12, డిసెంబర్ 2020, శనివారం

దత్తపది - శరము - మరువు - సిరులు - హరువు 11.12.2020

 



11 - 12 - 2020 - ప్రణాళిక 

దత్తపది 

శరము - మరువు -  సిరులు -  హరువు   

  నాలుగు పదాలతో ఔచిత్యమైన పద్యము / కవిత్వము అందించగలరు.

 

శరము - మరువు -  సిరులు -  హరువు   

 

మరుని శరములు కురియు

రాగ సిరులు అనురాగ ఝరులు,

ప్రేమ సుధా రస ధార లొలికించగ

మరువు బోలు హృదయములందు

తలపులన్ నిలుపు భావ హరువు .

 

CA కె మల్లికార్జునరావు

 

 

తేటగీతి...

పరుగు లంఘింప జిక్కెను మరువు చెంత

శరము సంధింప రావణుండొరిగె నేల

హరువు, ధీరుండు, రాముడు హర్షమందె

సిరులు గురవంగ లంకయున్ శీఘ్రగతిన

 పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

కందంము

శరము హొయలొలికి పారెన్

మరువును తాకుచు జలజలమనుచున్ సాగెన్

సిరులు సమృద్ధిగ కురియగ

హరువులొలుకు కిన్నెర ధరహాసము నందున్

 

శరము = జలము; హరువు = సొగసు

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

చం ll

మరువు సమీరమందు, నవమందసమందు, సరాగమాలికా 

శరముల సాంద్రభావములు చల్లనివేళన పల్కరించగన్      

సిరుల పటీరమందు సరసీరుహజాక్షి మనోహరాస్యయై 

హరువుల దివ్యభావముల హాసికలై సృజయించె ప్రేయసీ         

 

"మరువు సమీరములు" = కొండగాలి  

శరము = మన్మధుని దగ్గర ఉండే బాణాలు 

హరువులు - అందము..సొగసు 

కస్తూరి శివశంకర్

 

 

కం ll

సరసీజుహరాక్షి కనుల  

శరముల చూడ్కుల హరువులచందనమాయెన్ !

సిరులొలికే సొబగులతో    

మరువుల తీరమున మనసు మందస్మితయై !!

కస్తూరి కవనం

 


 

తే.గీ.

సిరులు కురిపించు నగవుల శ్రీసతి తన/

శరములను బోలు చూపుల చకితులవగ/

జగతినెల్లరూ మరువును ఝరుల నింపి/

హరువుగ మలచె, ముదమంది హరిని గాంచి

 

ఆటవెలది

చెరకువింటివాని శరమున విరులును

సిరులు గొలిపి చిందు హరువు మదిని

రతియుజేరి సరస లాస్యము నొనరించ

సతియు, పతియు జేరె జతగ

మరువు. మరువు =మరుగు, చాటు

హేమలత

 


 

అర్జునులు కావలె

 

అర్జునుఁడు వాడే శరములను

భీష్ముని అంపశయ్య కొరకు

అద్భుతముగా ,అటులనే

సమర్ధవంతముగా సాంకేతిక

నిపుణులు వారి జ్ఞానమును

వాడుచూ మరువులను హరువులుగా తీర్చి దిద్దుతూ సిరులకు నిలయముగా ,

ఉద్యోగములకు గృహములుగా

ప్రయత్నించు చుంటిరి .

జి మురళీ మోహన్ రావు

 

 

చంప"

హరువుల మానసంబు గల నండగ నుండెడి మిత్రులుండగా

సిరులను గూర్చగన్ బలుక శ్రేయము గోరుచు సాయమవ్వగా

మరువును బోలు బల్మినిడి మార్గము జూపగ కానిదుండునా

శరమయి చీల్చ చిక్కుల, బ్రశాంత తిడంగ నసాధ్యమెయ్యదిన్!

వాణిశ్రీ నైనాల

 

 

ఆటవెలది

శివుని యాఙ్ఞ లేక చీమైన కుట్టదు

రామ భద్రుడైన లబ్ధి లేదు

కృష్ణుడైన గాని కృపలేక యుండగా

నింద లెన్నొ మోసె నిక్కువంబు.....

 

 

తేటగీతి

( తల్లి, తండ్రి, గురువు, దైవం )

 

తల్లి మురిపము నెప్పుడు చల్లగాను

నాన్న దండించి, దీవింప వెన్ను దన్ను

గురువు నేర్పంగ విద్యల కొదువ లేదు

దైవ కృపయె జగతికిల జీవనాడి

పి.ఎల్.నాగేశ్వరరావు

 


 

మధ్యాక్కర

శరములు ఝరులైన స్వనముజతులకూడిన రాగ ములయి

హరువునొందిన మది మురిసి యనురాగ సిరులు గుప్పించ

మరువుపైన మలయజమ్ము మలయ పవనుని సంగతుల

మరులొలికించగ మనసు  మరుకమై నాట్యమాడేను

 అవళూరు సీత



 

వరూధిని ప్రేమను తెలిపి ప్రవరుని తిరస్కారం తో విరహ తాపాన్ని అనుభవించు ఇతివృత్తం గా నా ప్రయత్నం

సీ.

పువ్వుల విలుగాడు పుష్పశరములు సంధించగ మదినందు తీపి వలపు

పుట్టి వరూధిని పులకితమై ప్రవరునికి తా వలపు సిరులొలికిస్తు

ప్రణయ భావము తెలుపగ, ప్రవరుని పేర్మి మరువుపడగ సఖి మనసునందు

హరువు సమసిపోయినటమటించి,వరూధిని వగచె, చెలియలు నివ్వెరపడి

గీ.

ఊరడించెడి యత్నము నుద్భవించె

విరహ తాపము తోడ వివేక మంత

రించిన వరూధిని మది నిగ్గించు వలపు

మంట లెంతాపదలు గూర్చె మైమరపుగ

మరువుపడు= కానకపోవు

వెంకట్.సి హెచ్

 


 

తే.గీ ౹౹

మరువు సారంగరాగాల హరువులేవి ?

సిరులు కురిసేటి దివ్యమౌ వరములేవి 

వరములిచ్చే వసంతాల వైనమేది ?

శరములందు మాదుర్యమౌ సాంత్వమేది

 

వై. శ్రీదేవి

చూపులు శరములు కాగా,

మరువు మారుతం తోడు రాగా,

సిరులు కురిపించు నవ్వు బదులీయగా,

హరువు బంధం ఇరువురి మధ్య పెనవేయగా....

ఉష

 


 

కందము

హిమగిరి మరువుల యందున

సుమశరముల తాడనముల సునిశిత సిరులై

తమకపు హరువుల జల్లులు

విమలములై వాంఛఁ బెంచె భీముని మదిలో

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

మారుని శరము దగిలిన మరునిసూడి

నెగులతిశయించగన్ యగ్ని నేత్ర దృక్కు

పడగ మీనకేతనుడును బసిత మరువు

గాను మారంగ రతియార్తి గాంచి భవుడు

మంగళ సిరులొ సగి పతి మదనయుసురు

నిలిపి  జగతిలోన హరువు నిలిపె హరుడు

సూరే వెంకటప్పయ్య


 

కుమార సంభవం,

సుమ శరములు ఒక పక్క,

మరువు సమీరములు ఇంకొకప్రక్క,

సొగసుల సిరులు కురిపించగా,

హరువులు విరివిగా ఒలికించగా,

హరుని చిత్తము చలించె,

కుమార సంభవం జరిపించె...

వచన కవిత,

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 


 

రాము శరము వలన రావణుండిల కూలె

మదము మరువుగాగ సదయులార!

హరువు భక్తుడైన ఆతని కుగుణమ్మె

కీర్తిసిరులజంపి కీడుగూర్చె

 

రాంమోహన్ నిజామాబాద్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...