మొత్తము నిలుపగ సాయము నిడుమా!!
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి తెలుగుతేనియలు
హై హై నాయక
బడులు లేక పుస్తకములు మోయు భారము తగ్గి
నడకలకు దూరముగా , బద్ధకమునకు ప్రియముగా
ముఖతా చెప్పలేని పాఠముల సారము గ్రహించలేక
అయోమయ పరిస్థితిలో వున్నవారము మేము ఈ విద్యార్థులము.
హై హై నాయకా, మాకు త్వరితగతిన యధా స్థితిని కలిపించుము ఘటోద్గజా !
జి మురళీ మోహన్ రావు తెలుగుతేనియలు
వచనకవిత,
పృథ్వి పై పాపుల భారము పెరిగినప్పుడు,
తన పరివారము తోడ ఆ దేవదేవుడు,
దూరము భారము మది నెంచక వైకుంఠం నుండి,
తన ఇష్టానుసారముగా ఇలపై అవతరించు....
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి తెలుగుతేనియలు
ఇంద్రుని కిన్ పూజ లేలని నందకి శోరుడు నాపగ తూరుపు దొర
విప్రతీ (సారము) వేగముగ బడసి జలపతి ననుపగ విలయ తాండ
వము తోడ కురిసె భువన మందు నా(సార, ము)రళి ధరుడు నగమును రయముగ
గోటిన దాల్చగ గోవులన్ నందుని పరి(వారము) తరల్చె పర్వతంబు
నీడ లోన,(దూరము) నందు నాడు చున్న
గోపి కాస్త్రీ సమూహంబు కొండ క్రింద
జేర, (భారము) నొందక చిరు నగవును
జూప వేల్పులు కాంచిరి చోద్య మపుడు
విప్రతీసారము = కోపము, జలపతి =వరుణ దేవుడు
ఆసార. = జడివాన, తూరపు దొర= ఇంద్రుడు
ఉత్పలమాల
వారము వర్జమంచు నుపవాసము చేయగ కుక్షి కాలగన్
భారము మోయు దేవుడని భక్తులు మౌడ్యపు మార్గమెంచకన్
దూరము తగ్గునే సతము, త్రుంచగ కోర్కెలు ధ్యానమందునన్
సారముదెల్పు భక్తిరస స్వాధన సాద్యము సాధనంబునన్
వాణిశ్రీ నైనాల తెలుగుతేనియలు
ప్రవరుని వలచిన వరూధిని తనకు ప్రవరుడు దక్కలేదని విరహవేదన పడుతుండెడి ఇతివృత్తం గా నేటి దత్తపది తో అన్యర్థంలో ప్రయత్నం.
సీసము
ప్రవరుని చెలిమికై రమణి వరూధిని పరితపించి వగచి, వదన మంత
నీరసింప, తన సిం(దూరము) కోల్పోయి, అను(వారము) సఖుని నరయు చుండె.
అంత(సారము) విస్మయముగ నంతర్థాన మవ్వ, వరూధిని యలజడి పడె.
అతి(భారము) సహింప కతివ క్షోభపడుతు విలపించు చుండె వివేకమంత
సమసి బోగ; చెలులు జేరి సమధికముగ
నూరడింప యత్నము జేసె యోర్పు తోడ;
అకట! స్వర్గ వధువున కిం తాపదేమి?
వలపు కౌగిలి కెవరతీతులు పుడమిని
అనువారము= మాటిమాటికి, అంతసారము= ఆత్మబలం
వెంకట్. సిహెచ్ తెలుగుతేనియలు
చంపకమాల
చెలియిక ప్రేమనే మరచి చేతల నింపగ పెంకిచేష్టలే
అలకలు మెండుగా బెరిగి యాగ్రహ మొందుచు చూచినంతనే
పలుకగ నెట్టులన్ కనుల వైనము జెప్పగ మూగబోతి నే
కలువలు విచ్చెగా పగటి కాలము నందున నబ్బురమ్ముగా
కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి
ఓ శ్రీ వెంకటేశా !
నే సం సారమ" ను ఓ టెంక వేశా !!
ఇల ఆ చెట్టు మొలచినా,
తల జుట్టు మొలచినా,
నీదె భారము స్వామి;
పేద్ద సం సారము స్వామి;
అది ఓ కా సారము స్వామి;
కాని, మమ కారమే స్వామి;
నీ ఆన మఱియు నీ అండయు లేకుండ
ఉంటి - నీ కొండ దరికైన చేర లేకుండ;
నీదు మొక్కు తీర్చుకోలేకనే
ఢక్క, ముక్కీలు తిని ముక్కు చునున్నాను;
పేద వారము స్వామి ! దూర భారము స్వామి !
నీతో బేరము స్వామి !!! నీవె దిగివచ్చి మరి
చేదుకో నను నీ దరి !!!!
వెంకట రమణ తెలుగుతేనియలు
రామ కార్యమున మారుతి సాగరము ను లంఘించె
కాసారాము వలె రామ ముద్రను చూపి మాత
భారమును బాపె రామ చంద్రుని దుఃఖమును
దూరమును చేసె చూడామణి చూపి
శ్రీ రామ పరివారమున వాసికెక్కే హనుమ శ్రీరామబంటుగా
రాజ రాజేశ్వరి తెలుగుతేనియలు
పని భారము తో అలసి సొలసిన సభ్యులకెల్ల
అనుభవ సారము కల్గిన కవితలు కలిగించె
మనో వికాసము అవదులెరుగని తెలుగు తేనీయల
వేదిక పరి వారము హృద్య భాదలకెల్ల కడు దూరము
వి. వి. శ్రీనివాస్ తెలుగుతేనియలు
అంశం : సాహితీ సేద్యం
తెలుగు తేనియలు సమూహంలో వారాంతం లో సాహితీ కార్యాచరణ ప్రణాళిక
ఉత్పలమాల
సారతరార్ధసంపదలసారము గైకొని శారదాకృపన్
దూరముగాకు ! పుస్తకముదోహదమాయె వికాససంపదల్
వారముకో సమీక్షను విభాసితమౌ హృదయంగమంబులై
భారమదేమి కాదు ప్రతిభాగరిమంబుల జూపఁగావలెన్
సారములేని జీవితము సాహితిసేద్యము జేయలేనిచో
నేరవు జూపి చక్కగను నీ హృదయమ్మున పంచగావలెన్
కస్తూరి శివశంకర్ తెలుగుతేనియలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి