4, నవంబర్ 2020, బుధవారం

03.11.2020 చిత్రం పై పద్యం - 61

 



ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచే నోము....


తేటగీతి

కాలమును మించి విలువైన కలిమి లేదు

వ్యథయె మిగులు నయ్యది వ్యర్థమవగ;

వెసను జేయుమన్ని పనులు విలువ దెలిసి;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

నీతిగా చరింప భజించు నిన్ను పరులె;

నీతి యన్నది వీడిన నింద సేయు

నైతికత తోడ సతము మాన్యతయె గల్గు ;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

చల్లా దేవిక

 

 

సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’

 

అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో  కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.

 

అట్ల తద్ది కథ

 

అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.

 

కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.

 

అట్లతద్ది అంతరార్థం

 

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి     వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.

 

ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.

రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.

 

ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

 

సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

 

ఇరువదియును నాల్గు ఘంటల సామీప్య భావిలో "అట్లు" చేయువారందలందఱును... అట్లు ....మన సాదర సోదరీ సోదరుల యుదరములకట్లెట్లో..నేటి లేబ్రాయపు యువోదరములకు  కట్లెట్లెట్లో.. మరియునామ్లెట్లెట్లో...  కవితారసాస్వాదనాంగద గొన్న  మా మస్తిష్కములకు మీ కవనపు పట్లట్లే యనునట్లు...  అట్లే సేసి, మము, పసిరి చేల గట్లపై గల చెట్లకు గట్టిగా గట్టిన "యట్ల తదియ యూయేల తొట్ల" నట్లిట్లు బిట్టుగా నూచి, మాచే గట్టిగ గేకిసల్ గొట్టించవలయు..

మఱి... అట్లేనా ?

వెంకట రమణ  

 

 

#అట్లతద్ది

 

ఇప్పటి  మన నేటివ్  తెలుగు మగ పిల్లలగురించి తెలీదు గానీ...నా చిన్నపుడు అట్లతద్ది అంటే మాకు మరి ...మాకు కూడా పండగే....

పొద్దున్నే "ఉట్టి కింద ముద్ద' చక్కగా ఆడ పిల్లలతో పాటు తెల్లారుఝామునే...గోంగూర పచ్చడో...నువ్వుల గుండ...పులుసులతో జామ్ జామ్మని లాగించేసీ....మళ్లీ బజ్జుని లేచి  దూలానికి  తాడు కట్టి పీట ని ఉయ్యాల చేసుకొని  ... సారి ఊగేసి...అమ్మ చేసిన టిపిను పాపం అక్కచెల్లెళ్లు బిక్కుబిక్కు మని చూస్తూ ఉంటే  బుక్కేసి.....వాళ్లతో కలిసి మల్ళీ  పళ్లూ  పలారం కానిచ్చీ ....మధ్య మధ్య.... అట్లతద్ది ఆరట్లు...ముద్దపప్పు మూడట్లూ  అని ఆడేసుకుని....గోరింటాకు రుబ్బుకుని తెచ్చుకుంటే....మధ్యలో దూరి, వేళ్లకి అర చేతిలో చందమామ.పెట్టేసుకుని....ఆరేదాకా పక్క కూచుని కథలు చెప్పుకుని....సాయంత్రం చంద్రుడు వచ్చాడా లేదా అని వెతికులాట....మరి ఎంత తొందరగా వస్తే మరి అట్లు అంత త్వరగా తినొచ్చు మరి...మధ్యలో పూజ...అందులో మా మామ్మ చెప్పే కథ... రాజుగారి కూతురికి అన్న ,పాపం అద్దంలో మంట చూపెట్టి చందమామ అని వ్రతం పూర్తి చేయించటం.... ఎట్సెట్రా...కథ ప్రతీ సంవత్సరం విన్నా....ఎప్పుడూ కొత్తగా ఉండేది‌‌....అది మా మామ్మ గొప్పదనం....

కథ తర్వాత   వాయనాలకి మా అందుకూరి మామ్మ ,నర్శ మామ్మ వచ్చే వాళ్లు... రెగ్యలర్గా.... చంద్రుణ్ని చూసి ఘబాల్ని అట్ల మేటు మీద పడేవాళ్లం....అందులో కండిషన్....చిన్నట్లు తిమ్మనంతో తినాలి....మరి పెద్దట్ల కోసం కొన్ని త్యాగాలు చెయ్యాలి మరి.....  సుస్తుగా.... మస్తుగా బొజ్జనిండుగా తిని బజ్జునే వాళ్లం.....

మరి ఇప్పుడు ....మగపిల్లలు......ఊప్స్....సారీ.....ఆడపిల్లలకు తెలుసా... అట్లతద్ది... చేస్తున్నారా???

 

కన్నాజీరావు

 

 

అట్ల తద్దేయోయ్.. ఆరట్లోయి

వచన కవిత,

 

అట్ల తదియ అందరు అతివల పండుగ,

కన్నెలను కోరికల ఊయల పై ఊపే పండుగ,

పెండ్లి కాని ఆడపిల్లలు  నోములు నోచే పండుగ,

పెండ్లయిన గృహిణుల  పూజలు ఫలించే పండుగ...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

వచనం లో నా భావన

 

వెన్నెల వాకిళ్లయిన కన్నులతో

అన్నుల మిన్నలు వేకువ సిరివెన్నెల్లో

అర చేత పండిన గోరింట మెరుపులతో

సిగలో చేమంతులు దాల్చి మంచు బిందువులతో

అభ్యంగన స్నాన మాచరించిన పూబాలల వలే ముదు ముద్దుగా

ఆటలు ఆడుతూ చక్కని వరుడినే వరముగా

ఇమ్మని కమ్మగా పాడుతూ గౌరమ్మని కోరుచూ

ఊయల లూగుచు మధురోహల తేలుచు

అరుణోదయ మగు వరకు అలసట తెలియక

చేసెడి సంబరమే అంబరమంటగ పడతుల  మోమున

మెరిసేకాంతులే శరత్చంద్రికలై కళ కళ లాడును కదా !!

 

రమ

 

 

అట్లతద్ది ఆరట్లు....ముద్దపప్పు మూడట్లు

యనుచు మురిసిపోయేడు ముదితలు

ఉల్లాసముగా,ఉత్సాహంగా వూయాలలూగుచు

రాబోవు వర్షాన కాబోవు వారుణ్ణి తలచుకొని

చేత గోరింట,సిగలో చేమంతులతో ఈ పూబంతులు

ఆనందముగా,అతివాలందరూ కాలము గడపిరి

 

బి‌వి‌ఎస్

 

 

ఆహా.. కడు హృద్యం అక్కా..

 

 నా చిరుప్రాయంలో... అట్ల తద్ది రోజున.  అమ్మతెల్లవారు ఝామునే మమ్మల్ని (నాతోపాటు తమ్ముడు, చెల్లాయిని కూడా అన్నమాట) నిద్రలేపి, దంత ధావనం చేయించి, క్రిందటి సాయంత్రమే, మాకోసమే, రోట్లో రుబ్బి చేసిన గోంగూర పచ్చడి, కందిపచ్చడి,ఒకే కంచంలో కలిపి  మాకు గోరు ముద్దలు తినిపించి, గడ్డపెరుగుతో ముక్తాయింపఁ జేసి,దిష్టి దీసి, ఇక ఆడుకోండని, అమ్మ, వీథిలోకి పంపితే.. పక్కింటి, ఎదురింటి అక్కలతో.... మగా, ఆడా తారతమ్యాలే తెలియని ఆ పసిడి పసి ప్రాయంలో...ఆ వెన్నెల పరుచుకున్న, చిరుచిరు చలులు కౌగిలించుకుంటున్న  ఆ  మా వీథులలో.. పంటలు వేసుకుంటూ, పరిగెడుతూ, పడుతూ, లేస్తూ, దులిపేసుకుంటూ... పప్పు చారు, "దాగుడు మూతలు- దండా కొర్"దొంగా పోలీసు,కోతి కొమ్మచ్చితొక్కుడు బిళ్ళలు, కుందుళ్ళు...ఇంకా..  ఉయ్యాళ్ళు.... అలుపెరుగక  ఆడుకుని,అనక..  ఇంటికి వచ్చిన తరువాత, తీరికగా, క్రింద పడిపోయినపుడు, దోక్కుపోయిరక్తపు చెమ్మతో ఉన్న కాళ్ళని,అమ్మ చూడకుండా జాగ్రత పడుతూ....తమ్ముఁడు, చెల్లాయి నేను.. ఒకరికొకరం  చూపించుకుంటూ, మాలోమేము నర్మగర్భంగా.. ముసిముసిగా నవ్వుకుంటూ .. పరిపూర్ణంగా  ఆస్వాదించిన ఆ మరపురాని, మరవలేని, తిరిగిరాని అమాయకపు లాగుల నాటి బాల్యాన్ని గుర్తు చేసావ్ అక్కా !

కోటి ధన్యవాదాలు అక్కా..

 

 

మడిబట్టలో ఇంతి సౌభాగ్య పూజలు చేసి

తొలిజామున చద్ది భోజనాలతో గడిపి

పండు వెన్నెల లాటి అరచేతిలో చక్కని గోరింట పండి

వరుడి కోసం ఎదురుచూపులు..

సౌభాగ్యం కోసం వ్రత పూజలు..

పట్టుపరికినిలో పడుచు పిల్లల అల్లరులు...

ఉయ్యాల ఆటలు...  అట్లతద్ది అట్లు...

సాయంకాలం వెన్నెల చంద్రుడి కోసం పడిగాపులు

అబల నెరవేర్చు అమ్మవారికి ప్రీతికరమైన వ్రతపూజ

ఆడదే ఆధారం ప్రతి ఇంట్లో ఓ అమ్మగా...

అందుకే అంటారు అపురూపం ఆడజన్మ...

సమూహంలో ఉన్న మా తోబుట్టువులకు అమ్మలకు అట్లతద్ది శుభాకాంక్షలు

 

సూర్య తాడిపూడి....

 

 

 

అట్లతద్ది

 

అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్..

అంటూ పట్టుపావడాల పడతులాడుతులాడగ

ఆనక రావాలంటే ఇప్పుడు వెళ్ళాలన్న

నిజం ఆకళింపుకాక అవస్తపడుతున్న రేరాజుని

తొందరపెడుతూ దినకరుడు తొంగి తొంగి చూస్తున్నాడు...

 

ఉరికే ఉత్సాహంతో కాంతలు ఊయలలూగుతుంటే

చెలిమి చేయు చెట్లను చూసి బలిమి లేని మొక్కలసూయ పడుతున్నాయి...

 

చక్కని మగని కొరకు మక్కువ తీర మగువలు

ఉపవాస దీక్షతో పూజించు గౌరమ్మ బిడ్డలై

గంగమ్మను కొలిచి గోవుమాలక్ష్మికి మొక్కి

పసుపు ముద్దల, ఫలముల, అట్ల వాయినంబులిచ్చి

ముదితల దీవెనలందగ నియతి చూపు నెలతులు మన

నిండు సంస్కృతికి నెలవులు

 

వాణిశ్రీ నైనాల

 

 

 

ఆటవెలది లో 

1

అట్ల తదియ నేడు యక్కలు,చెల్లెండ్రు 

నోము నోచుకొనిరి కోమలముగ 

మసలి రాజుల కొమరి సునామ కథవిని

యాడి పాడ గౌరి యాదుకొనెను 

మసలి - ప్రయత్నపూర్వకముగా

 

2️

కోమలాంగులరిగొ కుజదోషములు బోవ 

నట్లు జేసి గుజునికారతిచ్చి 

పూజచేసికొనగ పుణ్యఫలములిచ్చె 

గౌరి దేవి తుదకు గౌరవముగ

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

 

 


 అట్లు వాయనంబుగ నొసగు పండుగ

 

గౌరీదేవి శివుని కోరి వ్రతము చేసిన పండుగ

 అమ్మాయిలు మంచి పతిని కోర చేసే పండుగ

వివాహితులు భర్తలు చల్లగా ఉండాలని

చేసే పండుగ పట్టు పరికిణీ లతో ఊయలలూగుతూ

కేరింతలతో చేసుకునే పండగ గోరింటాకు చేతులతో

 గౌరీదేవి నోము నోచుకునే పండుగ

చంద్రకళల నుండి సౌభాగ్యం పొందగోరి

సౌభాగ్యవతులు చేసుకొనే పండుగ

అట్లతద్దోయ్ ఆరట్లోయ్ అంటూ అంగనలు

ఆనందముగ నోము నోచుకునే పండుగ

ఈ అట్లతద్ది.

 

దేవరశెట్టి నాగమణి.

 


 

అంశం:-అట్లతద్దె ప్రాముఖ్యత


శీర్షిక :- సంప్రదాయపు నెలవు

 

ఆశ్వయుజ మాసంలో బహుళ తదియన మహిళల మనసు తెల్పె మంగళకరమైన పండుగ...

 

గోరింటాకు చేతులకు పెట్టి, కొత్త పరికిణిలతో కాలి మువ్వల అందెలతో కన్నెపిల్లలంత కలిసి జరుపుకునే ముచ్చటైన పండుగ...

మధురమైన ఊహలతో, స్వచ్ఛమైన నవ్వులతో గౌరిదేవిని కొలిచె ఘనమైన పండుగ...

 

దశ సంఖ్యకు ప్రాధాన్యతనిచ్చి, అమ్మ వారికి అట్లను, ముత్తైదువులకు వాయినమిచ్చె విశిష్టమైన పండుగ...

సంప్రదాయపు నెలవై, పునఃసృష్టితో ముడిపడి, ఆటపాటలతో  తరుణిలంత ఊయ్యాలూగే ఉత్సాహమైన పండుగ...

 

చంద్రోదయమున ఉపవాసము విరమించి, మంచి మొగుడికై మనసుతో వేడుకునే మధురమైన పండుగ...

 

 

సి.హెచ్. రజిత, ఆచంపల్లి, కరీంనగర్

 

 


 

అట్లతద్ది ఆడపిల్లలు నోచే నోము....


కందము

 

ఊగుచు నూయల పడతులు

తూగుచు తా కోర్కెలందు తొలకరి వలపున్!

రాగల కాలము తలచుకు

నాగక పండుగను జేయు నట్లను దినుచున్!!

 

చంపకమాల

అతివలు జేయుచున్ నెపుడు నల్లరి తీరుగ నట్లతద్దినన్

మతులను మాపగా వెరసి మంత్రము వేయుచు నూయలూగుచున్

వెతలను వీడుచున్ తలచి వేడుక నొందెడి భవ్యకాలమున్

సతతము సంతసంబులను సాధ్యము జేయును పండుగన్ నిలన్

 

ఆటవెలది

ఊయలూగు తరుణి యుల్లాసముగనేడు

అట్ల తద్ది యనిన నాటలాడు

వేడుకైన దినము వేదనలు విడిచి

సంతసముగ జరుపు సంబరమ్ము

 

తేటగీతి

పట్టు పరికిణి ధరియించి పల్లె పడుచు

అట్లతద్దిన ప్రియముగ నాటలాడి

ఊయ లూగుచు పండుగ ఉత్సవమ్ము

స్నేహితుల తోడ సతతము జేయదగును

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

1. కందము


ఆటలకు పడతులంతా

మాటల కోలాహలముల మాటున చేరే

పాటల  వూయల ఊగే

బాటలు పరచుచు తదియకు పండుగ తెచ్చే

 

2. భద్రకం.


ఆటకై పిలువ తద్దియై

మాటలే కలిసి యట్టులే

పాటయై పడచు ఊయలే

బాటలే పరచి చేరెనే

 

డా.సతీష్

 

 

ఊయలలూగుచు పడతులు

తీయని తలపుల వలపులు తీరగ శ్రితులై

చేయగ గౌరీ వ్రతములు

మాయని ఫలముగ మమతల మనువును కోరే

 

అవళూరు సీత


 

అట్లతద్ది

ఈ సాయంత్రం తొలి చుక్క పొడిచే సమయం....

 

ఉత్తి రోజుల్లో దిక్కూ దివాణం లేకుండా పడున్న పట్టు పరికిణీ పావడాల దుమ్ము దులిపి,నెత్తిమీద పూలు మొలిచాయా అన్నట్టు పెరట్లో పూలన్నీ జుట్టుకి సింగారించి, ఉంటే నగలు లేకుంటే చిలకలపూడి బంగారం వేసుకుని రామచిలకలా తయారయ్యి , పళ్లెం నిండా వేడి బువ్వ ,ప్లేట్ నిండా పూజా సామగ్రి  , ఇంకో ప్లేట్లో అట్లు ...ఓపక్కన పెట్టి వాకిట్లో పీటలేసుకుని చెంపకి చేతులేసుకుని , వగలరాయుడు గారు విధి నిర్వహణ కోసం వినువీధిలోకి ఎప్పుడొస్తాడా అని ఆకాశం కేసి ఎదురుచూస్తున్నారు మా ఊరి అమ్మాయిలు ...

 

ఉదయాన్నే లేచారేమో కళ్ళుమూసుకుపోతున్నాయి, చద్ది తర్వాత ఏం తినలేదేమో పొట్టలోపల పిల్లి కూతలు వినపడుతున్నాయి, ఆడి ఆడి అలిసిన కాళ్ళు పీకేస్తున్నాయి, పాడి పాడి వాగిన నోళ్ళు నొప్పెడుతున్నాయి ... ఈయన చూస్తే ఇంకా రాలేదు...!

 

ఈలోగా...రెండురోజులుగా వీళ్ళు చేసిన హడావిడి గురించి మహాడేసుకుందాం నాతో రండి..

 

నాకు, మా చాగంటి జ్యోతికి ఉన్నట్టు అందరింట్లో సిన్సియర్ బామ్మలు ఉండరండీ , ఆనవాయితీ లేదు అని వంకతో ఊర్లో సగం మంది పెరట్లో మామిడిచెట్టంత గోరింటాకు మొక్క ఉండదు, కాబట్టి మా చింతా పద్మావతి లాంటి వాళ్ళైతే ముందు రోజు స్కూల్ ఎగ్గొట్టి వాళ్ళే గోరింటాకు వెతికి కోసుకుని రుబ్బుకోవాలి... నానా తిప్పలు పడి కోసిన గోరింటాకు ఉత్తప్పుడు పండకపోయినా పర్లేదు, ఈరోజు పండకపోతే అవమానం కదా, అందుకే అందులో పోక, పెంకు, కవిరి, చింతపండు, కిరోసిన్ ఒకటేమిటి దొరికినవన్నీ వేసి రుబ్బుకుని రెండు చేతులకి , కాళ్ళకి ఖాళీ లేకుండా పెట్టుకుని, తీసేసాకా కడక్కుండా దానికి జామాయిలో, నూనో రాసుకుని ఇంకో గంట....తెల్లారేసరికల్లా వాళ్ళ అదృష్టపు రంగులు బయటపడేవి!!

 

జాబిలి చంద్రేస్సర్రావ్ డ్యూటీ దిగి ఇంటికెళ్ళేలోగా చాగంటి వారింట్లో ఝాము విందు జరిగేది ,కుండెడు తరవాణి అన్నంలో  గిన్నెడు గానుగా నూనె, చిన్న రాచ్చిప్పడు ఊరగాయ కలిపి మా వీరలక్ష్మి వాళ్ళ మామ్మగారు ముద్దలు పెట్టేవారుసుష్టుగా లాగించి పెద్దల పర్యవేక్షణ లో ఆటలు మొదలు పెట్టేవాళ్ళం , ఇండోర్-సబ్జా (ఆ పదాలేవో సరిగ్గా తెలిసేడవదు) , కుంటాట , ఎల్ ఓ ఎన్ డి ఓ ఎన్ లండన్ లాంటి నోటికిచ్చిన ఆటలన్నీ రేపటికి బ్యాన్ అన్నట్టు అంకితభావంతో ఆడేవాళ్ళం.

 

దాదాపు 11 అయ్యేసరికి పొట్టలో కీకారణ్యపుకీచురాళ్ళ గోల మొదలయ్యేది , ఆకలేస్తోందే అని నోట్లోంచి మాటొచ్చేలోగా, "ఉపవాసం ఉండకపోతే నీకు మన అటుకులమండపం చెట్టుమీదుండే బ్రహ్మరాక్షసుడు ముగుడవుతాడు చూడు, మాకేం బాబా..నీఇష్టం, మొన్నప్పుడో మా పిన్నికి కాపడ్డాడంట కూడాను" అని ఫ్రెండ్స్ భయపెట్టేవారు .

 

సర్లే !! స్నానం చేసొస్తా , ఉయ్యాల దగ్గర కలుద్దామని చెప్పి.. ఇంటికి పాక్కుంటూ చేరేదాన్ని .

 

మా బామ్మేమో మనకి ఆనవాయితీ లేదులేవే, గోరింటాకు పండితే చాల్లే , ఏం కాదు తిను అని ఓ నాలుగు అట్లు, నాలుగు పచ్చళ్ళతో పెట్టేది, ఓ పక్క ఫ్రెండ్స్ మాటలు నిజం అవుతాయని భయం ఉన్నా , వాడికెంత ధైర్యం ఉంటే నన్ను చేసుకోవాలి, అంతగా తేడా పాడా వస్తే బామ్మా వాళ్ళు చూసుకుంటారులే అని ధైర్యం తో సుబ్బరంగా మెక్కి ఉయ్యాల ఊగడానికి వెళ్ళేదాన్ని !!

 

కాలవగట్టునున్న నిద్రగన్నేరు చెట్టుకి పెద్ద పెద్ద మోకు తాళ్ళుకి పెద్ద రోలు కట్టి , దాని మీదకెక్కించి "హ్మ్..పాడు అట్లతద్దోయ్ , ఆరట్లోయ్ " అంటూ ఊగించేవారు, ఆ ఉయ్యాల ఊగేప్పుడు సరిగ్గా పట్టుకున్నామా గట్టుకావల-ఈవల వల కలిపి ఊగచ్చు, లేదంటే డైరెక్ట్ కాలువలోకి డైవింగే ,నాలాంటి ధైర్యవంతులకి తోడుగా మా బాబాయో, పిన్నో కూర్చునేవారు , మనకి కళ్ళు తిరిగి పొట్టలో మిగిలున్నదేమైనా బయటకి వచ్చేస్తుందేమోనన్నప్పుడు అడుగుతారు .... ఎవరు వారు ? ఎక్కడి వారు? ఎప్పుడొస్తారు? ఎలా ఉంటారు? అని , అబ్బాయిలు అయితే నచ్చిన అమ్మాయికి వాడు నచ్చినట్టే అని తెలుసుకోడానికి ఓ పేరు చెప్తాడు, ఆ పిల్ల కిసుక్కు అందా ..సరి సరి, కినుక్కుమందా ..వాడికి ఆరోజు మా సత్తెమ్మింట్లో ఇస్త్రీ నే !., గజనీ వంశీకుడైతే మరుసటేడుకి జబ్బలు చరుచుకుని ఇంకో అమ్మాయిని వెతుక్కుంటాడు....ఆడపిల్ల ఎక్కినపుడు మాత్రం అందరికీ అనుమానమే ఎవడిపేరు చెప్పుద్దా ? అని..

 

నాగరాజుగారి పరివారం పంట పొలాల్లోంచి బయటకొచ్చి బుస్సుబుసుమని  ఆర్కెస్ట్రా వాయించేలోగా ఇంటికి చేరుకునేవాళ్ళం....

 

అదుగడుగో వచ్చేసాడు మన హీరో ... మా ఊరి పిల్లల్లో సందడి మొదలైంది , చంద్రుడంటి అందం, శివుడంటి మనసున్న రాముడంటి భర్త కావాలని కోరుకుంటున్నారు ... త్వరగా పూజ అవగొట్టి అట్లు వాయనాలు ఓ వాయ లాగిద్దామనుకుంటున్నారు , మబ్బు చాటుగా చందురుడు , దొంగచాటుగా అబ్బాయిలు వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

 

ఇహ మనమెందుకిక్కడ ..

పదండి మనం కూడా అట్లు లాగించేసి అట్లతద్దికి శుభం కార్డు వేసేద్దాం !!!

 


 

అట్లతద్ది

 

ఆశ్వయుజ బహుళ తదియ

అట్లతద్ది

ఆడవారి ఆనందాలహేళి

అవివాహిత ఉయ్యాల కేళి

పడతుల పట్టుపరికిణీల హోళీ

 

గోరింటాకు చేతులతో

గోమాత పూజతో

గోరంత దీపాలతో

కొండంత ఆశలతో

గౌరీదేవిని పూజించే

ఘనమైన పండుగ

 

కన్నెపిల్లతనకలల రేడుకై

ముత్తయిదువ తన మగని ఆయుష్షు కై

అట్లవాయనాలెఆనవాయతీగ 

ఆనందముతో పంచుకునే పండుగ.

 

డి. వి. హేమలత

 

 

 

తెలుగింటి ఆడపడుచులకు అట్లతద్ది శుభాకాంక్షలతో...

నేటి చిత్రమునకు సీసమాలిక

 

వేకువ జామున వెన్నెల వెలుగులో   గుమ్మలందరు జేరి యమ్మ పూజ

జేయు నట్లతదియ జిలుగు జెప్పతరమా!  తెలుగు సంస్కృతికిదే వెలుగు దివ్వె

మైదాకు పులకించి మగువ కరముల నందొదిగి శోభిల్లు పర్వదిన మందు

కన్నెయ లందరు వన్నె చిన్నెలు  వెలయిస్తు సోయగ మొలకించు నిలన

ముత్తైదవులకిచ్చు ముత్తెపు వాయనములె సుమంగళిగను ముదముగూర్చు

సద్గుణ పురుషుని సతి యగుటకు కన్యనోసెడి నోములే వాసి నిచ్చు

ఉయ్యాల నూగుతూ సయ్యాట లాడెడి  పల్లె చిత్రంబిది పరికరింప

మెండుగ కనిపించు నిండైన తెలుగుదనపు ప్రభవమిదె జానపదమందు

తెలుగింటి పడతులు తృప్తి నొందెడి పర్వదిన మహిమెంతయో తెలుప తరమా!

 

తేటగీతి

 

 అట్లతద్ది తెలుగు వారి కబ్బురంబు

నిచ్చు పర్వదినమె; హ్లాద మిచ్చి తెలుగు

సంస్కృతి ప్రభవించ కలుగు సర్వ పర్వ

దినములు నిలుప గాంధ్రులు తేజరిల్లు

 

వెంకట్.సి హెచ్

 

 

అట్లతద్ది అనగానే స్మృతి శీర్షములో అలరారు

కొంటె భావలాహిరులు

ఒక సరణిలో చదువగలరు....

వచనంలో కాక చిన్న పద్యాలుగా 

 

అట్లతద్దిశోభలలోన అల్లరులని   

పంచునిచ్చోట వింతైన పరవశమ్ము !    

గగనకేతువౌ మెరుపుతీగగనరాక  

విభ్రమముతో వెదుకుచు నే వీధులన్ని 

 

ఊయలూగు సుభాషిణి ఊహలేమి ?

మనసులోని తీయనిమాట వినుటకొరకు    

సిరులవెన్నెల మంజీరశింజితముల 

కొరకు వెదుకుచూ కనులేమొ కొంటెగాను !!

 

అల శరత్చంద్రికల తోడు కలవరింత

మిసిమి కాటుకకన్నులు మీసరముల 

సొబగు గోరింట కెంపారు శోభ కొరకు  

ముఖశశిద్యుతి విరితమ్మిపూల కొరకు  

 

కలలరాకుమారుని సౌరు గాంచవచ్చు 

లలితసుమనమ్ర పాదపమ్ములగదల్చి 

వికచపంకజవనులు నబ్జినుల గాంచి

అనిలదేవుడు "యువకుల" నలరుజేయు 


 

వేకువన పిల్ల గాడ్పుల వీచి వీచి 

కనుల పండుగై మంజులకరములందు 

వలపు వీచికలో సిగ్గు వాచవులకు 

కన్నెల "కపొలమ్ముల" నాడు కాంతులీను !

 

అల శరత్చంద్రికల తోడు కలవరింత

మిసిమి కాటుకకన్నులు మీసరములు 

సొబగు గోరింటకెంపారు శోభలందు 

ముఖశశిద్యుతి విరితమ్మిపూల వోలె 

 

కస్తూరి శివశంకర్

 

 

 

ఆశ్వయిజమాసం అమ్మలను కొలిచే సమయం

అపరంజి బొమ్మలు ఆటలాడే సమయం

అయిదోతనం కోసం నోములెన్నో నోచే సమయం

అందాల అతివలు ఉయ్యాలలూగి

అవరోధాలు లేని అర్ధరాత్రి సమయాన ఆటలెన్నో ఆడి

చుక్కలు కొండెక్కక మునుపే మంగళ స్నానాలాచరించి

చంద్రకాంతులలో  విందులారగించి

అరచేత పండిన గోరింట చూసి ఎంత ఎర్రగా పండితే

మగని ప్రేమ అంత మెండుగా ఉండునని ఏడిపించు చెలుల చూపులకు

అరచేతి ఎర్రదనం చెంపలకు పాకి కెంపులుగ తోచె

 

 

పట్టు బట్టలు చుట్టిన వయ్యారులు ఇల లోన

వెలసిన అప్సరసలయిరి కలహంస నడకల కళ్యాణులు

గుమ్మాల తిరిగి పసుపు ముద్దలను ముత్తయిదువులకు

పంచి సందె సీకట్లలోగంగమ్మ పూజలే చేసి

గోమాత ప్రదక్షిణ గావించి పసుపు,కుంకుమలు కాచే

గౌరమ్మ తల్లికి ఫల,పుష్ప,అట్ల వాయనముల తో సేవించి

ముచ్చటగొలిపే ముత్తయిదువుల కు వాయనములిచ్చి

వారి దీవెనలు పొంది శశి కాంతుని దర్శనము చేసి

అట్లనారగించె  అతివలు సంతసమున

వివాహ తంతు మించు వైభోగం తలపోయుదురు

అట్ల తద్దె వీక్షించు వారలు

 

రాజ రాజేశ్వరి

 


 

తెల్ల వారక ముందుగా మెల్లగాను

నిదుర లేచి మోముకడిగి ముదము బడసి

నెత్తి పై పది చెంబుల నీరు పోసి

స్నానమునునేను  చేసితిన్ సంతసముగ

వంట గది ప్రక్క నున్నట్టి పంచ లోన

చేరి కూర్చుండ  వడ్డించె చెలిమి‌ తోడ

 

ముసలి నానమ్మ‌ పేరెట్టి కొసరి కొసరి

జీల కర్రను జోడించి చేసి‌నట్టి

కంది పచ్చడి బువ్వను ముందు గాను

కలిపి పండ్ల గోంగూరయు చెలిమి చేయ

పచ్చి పులుసు పోయంగ పరవశముగ

గోట ముద్దలన్ జేయుచు నోట జేర్చ

కంట తడినిపెట్టించెను కారమపుడు

మరచితి ననుచు నానమ్మ పరుగు తోడ

నెయ్యి పోయంగ చేతిలో రయ్యి మనుచు

 

పారిపోయెగా నోటను చేరి నట్టి

మంట, మీగడ పెరుగుతో ‌మధుర మైన

ముద్ద లను కలుపుచు నోట మోదమునిడి

జనని చెల్లికిన్ నాకున్ మనసు బెట్టి

పెట్ట త్రేన్చితి మప్పుడు బ్రేవు మనుచు

చెరువు గట్టుపై నున్నట్టి చింత చెట్టు

 

కొమ్మలకు మోకు తాళ్లతో కూర్చి‌ కట్టి

నట్టి ఉయ్యాల చెంతకు నెట్టు కొనుచు

చెల్లి‌ నేను పరుగిడుచు చేర నచట

నెక్కి నూగుచు నుండెగా చక్కనైన

నా మరదలుపిల్ల. ప్రేమతో నన్ను పిలచి

ఊప మనుచు వేడెనుగ నన్నాప కుండ

నేడు లేవుగా నటువంటి వేడు‌కలు‌ మ

రలమరలరావు నెప్పుడు చెలిమి తోడ

 

పూసపాటి

 

సమాప్తం

 

 

 

 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...