21, నవంబర్ 2020, శనివారం

సమస్యా పూరణ 18 11 2020, నాగ పూజ శాపంబౌను నరులకిలను

 


సమస్యా పూరణ

నాగ పూజ శాపంబౌను నరులకిలను

సమస్యాపాదం   తేటగీతి లో..  

 

 

మంజరి ద్విపదతో

 

 శ్రీరామ నీనామ చింతనే చాలు

ఆరాట పెట్టేటి  యాపదే తీరు

మారాము చాలించి మనసులో నిల్చి

కాయుమా తప్పులే కరుణయే జూపి

 

ఇందిరా రమణమా యింట నీవుండ

సందడే చేసేము సంతోషముగను

కొండంటి  యండయే కూడి రాగానె

పండంటి బ్రతుకుల వెలుగులే నిండు

 

నీనామ  స్మరణచే  నిమ్మళించేను

కష్టాల మంటల కాగిన మనసు

నీదయ పొందగా నెమ్మది నొంది

శాంతమే చేకూరు శరణమీయగనె

 

ఇహలోక సంపద లికచాలు స్వామి

నీధ్యాన సంపద నెయ్యమే మేలు

కడదాక చేసేము కారుణ్య సాంద్ర

కడతేర్చు దీనుల శ్రీరామ చంద్ర

 

 

తేటగీతి

 

పూజ కొరకని దెచ్చియు పోయు పాలు

భక్తి నిండుగ నింపుచు పాము కడుపు

మట్టి కోరుచు మనుజులు పుట్ట త్రవ్వ

నాగ పూజ శాపంబౌను నరులకిలను

 

తేటగీతి

 

పండ్లు పూలను ద్రెచ్చియు పాలు తోడ

పుట్ట యందున బోయుచు పూజ జేసి

సర్పముల జూడ కర్రతో జంపుచుండ

నాగ పూజ శాపంబౌను నరులకిలను

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి  | తెలుగు తేనియలు

 

వివాహ మందు నాగ దోష మున్న పూజింతురు కన్యలు

చవితి పండుగ అన్న పాలు పోసి చలిమిడి ఇడుదురు

అతివలు పసుపు కుంకుమలు చల్లంగ ఉండేలా

దీవించమని నోములు నోచేరు ముత్తయిదువలు  

సర్పము కనపడి నంతనే చంపిన నాగ పూజ శాపం బౌను నరుల కిలను

 

దేవరశెట్టి నాగమణి | తెలుగు తేనియలు

 

 

తేటగీతి

నాగుల చవితి దినమున నాగ పూజ

జేయ సకల సంపద లిచ్చు చిలువరేడు

దారిన వెడలు త్రాచుకు దండమెట్టి

పుణ్యమని పాలు వొంపుచు పూజ జేయ

నాగపూజ శాపంబౌను నరులకిలను

 

వెంకట్.సి హెచ్  | తెలుగు తేనియలు

 

 

హెచ్చుగ హింసల ఒనరించి,

మరి హెచ్చుగ నసత్యమాడి,

నిలువెల్లను గరళము నింపి,

మనుజుల్ పుట్ట నిండ పాలు,

నింపి భక్తి వెలయు ప్రార్థనల్,

చేసి పెక్కు కోరికలన్ కోరంగ ,

నట్టి *నాగ పూజ శాపంబౌను

నరుల కిలను* శిక్ష బడయగ.

 

CA కె మల్లికార్జునరావు  | తెలుగు తేనియలు

 

 

 

తేటగీతి

 

కొత్తదనమనంగ సతము కూర్మి జూపు

పాతదన విముఖత తోడ వదల బోకు

కొత్త పాతల కలయికే గురుత గాంచు;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

చల్లా దేవిక  | తెలుగు తేనియలు

 

 

తేట గీతి

 

చుక్క పాలకొరకుయేడ్చి సొమ్మ సిల్లు

వారి వైపైన చూడక పాలు పళ్ళు

పుట్ట లోనిడి మూఢులై పూజ చేయ

నాగపూజ శాపంబౌను నరుల కిలను

 

రమ | తెలుగు తేనియలు

 

 

తేట గీతి

చదువు సంధ్యల వీడి చంచలత తోడ

అదుపు లేని మనమ్మున నగ్గలించి

వలపుకై జేయగా పరవశమున నెల

నాగపూజ శాపంబౌను నరుల కిలను!

 

కందము

 

సాకతముగ నీశుండే

శ్రీకరముగ సర్వులకును సేమము గూర్చన్

ఈ కార్తీకమ్ము సతత

మాకరమౌ పుణ్యములకు నద్భుత రీతిన్!

 

కందము

 

అంతయు నీ దయ యనుచును

సంతసమున కార్తికమున శంభుని వేడన్

చింతను దీర్చి మనమ్మున

కెంతయు శాంతి నొసగు పరమేశ్వరుడెలమిన్!

 

కందము

 

మనమున దోసపు సంశో

ధనము శివశివయనగా సతము జరుగగ; పా

వనముగ జపించు తరి స

జ్జన మనముల సంభృతముగ శాంతినిడుగదా!

 

కందము

 

ఇల మారేడు దళమ్ముల

పొలుపారగ నీశ్వరునిట పూజింపంగా

కలుగును ముక్తి యటంచును

దలపోయుచు భక్తులెల్ల తరియింతురుగా!

 

చల్లా దేవిక  | తెలుగు తేనియలు



 

నాగ పూజ శాపంబౌను నరులకిలను

సమస్యా పూరణం

శేష తల్పానఁ బవళించె చక్రధారి

సర్పహారంబు ధరియించె శంకరుండు

చవితి పండుగ నిష్ఠతో సలుపరేని

నాగపూజ.., "శాపంబౌను నరులకిలను"

 

ఆదిభట్ల సత్యనారాయణ  | తెలుగు తేనియలు

 


 

వచన కవిత,

 

పుట్ట చుట్టూ ప్రదక్షణాలు చేయండి, తప్పులేదు,

పుట్టలోన పాలుపోయండి, తప్పులేదు, కానీ

పుట్టలో చేయి పెట్టి పాము ఉందోలేదో వెతక్కండి,

నాగ పూజ శాపంబౌను, నరుల కిలను ....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి  | తెలుగు తేనియలు

 

 

నాగ పూజ

 

భక్తి శ్రద్ధ , నిష్ఠ లతో, మహిళలు

చేయుదురు నాగులచవితి పూజ .

 

' నాగపూజ శాపం బౌను,నరుల కిలను '

అని కొందరు అనుమానించెదరు .

 

నిష్టా గరిష్టులు భక్తి భావముతో

వారిని ధైర్య పరచవలె !

 

సర్వం శాంతము

 

నిర్మలంగా మనసు

నమ్మకంగా భక్తితో

నాగులను కవ్వించక ,

కదిలించక ,నొప్పించక

 

జరిపిన నాగుల

చవితితో తొలగు

అనుమానములు,

అపవాదములు

 

'నాగపూజ శాపం

బౌను, నరుల కిలను '

లాటి అపనమ్మకములు

భయములును !

 

జి మురళీ మోహన్ రావు  | తెలుగు తేనియలు

 

 

తేట గీతి

చక్కదనము వంకగ జూపి ప్రక్కనెట్ట

నమ్మి వచ్చినాలి కనులు చెమ్మగిల్ల

నీతినివిడి సుఖమునెంచి నీచపు యెల

నాగ పూజ శాపంబౌను నరులకిలను

ఎలనాగ=పడతి

 

వాణిశ్రీ నైనాల  | తెలుగు తేనియలు 

 

 

తేట గీతి

నాగ పూజ దోషంబుల నావల పడ

జేయు నిలనీశ్వర! పరమశివ! వెలయెల

నాగ పూజ శాపంబౌను నరులకిలను,

దెల్పఁ ధర్మాచరణములె తీర్చు వెతలు!

 

దుర్భ కృష్ణశాస్త్రి | తెలుగు తేనియలు

 

 

పూజ జేసి నామజపము పూనుకొనిన

మూడ భక్తి వెర్రి యెనెడి మూర్ఖులుండు

సాంప్రదాయమున్ దూషించు సరుస జేరి

పాలు ద్రాగుపామును గొట్టు పామరులకు

నాగ పూజ శాపంబౌను నరులకిలను

 

పద్మలత మున్నంగి  | తెలుగు తేనియలు



 

తేటగీతి

 

చెట్టు పుట్టల యందును, జీవమున్న

ప్రాణులన్నిటి లోన దైవముగలడని

నమ్మి పూజలు చేయు మానవులము గద

పణము పైనాశతో మూగ ప్రాణుల వధ

జేసి ప్రతిమకు పూజలు చేసినంత,

నాగపూజ శాపంబౌను నరుల కిలను

 

అవళూరు సీత  | తెలుగు తేనియలు

 

 

నాగ పూజ శాపంబౌను నరులకిలను నా ప్రయత్నం....

 

నాగరాజుకనుదినము న్యాదమీక

చవితి నాడు పుట్టల నిండ చామ్య మేసి

చదిరములనిట్లు తిండితో జంపి వేయ 

నాగ పూజ శాపంబౌను నరులకిలను

 

న్యాదము + ఈయక = న్యాదమీక = ఆహారమీయక 

చామ్యము + వేసి = చామ్యమేసి = ఆహారము వేసి 

చదిరములు = పాములు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి  | తెలుగు తేనియలు

 

 

తేటగీతి

 

నాగపూజలే నమ్మని నాస్తికుండు

పాము లనినను నిలలోన పాకు జీవె

యనుచు పుట్టను దొవ్వెడు మనుజు వలన

నాగపూజ శాపంబౌ నరులకిలను

 

హేమలత  | తెలుగు తేనియలు

 

 

తేటగీతి

పాపములు శమించువు నేడు పాలుబోయ !   

నీచులై కపటత్వము నిండుకొన్న 

మనసులో మానవత్వము మరచినంత  

నాగపూజ శాపంబౌను నరులకిలను 

 

తేటగీతి

భూరి సంపదలను జూచి మురిసిపోయి 

సత్క్రియల్ మాని మూఢత స్వార్ధబుద్ధి

లోభమును జూపు భక్తికిన్ లాభమేమి    

తిమిరములును పోకార్చు దీధితులుగనని  

నాగ పూజ శాపంబౌను నరులకిలను ! 

 

కస్తూరి శివశంకర్  | తెలుగు తేనియలు

 


 తేటగీతి

 

విషపుజీవుల విలువను వేదమెరుగు

ప్రకృతి సమతుల్యత కొరకే పాముపూజ!

మూఢ విశ్వాసులై మూలమొదలి జేయు

నాగపూజ శాపంబౌను నరుల కిలను!!

 

డా. నాగులపల్లి   | తెలుగు తేనియలు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...