7, నవంబర్ 2020, శనివారం

సమస్యా పూరణ - అమ్మ పేరు బలుక నంత మౌను 04.11.2020

 


తేటగీతి

జనులెరుంగు నీదు ప్రతిభ జయము నొంద;

సుజనులెవ్వారు జనులందు సుకరముగను

నీవెరుగుదు వపజయమె నీకు గలుగ;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

తేటగీతి

అనుభవించు దాని విలువ నరయకున్న

కోలుపోయిన వేళను కుందు మనము;

విలువ నెరిగి చరించుము తెలివి గాను;

మాననీయుల మాటను మరువకెపుడు!

 

చల్లా దేవిక.

 

 

చేటు తెచ్చు నీకు చేసిన పాపముల్

వేల్పు పేరు తలచ వీగి పోవు

మారు బలుక వలదు, నోరును తెరచి దు

ర్గమ్మ పేరు బలుక నంత మౌను

 

ఆటవెలది

అట్లతద్ది దినము నతివ పూజించి, గౌ

రమ్మ పేరు బలుక; నంతమౌను

సకల పాపములు, సుసౌభాగ్య ములనిచ్చి

గాచు గుబ్బితలను కరుణ తోడ

 

వెంకట్.సి హెచ్

 

ఎంతవారలైన కొంత జీవితమందు

దెబ్బ తగిలినపుడు యబ్బ యనుచు

నూరకుండుకొనక నుపశ మనమునొంద

నమ్మపేరుబలుక నంతమౌను

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

అమ్మా..అమ్మ!

 

అది తాడా - పామా, బొమ్మా - నిజమా, సాధు జంతువా - మృగామా

అని చిన్నప్పటి నుండి

తేడాలు నేర్పించిన అమ్మ పేరు

బలుక నంతమౌను ఎటువంటి

దుఃఖములు ,బాధలైనను

కలుగును ధైర్యము, నిరంతరము అమ్మ జపమే దైవ ప్రార్థన!

 

 

అమ్మ ..

అమ్మ అన్నది చల్లని పిలుపు , అమ్మ పేరు బలక నంత మౌను

పిరికితనము , పీడకలలు , భయములు .

అమ్మ పేరు తలచుచుండ కలుగు ఆనందము   ,

శుభము , విజయము నిరతము !

అమ్మే ప్రత్యక్ష దైవం!

 

జి మురళీ మోహన్ రావు

 

 

రోజు సమస్యా పూరణకి మా నెల్లూరు గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి ని ఆశ్రయించాను.

 

లోక మాత మాయిరుకళల పరమేశ్వ

రమ్మ పేరు పలుక నంత మౌను

వ్యాధి బాధలు, కలవరపాటు నంతయు

సింహపురి భవాని సిరుల నొసగు

రమ

 

ఆటవెలది

భక్త బృంద ములను పాపల వలె సదా

శ్రద్ధ తోడ కాచు సకల లోక

మాత దయను మన సమస్త కష్టములు దు

ర్గమ్మ పేరు పలుక నంత మౌను.

 

డి.రామ నాగేశ్వరరావు

 

 

మాటల ముళ్లు గుచ్చుకొన్న మనసుకు,

కాయానికి అయ్యే కనిపించే గాయాలకు,

ఎవరితోనూ చెప్పుకోలేని బాధా తరంగాలకు,

ఖచ్చితంగా అంతో,ఇంతో,ఎంతో కొంత,

అమ్మపేరు పలుక(గానే) అంతమౌను.

 

ఉష

 

 

 

 

అమ్మ యనుచు బిలువ అమృతంబు నిడును  

కమ్మదనము నిండు కరుణ పొంగు

నమ్మి కొలిచి నంత నరుల చింతలు యన్ని

అమ్మ పేరు బలుక నంత మౌను

 

శిరీష, గుడివాడ.

 

 

నేను మా నెల్లూరు దగ్గర నున్న ప్రసిద్ధ పుణ్య క్షేత్ర దేవత

కామాక్షి దేవి మహిమను పూరణ లో తెలుపు చున్నాను.

 

సింహపురికి దరిన సిరియైన దేవత

జొన్నవాడతల్లి చూపు తగిలి

దుష్టగాలి చేష్ట దూరమై పోవును

అమ్మపేరు బలుక నంత మౌను

 

హేమలత

 

 

1.

త్రిమూర్తులను వ్యక్తపరిచిన అమ్మ,

మూడు లోకముల మూల పెద్దమ్మ,

పేరు బలుక నంత మౌను మనమ్ము,

నెలకొని పీడించు సంసార భయము.


 

 

2.

పల్నాటి నాయకురాలు నాగమ్మ,

పేరు బలుక నంతమౌను మనము,

నందు గూడు కట్టిన  పిరికితనము,

ఉరకలు వేయగ సమరోత్సాహము.

 

3.

భాష ఏదైనా ప్రాంత మేదైనా

దేశ మేదైనా లోక మైదననూ

ప్రాణమున్న జీవి ఏదైన కానీ

గుండెల్లో దుఃఖము పొరలగ

రక్షించమని అరచు అమ్మా!

యంచు, అమ్మ పేరు బలుక

నంతమౌను ఎన్ని బాధ లైనా,

మది సాంత్వనమౌ తక్షణము.

 

 CA కె మల్లికార్జునరావు

 

 


 

ఆది కాలము నుండి అత్యంత ప్రేమయై

సిరులు లోలుకు భాష మన మాతృభాష

ఆది కావ్యము లన్ని జీవనామార్గమౌ

మానవజాతికి జాతిరత్నము లందించిన

సత్కావ్యము,సత్య,ధర్మములు పలు

కు కవులెల్ల మనకు గురువులు కాద

 

అమ్మ యన్నపదము అమృత తుల్యము

అమ్మఉన్నచాలు జగతియందు,బ్రహ్మకైనా

అమ్మ కావలే కదా,దురితము లెనైన దూరమౌనుకదా

అమ్మ పేరు బలుక నంత మౌను.

 

అమ్మ వున్న వాడు అత్యంత బలశాలి

ఆలి వున్నవాడు అత్యంత ధీశాలి

అమ్మ,ఆలి ఉన్న అతడేగా గుణశాలి

తెలిసికొనుము నీవు తెలుగుబాల

 

అమ్మ మనసు చూడ అమృతభాండము

చిలుకు కొలది ప్రేమ తొలుకుచుండు

ఆది అంతము లేక చేసిన పాపము

అమ్మ పేరు బలుక అంత మౌను.

 

అమ్మ పాదము(పదము) మీద

నమ్మకములేనట్టి,పామరుడైన

దుష్ట దూర్ధుడైన,నమ్మకము కల్గి

అమ్మ పదము బలుక కలుషము యంతమౌను

 

 

అమ్మ దేవుని ప్రతిరూపం

అమ్మ దేవుడు ఇచ్చిన వరం

దేవదేవుడు కూడా అమ్మ

లేదని ఆవేదన చెందాడు,అందుకే

అమ్మలగన్నఅమ్మ, ఆది పరాశక్తి

తన అర్ధాంగియై ,తనను ఒడిలో చేర్చుకుంది

స్వామిలో సగమైంది, అమ్మను సృష్టించే

బ్రహ్మ దేవునికైనా అమ్మ కావాలి

అనురాగనికి అమ్మ,ఆప్యాయతకు అమ్మ

ఆవేదనలో అమ్మ,అభిమానానికి అమ్మ

అనురాగములోని "" కారాన్ని,అమృతము లో

ముంచి, మకారానికి మాతృత్వాన్ని జోడించి

"అమ్మ" ను ప్రసాదించాడు. నవ్వినా,ఏడ్చినా

కన్నీరు వచ్చినట్లు,సుఖ,దుఃఖలలో అమ్మ ఉండాలి.

 

అమ్మ ఉన్న బ్రతుకు అమృత తుల్యంబు

అమ్మ లేక బ్రతుకు నరకమౌను

ఆలి ఉన్నానుకాని అమ్మ సమము కాదు

అమ్మకు ఇలలోన సాటి గలరే (ఎవరు)

 

  బి. వి. శాస్త్రి

 

 


 

 

వచన కవిత

 

కాళికమ్మ పేరు పలుక దూరమౌను దుష్ట గణము,

దుర్గమ్మ పేరు పలుక తొలగు భయము కలుగు జయము,

మన అమ్మ పేరు పలుక నంతమౌను బాధ, సొంతమౌను శాంతమ్ము....

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

అమ్మా యని బలికినంత మాట మాధుర్యము

అమ్మా యను బలుకనంత మనసునందు వికలము

అమ్మ పేరు బలుక నంత మౌను భయము

అమ్మ పేరు బలు'కనంత'మౌను ధైర్యము

 

విష్ణుమాయ

 

 

ఆటవెలది

 

దుష్ట శక్తులన్ని దూరమౌ మాయమ్మ

కన్ను దిష్టి మాన్పి దన్ను నిచ్చు

చేతబడికి చేరు భూత ప్రేత ములు నె

ల్లమ్మ పేరు బలుక నంతమౌను

 

వాణిశ్రీ నైనాల

 

 

 

 

 

జగము నేలు తల్లి  జగదంబ యేగద

కరుణ జూపి తల్లి  కామితముల

తీర్చు. చీకు చింత తెక్కలి పాట్లన్ని

నమ్మపేరు బలుక  నంత మౌను

 

తెక్కలి పాట్లు=సంకటములు

 

అవళూరు సీత

 

 

 

త్రిభువనమోహనమ్ములఁగు తీయని పల్కు మనోహరాస్యమౌ 

ప్రభలకు నూత్నకాంతుల విభావము మానసమందు లేనిచో

శుభముల నీయు "వాకృతికి" సుందరశోభల పల్కులమ్మ పే 

రు బలుక నంత మౌను ! నవ రుచ్యములెన్నియొ జాలువారగా 

 

కస్తూరి శివశంకర్

 

 

భక్తుల కొంగు బంగారం భైరవకొన

కొండ కోనలలోన కొలువైన దుర్గమ్మ

కోరి కొలిచిన యెడల ఎట్టి పీడలైన

అమ్మ పేరు బలుక నంతమౌను

 

వి. వి. శ్రీనివాస్

 

 

 

ఆటవెలది

నిద్దురయును లేక నిష్ఠమౌ వేళల

మరల తిరిగి వచ్చు మాయ రుక్కు

లెదురు వచ్చి భయము లేగొలుపునపుడు

అమ్మపేరు బలుక  యంతమౌను

 

 

భద్రకం కోసం కొంచెం స్వేచ్చ తీసుకున్నా

 

 కొమ్మనే విరచి  దండ్రియే

 అమ్మకే ఎదురు చెప్పుటే

 హమ్మనే యనుచు తన్నగా

అమ్మనే పిలువ యంతమౌ

 

రుక్కు - రోగము

 

స్వేచ్ఛా సమర్పణ కందం గా భావించ మనవి

 

బామ్మ యని పిలుపు వినియా

గుమ్మమున వికసిత వదన గూర్చొని యుండన్

 అమ్మమ్మ  నడగ ఎవతే

 బామ్మ  యనుచు యమ్మ పేరు బలుకగ యంతౌ

 

సతీష్

 

 

 

దుష్టశక్తులెన్ని కష్టాలు పెట్టినా

పాముయైసమయము పగనుబూన

చిత్తమందు భక్తి చిందేసి ఆర్తితో

అమ్మపేరు పలుక అంతమౌను!.....

 

రాంమోహన్,  నిజామాబాద్

 

 

ఆటవెలది

 

బాధలిలను తగ్గి పండుగ రోజులే

ఎల్ల వేళలందు నెప్పుడైన

ఇంతకన్న నింక వింతేమి లేదురా

అమ్మ పేరు బలుకనంత మౌను

 

కళ్యాణ్ చక్రవర్తి, ముంబై

 

 

తేటగీతి

అవనిజనుల వెతలకంతు లేదయ చూడ

నన్య మార్గ మనునదసలు లేదు

జతనమున సతతము జగములనేలెడి

యమ్మ పేరు పలుకనంతమౌను

 

డా. నాగులపల్లి

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...