19, డిసెంబర్ 2020, శనివారం

సమస్యాపూరణ 16.12.2020, "కలువ వికసించి సూర్యుని కరముతాకె "

 


సమస్యాపూరణ 16.12.2020,

"కలువ వికసించి సూర్యుని కరముతాకె "

 

యధాతధంగా సమస్యా పాదాన్ని అలాగే ఒక పంక్తిలో ఉంచి అందమైన భావకవితలాగా అందించినా సగౌరవంగా, సభక్తికంగా  స్వీకరిస్తాము.

 

 

 

తేటగీతి..

 

భక్తి  బ్రహ్మోత్సవంబున పరిఢవిల్ల,

కలువదములను వ్రేలాడగట్టి కొలువ,

ధ్వజ శిఖరమునన్ కైమోడ్చి నంజలిడిన

కలువ వికసించి, సూర్యుని కరము తాకె....

 

 భావము...

బ్రహ్మోత్సవ సమయాన, బంగారు కలువ పుష్పములను పట్టు వస్త్రమున మూటకట్టి, ధ్వజస్థంభము పైకి వ్రేలాడ గట్టెదరు, ధ్వజారోహణ చేసే సమయంలో.....  పసిడి కలువలను "కలువదములు' అని అంటారు.

 

స్వామి వారి ఉత్సవ వేడుక శిఖరం నుంచి తిలకించి, ప్రణమిల్లి, బంగరు కలువ వికసించి భక్తి భావంతో పులకించి పోయి, అంతకు పైన యున్న సూర్యుని కరములు తాకినంత ఆనందము, తన్మయత్వములో మునిగినదనే  ఉపమానంలో  చెప్పడం జరిగింది...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

స్వశక్తి

 

తన శక్తితో కలువ వికసించి

సూర్యుని కరము తాకెనో, తాకునో గాని

ధైర్యంబు ,బుద్ధి, జ్ఞానంబులు

వికసించి సాధించిరెందరో

విజయంబులు, ఘనతలెన్నో !

 

 

కలువ కలియునులే

చెంగు చెంగున గంతులు వేస్తూ

తువ్వాయిలు అమ్మ పొదుగు చేరునులే

 

బోసి నవ్వుల పసిపాపలు

తప్పుటడుగులతో అమ్మని చేరి ఒడిలో పడునులే

 

అటులనే కలువ వికసించి సూర్యుని కరము తాకెనని

కబురులు తెలియనులే .

 

జి మురళీ మోహన్ రావు

 

 

విశ్వకవి రవీంద్రుడిలను వెలుగు నింపె

కానుకిచ్చె గీతాంజలి మానవులకు

పొందె నోబెల్ బహుమతిని పొందికగను

కవులు పొగడిరి మురియుచు కాల గతిని

కలువ వికసించి సూర్యుని కరముతాకె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

తేటగీతి

వేయివేల మయూఖముల్ వెలుఁగుఱేఁడు

కరములై ప్రాణికోటికై కరుణ జూపు !

మోద మతిశయించిన నగుమోము తోడ

కలువ వికసించి సూర్యుని కరము తాకె!!

 

డా. నాగులపల్లి

 

 

 

వచనం,

తలపులు నిండిన వేళ,

వలపులు పండిన వేళ, కను

కొలఁకుల కాంతులు విరిసిన వేళ, ఎద

కలువ వికసించి సూర్యుని కరము తాకే...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

తే.గీ.

 

దినముల వయసునాడె పవన సుతుండు,/

నాకలికి తాళజాలక నంత కనుల/

కలువ వికసించి, సూర్యుని కరము తాకె/

తన బలిమితోడ ఫలమని తలచి. యబ్బు/

రపడి రాతని గాంచి సురలపుడంత

 

వారణాశి శ్రీలేఖ

 

 

 

తే.గీ.

 

అంతకంతకు యెదిగెడి యదితి పుత్రు/

వామనావతారము గూర్చి వర్ణన సలు/

పంగ పోతన, యూహల భావ కొలను/

కలువ వికసించి సూర్యుని కరము తాకె

 

వారణాశి శ్రీలేఖ

 

 

తేట గీతి

పుష్య ప్రత్యూష వేళలో పూవులన్ని

పులకరించి యా నీహరపుపొగ మంచు

తెరల మాటునుండి తనివి దీర భాను

బింబము కనగ నునుసిగ్గు బిడియపు తెర

దీసి హేమంత సోయగ దీప్తి జూసి

కలువ వికసించె సూర్యుని కరము తాకి

రమ, కంకిపాడు

 

 

కరి మబ్బుల మాటున మెలగుతు

వెలుగురేఖలు నింగిన ప్రసరించగ

శశాంకుడని ఎంచి కలువ వికసించి

సూర్యుని కరము తాకెను ఆ క్షణము

వీక్షణ శరముల్ రయమున సంధించి.

CA కె మల్లికార్జునరావు


 

తేటగీతి

అరుణకాంతినిజేగొని అవని వెలగ

పూలుబుష్పించిపరిమళంపుడమి నిండ

వర్ణశోభనుగనినట్టివనిత; కనుల

కలువవికసించిసూర్యునికరము తాకె.

హేమలత

 

తే

పావన రథసప్తమి దిన ప్రభవమెంచి

సకల ఫల, పుష్ప మాలల సవరణించ,

రవి గళ నిగళంబై కుల్క రమ్యరీతి

కలువ వికసించె సూర్యుని కరము తాకి

 

సవరణిoచు=అలంకరించు

వాణిశ్రీ నైనాల

 

 

ఉత్పలమాల

ధర్మ బోధల నిచ్చు శతకమును విర

చించి వెంకయ్య యర్కుని సేవఁ జేయ

పద్య మాలిక లల్లి సద్భక్తిఁ జూప

కలువ వికసించి సూర్యుని కరముఁ దాకె

చాగంటి చరణ్



 

ఈనాటి సమస్యా పూరణకు రామాయణ నేపథ్యంలో

 

రావణుని పరిమార్చంగ రాముడన్న

వార్త వినినంత ధరణిజ బాళి నొంది

పతి సమాగమ భావనల్ పరిణమించ

సేద దీరిన యంగన సీత కనుల

కలువ వికసించి సూర్యుని కరము తాకె

అవళూరు సీత

 

 

చంద్ర కౌముదీ పరవశ సంతసమున

కలువ వికసించి , సూర్యుని కరము తాకె

నరుణ కాంతులు నలుదిశ లావరింప

జగతి మేల్కొల్పు సమయాన పగటి ఱేడు

ఆదిభట్ల సత్యనారాయణ

 


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...