3, డిసెంబర్ 2020, గురువారం

వారాంతపు పుస్తక సమీక్షలు, ఆదివారము, 29.11.2020

 


వారాంతపు  పుస్తక సమీక్షలు, 

ఆదివారము, 29.11.2020


కార్తిక మాసం, శివకేశవులకు ప్రీతికరమాసం..

శివుడే కేశవుడు.. హరియే హరుడతడు,

 

శివకేశవులకు లేదు భేదము,

యింకా మనలో ఎందుకు వాదం...

 

పన్నగధరుడు హరుడు..పన్నగ శయనుడు శ్రీ కరుడు

తిన్నగ భక్తుల బ్రోచుటలో ఒకరిని మించి మరొకరు..

 

నీలకంఠుడు శివుడు.. నీల వర్ణుడు కేశవుడు,

కాలాతీతులే ఇరువురూ కామిత ఫలములు కూర్చెదరు...

 

చిత్తజహరుడు  శివుడు.. చిత్తజ గురుడు కేశవుడు,

కార్తిక మాసపర్వదినముల హరిహరుల సేవే మహద్భాగ్యము....

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

సమస్య: వారిజ నేర్ప సంగతులు వాణియె పాడెను వీణ మీటుచున్

నా పూరణ ప్రయత్నం..

 

.మా.II

 

తీరుగ బొమ్మలన్ తరచు తీర్చుచు దిద్దెడి బ్రహ్మ వాక్కులన్

నారద తుంబురంబునను నాట్యము జేసెడి వేద గీతులన్

ధారగ బొందుచుండగను దక్కిన సంతస వేళలందు యా

వారిజ నేర్ప సంగతులు వాణియె పాడెను వీణ మీటుచున్

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 


' విశ్వనాధుని స్మరణము విభవ మొసగు'

 

శంకరున్గొల్వ బత్రియు జలము తోడ

భక్తి పారవశ్యమునందు భక్త జనులు

శక్తి మేరగ ప్రార్థింప సంతతంబు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు....

 

తే.II

గరదమున్ మ్రింగె గావగ గరళకంఠు

భస్మధారి నుమాపతి బరమ శివుడు

కోరి నంతనె పరుగిడు గోర్కె దీర్చ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు....

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

పూసపాటి గురువుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ...

 

సీ.II

భారతి పుత్రులు బంధకవివరేణ్య

శ్రీనాథు దీవించ సీసరేడు

పామరుల బిలచి పద్యము నేర్పి

హరహము నడిపించె  కరముబట్టి

తప్పులు మన్నించి దన్నుగ నిల్చు వా

త్సల్యమందెవ్వరు సాటిమీకు

కవివర్యు పదముల, కవనపు కుసుమాలు

చెల్లించి మ్రొక్కెద శిరసు వంచి

 

ఋణము దీరని వరముల మనము నిల్పి

పద్యమాలిక లర్పించ పరితపించి

గుండె లోతుల గురువుకు గుడిని గట్టి

పూసపాటి పదములకు పూజలిడుదు

 

 

 గురువు పూసపాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ....

వినమ్రముగా అందిస్తున్న సీస మాలిక

 

సీ.II

పూసపాటి కొలమున్ పున్నెము జేసెడి  యాశయముగ జన్మ యవతరించె

సూర్యకుమారునిగ సుకృత నామముతోడ వేసంగి భానుడై వెలుగు నొందె

కష్టనష్టము లందు గరిమ జూపి  సతము దైవ సుకృతమని తనివి నొందె

జిజ్ఞాస తపసుడై శ్రీకరముగ నేర్చె నెన్నో చదువులను, హెచ్చు పడక

సమ్ముదముగను తా జ్ఞానము పద్యవిద్యల్ నేర్పి పంచుతూ ధన్యు డయ్యె

కార్యసాధకునిగ కలము బట్టి కవితా కదనరంగము నందు ఖ్యాతి నొందె

నిత్యాభ్యసన తోడ నేర్పు యొడుపులన్ని సంగ్రహించి మదికి శాంతి కూర్చె

చిత్రబంధ కవితా జిగి జూపి, సుకవిగ శిఖరాయ మానమై శ్రేష్టుడయ్యె

తెలుగు సాహిత్యపు దీప్తి బంచుతు కవి వెలుగుచుండె సతమువినయముగను

 

 

తే.II

దైవ దీవెన తోడ నుద్గాడ మగుచు

శాంతి సుఖ జీవనము తోడ సంతసంబు

కూరవలెనని ప్రార్థిస్తు గురువు గార్కి

జన్మదిన శుభాకాంక్షల సవురులివియె

 

వెంకట్. సిహెచ్

 

మహనీయ పద్యంపు మాధురీ పుష్పాల రాముని పూజించి రమ్య గతిని

తెలుగున ఛందస్సు తీరుల నేర్పించి తేనెలొలుకునట్లు తేట పరచి

ఆప్యాయతానురాగాతిశయమ్ములఁ వాత్సల్యమమరగా వ్యక్తఁబరచి

కమనీయ రీతుల కవన మాధుర్యంబు శిష్య వర్గముకెల్ల చేరవేసి

ఘనత పొందిన గురువర్య ఘనుడ వీవు శిరసు వంచెద నీదివ్య సేవ కిలను

కోరి మ్రొక్కెద నీశ్వరు కోర్కెఁదీర దివ్య వరములు గుప్పించి దీవనిడగ

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

శ్రీ గురుభ్యోనమః,   మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ

 

సీ.II

పద్యమేది సరియో బలికి జెప్పుటకును పదములు నెంచగ పావనంబు

యసమాన ప్రతిభయె యాభరణములుగా ధారణ గావించె తరచి జూడ

వాసికెక్కె జగాన వాఙ్మయ కర్తగా బంధ కవితలల్లె బాసురముగ

పూజ్య గురువులకున్ పుట్టినరోజు శుభాకాంక్షలును జెప్పె పరవసముగ

 

.వె.II

వందనమ్ము గురువు బంధ కవులు పూస

పాటి స్మరణ జేతు బాగు గాను

విద్య కూర్మి తోడ పద్య గద్యములన్ని

పేర్మి బెంచె మాకు పేరు దెచ్చె

 

తే.గీ.II

దొరకె మాకు గురువులుగా దొడ్డ వారు

పద్యమును నేర్పె తీరుగ పలుకు లద్ది

లాక్షనీకుల సరుసన లక్షణముగ

నిలువరింప జేసెనుమమ్ము నిజము సుమ్మి

 

కం.II

గురువులు బంధ కవివరులు

కురియగ మీ యందు పేర్మి కూర్మిగ తోడన్

గరిమగు పూరణ లెంచగ

పరిమళ మిచ్చెను మధురిమ పంచగ వచ్చెన్

 

పద్మలత మున్నంగి

 

 

 

శ్రీ పూసపాటి ఆచార్యులకు హృదయ పూర్వక జన్మదిన శుభాభినందనలు 

 

.ll

వీఁక హసించు సత్వరకవిత్వపు మాధురిమాణికంబు  

వ్యాకృతి తెల్గుతేనియల భావమనోహర పద్యమాలికల్  

ప్రాకట భావగర్భితము భాసురమౌ "కవి పూసపాటికిన్"         

మీకు విలాసయుక్తమగు మేలిమి జన్మదినంబు చందముల్ !

 

చం.ll

వదలక పద్యసేద్యమును పంచిన ధీయుత  మీరు జూపగన్  

ముదముగ నిండుదీవెనలమూట నొసంగుచు మానసంబునన్ 

మధురము మీదు పద్యములుమంగళ శాసనమైన యానతుల్ 

సదమున పూసపాటి మనసందున బద్యము వోలెపొంగుచున్ !! 

 

కం.II

మీ సుమధురమౌ కవనపు    

పేశలలంబది సతతము పీయూషములౌ    

సీసములెన్నియొ గూర్చగా  

భాసురభావముల పూసపాటి కవివరా

 

కస్తూరి శివశంకర్

 

 

శ్రీ గురుభ్యోన్నమః

పూసపాటి గురువర్యుల జన్మదిన పబ్బము పురస్కరించుకొని, వారి పాదపద్మములకు ప్రణతులు, వారి బహుముఖ ప్రజ్ఞకు ప్రణుతులతో  సమర్పించిన పద్య ప్రసూనాలు..

 

 ఆ.వె.II

పద్య రచన దొడగి, యుద్యమించ వలయు

ననెడి కోర్కె యొకటి  యధిక ముండె;

పూసపాటి యార్యు బూనిక, ప్రేరణన్ 

నేటికయ్యె నిజము నాటి ఆస.

 

ఆ.వె.II

ఓనమాలె రాని యొట్టి   యౌత్సాహికే

పద్య విద్య గఱపి, పదుగురందు 

చిరు కవియనగ మలచి, నను  తీర్చినయట్టి

పూసపాటి యొజ్జ! పూజనీయ !! 

 

ఆ. వె.

సకల కళలకును పొసగు పరమావధి 

యాత్మ ముదము,సుంత యాత్మతృప్తి; 

యట్టి తృప్తి వడయునట్టి వరమిడిన

పూసపాటి వర్యు పూజ సేతు.

 

ఆ. వె.

వట్టి వెదురు ముక్క వంటి నన్ జేకొని,

మోహనంబయిన యమోఘ రాగ

ములొలుకగఁ  మలచిరి  మురళిగా గురువర్య !

ఏమి యిడిన మీదు ఋణము దీరు ?

నాకు, 1978 నుండి తీరని కోర్కెగా మిగిలిపోయిన "పద్య రచన" చేయాలన్న పేరాస, ఇన్నేళ్ళకి,నాకు పూర్వ జన్మ సుకృతమనగ దొరికిన  గురువుగారి పరిచయ భాగ్యం, వారికి,  నే  చేసుకుంటున్న శిష్యరికం వలనను నెరవేరింది.

వారి జన్మదిన పర్వ శుభావసరమున.....వారికి సర్వదా బహుధా కృతజ్ఞుడను అని తెలియఁ జేసుకొంటూ, నా పద్య ప్రసూనాలని వారి పాదపద్మములవద్ద, సభక్తి, సమర్పిస్తున్నాను.

 

శ్రీ గురుభ్యోన్నమః

వట్టెం వెంకట రమణ

 

 

గురువర్యులు శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

తే.గీ.II

పద్య రచనా పటిమతోడ భాసురముగ

వెల్గునట్టి గురువులకు న్వినుతి జేతు;

శిష్యకోటి మనమ్ముల చిరయశముగ

ప్రాభవమ్మొందు పూజ్యుని ప్రణుతి జేతు!

 

చల్లా దేవిక

 

 

ఆది గురువులు

తే.గీ.II

ఆది దంపతులే మనకాది గురువు

లయ్యె, రుద్రుండు రక్కసుల్కశనిపాత

ముగను, లంఘించదప్పదు శుక్రుడైన

ఆది భిక్షువు నాశ్రింప నాశ గలదు...

పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

ఓమ్ శ్రీ గురుబ్యోనమః

 

కన్నుముక్కు లేని కమనీయ శిలనొండు

భగవదాకృతి గను పల్కుటెల్ల

బ్రహ్మ మరయనే నిరాకారమనిజెప్ప

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

ఓమ్ నమశ్శివాయ ఓమ్ శివాయ!

 

సురేష్

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...