12, డిసెంబర్ 2020, శనివారం

సమస్యాపూరణ - "భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె" 09.12.2020

 


09 - 12- 2020;  ప్రణాళిక

సమస్యాపూరణ

"భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె"

యధాతధంగా సమస్యా పాదాన్ని అలాగే ఒక పంక్తిలో ఉంచి అందమైన భావకవితలాగా అందించినా సగౌరవంగా, సభక్తికంగా  స్వీకరిస్తాము

 

చదువు నేర్పించెను తనకు శ్రద్ధ గాను

వినయ సౌశీల్య గుణములఁ విపుల పరచె

గురుతఁ గలిగించిన ఘనుడు గురువు గారి

భార్య పాదంబు లకు మ్రొక్కి భర్త మురిసె

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

సీసంలో...

గణపతి దేవుని ఘనమైన శౌర్యంబు

రాణి రుద్రమ యొక్క రాజసంబు

పుణికి పుచ్చుకొనెను పూర్వ వైభవమును

కాకతీయుల కీర్తి కామితముగ

కనిపించు ముచ్చటన్ గంభీర కుడ్యాలు

శిథిలాలు పలుకంగ సిరుల ఘనత

ఒంటికొండనుగన నోర్పుగ దెలియును

పరిపాలకుల మెండు ప్రాభవములు

 

ఆట వెలది

ఓరుగల్లు కోట ధీర చరితమును

వినుచు మురియ వలెను వీర గాధ

ఏలిక కలిగించె యెనలేని గౌరవం

జిలుగు లొలుకు ప్రభుత చిహ్నమాయె

 

తేటగీతి

లలిత కళలను పోషించు లాస్యమందు

ముదిత మురిపించి మెరిపించె ముచ్చటగను

నారి కాళికా దేవిక నాట్యమాడ

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తేటగీతి

కాపురాన కలత జూచి కాచుకొనుచు

వదిన, బ్రతుకు తెరువు చూపి వగపు దీర్చ

దారి చూపు దేవతనుచు తనదు నన్న

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

వాణిశ్రీ నైనాల

 

 

 

తేటగీతి

పడతి యింపైన పారాణి పదము కదిపి

భరత నాట్యము జేయుచు భక్తి తోడ

శివుని పూజించి నటరాజ సేవ చేయు

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

రమ,కంకిపాడు.

 

ఇల్లాలే సమస్తము

 

పుట్టినిల్లు నొదిలి

మెట్టినింట అడుగు

పెట్టినంతనే అత్త, మామలను

తల్లిదండ్రులులా ,బంధు

వర్గములను తన ఆత్మ బంధువులులా

ఆదరించుచూ ,

దశాబ్దములుగా

కుటుంబ సర్వ శ్రేయస్సులలో

నిమగ్నమైన తన భార్య, తనకు

తగినంత స్నేహపూర్వక భాగస్వామి అని సంతసించి

భార్య పాదంబులకు మ్రొక్కి ,మనమున,

భర్త మురిసె !

 

జి మురళి మోహన్ రావు

 

మాత  మంచ మందుండ అలసటయే ఎరుంగక,

చీదరించు కొనక మల మూత్రాదు

లను శుభ్రపరిచి సేవలందించే

 భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

దేవరశెట్టి నాగమణి

 

జగ మెల్ల అమ్మ యేనని నమ్మిక బడసి

అంగనలందరున్ అమ్మ లంచు  తలచి,

లోకరీతిన్ పెద్దలు వివాహ మొనరింపగన్,

తత్వము నెరిగి  మనసు మారని గురువు

శ్రీ రామకృష్ణ పరమహంస ఆలిని అమ్మగ

నెంచి ఆయమకు దైవ పూజ లొనర్పగను,

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

 

ఇంకొక పూరన

పర స్త్రీ లోలుడగ మసలు కొనుచుండ

తన గుట్టు రట్టై సతికి బయల్పడగను

తిరుగ దగా చేయ, దీన వదనమునన్

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

 

CA కె మల్లికార్జునరావు

 

 

పూవుఁ జెక్కిళులందంబు పొలుపునెంచి 

సొబగు గోరింటకెంపారు శోభ జూచి 

లలితసుమనమ్ర పాదపమ్ములను గాంచి 

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

 

జిలుగు నెలవంక కాంతులన్  కలికిచిలుక

స్నిగ్ధదరహాస కౌముదీ ముగ్ధని గని 

మంజులంబైన మంజీర శింజితముల

నూపురమ్ముల ముద్దాడు మాపటేల 

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

 

 

కలికి సరసీరుహాక్షి కనులని గాంచి     

అలరు జెంగల్వ పుప్పోళ్ళ లలనపాద 

పద్మయుగ్మముల్ కెంపారు సద్మమందు 

భార్యపాదంబులకు మ్రొక్కి భర్త మురిసె !

 

కస్తూరి శివశంకర్

 

 

తేటగీతి

అత్తమామల నెప్పుడు నాదరముగ

తల్లి దండ్రుల వోలెను తాను జూచి

ప్రేమ పంచంగ, మనసున ప్రేమనిలిపి

"భార్య పాదంబులకు మ్రొక్కి, భర్త మురిసె"

 

తేటగీతి

పుత్రుని మరణమ్ము రణపు భూమియందు

గాంచి యొకతల్లి మిక్కిలి గర్వముగను

సంతసించగ జూచిన సంబరమున

"భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె"

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

తేటగీతి

భార్య భర్తల దెప్పుడు బ్రహ్మ ముడియె

శషబిషలకెంత మాత్రము జాగు లేదు

భర్త పాదపూజలయందు భార్యయుండ

భార్య పాదంబులకు మొక్కి భర్త మురిసె..

 

**మొక్కి ..పదము వాడాను..దత్తపది పదములా

రావడము లేదు, గమనించగలరు...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

తేటగీతి

కాళికాదేవి భక్తి సాగరము నందు

మునుగు రామ కృష్ణునకు ను ముదిత నిచ్చి

మనువు సేయ నా సతియందు మాత గాంచి

భార్య పాదం బులకు మ్రొక్కి భర్త మురి సె.

 

 

బాల్యము న నుండియున్ మాత వలెను పెంచి

చదువు సంధ్యలు చెప్పించి,సహన శీలి

నప్పగించిన సతి తోడ అన్నగారి

భార్య పాదంబులు మ్రొక్కి భర్త మురి సె.

 

డి.రామ నాగేశ్వర రావు.

 

 

తేటగీతి

మంగళకరముగ వివాహమాడిన సతి/

తొల్లికోర్కె తాదీర్చగ దోడ్కొని వెడ/

ల సిరినగముకు మనసు దీరంగ భవుని/

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

తల్లి ప్రాణము కాపద తలవని తల/

పుగ నెదురవ, నాకోడలు బుడమి తల్లి/

 వోలె చేసిన సేవల బొంగి నపుడు/

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

ఘోర రక్కసి మూకల కౄరముగ న/

ణచిన యంబిక కోపము నాపగ దల/

చిన హరుం డపుడంత్య జతనముగ తన/

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

వారణాశి శ్రీలేఖ

 


 

వచన కవిత,

నారవలువలు దాల్చి సీతారాములు,

అరణ్య మార్గమున అత్రి ఆశ్రమం దర్శించి,

అనసూయ కు సాష్టాంగ నమస్కారం చేసె

భార్య,, పాదంబులకు మ్రొక్కి భర్త, మురిసె నిద్దరు,

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

తేటగీతి

 

శాస్త్ర మెఱిఁగిన పండిత శాస్త్రి గారు

ప్రియ సతిని గాంచి దేవిగా వీక్ష సేసి

షోడశోపచారములతో స్తుతులు చేసి

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

మనసు లోని భక్తి యెగసి, మాయ విడగ

 

( సప్త పది చిత్ర స్పూర్తితో)

 

రామ కృష్ణ పరమహంస రక్తి విడచి

భార్య శారదా మాతను భక్తి  మీర

కాళి మాతగా భావించి  ఘనత నొప్ప

చేసి షోడశి పూజలు,  చిత్తమలర

భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

 

(రామకృష్ణ మఠం లో ప్రతి ఏటా జరిగే ఫలహారిణి కాళి పూజ స్ఫూర్తి తో)

 

అవళూరు సీత

పుణ్య గేహిని పూజించు పొందికపడి

కరుణ యెరుకని భర్తను, కష్టపాటు

నెరిగిన పిదప దోషము నెరిగి నడలి

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

భావ కవియైన ప్రీతుండు ప్రణయని కని

అందచందాల నెంచి తా  నతివను పరి

ణయము గావించి యెసగ  సునయన రహిని

పొగడగ సతి పరవశింప, పొందు కోరి

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

లలిత లావణ్య మొలకించు లలన పొలుపు

వలపు తెలుపంగ చెలువుని తలపు నందు

మధువు లొలకంగ మనువాడి మహిమ యనుచు

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

వెన్నెల తునక దిగువారి వెలది తనువు

నందు నమరినో! మైదాకు నలుముకొని

సుందరి ప్రణయ మొలకిస్తు శోభితముగ

నచ్చర వలె ప్రత్యక్షమై నలరు చేయ

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె

 

వెంకట్.సి హెచ్

 


 

సునీల్ దత్ నర్గీస్ ని,సైఫ్ అలీఖాన్ అమృతా సింగ్ ని, రాజ్ కుంద్ర శిల్పాషెట్టి ని, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ని, ధనుష్ ఐశ్వర్యా (రజనీకాంత్)ని, కరణ్ సింగ్ గ్రోవర్ బిపాసా బసుని, ఆదిత్య పన్చౌలి జరీనా వహాబ్ ని,ఫరహ్ ఆక్తర్ ఆధునా బబాని ని  .. ఇక సచిన్ టెండూల్కర్ కూడా ఇలాగే..అంజలినీ.. తమకంటే వయస్సులో పెద్దవాళ్ళైన ముద్దుగుమ్మలను,వలచి, వలపించుకొని మరీ పరిణయ మాడారు కదా...ఈ కోవకి చెందిన ఒకానొక భర్త..తను తను(ఆ) కట్టుకున్న దానికంటే,  వయసులో ఎటూ చిన్నవాణ్ణే గదా... తప్పులేదులే......అని, తన భార్య కాళ్ళకే నమస్కారం చేసుకొని...  "ఒక విషయం" లో అడిగిమరీ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు.. చూడండి మరి.. ఏమి కోరుకుంటున్నాడో...

 

సచిను, కుంద్ర, సునీల్ దత్తు, సయిఫు ఆలి

ఖాను, ఆదిత్య, ఫరహ అక్తర్, ధను,షభి

షేక్, కరణు సింగు, పెండిలి సేసి కొనిరి

తమను వయసున "మించిన" తరుణులనట!

అట్టి  "మగలు" సృష్టించిరి గట్టి చరిత !!

వారి కోవకు జెందిన "పతియె యితడు" !!!  👇👇

మగడు ""తన భార్య దీర్ఘ _సుమంగళిగను

మనునటులనె, దీవెనలనిమ్మ !"" యని తనదు

భార్య పాదంబులకె మ్రొక్కి, భర్త మురిసె;

అనఁగ, దన యాయువృద్ధికే నడిగె వరము !

 

(ఈ జంటలని .. Confusion లో ఒకరి కొకరిని...కొంపతవ్వి మార్చి ఉంటే కూసింత చూసీ చూడనట్టుండండేం...)

మన సమూహంలో............... ఈ గూటికి చెందిన పక్షులు ఏవైనా ఉన్నచో... నన్ను మనః పూర్వకంగా మన్నించమని... పాదాభివందం చేసి ఆర్ధిస్తున్నాను.

 

వట్టెం వెంకట రమణ

 

తేటగీతి

 

అతని సతినే తనయగాయమ్మ  దలఁపు

గనిన; తనయుడునెంతయో హర్షమొంది

కొడుకుమోమునముదమును గొలుప ; జనక

భార్య పాదములకు మ్రొక్కి భర్త మురిసె.

 

హేమలత

 

తేటగీతి

 

ఆపద పరిఘటించంగ యంగ హీను

డగు పతిని గాంచి బరువుకు డస్సి పోక

యాదు కొనుటకు సాక్షియై యచ్చెరువున

భార్య పాదంబులకు. మ్రొక్కి భర్త మురిసె

 

సూరే వెంకటప్పయ్య


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...