5, డిసెంబర్ 2020, శనివారం

"చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె" 02.12.2020

 


02 - 12 - 2020;  ప్రణాళిక

అంశం : సమస్యా పూరణ

"చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె"

ఇచ్చిన పాదం తేటగీతి లో

యధాతధంగా సమస్యా పాదాన్ని అలాగే ఒక పంక్తిలో ఉంచి అందమైన భావకవితలాగా అందించినా సగౌరవంగా స్వీకరిస్తాము

 

 

చంద్ర సూర్యులు కనులుగా చక్క నమర

జింక చర్మము ధరియించు శంకరునికి

దర్పణమునందు నిజరూప దర్శనమున

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తే గీ.

 

చక్కని తరుణి మోమున చందమామ

వెలసి; కాంతులు చిందించె వేగిరముగ

కోప తాపములు బెరుగ కోమలికిక

"చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె"

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

01

ముదితయె ధరించె ఫాలమున్  ముచ్చటగను

మణిని పోలిన తిలకము మరులు గొల్ప

భాను కిరణముల్ జాల్వారు భాసురముగ

లలన ముఖమును జూడఁగ లాస్యమాడె

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

02

రవికుల తిలకుడగు రాజు రాముడు తన

తిలకముగ సూర్య బింబమ్ము దిద్దు కొనగ

ప్రజలు ముచ్చటించిరి వారి ప్రభువును గని

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

03

చీరను కొనమని మగని దార కోర

చీకు చింత లేని మగడు చీదరించె;

తుదకు పైఠనీ చీరను పదిల పరచి

యాలికిచ్చిన యానర్మకీలుని గని

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

పైఠనీ పట్టు = మహారాష్ట్ర, పూణే ప్రాంతంలో లభించు ప్రశస్థమైన పట్టు చీరలు

నర్మకీలుడు = భర్త

 

04

చైత్ర శుద్ధ పాడ్యమినాడు చందముగను

కవుల సమ్మేళనములో నుగాది నాడు

పృచ్ఛకుడడిగెను సమస్య పుంగవునకు

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

05

వేద పఠనము జేసెడి ఐదుగురును

ఛందమున్ నేర్చుచుండిరి యందముగను

పూరణల నొకడడిగెను ముచ్చటపడి

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

లంకలోని అశోకవనంఋ నందు

అవనిజ శోకతప్త వదనముతో కూర్చుండ

అంతలో మారుతి సీతమ్మ దరికి జని

రామయ్య ఒసంగిన ముద్రిక నిడగ

గాంచిన సీతమ్మ మోము లోని

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగే.

 

దేవరశెట్టి నాగమణి

తేటగీతి

మృదుల భావముమదియందు మెదలుచుండ

కలువకనుదోయిజూపులు కరుణ జూప

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

తీరు యున్నట్టి మోముతో దీరెనంబ.

 

అంబ =పార్వతి

 

తేటగీతి

అష్ట సతులతో కృష్ణుడ లరుచుండ

పారి జాతంబును ప్రధమ భార్యకివ్వ

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

రీతి శయ్యపైనలకతో రేగె సత్య.

 

హేమలత

 

 

తేటగీతి

చంద్ర బింబము నయినను సంశయింప

'చంద్ర' మతియును బోవగ జడయు కురులు

చంద్ర బింబమై దొరసాని జాము జేయ

"చంద్ర బింబమ్ము" నందు భాస్కరుడు వెలిగె.....

 

తేటగీతి

చంద్ర యానుని బంపించె షారు సంస్థ

నింగి నద్భుతంబు జగతి నివ్వెరంబు

" ప్రాణి కోటికి జీవమై ప్రాకుచున్న

చంద్ర బింబమ్ము" నందు భాస్కరుడు వెలిగె...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

రాహుకేతు గ్రహంబులే రయము మీర

కక్ష్య దిరుగు చుండగ యేక కాల మందు

సూర్య యంబుజముల జుట్టె సూక్ష్మ కాంతి

తళుకుమని యంబరమున తేజ రిల్లే

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

పద్మలత మున్నంగి

 

తేటగీతి

వేణు గానమధురిమలు వింతహాయి

గొలుప,కన్నయ్యను వెదుక కలువకనులు

యలసి సోలిపోవగ పూపొదల సరసన

పొంచి యున్న వెన్నుని తిలకించి రాధ

మది వనమయూరమై నాట్య మాడ, వదన

చంద్ర బింబమ్మునందు  భాస్కరుడు  వెలిగె

 

అవళూరు సీత

 

తే"

 

విశ్రమించక దినమంత వెలుగు జిమ్మి

తిమిర భామ యొడిని జేరి తెప్పరిల్ల

మోయలేనీ విరహమంచు రేయి వగచ

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

వాణిశ్రీ నైనాల

 

 

తేటగీతి

సూర్యరశ్మిచే రాజిల్లు సోముడెపుడు

చల్లబరచునా తేజమున్ జందురుండు

శశియె దర్పణమై జూపు శాశ్వతుడను

చంద్రబింబమ్మునందు భాస్కరుడు వెలిగె

 

 

డా. నాగు పెళ్లి రోజుకు నిచ్చెద ప్రేమ తోడ

స్వర్ణ హార మని పలికి భర్త  మాట

మరువ హెచ్చిన కోపాన మంచి భార్య

చంద్ర బింబ ము నందు భాస్కరుడు వెలిగె.

 

డి.రామ నాగేశ్వర రావులపల్లి

తేటగీతి

 

ప్రాణ సఖుడి సమక్షమున్ వనిత మోము

వెల్గు వెన్నెలై ప్రణయపు బిడియపు తెర

చాటున చెలువంపు వదన సౌరు జూడ

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

నేమొ యనురీతి దలపించె నిజము సుమ్మి

 

కార్తికమున తరుణులంత కాంతు లొలుకు

దివ్వె లొదిలి కోరెదరొక ధీర వరుని

వేకువ సిరివెన్నెల వేళ వెల్గు దీప

శోభలందు కోమలిమోము జూచి నంత

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

రమ, కంకిపాడు

 

1

అజ్ఞాతవాసము భంగ పరచు నెపమున

దురాత్ముడు దుర్యోధనుండు విరాట దేశ

దురాక్రమణ ప్రయత్నము సేయ నెంచగ,

నిలువరించ బూనిన చంద్ర వంశ ధీరుడు

అజేయ శూరుడు కౌంతేయ తేజో ముఖ

చంద్ర బింబము నందు భాస్కరుడు వెలిగె.

2

ప్రేమ దూతను పంపిన రమణి రుక్మిణి

వలచినవాడికి తనదు సందేశమందెనో

లేదో  ననుచు సందేహము మది కదలగ

బిక్కు బిక్కున నలుదిక్కులు చూచుచు

భయమున తిరుగాడ, అల్లంత దూరాన

పరుగెత్తి వచ్చు అశ్వ పద ఘట్టన ధూళి

మేఘ ఛాయలన్ గోపాలు మోము గనంగ

సంభ్రమమై ప్రేమమయి విచార వదన

చంద్ర బింబము నందు భాస్కరుడు వెలిగే

 

CA కె మల్లికార్జునరావు

 

మార్గ దర్శకులు

 

ఖగోళంలో కలవని బంధం

సూర్య చంద్రులది , పగలంతా

సూర్యుడే . అయనే చంద్రునితో

చెప్పి రాత్రంతా వెన్నెల పంచుమయా

అనుచు , అందులకు

చంద్ర బింబమునందు భాస్కరుడు వెలిగే !

 

నవ్విధంబుగా పెద్దలు పిల్లలకు మార్గదర్శకులై కొన్ని ముఖ్య బాధ్యతల నప్పజెప్పవలె ।

 

 

ఓం

చంద్రుని చింతని సూర్యుడు

గ్రహించి , చంద్రునికి వివరించె .

తిరుగుము భూమి చుట్టూ అవ్విధముగా .

పగలంతా నా స్వయం ప్రకాశంతో నే దును , నా పథకంతో నువ్వు రాత్రంతా వెన్నెల వెలుగులు చిందిచు.

 

చంద్రుడు సూర్యుని తెలివికి

మెచ్చి బహు సంతసించే .

అటుల చంద్ర బింబము నందు

భాస్కరుడు వెలిగె !

 

ఇవ్విధముననే పెద్దలు, విజ్ఞులు

యువతని సన్మార్గము లో

చురుకుగా వుండు విధానం

వివరించవలె.

 

జి మురళీ మోహన్ రావు

 

 

 

తే.గీ 1

రమ్యసౌధాగ్రములలోన రాత్రులందు

గాఢ నిద్ర నటించు నంగనల మోము

విభుడు పరిహాసమాడి నవ్వించునపుడు

సతతతాంబూల స్వాదుకషాయితముల

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

తే.గీ  2

అధిక శైతల్యమూని మందానిలుండు

పలుకరించిన వేళలో కలికిచిలుక

కలువదమ్ములలో లలి జెలిమి చేసి

మృదుకపోలమున్ కెంపారు మీసరమది  

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

తే.గీ  3

లలిత సుమనోజ్ఞ దివ్యమంజుల లతాంత

మాలికాభరణంబున మాలకమ్ము

లధరపు సిరుల పొంగారు లాస్యమందు

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

 

 

తే.గీ  4️

మొగపు గాంతిలో కెమ్మోవి నగవులమర

మాసరములయ్యె దలపంగ వాసరములు

యామినీ సమయమున పర్యంకములన

విరహిణుల స్తపమందు కెంపెదవులేమొ 

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె

 

తే.గీ 5️

మేల్మి బంగరుకమ్ములు మెఱయు మోము

చందనరసంబు సరముల మందగమన

చెలగు తరలాక్షి కెమ్మోవి సలిలజమది !

చంద్రబింబమ్ము నందు భాస్కరుడు వెలిగె !

 

కస్తూరి శివశంకర్

 

 

ఈరోజు కవిత లేవి?

సమర రంగాన సత్యభామ

నరకాసుర వధకై రౌద్ర రూపాన ప్రజ్వరిల్ల...

అబలగ తోచిన సురాధములకు భామమోము గాంచ

చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలిగే ప్రచండ జ్యోతి.

 

డా. నాగులపల్లి

 

పగలే వెన్నెలలాయెస్వాదు రసముల్ పంచంగ మాధుర్యమే 

సిగలోజాబిలి జూచి సన్నుతిన వాంఛింపంగ మాధుర్యమే 

వగలన్ వైళపు రూపమందు నిను కొల్వంగాను మాధుర్యమే  

జగముల్మెచ్చిన జాబిలీ ! చెలగునోజ్వాలంబులీతీరుగా    

 

కస్తూరి శివశంకర్

 

 

తే

సూర్యచంద్రు లిరువురును శోభితముగ

జగతికి వెలుగు నందించి సౌఖ్యమిచ్చు

శరదృతువు రేయి పొడచూపు జాస్తి కాంతి

చంద్ర బింబమ్ము నందు; భాస్కరుడు వెలిగె

గ్రీష్మ మందు నధికముగ నుష్మ మిడుతు.

 

వెంకట్. సిహెచ్

 


ఇదిగోండి రావు గారు, ఈ గీతం మొత్తము ఆ జగదేక పురుషుని మీద వ్రాసిందే.

 

తలపు నీవే అయితే

మనసులో నీవయితే

నా మాట నీవే అయితే

నా చేత నీవే అయితే

బ్రతుకంత మధురమ్ము కాదా

యీ బ్రతుకంత మధురమ్ము కాదా

 

పదము నీవే అయితే

రాగమే నీవయితే

భావమే నీవయితే

తాళమే నీవయితే

బ్రతుకంత వేణు గానమ్ము కాదా

యీ బ్రతుకంత వేణు గానమ్ము కాదా

 

పదములే నీవయితే

అడుగులే నీవయితే

నడక నీదే అయితే

రాదారి నీవయితే

బ్రతుకంత నాట్యమ్ము కాదా

యీ బ్రతుకంత నాట్యమ్ము కాదా

 

అహము నీవయితే

నాయిహము నీవయితే

పరము నీవే అయితే

కైవల్యమే చేరుకోనా కృష్ణా

కైవల్యమే చేరుకోనా

 

అవళూరు సీత

 

ఇంద్రుని కొలువునందు కొలువు తీరిన,

వారందరు అచ్చెరువొందఁ అర్జుని గాంచి,

ఊర్వశి డెందమ్మున,

చంద్ర బింబమ్మునందు భాస్కరుడు వెలగె.

 

వచన కవిత,

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

భీకర రణ నినాదంబు భీతి గొలప

అంబ సంగరంబును జేసె నసుర మహిషు

దలపడెడి భీకరంబగు దాక్షి ముఖపు

చంద్ర బింబమ్ము నందు భాస్కరుడు వెలిగె


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...