29, నవంబర్ 2020, ఆదివారం

సమస్యా పూరణం - చేదు నిజము లెపుడు సేద దీర్చు , 25.11.2020

 

సమస్యా పూరణం

ఆటవెలది     :    చేదు నిజము లెపుడు సేద దీర్చు 

కందము        :    చేదు నిజము లెప్పుడు కడు సేదను దీర్చున్

ఉత్పలమాల:  చేదు నిజంబులెల్ల మదిసేదను దీర్చును చిత్రమే నహో 

 

వేళ

చల్లని రాత్రి

వెన్నెల ధారగా జారిన వేళ

నింగిన చుక్కలు నవ్విన సమయాన

మబ్బు తునకలు చాటున నవ్విన చందురుడు

హాయిగా వీచే మలయమారుత ఉషస్సు వీచికలు

అప్పుడప్పుడే కనులు తెరుచుకుంటున్న కలువలు

 

చల్లని రేయి

మది హాయిగా నిండిన రేయి

అందరూ నిదిరిస్తున్న నడి రేయి

ఆలోచనలు అలలై మనసు తీరం తాకుతున్న రేయి

అప్పుడే విచుకుంటున్న పూరెక్కలు సుమగంధాలు వెదజల్లుతున్న రేయి

ఎక్కడో వెచ్చని అమ్మవడిలో ఒదిగిన పసికూన ఉలికిపాటు

జామురాత్రి..............

 

కోవూరి

 

విశాఖార్ణవమంజులాతటులతో మంత్రమేశారు, సమ్మోహనం చేశారు.

కందము  

నీలికడలితీరము గని 

నీలోత్పలములగు పద్య నెలవంకలతో   

కోలాటము; మీ కవనము

శైలూషి పదములలోన చైత్రములాయే !

 

కందము  

స్వాదురసావిష్కృతులవి  

వేదము, నైవేద్యమైన పీయూషములై 

మోదముబెంచు చదివినన్      

చేదు నిజము లెప్పుడు కడు సేదనుదీర్చున్  

కస్తూరి శివశంకర్

 

 

నా పూరణ ఉత్పలమాల గా

 

లేదు పరాజయంబనుచు రేగుట యేలనహంబు తోనయా

 వేదన లేలయా వెతల వేసరి కృంగుట నేలయా భువిన్

 వేదపు భాషణల్ దెలిపె వింతగు భ్రాంతిగ చావుపుట్టుకల్

 చేదు నిజంబులెల్ల మది సేదను దీర్చును చిత్రమే నహో

డా. నాగులపల్లి

 

కుళ్ళు కుత్చితములు గూడిన వారికిన్;

సాటివారి బ్రతుకుపాటు జూచి,

వారి కొచ్చినట్టి వ్యధల మూలంబగు

చేదునిజము లెపుడు సేదదీర్చు

 

డా. నాగులపల్లి

 

 

ధర్మ దేవతలను ధర్మాసనములోన

చూడవచ్చుననుచు జూనియర్లు

వాదనలను, కుప్రతివాదనలన్ విని

చేదు నిజము లెపుడు సేద దీర్చు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

ఆటవెలది

బాధ పడెడి వారి బాగును కోరుచు

నిజము దాచ బోకు యిలను నెపుడు

తేల్చి జెప్పి జూడు తేలిక పడుదునే

చేదు నిజము లెపుడు సేద దీర్చు

 

 

 

కందము  

 

రోదించుచు నిరతము పలు

వేదనలో నుండు జనుల  ప్రియముగ తోడై

బాధలు దూరము జేసెడి

చేదు నిజము లెప్పుడు కడు సేదను దీర్చున్

 

ఉత్పలమాల

కాదన గల్గునే నిజము కాటికి కాపును గాచు వీరుడై

వేదన లుండినన్ నెపుడు ప్రేల కసత్యపు మాటలెచ్చటన్

బాధల యందు యుండినను బల్కెను సత్యము మెండురీతిగన్

చేదు నిజంబులెల్ల మదిసేదను దీర్చును చిత్రమే నహో

 

 

కందము  

 

వాదన జేసెడి లాయరు

పోదుము నిక గెల్వలేము పోయెను కోట్లున్

లేదిక మీ ఫీజు యనిన

చేదు నిజము లెప్పుడు కడు సేదను దీర్చున్

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 

వచన కవిత:

 

తప్పని మాట చెప్పు వారిని

అనృతము లాడని వారిని

సత్యమున చరించు వారిని

భగవంతుడు సకల దుఃఖ

కూపముల నుండి పైకి చేదు,

నిజము లెప్పుడు సేద దీర్చు.

 

CA కె మల్లికార్జునరావు

 

 

ఆటవెలది

లంకజేరి హనుమ లంకను శోధించి

తరువుపైన గూడి తరలి బోవ

భీత యైన సీత బేలగా నగుపించ  చేదునిజములెపుడుసేదదీర్చు

 

హేమలత

 

జయమ్ము నీదేరా

 

మానసిక ధృఢత్వము

పెంచుకొనుచూ

సమస్యలను శోధించుచూ

పరిష్కారములు సాధించవలె .

 

నిజ  జీవితమున ఎదురౌను ఎన్నో కఠిన వాస్తవములు .

 

ధృడమైన మనసుతో

శాంతముగా ఆలోచించిన

అటువంటి చేదు

నిజము లెపుడు సేద తీర్చు

కొందరికి , మరి కొందరికి

చేదు నిజములెప్పుడు

కడుసేదన్ తీర్చును .

 

జి మురళీ మోహన్ రావు

 

"చేదు నిజము లెపుడు సేద దీర్చు"

ఆటవెలది

 

తానొకటి తలచిన దైవమొకటి కూర్చు

సర్వ జీవితంబు సాయి కృపయె

చింత పడక దైవ చింతనా నిరతితో

చేదు నిజము లెపుడు సేద దీర్చు

 

"చేదు నిజములెప్పుడు కడుసేదను దీర్చున్"

కందము

 

మోదముకై తపన పడక

ఆదిశబరుడిని భజించి నద్భుతమయి నా

స్వాదన జీవనము గడుప

చేదు నిజములెప్పుడు కడుసేదను దీర్చున్

 

"చేదు నిజంబు లెల్ల మదిసేదను దీర్చును చిత్రమే నహో"

ఉత్పలమాల

 

మోదము తోడ నీశ్వరుని మ్రొక్కుచు శ్రామికులయ్యి జీవ నా

స్వాదన సల్పు ధీరులకు సర్వము దైవ కటాక్షమౌ భువిన్

వేదన లెందుకో యనుచు వేదము లభ్యసనమ్ము జేయగన్

చేదు నిజంబు లెల్ల మది సేదను దీర్చును చిత్రమే నహో

 

వెంకట్.సి హెచ్

 

 

మధురమయిన తిండి రోగమిచ్చు

చేదుమందుతొ రోగముపశమించు

తీపి మోసమెపుడు గాయపరచు

చేదు నిజము లెపుడు సేద దీర్చు

                    

విష్ణుప్రియ

 

చేదు నిజంబు లెల్లఁ మది సేదను దీర్చును చిత్రమే నహో

వ్యాధి కరోన బాపగను    వ్యాక్సిను, మాత్రల కోసమై సదా

శోధన చేయగన్, కడకు సూక్ష్మ మెఱింగియు, నేడు రేపునో

బాధలు వీడగా యిలకు, పాటవ ప్రజ్ఞకు గీర్తి దెచ్చెగా

చేదు  నిజంబు లెల్ల మది సేదను దీర్చును చిత్రమేనహో

 

 

తేటగీతి

వేదనల బ్రతుకు నరులివ్విధిని చిత్త

శోధనలు జేయ దోషంబు జూడ నెంచి

మేధకు పదును బెట్టగా  మిధ్య వాదు

చేదు నిజము లెప్పుడు కడు సేద దీర్చు

 

 

కందము

 

రోదన బలమే బిడ్డకు,

వాదన లాడకు చిలిపిగ బాలల తోడన్

క్రోధము వీడిన మోదము

చేదు నిజము లెప్పుడు కడు సేదను దీర్చున్.

 

శిరీష

 

 

ఆటవెలది

కల్లలాడి మదిని కలతచెందుటకంటె

నిజము చెప్పి పడిన నింద మేలు

కల్లలవియె పెంచు కల్మషపు మనసుల్

చేదు నిజము లెపుడు సేదదీర్చు

 

కందము

మోదము కూర్చు మెరుగులకు

యాదట పడి కపట రీతి నార్జన చేయన్

ఖేదము కలిగించు ధనము

చేదు నిజము లెప్పుడు కడు సేదను దీర్చున్

అవళూరు సీత

 

 

ఆటవెలది

పట్టుగ నిలచి తన వారలందరికిని

ఉన్నతులుగ దీర్చు యుత్తమునికి;

తనదు సుఖము లెల్ల త్యాగమ్ము జేసిన

చేదు నిజములెపుడు సేద దీర్చు!

చల్లా దేవిక.

 

రుజలు గుణము గాఁగఁ  రోగికినొక్కచో

చేదు మందు నిడుట చేటు గాదు;

గుణము పఱచు గొప్ప గుణము నిజమ్ముగా

""చేదు""!  నిజము లెపుడు సేద దీర్చు !

 

( గుణము అను పదము...

యమకాలంకారము గా నిచట ప్రయుక్తము)

వెంకట రమణ

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...