25, నవంబర్ 2020, బుధవారం

దత్తపది - 57 - “గురు, శుక్ర, శని, ఆది”, 20.11.2020

 


దత్తపది - 57

“గురు, శుక్ర, శని, ఆది”


సీసము:

అసురుల నణచగ యజితుడు వటునిగ భువిపై నవతరించి భూపతి యగు

బలిని కోరెను మూడు పదముల ధరణిని వలదని యిదియంత వర్ధమాన

మాయని వారించె మానుషాద గురువు యాచన నెన్నడు యాచరించ

ని యుపేంద్రుడడిగిన నిక్కము గానిత్తు దానము చేయు ప్రధాన నీ

ని యతిని విడువనని గురు శుక్రు నికి తెలిపి దానమిచ్చె బలి.యిరు పదము

ధర యాకాశముల గొలిచి మూడవపదమును మోపగ బలియు శిరము

నందించ పదముతో నాది పురుషుడును బలిని రేకుమణచె పాత ళముకు.

 

తేటగీతి:

పరమ పావన దివ్వియ పదము మోప

బలి యెంత పుణ్యము జేసె, కంబ పాణి

కావలిగ నుండె సుతల లోకమునకు, నసు

రాధి పతియు ధన్యత నొందె రమణ దయకు

 

విష్ణువు: అజితుడు, వర్ధమానుడు, ఉపేంద్రుడు, ఆది పురుషుడు, కంబ పాణి, రమణుడు

 మానుషాద -రాక్షస,  రేకుమణచు -అణగ ద్రొక్కు

నీశనియతి -ఈశుని యానగా పెట్టిన నియమము (ఒట్టు)

 

సూరే వెంకటప్పయ్య

 

వచన కవిత,

దానవ గురువు ఐన,

శుక్ర ఆచార్యుడు,  బలి దానమివ్వ,

శని లా జలము కడ్డుపడ, వామనుడు,

దర్భతో పొడిచె, తద ఆదిగా కన్ను పోయెశుక్రునకు...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 

తేటగీతి

తోటివారి సంతసమది దుర్భరముగ

తలచి వగచు చుండనెపుడు తలపులందు

చిత్తశాంతియె దూరమై శీర్ణమౌను;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

తృష్ణ యంతరించని నాడు తృప్తి లేదు

తృప్తి లేని యెడల శాంతి దొరకదెపుడు

శాంతిలేని మనంబది చంచలమ్ము;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

స్వార్థ మన్నది లేకయె సాగుచుండి

ద్వేషమది వీడి పయనింప ధ్యేయమెరిగి

ప్రగతి బాటను మనుజుడె పరగుచుండు;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

కందము 5

బాధింపకు పరమేశా;

శోధింపకు నాదు మనము శూలధరా; యా

రాధించి నీదు కృపనే

సాధించుకొనెద నితాంత సామీప్యతతోన్!

 

  

కందము 6

ఆదట తనువందున గౌ

రీ దేవికి సగమొసంగి లీలను జాటన్

మోదము నొందగ నీవే;

తాదాత్మ్యమ్మునను మురిసి తనిసితి నీశా!

 

కందము 7 

శిరమున గంగను దాల్చిన

పరమేశా; నిను దలంచి భవ్య మనమ్మున్

పరవశనై సతతంబును

హరహరయని నే జపింతు హర్షమ్మొప్పన్!

చల్లా దేవిక.

 

సీసము

తేనియల్ పంచెడి తెట్టు ప్రణాళికన్  ప్రముఖులు కూర్చిరి పాటవముగ

సోమ వారమునందు శుక్ర వారమునందు వెలుగు దత్తపదితో వెగ్గలముగ

చిత్ర కవితతోడ జిగి బంచి మంగళ,  గురువారములు వెల్గు మరులు గొలిపి

శని ఆదివారముల్ సాహిత్యపు సమీక్ష తోడ ప్రహేళికల్ ద్యోత మిచ్చు

 

 

తేటగీతి

చక్కని సమస్య పూరణ వెక్కసముగ

నిచ్చెడి బుధవారము మది కింపు కలుగు

ప్రథిత స్వేచ్ఛా సమర్పణల్ ప్రతిభ తెలిపి

దళము తెలుగుసాహిత్య సుధలొలికించు.

వెంకట్.సి హెచ్


 

వచన కవిత

గురుడు పలు విద్యల బోధించు,

శుక్రుడు భోగముల ప్రసాదించు,

శని మహాత్ము కష్టముల నొసగి,

జీవితమున సత్యములు చెప్పు,

ఆది దేవుడు తనువెల్ల  ప్రకాశమై,

జగమునకు జీవశక్తి వెదజల్లున్,

వీరినందజేసిన సృష్టికర్త దైవానికి,

మనము కృతజ్ఞతలు చెప్పవలె.

CA కె మల్లికార్జునరావు

 


 

తేటగీతి

పదునెనిమిది పురాణాలు వ్రాసి తాను

వాసికెక్కెనాదిగురువై వ్యాసమునియె

శుక్రరహిత ఫలంబగు శుకుడు భాగ

వతము శనిపాశ ముక్తికై ప్రకట పరచె

డా. నాగులపల్లి

 

 

తేటగీతి

ఆదిభిక్షువు వరములీ "స్వాదుగతులు"

సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనుల

సాహితీసేద్యముల వికస్వరము నింపి

మాధురీభరిత కలిత మంజుషముల

వరములై ప్రావృషములౌ విభాసురములు

సారస పరాగములు జిల్కు జావళీలు

వికచబంధూక పదములపేశలములు 

కస్తూరి శివశంకర్

 

 

ప్రతి వారం

వారం వారం ప్రతి ఆదివారం

పగలు పన్నెండుకి ఆకాశవాణి ద్వారా

శ్రీ గురుభ్యోన్నమః అని మొదలుపెట్టే

ఉషశ్రీగారి భాగవత ప్రసంగంతో

ఊరంతా నిర్మానుష్యమే !

 

సోమ నుండి శుక్ర వారముల దాకా

అయిన పాఠములన్నీ క్షుణ్ణంగా శనివారమే

అన్ని విధముల చదివేసుకుంటే

మిగులును ఆదివారము హాయిగా గడుపుటకు!

 

 

ఆశీస్సులు

గురుత్వాకర్షణ శక్తి

గురించి,అత్యంత వేడి,

ప్రకాశవంత మైన

శుక్ర గ్రహం గూర్చి

చదివే విద్యార్థికి

న్యాయంచేసే  దేవుడు

శనిగారు వాడికి చెప్పి

ప్రతిరోజూ ఆదిత్య హృదయం

చదువుకో  నాయన

నీకు హాయిగా వుంటుంది అన్నారు .

 

జి మురళీ మోహన్ రావు

 

 

భాగవత గ్రంధ విశిష్టతను వర్ణిస్తూ

గురుతర పద్యమాలికలగుంభన మాశు క్రమంపు రమ్యమై

పరవశ నిగ్గులం జిలికి పండిత పామర మోద యోగ్యమై

వరనుత సంస్కృతిం గలిగి భావ పదాది విరాజితాఖ్యమై

పరమపవిత్ర కావ్యమిలఁ భాగవతంబు సుపూజ్య మానమై

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

మంజరీ ద్విపద

ఆదిత్య హృదయంబు నాదిగా నుడివి

సోమ మంగళగ్రహ చొప్పుగని, బుధ

గురు శుక్ర శని పూజ గురుతరం బుగను

మతినిల్పి ధ్యానించ గతిమార్చి గాచు

వాణిశ్రీ నైనాల

 

 

మంజరీ ద్విపద

పడతులు సోమవారమన్న శివుని పూజించు

మంగళవారమన్న మారుతిని పూజించు

బుధవారమన్న విఘ్నేశ్వరుని పూజించు

గురువారమన్న సాయిబాబాను పూజించు

శుక్రవారమన్న మహాలక్ష్మిని పూజించు

శనివారమన్న బాలాజీ ని పూజించు

ఆదివారము మగని పూజించు

 

దేవరశెట్టి నాగమణి

 

 

నలు గురు  కూడిననవ్వులు పూయు

శుక్ర వారమనిన సుదతులు మురియు

అత్యా శని ను కాల్చు యగ్నియై నెపుడు

ఆది అంతములన్నీ యాహరి కెరుక

 

 

తేటగీతి

గురువులుండెడి బడులన్ని కోవెలౌను

శుక్ర గ్రహములోప్రేమలు శోభ నొందు

శనియె కష్టమోర్చుకొనెడు శక్తి నొసగు

ఆదిశేషుడే మోయునీ యవని నంత

 

రమ, కంకిపాడు.

 

 

కందము

ఉండుచు నుపవాసమ్ములు

మెండుగ నాదిని విడువక మేయుచు తామే

తిండిని గురు శుక్ర శనిన

దండగ జేయరు; వదాన్యత నెరుగరు కదా!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 


సీసము

తిరిపెమ డుగుచును తెల్లని దొరనాది బిక్షువై నొప్పుచు విరలి వీడ

మౌనప్రబోధముల్ మౌనీంద్రులకుజేసి దక్షిణామూర్తి ప్రథమగురువన,

ధనపతిత్వము నిచ్చి దానవ గురువుగ శుక్రుని నియమించె శూల పాణి!

శనిబాధ తొలగించు శంకరా! నీవుతై లాభిషేకములోలలాడ, కరుణ

 

కురియ జేయుము దేవేశ! కోక నదుడ!

నీటి ధారల మురిసేవు నీల కంఠ!

యల్ప పూజల హర్షించు యష్ట మూర్తి!

శరణు వేడెద మయ నిను చంద్ర మౌళి!

అవళూరు సీత

 

 

రోజు దత్త పది కి నా ప్రయత్నం.

రోజు మాయింట పాటించు పూజ క్రమము 

సోమవారము శంభుని సోయగమును

మంగళకరమగు హనుమ మరుదినమున 

బొజ్జ దేవుని కొలుతుము బుధుని దినము

గురుని వారము సాయిని గురుతు జేసి

శుక్ర వారము లక్ష్మిని శుచిగ కొలిచి

ఏడు కొండల బాలాజి వేడుకలను 

ముచ్చటగ శనివారము పొనరించి

ఆదివారము నాడేమొ యాది దేవు

నిగొలువన్ ప్రతిదినచర్య నింపు కొనెద.

 

పొనరించి = చేసి

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

 

 

సేకరణ: సి‌ఏ. మల్లికార్జున గారు

మంచి గేపకాలు:

 

ఇండీషను బుడ్డికి పైన లబ్బరు మూతుండీది గేపకవుందా? దానికి బొంతసూత్తో మయంగా కన్నవెట్టి సీసాలో నీల్లోసుకుని పలకమీద ఇదుపుకుని తుడుసుకునీవోల్లుం గుర్తొచ్చిందా.,

పక్కోల్లుకూడా అడిగీవోరు నాకోసారి ఇదపవొరే అని గేపకవొచ్చిందా?

అప్పుడికి పలక జిడ్డొదలకపోతే ఉమ్మెత్తాకులతో తుడుసుకుంటే పలక మల్లీనల్లగా ఐపోయీది గేపకవొచ్చిందా?

పెన్నులో ఇంకైపోతె ఒరేయ్ రెండుసుక్కలెయ్యవొరే?

అని ఇంకుసుక్కలు అప్పడిగిన రోజులు గుర్తున్నాయా!!!

పెన్ను సరిగ్గా రాయకపోతే నోటితోటి పాళి,నాలిక తీసినరోజులు..., నోరంతా ఇంకైపోయీది., ఆరోజులు మర్సిపోయుండరులే?

ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకేరకం బట్టలుకుట్టించీవోరు పండగలప్పుడు...,

అయికూడా ఎదిగీపిల్లోడని లూజుగా కుట్టించేసీవోరు.., గేపకవుందా?

వూల్లోకెవరైనా మోటారు సైకిలేసుకొస్తే ఆబండెనకాల పరిగెట్టేసీవోల్లుం., మనంకూడా నోటితో బ్రూం బ్రూం.. పిపీప్ అంటా ఎల్లీవోల్లం గేపకవుంది కదా?

ఆరోజుల్లో పోలీసోల్లని సూత్తేసాలు దడొచ్చేహేది. పోలీసు కనపడితేసాలు ఎవడింటికాడుపరుగు

అప్పుడు పోలీసులు నిక్కర్లేసుకునుండీవోరు.

ఆయ్యెంత లూజుగా వుండీయంటే వుంకో ఇద్దరు దూరొచ్చు అందులో అలాగుండీయి.,

పోలీసోల్లనే కాదు మేట్టార్లని సూసినా అలాగే పారిపోయీవోల్లం అంత భయం భక్తి వుండీయి.,

సవరం ఎప్పుడూ పురికొస కటింగే.,

చెంపలంటా కారిపోయేలా తలకు గొబ్బరినూని.,

చిరిగిపోయిన మడతమంచం గుడ్డలే కదా మనకి

ఆరోజుల్లో స్కూలుబేగ్గులు.,

బల్లో ఇంటర్వెల్లో కొనుక్కునే సేమ్యా ఐసు గేపకవుందా..? యేండి సేమ్యా ఎక్కువున్నా దివ్వరాండి.., అనడిగిన రోజులు మర్చిపోగలమా.!

పాడేసిన సిగరెట్టుపెట్టి లేరుకుని ఆటితో యీదలోరి బుజ్జిగేడి దూల్లమకాంలో బచ్చాలాడినరోజులు..., ఆటిని మల్లీ బేల్లులాగ పేర్చి మనవెంతో ధనవంతుల్లాగ ఫీలైన రోజులు..

మరువతరమా..?

తాటితాండ్ర సేతిగోల్లకు అంటించుకుని తిన్నారోజులు..

ఆకలేస్తే ఆవకాయముక్కలు పైపుకాడికట్టికెల్లి కడిగేసుకుని తిన్నారోజులు..,

ఉసిరికాయలు, మావిడికాయలు తినేసేసి పల్లు పులిసిపోయి ఇంటికాడన్నం తినాపోతే తన్నులు తిన్నారోజులు ఎలా మర్చిపోగలం..?

ఏసెలవొచ్చినా పిల్లలవంతా గుంపులు గుంపులుగా పోగయ్యి ఎన్నిరకాలాటలు..,

ఆరోజుల్లో అందరం ప్రాణస్నేహితులమే కదా..!

ఒరేయ్ నువ్ నాజట్టుంటావొరే..? అనడిగీవోల్లుం.., ఎంతకమ్మగా వుందామాట..,

కబాడీ ఆడితే ఇద్దరుబాగా ఆడీవోల్లు చెరోపక్కన నిలబడి కోరుకునీవోరు..,

ఒరే యీదలోరి బుజ్జి నువ్విలావొచ్చేయరా అనొకడు

ఒరే ముత్తాలోరి బాబి నువ్విలాగరారా అని కోరుకుంటం..., లేపోతే పంటలేసుకుని ఆఖర్న మిగిలినోన్ని దొంగెట్టమంటం.....!

అబ్బబ్బబ్బా ఆరోజుల్ని తలచుకుంటేనే మనసంతా భారమయ్యిందో.., తేలికయ్యిందో తెలియని మధురానుభూతులు.

 

సేకరణ: సి‌ఏ. మల్లికార్జున గారు

 

 

ఒక శివరాత్రి రోజున శివుడి గురించి నేను వ్రాసుకున్న గేయ కవిత

 

గంగ నెత్తిన ఉండ నీకేటి కొదవో

నీటి చుక్కొకటే చాలు అన్నావు

కన్నీటి చుక్కయిన మక్కువన్నావు

 

గుప్పుమనెడి పూలు ఎక్కువే నీకుండ

ఆకులలుములే నీకు ఆసక్తి అంట

తుమ్మి పూవులే నీకు తృప్తి అన్నావు

 

భోగాల తులతూగు గౌరి నీదైనా

బూడిదే రాసుకొని తిరిగేవు నీవు

కట్టే బూడిదే రాసుకొని తిరిగేవు నీవు

 

అమ్మ అన్నపూర్ణయే ఆలి నీకైనా

బిక్షమెత్తితే గాని పొట్ట గడవాదంట

అందుకేనేమో గరళమ్ము  నీవుమింగినావంట

 

శివా శివా అంటేను బుసా బుసా సొత్తిచ్చి

పాములను  నగలుగా వేసుకున్నావు

సొట్ట చంద్రుడే నీకు సిగపూవు ఆయే

 

పదమంటితే చాలు భువనాలనిచ్ఛేవు

వల్లకాడే నీకు వీడు అన్నావు

అక్కడే నీవు తైతక్కలాడేవు

 

వేన్నోళ్ల పొగిడేటి నమక చమకములుండ

పంక్షాక్షరియే ప్రీతి అన్నావు

శివ పంక్షాక్షరియే ప్రీతి అన్నావు

 

ఇన్ని ఇచ్సిన కాని మాకేటి కొదవో

దయ తోన చూడమని దండమెట్టేము, సామీ

మమ్ములా దయ తోన చూడమని దండమెట్టేము

 

ఇన్ని ఇఛ్చిన నీవు మరిచావు ఒకటి

ఇచ్చేటి గుణమొకటి మాకీయలేదు

పరులకిచ్చేటి గుణమొకటి మాకీయలేదు

 

అందుకేనేమో తిక్క శంకరుడవని తిట్టేము మేము

మా తిక్క శంకరుడవని తిట్టేము మేము

 

అవళూరు సీత

 

 

అంశం : సాహితీ సేద్యం

తెలుగు తేనియలు సమూహంలో వారాంతం లో ఉండవలసిన సాహితీ కార్యాచరణ ప్రణాళిక

 

ఉత్పలమాల

సారతరార్ధ సంపదల సారము గైకొని శారదాకృపన్ !  

దూరముగాకు ! పుస్తకముదోహదమాయె వికాససంపదల్ ! 

వారముకో సమీక్షను విభాసితమౌ హృదయంగమంబులై  

భారమదేమి కాదు ప్రతిభాగరిమంబుల జూపఁగావలెన్        

సారములేని జీవితము సాహితిసేద్యము జేయలేనిచో 

నేరవు జూపి చక్కగను నీ హృదయమ్మున పంచగావలెన్

 

 

తేటగీతి

ఆశ నిబిడమైనట్టి వాడల్పుడౌను;

ఈశు క్రమముగా బెరిగిన నేర్చు జనుల;

శమదమాది గుణమ్ముల సదమలుడగు

సద్గురువు బోధనివి వీడ సాధ్యమౌను!

 

చల్లా దేవిక.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...