22, డిసెంబర్ 2020, మంగళవారం

చిత్రం పై పద్యం - 73, 17.12. 2020 ; గురువారం

 


చిత్రానికి తగిన రీతిలో మీ పద్య / భావ కవితలు అందించగలరు

 

17 - 12 - 2020 ; గురువారం

చిత్రం పై పద్యం  - 73

 

చదువుల యేరును దాటగ

వదలకయుండంగ వలెయు వర ధైర్యమ్ముల్

పదిలమ్మగు తాటినడకె

ఎద గెలుపుల జెండనాటునెవ్వరి కైనన్ !

రాంమోహన్, నిజామాబాద్

 

నీట దుంగపై గతుకుల నేలపైన

నేర్పు తోడనే నడచుట నేర్వవలయు

జీవనపనయంబున విద్య చేవనొసగు

నంచు సాగెను బాలిక యలుపులేక.

ఓలేటి ఉమా సరస్వతి

 

పల్లె పట్టు బ్రతుకు బాగు చేయగరాద

బితుకు బితుకు యంచు పిల్ల లేగ

చదువు కంటె ముందు చావు బ్రతుకులుయూ

ముఖ్య మిచట జూడు ముఖ్యమంత్రి..

 

2 ఆటవెలది

విద్య, వైద్యమన్న విధులలో  భాగమే

ప్రభుత మరచి పోవ బాధ గలుగు

ఏండ్లు పూండ్లు గావు ఏలికల్ దలుపగా

చక్క దిద్దుమయ్య  జాగు లేక .

పి.ఎల్.నాగేశ్వరరావు


 

చదువు యన్న మక్కువ కలుగంగ కష్టమైన ఓర్పుగా నడ వంగా

పట్టు తప్పక బహు నేర్పుగా ఆవలి ఒడ్డుకు చేరంగా

భావి భారత బాలిక బతుకు పయనంలో  ఆటుపోటులను ఇప్పుడే నేర్వ సాగే.

మాటలు చెప్పు పాలకులు గెలుపొందం గనే మాటలన్నీ బూటకములాయే

దేవరశెట్టి నాగమణి

 

మన దేశంలో నేతల విగ్రహాలకీ, సమాధులకీ, విలాసవంతమైన ప్రభుత్వ భవనాలకీ నిధుల సమీకరణ జరుగుతుంది స్వచ్ఛమైన సంక్షేమ పధకాలకి నేతల దృష్టి ఎందుకు పోదో అర్ధంకాక,

స్వార్ధపూరిత నేతలని దృష్టిలో ఉంచి మాత్రమే వేదన 

 

 ll

ఇది నీ యజ్వల దేశసేవ ఫలమా ?? ఎన్నో దశాబ్దాలలో  

చదువుల్ స్థేమము ఘోరమై జగతిలో స్వార్థమ్ము నిండంగ, దు 

ర్మద కౌటిల్యకరాళఘోరములలో మౌఢ్యమ్ములే సత్యమై 

వ్యధలన్ నింపగ ? విద్యలన్ ప్రగతినీ, వంచించు దేశంబిదే !   

కస్తూరి శివశంకర్

 

 

సవ్యంగా చేద్దాం

ప్రతి నిత్యం కష్టాలు , కన్నీళ్లు కలిగించు  అవరోధములు ఎన్నో

వివిధ నిర్మాణాత్మక  మూలాలతో వాటిని పరిష్కరించు కొనవలె గానీ

ఫరవాలేదులే అనుకొనుట ఏ విధంబుగా , ఎవ్వరికిన్ సరికాదు , సరి కనే కాదు .

 

 

పిలుపు

పాపా ఆగమ్మా వెనక్కి నడువమ్మా

గురువులు నేర్పిన పాఠాలు పాఠాల్లో పరిష్కారాలు

ఎందరో ఎన్నో చేశారని చదివిందే చదివి మంచి

శ్రేణి సాధించావు ,కానీ ఈ దారి సహదారి కాదు

రహదారి వేయిద్దాం రామ్మా

జి మురళీ మోహన్ రావు

 

 

తేటగీతి

చదువు నేర్చుకో వలెననుతపన తోడ

ఏటిదుంగపైనడకకుయేమరకను

ధీరభావముజూపుచుదిగెనునీట

ఆమెధైర్యము స్ఫూర్తికిఆనవాలు

హేమలత

 

 

తేటగీతి

విద్య నేర్వగా ధీరయై వితము నెఱిగి

తరువు నడవ తడబడక దాటి నట్టి

మేటి బాల!నీ విశ్వాసమేవలనగు

యెదురు లేదమ్మ యింకనీ యెదుగుదలకు

అవళూరు సీత

 

 

దృశ్య కవిత-

ఆ భగవంతుని ఆంతర్యము నేమనవలె?

విద్య నేర్వుట కపాయము లెదురవ్వగ

బాలిక మొద్దుపై యేరు దాటవలసి వచ్చె

బడికెడలు విద్యార్థులకిది ఎప్పటి శాపము?

అనువు సేయని సర్కారుదెంత మోసము ?

తప్పెవరిదైనను పరిస్థితి ఏమైనను అవనీ

ఆ పసిదాని దృఢ సంకల్పం ప్రశంసనీయం

చదువు తోడవచ్చు బ్రతుకునకు వలసిన

మొక్కవోని ధీరత్వం నిండైనఆత్మస్థైర్యం.

 

CA కె మల్లికార్జునరావు

 

 

తేటగీతి

చదువుకొనుట భాగ్యమని తోచగ, నిరాశ

నిస్పృహలు వీడి జిజ్ఞాస నింపుకొనిన

పాప బంగరు భవితకై పాటుపడగ

చెంత తీసి  గోదావరి చింత తీర్చె.

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

ఆడపిల్లను నేనన్న యలుసు వలదు

చదువు సాధన యందున జంకు లేదు

స్థైర్యమున్నది నిండుగా తటిని దాట

బ్రతుకు బంగార మౌనట్టి బాట నేర్తు

చదువు చక్కగా నేర్చిన శక్తి నౌదు

బ్రతుకు పాఠాలు చదివిన భవిత నౌదు

ముందు తరముల కష్టాలు ముదము తోడ

తీర్చు చైతన్య భాసిత ధీమతౌదు

పల్లె ప్రజలను దిద్దగా పాటు పడుదు

భారతావని బిడ్డగా బాధ్యతెరిగి

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

ఎందాకా చదువు నడక ఒంటరి ఓ బాలికా

వీపున బడి బరువు కాళ్ళకింద నీటి చెరువు

విద్యను సంపద పొందగ గారడీలు చేసేవు

నడక తడబడనీకు గమనమాగనీయకు

జాగ్రత్తగ జాగరూకతో అడుగు సాగిపోనీ

నీ భవితను మలచుకో బంగరు వంతెన వేసుకో

 

విష్ణుప్రియ

 

 

అడుగులు అడుగులు ఒకదాని వెనుక ఒకటి

తడబడకుండా వడివడిగా చకచకగా మొక్కవోని

దీక్షతో ఏకదీక్షగా లక్ష్యం వైపుగా చిట్టీ తల్లి అడుగులు

మురిపంగా మురిసిన నవ్వులు

చూట్టూ పరుచుకున్న పచ్చదనాలు

తోడు నీకెవరు రాకున్నా అలుపన్నది రానీకుండా

సాగిపో సాగిలా పడకుండా అవంతరాలు అవధులు

దాటకుండా ఎక తాటి పై వానర వారధి సాధించిన

విజయం నీకు అండా దండా

 

కోవూరి

 

 

చదువే నా లక్ష్యమంటూ

నడిచేవు తాటి వంతెనపై

నీరు,నేల, చెట్టు నావే

నాకేల భయమంటూ

ఆత్మవిశ్వాసం ముందు

పిరికితనం లేదంటూ

తడబడని అడుగులతో

ప్రకృతి తోడుగా పయనిస్తున్న

నీ ధైర్యం కావాలి అందరికి ఆదర్శం.

 

ఉష.


 

సీ.

బడిలేని యూరులో బుడిబుడి యడుగుల తోడ  వడిగ తాటిదోనె మీద

విద్యార్జ నొడుపుగ పిన్నపాప వెడలు సాహసోపేత దృశ్యంబు ఘనమె!

బాలికా సంకల్ప బలమెంత నిబిడమో! తా మనోరథము విద్యాలయముగ

ప్రభవించు చున్నదో! పాప జిజ్ఞాసయే పదుగురి కాదర్శవంత మగునె!

గీ.

పల్లెలందు బడులు గట్టి ప్రచురముగను

పిల్లలకు విద్య లందించు విభుల జాడ

లేవి? రహదారి మార్గము లేవి? విద్య

కొరకు బాలల యగచాట్ల గురుతులివియె

వెంకట్.సి హెచ్

 

 

తేగి

బడికి జేరగ ద్రోవయు భారమాయె

వెతల నెదురోడి లక్షమున్ వెలికి దీసి

జదువు గొనుట యోగంబని జాటి జెప్పె

దీక్ష బూని తీరము దాటె ధీర శిశువు

 

కం

తీరము జేరని బిడ్డల

భారపు విద్యల బడలిక బాల్యము గడిపెన్

నేరము నెవ్వరి దేమో

సారము కానగ చదువులు సంకట మాయెన్

పద్మలత మున్నంగి

 

 

దాట దుస్సాహసమనుచు దలపకుండ,

శిథిల సాలము వారధి జేసి కొనుచు,

పాఠశాలకై సాగెడి పాప  పరగు

యభినివేశంబు గాంచగ నర్థమాయె

తాను పైపైకి నెదుగుచు తథ్యమనఁగఁ

నున్నత శిఖరంబుల జేరునన్న నిజము;

దీన బాలల వెతలను దీర్చుననుచు

హృదయ ఫలకమున మెరయ, ముదము గూరె !

వెంకట రమణ


 

ఆడిపాడే ఆనందాల బాల్యమే

ఆత్మవిశ్వాసపు ఆకృతి దాల్చి

తనువులోని అణువణువును

తరిగిపోని తపనతో నింపుకుని

శ్రమైక జీవన సౌందర్యంతో

శోభించే తేజోపుంజమైన దృశ్యమిది..!

కలవరపరిచే సవాలు

కళ్లెదుట కనబడుతున్నా..

ప్రమాదమని బెదరిపోక

మనో సంకల్పం చెదరనీక

దీటుగా గమ్యాన్ని చేరాలనే

కర్తవ్య దీక్షకు కట్టుబడి..

మేటి పోరాట పటిమను ప్రదర్శిస్తూ..

విద్యా ప్రణవ గీతాలాపనతో

మున్ముందుకు వెరవక సాగిపోయే

భావితరం కావాలి ఎల్లరకు ఆదర్శం..!

ఈ వికసిత హృదయ కమలమే

భారతీ కృపను పొందాలి అనునిత్యం..!!

 

చల్లా దేవిక.

 

 

వచనము,

పాఠశాల బాట కారాదు అంత

కఠినంగా, జటిలంగా, నెవరికి,

కోటలు దాటుతాయి నేతల,

మాటలు అవి గాలి మూటలు...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

తే"

చదువులమ్మ పిలుస్తోంది సాగుబాల

రెప్ప పడనీయ కడుగులు తప్పబోకు

చిత్త శక్తియె గమ్యము చేర్చు తుదకు

బ్రతుకు పాఠము నేర్చి నీ భవిత దిద్దు

 

వాణిశ్రీ నైనాల


 

ఉత్పలమాల....

పండిత శేఖరుల్ నలము బండిన  వాల్మిక,వ్యాసులిచ్చటన్

ఖండన మండనమ్ములిట కానగ రావుగ చర్చలందిటన్

పండిన తేనె పట్టులివి పామరు సైతము నేర్వగల్గినన్

దండధరుండులన్ గనము తప్పులు దిద్దుచు ప్రేమ భావముల్

 

పి.ఎల్.నాగేశ్వరరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...