6, డిసెంబర్ 2020, ఆదివారం

మధురమైన మన తెలుగు మహిని వెలుగు - వెంకట్ C.H

 


తే. 1

జ్ఞాన సంపద లొసగెడి శారదాంబ

పద్య రచన జేసెడి పాటవంబొసంగి

దీవెనివ్వ ప్రణతులు వాగ్దేవి! వాణి

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 2

సుకవు లెందరో ప్రభవించి శోభితముగ

కావ్య రచన జేసి సతము గరిమ జూప

దేశ భాషలందు తెలుగు దీప్తి వొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 3

తాళ్లపాక నందు జనించి తనువు పులక

రించునట్లు కీర్తనలు రచించి తెనుగు

హరువు పెంచిన స్వరకర్త అన్నమయ్య

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 4

రామణీయ రామాయణ రచన జేసి

మొల్ల తెలుగు ఘనత బెంచి మోహనముగ

తొలి తెలుగు విదుషీమణి ద్యోతమొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 5

పాల్కురికి సోమనాథుడే పాటవముగ

ద్విపద, తరువోజ, రగడలు విశద పరచి

తొలి తెలుగు కవియై భాష విలువ పెంచె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 6

తొలి తెలుగు కావ్య మందించి తెలుగు నేల

నలర జేసిన నన్నయ్య "ఆదికవి"గ

నవతరింప భాషా కీర్తి వ్యాప్తి జెందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 7

ఉభయ కవి మిత్రునిగ భువి నుద్భవించి

తిక్కన ఘనకీర్తి గడించి, దివ్య కవిత

లల్లి తా కవిబ్రహ్మగ నవతరించె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 8

శ్రీమదాంధ్ర భాగవతమున్ శ్రీకరముగ

నవధరించి పోతన యాంధ్రు లాద్యుడయ్యి

సహజపాండిత్యమున ఘనమహిమనొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 9

శైవ కవిగ గూర్చె కుమార సంభవమనె

వర్ణనాత్మక కావ్యమున్, వాసికెక్కె

నన్నెచోడుడు సురచనా వన్నె చాటి

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

 

తే 10

సుకవి శ్రీనాథుడు రచింప శోభితముగ

నలరె శృంగార నైషధం బద్భుతముగ

వెలిగె కవిసార్వభౌముడై తెలుగు నిలిపి

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 11

ఎర్రన హరివంశము ఘటియించె, నమిత

సౌమ్యునిగ ప్రబంధపరమేశ్వరుడు బిరుదు

తోడ తెలుగు కీర్తి నయించి ద్యోత మొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 12

పదకవితలకాద్యుడు కళాహృదయ, మధుర

భక్తి గల మొవ్వ క్షేత్రయ్య ప్రౌఢ కవియె

కీర్తనలు, పాటలు, కృతుల మూర్తి యితడు

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 13

అష్టదిగ్గజ కవులందు నగ్రగణ్య

పెద్దన మనుచరిత్రతో వెల్లి విరిసి

ఆంధ్ర కవితాపితామహు డయ్యి నెగడె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 14

పారిజాతాపహరణము వ్రాసి నంది

తిమ్మన తెలుగు నుడికార దిటవు తెలిపి

సున్నిత పదసొబగు తోడ శోభ నొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 15

ప్రథిత కాళహస్తీశ్వర భక్తుడైన

ధూర్జటి శతకము రచించి తులకరింప,

కాళహస్తి మహాత్మ్యము ఘనతకెక్కె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 16

మధుర పదగుంభనము తోడ మల్లన కవి

రాజశేఖర చరితము ప్రతిలిఖించి

గద్య పద్య వాఙ్మయముల ఘనత చాటె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 17

రామభద్ర కవి రచించె రమ్యమైన

కథగ రామాభ్యుదయమను గ్రంథము, తన

వ్యాకరణ, యలంకారముల్ వాసికెక్కె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 18

అల్లె గద కళాపూర్ణోదయ మనెడి యొక

ప్రణయకావ్యమున్ సూరన్న; ప్రథిత ద్వ్యర్థి

కావ్యకర్తగా "పింగళి" ఖ్యాతి గాంచె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

తే 19

పద్య రామణీయకతన భట్టుమూర్తి

వసుచరిత్ర గూర్చి కవితా ప్రతిభ తోడ

శ్లేష సహజ పటిమ జూపి శ్రేష్ఠుడయ్యె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 20

పాండురంగ మహాత్యము పావనముగ

వ్రాసి; వ్యంగ్య, హాస్య కవిగ రామలింగ

కవి వికటకవి బిరుదుతో గణుతి నొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 21

ఆంధ్ర శబ్ధచింతామణి నవధరించె

అప్పకవియె ఛందోగ్రంథ మయ్యి తెలుగు

నాట "అప్పకవీయం"బు నామ మొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 22

సాహితీ సమరాంగణ సార్వభౌమ

కృష్ణ దేవరాయల కవి తృష్ణ తోడ

వ్రాసె ఆముక్తమాల్యద రమ్యముగను

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 23

సరళమైన తెలుగు భాష సమ్ముదముగ

వాడి కంద ఛందస్సుతో పాటవముగ

బద్దెన సుమతీ శతకము ప్రతిలిఖించె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 24

రామ సంకీర్తనలు పాడి రామదాసు

డయ్యె కంచెర్ల గోపన్న; హరువు నిచ్చు

దాశరథి శతకము వ్రాసి ధన్యుడయ్యె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 25

అచ్చతెలుగు రామాయణ మనెడి కావ్య

ము హవణించె తిమ్మకవి,సమ్మోహనముగ

కుక్కుటేశ్వర శతకము కూర్పు జేసె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 26

ఉత్తర హరివంశము వ్రాసె నుబ్బకముగ

సుకవి నాచన సోమన; సకల భాష

భూషణుడిగ సర్వజ్ఞుడై పోణి జూపె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 27

"వాణి నా రాణి" యని చాటి పాటవముగ

వ్రాసె శృంగార శాకుంతలంబును "పిన

వీరభద్రుడు", విద్వత్కవియయి నెగడె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 28

చేమకూర వేంకటకవి శ్రీకరముగ

వ్రాసె విజయవిలాసము; రామణీయ

శ్లాఘ్య కావ్యమందించి ప్రశస్తి నొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 29

ఆటవెలది ఛందముతోడ నద్భుతమగు

పద్యములు గూర్చి వేమన ప్రథితుడయ్యి

సంఘసంస్కర్త, యోగిగా సంజనించె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 30

అల్లె భూలోక నారదుడైన త్యాగ

రాజు నారదీయము,స్వరార్ణవములు;ఘన

రాగ పంచరత్నములతో రమణుడయ్యె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 31

వ్రాసె సూరి బాలవ్యాకరణము, నీతి

చంద్రికల్; తా ప్రతిభ తోడ సమధికముగ

గద్యమునకు"చిన్నయ"యని గణుతినొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 32

భోజరాజీయ కావ్యమున్ పొందికగ ర

చించె కవి 'అనంతామాత్యు' డింపుగాను

ఆవు-పులి కథ తోడ తా నలరచేసె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 33

గౌరనయె హరిశ్చంద్రుని కథయును, నవ

నాథ చరితముల్ వ్రాసె, తన కవితలను

దృశ్యమాన రంజకముగ తీర్చి నెగడె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 34

అవధరించె సుభద్ర కళ్యాణ మనెడి

ద్విపద కావ్యమున్ తిమ్మక్క; తేజరిల్లె

తొలి తెలుగు కవయిత్రియై తెలుగు నాట

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 35

రాధికా సాంత్వనమనెడి రమ్యమైన

కావ్య మల్లి ముద్దు పళని ఘనత నొంది

మధుర వర్ణన సుకవితా మహిమ తెలిపె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 36

వెంగమాంబ భక్తి రచనల్ వెగ్గలముగ

జేసి పాటలెన్నింటినో వ్రాసి సహజ

నేర్పు తోడ కావ్యములల్లి నివ్వటిల్లె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 37

సంస్కృత విమర్శకునిగ ప్రశంస లొంది

కృతుల వ్యాఖ్యాన కర్తగ కీర్తి కలుగ

మల్లినాథుని భాష్యముల్ వెల్లివిరిసె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 38

అల్లె "నీతితారావళి" యనెడి కృతిని

సుకవి కందనామాత్యుడు; సుందరముగ

సామెతలతో కవితలల్లి శ్రవణ మొందె

మధురమైన మన తెలుగు మహిని వెలుగు

 

తే 39

సీసపద్య ఛందస్సుతో వ్రాసె పాట

వముగ నరసింహ శతకమున్, వన్నె జూపి

సాహితీ శ్రేష్ఠుడయ్యె "శేషప్ప" సుకవి

మధురమైన మన తెలుగు మహిని వెలుగు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...