25, నవంబర్ 2020, బుధవారం

చిత్రం పై పద్యం - 66, 19.11.2020

 


చిత్రం పై పద్యం  - 66


దుష్ట దనుజులను దునుమ దుర్గ మాత

గాన వతరించి మనుజుల కష్టములను

బాపితివి. నేడిల నురుకు పాటు బాపి

యసుర కోవిడు నిదునుమ యోష ధీధ

రిస్వరూపంబు గనవత రించి నావు.

యెషదీధరి-వైద్యురాలుఊరుకుపాటు -కష్టము

సూరే వెంకటప్పయ్య

 

 

సర్వం శాంతము

----------------------

 

నిర్మలంగా మనసు

నమ్మకంగా భక్తితో

నాగులను కవ్వించక ,

కదిలించక ,నొప్పించక

 

జరిపిన నాగుల

చవితితో తొలగు

అనుమానములు,

అపవాదములు

 

'నాగపూజ శాపం

బౌను, నరుల కిలను '

లాటి అపనమ్మకములు

భయములును !

 

జి మురళీ మోహన్ రావు

 

 

శార్దూలము 

ఇంతింతై భయమెంతయో పెరుగుగన్  యే రీతి రక్షించెదో

చింతాక్రాంతులమాయె ! సంశ్రయములన్, స్థేమంబు, ధైర్యంబులన్

భ్రాంతుల్ దీర్చి వరమ్ములిచ్చి, కృప సంప్రాప్తించు రూపమ్ము, వి

క్రాంతంబౌ వరమీయు తల్లి మదిలో శ్రాంతమ్ము యోగ్యమ్ముగా !

 

కస్తూరి శివశంకర్

 

వచన కవిత,

 

కరోనాసురా !ఇక చాలించు నీ ఆగడాలు,

నీ రాక్షసత్వానికి అందరూ బలి ఔతున్నారు,

బరి తెగించి విస్తరిస్తున్నావు, ఇక కరోనా,

నిరోధక టీకాతో నిన్ను అంతమొందిస్తాను,కాచుకో !

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 


 

ఓం ఫట్

------------

శక్తి స్వరూపిణి! నీ

అయుధములచే

సంహరించితివి

అతి భయంకరరులను .

 

శక్తులను వైద్యులకు,

శాస్త్రజ్ఞులకు ప్రసాదిస్తూ,

కనబడని క్రూర కరోనుడిని

కూడా తరిమి కొట్టు తల్లీ!

 

జి మురళీ మోహన్ రావు

 


 

మనం ఎదుగుతున్నాం...!

నిజంగానే మనం ఎదుగుతున్నాం !

 

నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం... ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం... అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం

 

నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...  నేనే హీరో... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

 

గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం... అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!

 

చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం... ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం... ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం... ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!!

 

మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి... కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం...! కానీ... మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...! మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..! మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం...! నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం...!

ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!!

నిజంగానే మనం ఎదుగుతున్నాం !!!

 

 

కందము 

మగువలు కొనియాడవలెన్

నగవులు చిలుకు మలయ పవనాంకురములుతో

మగవారి ఘనత తెలుపుచు

తగువారని పలుకమంటి ! ధన్యులమాయెన్ !

 

 

భుజమిచ్చి ఓదార్చడమే తప్ప

తనకొక భుజమడగని బేల తాను

కన్నీరు పెడితే నవ్వుతారని

నవ్వుమాటున నీరు దాచే చెలమ తాను

తనవారి బాగు ఎరిగి తన స్వార్థమెరుగని

తాపత్రయ జీవి తాను..

తపమైనా , జపమైనా తనవారి కోసమే...

ఏడడుగులేసిన రాణి కోసం సర్వం ధారపోసే బలి చక్రవర్తి తాను...

తన వారి వరమే తప్ప తన వరాలడగని

పిచ్చి మారాజులందరికీ .....

 

పు'ఋషుల' దినోత్సవ శుభాకాంక్షలు

 విష్ణుప్రియ

 

*పిచ్చి మారాజు అంటే జాలి తప్ప తిట్టు కాదు, గమనించగలరు!!

 

 

పైపైనే   ధీరతనం

మనసులో బేలతనం

కుదిరితే చూపించు ఆగ్రహం

కుదరకపోతే అంగలార్చు

అనుగ్రహం కోసం

 

ఇంటికి పెద్ద దిక్కు

దిక్కులే చూసేను

పెళ్ళాం ఊరెడితే

 

అందరి కడుపులు

నింపాలని తాపత్రయం

తన కడుపు నింపుకోవడం

తెలియని  కష్ట జీవి

 

అమ్మానాన్నల వరపుత్రుడు

అక్కయ్యల ప్రియ తమ్ముళ్లు

చెల్లెళ్ళకు ప్రియమైన అన్నయ్య

కూతుళ్ళ రోల్ మోడల్

మరి భార్యలకి ??????

 

ఇలా వ్రాస్తూ పోతే , మీకే కష్టం

తమ్ముళ్ళందరికి, మీ అక్క శుభాశీస్సులు

 

కరోనాను దునుమాడి కరుణతో మము కాపాడి

కనిపించని శత్రువుని కూకటితో పెకలించు

ఈ జన్మభూమి పై నువు జన్మించిన రోజునే

ఇంతకన్న మంచిరోజు వేరేది లేదు మరి...

కాళికవై  మణికర్ణికవై మరొక్కసారి జన్మించు

ఝాన్సీ రాణి వై క్రిమిసంహారిణి వై ...

 

Incidentally

*ఈరోజు ఝాన్సీలక్ష్మీ బాయ్ పుట్టినరోజు

 

విష్ణుప్రియ

 

 

శాంతి కపోతాలై తెల్లని వస్త్రాలతో

అవనిపై నడయాడే అశ్వనీ దేవతలు మీరే

 

మరి మీకు ఉగాదులు , ఉషస్సులు ,

పండుగలు , పౌర్ణములు

అన్నీ ఆసుపత్రి ఆవరణలోనే

అస్వస్టుల ఆలనా పాలన లోనే

 

రేయింబవళ్లు  రోగుల సేవలో

అలుపెరగని సైనికులై

వ్యాధులతో పోరాడే

మీకేమిచ్చి రుణం తీర్చుకోగలం ?

 

జనన మరణ భ్రమణం లో

కలవరపడు వారికి మీ చిరునవ్వు యిచ్చును

కొండంత మనోధైర్యం

 

 

కానరాని కరోనా రక్కసి

పాలిట కనకదుర్గలై కాలరాసే వేళ

కనుమూసిన వైద్యులకు

వైద్య సిబ్బందికి ఇదే నా అశృ(క్షర) నివాళి

 

రమ,కంకిపాడు.

 

 

కందము 

మాతాజీ మన తోడై

చేతిన బట్టెను సిరంజి సిద్దమె యనుచున్

మూతికి మాస్కును గట్టుకు

నూతము నీయంగ వచ్చె నుండదు కరొనా!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 

హరి యవతరించి రుజలను హతము చేయు

కాళి కరొనాను కబళించ కలియదిరుగు

ఈశుడొచ్చి కాచగలడ నెదురు చూచి

శక్తి రక్షించి తానిచ్చు యుక్తి యనుచు

 

నమ్మి యలసి పోతిమి స్వంత దమ్ము లేక

స్వీయ జాగృతి దప్పక స్వీకరించి

నూరు కరములవిశ్రాంత పోరు సలుప

వైద్యుడాదిశక్తిగ మారె వైరి దునుమ!

 

వాణిశ్రీ నైనాల, విజయవాడ

 


 

సీసము 

కంటి కగుపడని కరొన క్రిమి నెరపు

       విధ్వంస కాండ నివ్వెరగు జనులు

తహతహపడుతుండె ధరణియంతయు క్రిమి

       వెలయించు దౌష్ట్యంబు విగ్రహింప

విగతజీవులవోలె వితతి కాట్పడుచుండె

        నరయు నాధుని కొర కంగలార్చ

ధన్వంతరి వలె క్షేత్రము నందవతరించి

        గంధవతి ప్రజలన్ గాంచు తల్లి

 

తేటగీతి 

దశ కరములతో డేతించి దశ విధంబు

లాయుధములు బూని సతత మంతరించు

దుర్గ మాత టీకా తోడ ద్యోతమిచ్చి

వైద్యులకొసంగి మముగాంచ ప్రణతులమ్మ

 

వెంకట్.సి హెచ్

 


 

తేటగీతి 

కోవిడను జాడ్యము జనుల కొంపముంచె

 మందిరాన దైవము దాల్చె మౌనముద్ర

 రక్కసిని జంప వైద్యులే రక్షణిచ్చె

 యంబయే నేడు యీరీతి నవతరించె

 డా. నాగులపల్లి

 

 

నా ప్రయత్నం మధురాక్కర లో 

 

రాకు, రావలదని నిను రమ్యరీతి కోరినా

యేకు మేకై మము వలచి యేడ్పించిన మహమ్మారి

నీకు తగిన శాస్తి జేయనెంచి పిలిచితిమిల

మాకొరకు కరోనాసుర మర్దిని కదలిరావె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

తేటగీతిలో

 

అంతు తెలియని రోగమ్ము చింత రేపి

మానవుల నంత మొందించి మహిని కుదిల

పఱచె మందుమాకులు లేక బాధ పడుచు

వినతి జేసిరి జనులంత వెతలు తొలుగ

 

దుష్టుల నిహతి జేయుచు దుర్గతులను

బాపి, దుర్గవై నిలచి కాపాడి నావు.

వింత రోగమంతము జేయ సుంత కరుణ

జూపి మము కావవే యంబ! జోతలివియె

 

అవళూరు సీత

 

 


1)కందము

 

దేవీ కరోన రోగపు 

హావళిలో మునిగియున్న యవనిజనులకున్

నీవాల్లభ్యము , దయయను

నావను మాకొసగిచూపు నయముగఁద్రోవన్

 

2)కందము

 

దుష్టుడు కరోన రాక్షసుఁ

స్పష్టముగా కాళిభంగిఁ బరిమార్చంగా

భృష్టముఁజేయుము దల్లీ!

శిష్టుల రక్షించు కొఱకు శ్రేయోమతివై

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

వచన కవిత

 అమ్మా జగజ్జననీ

మహిషాసుర మర్దనీ!

 

హరిహరులకజేయులగు

పెక్కండ్రు భీకర రాక్షసులన్

నీదు అత్యుగ్ర రూప దర్శన

మాత్రమున వణికించినావు

 

దేవతాశక్తులాయుధములై

నిను ధరింపంగా మహా శక్తివై

క్రోధురాలివై సింహవాహినివై

ఘోర గర్జనలతో దుముకుతూ

 

నీ త్రిశూలపు ప్రయూషములతో

ఆ దుష్ట రక్కసులన్ సంహరించి

శిష్ట రక్షణ గొప్పగా చేసినావే!

 

కొంగొత్త కరోనా యను రాక్షసుడు

భూలోకమున విలయ తాండవం

చేయుచుండ ఆగ్రహమున్ పూని

రయమున సంహరించు చుంటివి?

 

ఎంత కరుణ ఎంతెంత దయ నీకు?

 

CA కె మల్లికార్జునరావు

 


 

కరోనా రక్కసి జగమంత

వణికించు చుండ

అమ్మ జగదాంబ కాళికాంబ

ప్రళయ  రుద్ర రాలై

ఎరుపెక్కిన కన్నులతో

అపర చండికలా

సిరంజియే వజ్రాయుధముగా చేబూని

అంత మొందించ

అవతరించె.

 

దేవరశెట్టి నాగమణి 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...