10, డిసెంబర్ 2020, గురువారం

చిత్రం పై కవిత్వం / పద్యం - 71, 08.12.2020

 


08 - 12 - 2020 -  ప్రణాళిక

చిత్రం పై కవిత్వం / పద్యం - 71

శీర్షిక : ఓరుగల్లు వైభవం

 

చిత్ర కవిత,

 

బాలరసాల సాలు వెల్లివిరిసిన నగరం,

కాకతీ రుద్రమ్మ పౌరుషానికి దర్పణం,

శిల్ప కళా సంపద కు  నిలయం,

తెలుగు భాషకు సంస్కృతికి చెరగని చిహ్నం....

 

వచన కవిత,

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

కాకతీయ శౌర్యమాకళింపునుజేసి

కళలరూపునెత్తి కథలదెల్పు

ధీరవీరరసము దీప్తించు కళికయై

తోరణమ్ము విజయ ఓరుగల్లు!...

 

వెల్లువలా చైతన్యం

బల్లుకొనిన శౌర్యగరిమ అద్భుత చరితన్

ఉల్లము జల్లన పొగిడెద

నల్లదె మా ఓరుగల్లునపురూపంబున్ !

 

రాంమోహన్

 

 

ఆ.వె  1️

ఓరుగల్లు కోట పౌరషాలచయమై      

రాణి రుద్రమాంబ రాజసమున  

కాకతీయ యశము కాణాచివెలుగులై 

తెలుగు గడ్డపైన తేజరిల్లు

 

శా ll 2️

ఓరుంగంటిపురంబు దివ్య విభవంబొప్పారి గర్జింపఁగన్  

స్వారాజ్యమ్ముల కీర్తికాంక్ష వరమై ప్రాకామ్యముల్ ఠీవిగన్      

వీరాగ్రేసరులైన కాకతి విభుల్ విన్యాసముల్ భవ్యమౌ   

పారావారము సైన్యసంపదలతో స్వాత్మాభిమానంబునన్

 

ll

రుద్రమ రోషణోజ్వలపురోచులుతో ప్రభవించగన్; ప్రతా  

పాద్ర విభుల్ విలాసముప్రభాసితమై సృజియించు మోదమై 

భద్రములై యశమ్ములు విభాసుర ఖ్యాతి ప్రతాపరుద్రుడై 

రౌద్రము, పౌరుషమ్ములు, కళాత్మకరూపములే వరమ్ములై !! 

 

కస్తూరి శివశంకర్

 


 

ఓరుగల్లు వైభవం....

 

ఆటవెలది ( సవరించినది )

ఓరుగల్లు యనగ పోరు గఢ్ఢగ నుండె

కాకతీయ వంశ కాంతులీను

రాణి రుద్రమాంబ రాజ్యమే విభవమై

మోదమంద జనులు ముదము తోడ..

 

ఉత్పలమాల..( రెండవ  పద్యం )

 

వీరుల పుట్టినిల్లుయట  పెట్టని కోటగ నోరుగల్లనన్

ధీరులు రుద్రమాంబయును ధీటుగ శౌర్యము కాకతీయులున్

మేరు నగంబుగా బడసె మెండుగ పౌరుష, శిల్ప సంపదల్

క్రూర మనస్కులైన రిపు గూల్చగ జైయన మెత్తురే  జనుల్..

 

ఓరుగల్లు వైభవం.... వచన కవిత  ( 3 )

 

ఓరుగల్లు కాదు నిప్పుడది వరంగల్

కాకతీయ రాజుల ప్రాభవంబుకు సాటియే

జంటకవుల తీరు జంట నగరమ్ములు

అదియె, హనుమకొండ- ఓరుగల్లు

 

గణపతి దేవుడు మార్చె రాజధాని

హనుమకొండ నుంచి ఓరుగల్లుకు

రుద్ర దేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడుపాలించిన

మహాధాన్యాగారం కాకతీయ సామ్రాజ్యం

 

గణపతి దేవుని రెండవ కుమార్తెయె రుద్రమదేవి దుర్గయై,

కాళికగా చెండాడెను శత్రువులను

 

 

స్త్రీ పాలన సహించని రారాజులకు బుద్దిచెప్పగ

సేనానులు వెన్నంటిన వారే, గోన గన్నారెడ్డి,

బెండపూడి అన్నయ్య,రుద్ర నాయకుడు, త్రిపురాంతకుడు.....

తన ప్రఙ్ఞా పాటవాలతో , రాణి రుద్రమదేవిగా ప్రసిద్ది చెందినది.

 

రుద్రమదేవి మనుమడే,ప్రతాపరుద్రుడు

వీరి పాలన పిదప , కాకతీయులు పతనమైరి.....

అదియె కాకతీయ రాజుల చరిత్ర.....

 

కాకతీయ సంస్కృతీ వైభవం

పేరెన్నికగన్న కళా విన్యాసం

ఓరుగల్లు కోట, శత్రు రాజులకు తూటా

 

భాషాభిమానం దండిగా ఉండగ

పెద్ద పీట వేసె కవులకు, పండితులకు

కాకతీయ తోరణం , కళలకు కాణాచి

ప్రభుత్వ చిహ్నములో భాగమయ్యె నిపుడు

 

రామప్ప దేవాలయం, రామప్ప చెరువు,స్వయంభు శివాలయం,

భద్రకాళి మందిరం,వెయ్యి కాళ్ల మండపం,

పాకాల చెరువు, ఏకశిలా నగరం, NITW అన్నీ అద్భుతాలే...

 

పి.ఎల్.నాగేశ్వరరావు



 

తే. గీ.

మేరు నగకీర్తి పొందిన ఓరుగల్లు

నారి రుద్ర మ్మ నగరమే ఓరుగల్లు

వీరులకు పుట్టినిల్లు మా ఓరుగల్లు

భూరి కళలకు నిలయమే ఓరుగల్లు.

 

డి.రామ నాగేశ్వరరావు

 

 

 

గణపతిదేవుని కొండంత జ్ఞాపకం

రుద్రాంబ నడయాడిన పుణ్యస్థలం

శౌర్యము, స్త్రీశక్తి ఈడనే ప్రారంభం

ప్రతాపరుద్రుడు ఏలిన సామ్రాజ్యం

 

చారిత్రక ముచ్చటల సమాహారం

పాత ప్రాభవం చెప్పే శిలాతోరణం

వేయిస్తంభాలపై భంగిమల అందం

రామప్పగుడిలో బొమ్మల చందం

 

అవశేషాలాయెగా శిల్ప సౌందర్యం

ఆ నందిరూపమే నిలువెత్తు సాక్ష్యం

గతంలో గతమై  ఓరుగల్లు వైభవం

కాకతీయుల ఏకశిలా నగరం

 

రాజ్యాలు పోయాయి రాళ్ళు మిగిలాయి

రత్నాలు పోయాయి రాళ్ళు మిగిలాయి

*****

 

రాజు తాకితే శిలలు కరిగాయి

శిల్పాలుగా నవ్వి కబురులాడాయి

రాళ్ళల్లే రేడూ శాశ్వతమని

మోజులెన్నొ రాజుపై పెంచుకున్నాయి

 

కలికాలం యుద్ధమై శంఖమూదింది

మరణం చేరువై అతని కమ్మింది

 

రాజు పోయాడు శిల్పాలు ఏడ్చాయి

తమ బండగుండెలు బాదుకున్నాయి

 

శిలాశాసనాలు కన్నీరు కార్చాయి

బండరాళ్ళుగ మారి బావురన్నాయి

రాజ్యాలు పోయాయి రాళ్ళు మిగిలాయి

ఆ రాజు కథలే మనకు చెప్పాయి

 

విష్ణుప్రియ

 


 

సీ.

కాకతి రాజుల ఘనతకు చిహ్నమై పొంగారె యోరుగల్పురము నాడు

రుద్రమ పౌరుష రోచిస్సుల వెలిగి పెనుపుయే నలుదిశల్ విస్తరించె

వీర ప్రతాపుడే వైరుల దునుమాడి రాజ్యమేలే జన రంజకముగ

శిల్పకళలవియె జిగిదేఱె కాకతీ యుల కళాప్రాభవ యోగ్యములయి

 

1. తే.గీ

ముష్కరులు దాడి చేయగన్ మూలపడెను

యోరుగల్లు వైభవమంత, పోరులోన

కాకతీయుల పౌరుషం కరిగిపోయె

గతము చిహ్నాలు మిగిలించె కర్కశముగ

 

2. తే.గీ

శివుడు సాక్షిగా నిలచిన శిథిల చరిత

వేయి కాళ్ళ మంటపమది విరిగిపోయె

నాగినిపొడయె కలకాగ నాశ మాయె

భద్రముగను మిటకరించె భద్రకాళి

 

అవళూరు సీత

 

  

 

ఓరుగల్లు వైభవంభు

 

కాకతీయుల ధృవతార

దిగ్విజయ పాలనను

ఆరాధించిరి కాకతీయులు ,

ఆహ్వానించిరి జై జై

రుద్రమ దేవ మహాహారాజా

అని పిలుచుకొనుచూ

 

ఓరుగల్లు ప్రాభవంబు

అంత మొంద  లేదు

 అంతటి తోనే ,ఎందురో సాధించుచుండిరి

పేరు ప్రఖ్యాతలు అచట నుండే

మన ఓరుగల్లు విధ్యార్దినే

మిచిగాన్ ప్రతినిధి గా

ఎన్నికైన పద్మ కుప్ప !

 

జి మురళీ మోహన్ రావు

 

 

 

సీ"

మునుసూరి కమ్మల మోదంబు గురుతుగా

కాకతీయుల కోట ఘనతనొప్పు

గణపతి దేవుని గారంపు బిడ్డయే

రాజిల్లె రుద్రమ రాణిగాను

కుష్మెహలు, ధరణి కోట, మేటి శివాల

యము, నేకశిలగుట్ట లరసి చూడ

కీర్తి తోరణములు మూర్తీభవించగ

రాష్ట్ర చిహ్నంబయ్యె  రాజసాన

 

తే"

జిలుగు లొలుకు దుర్గమిచట శిధిలమాయె

వైభవంబు గాన్చగ నేడు వశముగాదు

చూడ నానవాళ్లు మదిలో స్ఫూర్తి నింపు

గత పుటలలోకి చేరెనీ ఘన చరిత్ర

 

వాణిశ్రీ నైనాల

 


 

ఆ వె.

ఓరుగల్లు మీద జోరుగా వ్రాయగా

బుర్రలోని సరుకు తుర్రు మనియె

తెలియకున్న దిపుడు తెలిసినట్లు దెలుప

ఇష్టబడక నేను కష్టబడుదు

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

నా ప్రయత్నం సీసంలో...

 

గణపతి దేవుని ఘనమైన సౌర్యంబు

రాణి రుద్రమ యొక్క రాజసంబు

పుణికి పుచ్చుకొనెను పూర్వ వైభవమును

కాకతీయుల కీర్తి కామితముగ

కనిపించు ముచ్చటన్ గంభీర కుడ్యాలు

శిథిలాలు పలుకంగ సిరుల ఘనత

ఒంటికొండనుగన నోర్పుగ దెలియును

పరిపాలకుల మెండు ప్రాభవములు

 

ఆట వెలది

 

ఓరుగల్లు కోట ధీర చరితమును

వినుచు మురియ వలెను వీర గాధ

ఏలిక కలిగించె యెనలేని గౌరవం

జిలుగు లొలుకు ప్రభుత చిహ్నమాయె

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

  

శీర్షిక ఓరుగల్లు వైభవం

 

కాక తీయుల వైభవం కథలు చెప్పు

వేయి స్తంభాల గుడుకిరా వేల చరిత

రుద్ర మప్రతిభ యుద్దాన రూఢి పరిచె

ఓరు గల్లువై భవముకి  పోరు జరిగె

 

లలితారెడ్డి

 

 

 

తేటగీతి

కాకతీయులనిర్మాణఘనత దెల్పు

ఓరుగల్లున నున్నట్టి కోటతీరు

శిల్పసంపద మెండుగ జేర్చి యుండె

నాటిరాజులబాలన నౌర యనగ

హేమలత

 

 

తే.

కాకతీయుల పాలన ఘనమె తెలుగు

దేశమున రహిగ వెలిగి దీప్తి నొంద

చరిత నందు స్వర్ణాక్షర సహితముగను

వ్రాసెనె చరిత్ర కారులు ప్రణతిలిడుతు

 

తే.

వేయి స్తంభాల గుడి కట్టి వేల్పు నిల్పి

రమ్య రామప్ప గుడి గూర్చి రంజకముగ

ఓరుగల్లు నిర్మించినే వీరులయ్యి

కాకతీయుల శౌర్యంబు లాకృతులివె

 

తే.

శిల్ప కళలతో వర్థిల్లె, శ్రేష్టమైన

పాలనా నిపుణత తోడ ప్రాభవంబు

గాంచి వాణిజ్య మెలయించి గరిమ జూపి

కాకతీయ సామ్రాజ్యము ఖ్యాతి కెక్కె

 

తే.

ఎసగ గణపతి దేవుని ఏలి కందు

కాకతీయ వంశపు కీర్తి ఘనత నొంది

రాణి రుద్రమ్మ దేవి  సామ్రాజ్య మందు

పాలనా పటిమ శోభిల్లి పరిఢవిల్లె

 

తరువోజ

ధీరురాలై నిల్చె దిటవు జూపంగ దేవేరి రుద్రమ్మ దేవి రాజిల్లె

వీరుల నెదిరించి వీరవనితగ వెలిగి స్త్రీ రహి జూపి పేరు గాంచె గద

ఓరుగల్లు చరిత్ర యొడ్డుగ నిలిపి యోధురాలై రాణి యోగ్యురాలయ్యె

కైరవుల నణచి కాకతీ రాజ్ఞి కాకతీయుల వంశ గారము నిలిపె

 

తే.

ఓరుగల్లు కోట కనగ యొడలు పొంగి

తెలుగు వారి చరిత్రయే పులకరించు

నాటి వైభవ కాంతులు నేటి పాల

కులకు మార్గదర్శకములై వెలుగు లిడునె

 

వెంకట్. సిహెచ్

 

 

 

తేటగీతి

ఓరుగల్లు కోట యిదియె నుర్వి నేలె

కాకతీయ రాజుల కీర్తి కాంతు లిచట

వెల్గె వేయి స్తంభము లందు !! వీర నారి

రాణి రుద్రమదేవి పరాక్రమమ్ము

చాటు ధరణికోట నిలచె సాక్ష్య మోలె

 

రమ,కంకిపాడు



 

సప్తమాతృకలు ఏలుబడిలో

కాకతీయ వైభవం

కనిపించే కీర్తితోరణములో

అడుగడుగునా అగ్రముగా

రుద్రమదేవి శౌర్య పరాక్రమం

ప్రతాపరుద్రుని బలిదానం

ఏకతాటిన తెచ్చే తెలుగువారిని

దక్షిణాపథమున శౌర్యంతో కూడి

ధర్మం నాలుగు పాదాలు నడక

నాలుగు దిక్కులు విస్తరించే

సూచిక నాలుగు స్తంభాలు

గర్జించే సింహాలు కాకతీయుల

ఎదురులేని నాయకత్వంనకు ప్రతీక

తోరణం నిండా లతలు తీగలు అల్లుకునే

గొలుసుకట్టు సామంత రాజుల ఆటకట్టు

రెండు హంసలు గుర్తుగా

పాలన పారదర్శకంగా

కాకతీయుల వైభవం

చేతులు పైకెత్తిన కుబేరుల ప్రతిమ

ఆర్ధిక పరిపుష్టికి చూచిక

పాడిపంటలు పుష్కలంగా

కీర్తతోరణంన సజీవ దృశ్యం

-కోవూరి 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...