7 - 12 - 2020 - ప్రణాళిక
దత్తపది
వేదము - స్వేదము - నాదము - మోదము
ఈ నాలుగు పదాలతో ఔచిత్యమైన పద్యము / కవిత్వము అందించగలరు
ఉత్పలమాల...
వేదము,శౌరి నాలమున వీరుల జంపగ రివ్వునంజనన్
భాదయు నర్జునుండుగని బావుర మందగ,మోదమున్ జగ
న్నాదము గీత సారము రణంబున స్వేదము గ్రక్కుచుండగన్
జూదము నాడి యైనయును శూలము శాత్రవు సంహరించగన్
వేదము...వేదముల సారము, శ్రీ కృష్ణుడు అని అర్థం..
బావుర మందగ......భాదతో ఏడ్చుట, శూలము...ఒక ఆయుధం
పి.ఎల్.నాగేశ్వరరావు
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్
గణిత మేధావి రామానుజన్
జన్మదిన మోదములు నేడే
వేదమువలె పఠించిరెందరో
రామానుజన్ అయ్యంగారి
సాంఖ్య చతురత్వములు ,
అందు దాగిన పటుత్వములు .
చదివినా అర్ధంగాక స్వేదముతో
తికమక పడువారు నాదము
వినుచు పదే పదే పఠించినన్
కలుగు బహుళ ఫలితములు
మోదముతో పుస్తకముల పఠనము ,సేదము కలుగు వరకు ప్రతిరోజూ వ్యాయామము చేయుచూ,
అలసట తీరుటకు హాయిగా వినవలె నాదము అని ఎన్నో ఎన్నెన్నో అమ్మ నాన్నలు నేర్పించినవే మాకు ఈ జీవిత వేదములు ।
జి మురళీ మోహన్ రావు
శా ll
ఖేదంబుల్, దురితంబు మోహములవే క్లేశమ్ములన్ నింపగన్
వేదంబుల్ భవయోగవేద్యములగా విశ్వమ్ములో నాదమై !
మోదామోదము నీయు భాగ్యములగా మోక్షేచ్చ సస్వేదమై
స్వాదీయంబగు పల్కులే వరములై సద్విద్య స్వాధీనమౌ !
కస్తూరి శివశంకర్
1.
కర్షకు దేహము స్వేదము నేను
శ్రామికుని జీవన వేదము నేను
విప్లవవీరుని నినాదము నేను
దీన జన మనో ప్రమోదము నేను
2.
తత్వజ్ఞానుల నిర్వేదము నేను
ప్రణవ నాదమున శబ్దము నేను
చతుర్వేదముల సారము నేను
సకల యోగుల ఆమోదము నేను
ఎల్లెడలా వెలయు ఆత్మను నేను.
CA కె మల్లికార్జునరావు
కం
మోదామోదముమైన ని
వేదనములతో పలుకులవేద్యమ్ము రసా
స్వాదన ప్రస్వేదములౌ
నాదము ! ఖేదము మరచిన నందనవనమై !!
కస్తూరి శివశంకర్
( రైతుల కష్ట నష్టాల గురించి ) సీస పద్యము... ( రెండవ పద్యం )
పెద్దలన్న యెడల వేదంబు నాదము మోదమయ్యె మనకు ముద్దు గాను
స్వేదంబు చిందించ గాధలెన్నొ జగతి పట్టెడన్నము కైన పాటు బడగ
కూలి నాలియు లేదు, కులవృత్తులును లేవు రైతు బంధువులన్న రచ్చ కీడ్చు
'రైతు క్షేమము యందు రాజ్యమున్ క్షేమమే' పల్లెపట్టుల గావ ప్రభుత పుడు....
ఆటవెలది....
రైతు కంట నీరు రాజుకు కీడుయె
మంచి జేయ రాజు మెచ్చు కొనగ
గిట్టు బాటు రేటు పట్టు బట్టగ రైతు
సరుకు నంత నమ్ము సంత లోన....
పి.ఎల్.నాగేశ్వరరావు
మంజరి ద్విపద
వేదము లందలి విజ్ఞత నెరిగి
మోక్షము బొందుట మోదమౌ సుమ్మి
నాదము జూపుగానములోని సుధలు
స్వేదము చిందక చింతలు పోవు
ఉత్సుకము
వేదము తెల్పిరి విజ్ఞులే
నాదము జీవన వేదమౌ
స్వేదము చిందక రాదులే
మోదము మోహన రాగమై
(తమ్ముడు శివ ఆత్మీయ సూచన మేరకు)
వేదము తెల్పిరి విజ్ఞులే
నాదము జీవన వేదమౌ
స్వేదము చిందక రాదులే
మోదము నొందుచు సాగుమా
(తమ్ముడు జైకర్ ఆత్మీయ సూచన మేరకు)
వేదము తెల్పిరి విజ్ఞులే
నాదము జీవన వేదమౌ
స్వేదము చిందక రాదులే
మోదము వీడక సాగుమా
రమ, కంకిపాడు.
వేదము నేర్చిన గురువులు
స్వేదము చిందించి సతము సేతురు తంత్రీ
నాదము శ్రుతి రక్షణకై
మోదము తోడన్ నిరతము మోహము వీడన్.....
జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి
వీణానాదము వీనుల విందగు
వేదములందరికివిజ్ఞత పంచు
తిరుమలేశుని శీఘ్రదర్శనం
మోదమునొనరించు
స్వేదము చిందించుచు పనిచేయు శ్రమజీవి.
హేమలత
దత్తపది తో తొలకరి జల్లుల పారవశ్యం తెలుపు ప్రయత్నం
సీ.\\
మేఘనాదములతో మెరుపు వెలుగులతో ప్రథమోదము కురియ రంజకముగ
మనసుపరవశించు,మధుసూదనములు పుష్పస్వేదము కొరకు ఝంకరించు
శ్రవణీయధ్వనులన్నిసమ్మోదముసృజించు; పచ్చని మొలకల పలకరింత
మనసు నిర్వేదము మలయించి మోదము కలిగించు, తొలకరి పులకరింత
గీ.\\
ప్రకృతికి పురుడు పోసెడి పండుగ వలె
సృష్టికర్త కల్పించెనో! దృష్టి పథము
నందు నిల్చెడి దృశ్యంబు లతిశయమిదె
ప్రకృతి మాధుర్య మంతయు పావనంబె
ప్రథమోదము= తొలకరి వాన, పుష్పస్వేదము= మకరందం
వెంకట్.సి హెచ్
తేటగీతిలో
వేదములు జీవన విధాన విహితములని
యెఱిఁగి స్వేదము చిందగన్ యిష్టముగను
కష్టపడు జీవులమనికి గానసుధలు
నిండి మోదముల్ పొందుచు నిస్పృహతలు
తొలగ జీవననాదమై తొలకరించు
అవళూరు సీత
ఉ.మా
వేదము దెల్పెలే యరయ వేడిమికన్దొరఁ జేరు రీతులన్
నాదము పూజ్యమై యలరు నాగుల హారుని మెప్పుగోరినన్
మోదము నిత్యమౌ దెలియ మోహనరూపుని త్తత్వమూలమున్
మోదముఁ బూజజేయగ శ్ర మోద్భవ స్వేదము శ్రీకరంబగున్
నాగుల హారుడు.. వేడిమికన్దొరఁ..మోహనారూపుడు...= శివుడు
డా. నాగులపల్లి
రైతన్న చిందించే స్వేదము,
పుడమి కి మోదము,
జగతి కి వేదము,
ప్రగతి నినాదం...
గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
వేదము జ్ఞానము నివ్వగా
స్వేదము కష్టము తెల్పగా
నాదము హాయిని గొల్పగా
మోదము నిండు గ కల్గదా?
ఉష.
ఉత్పల మాల
స్వేదము చిందుచున్నతరి కర్షక కార్మిక భాగ్యశీలతల్
పేదలు దైన్యులున్ విడుచు వేదన పూరిత యార్త నాదముల్
మోదము లేనిజీవన విమోచన మార్గపు వేదమేమిటో
శోధన చేయగా గనుము శోభన మయ్యెడి మార్గమేమిటో
ఆదిభట్ల సత్యనారాయణ
ఓ రైతన్నా నీకు విలువెక్కడ !
బురదనేలలోన నవ్వులేదు
నెర్రెలిచ్చిన నేలలోన నవ్వులేదు
పంట పండిననాడు సంబరం లేదు
పంట పండని నాడు తంబూరా లేదు
ఎండ లెక్క లేదు
వాన ఖర్చు తెలీయలేదు
ఋతువులు లేవు
సూర్యచంద్రులను లెక్కపెట్టనే లేదు
ఘడియ లేదు విఘడియ లేదు
అస్సలు కాలమే తెలియదు
శ్రమజీవి కష్టజీవి
సుఖమెరగని నేటి యుగజీవి యదార్ధజీవి
రక్తాన్ని స్వేదంగా
రెక్కలు ముక్కలుగా
పగుళ్లిచ్చిన పాదాలతో
రూపురేఖలు అరిగిన చేతులతో
నీవు చేసే యాత్రకు ఏ పేరేడదాము ఓ రైతన్నా!
ప్రకృతి కోపం నష్టం నీకు
దళారి లాభం తీరని శోకం నీకు
నకిలీ విత్తనాలు
మొలకెత్తని నారుమడులు
నీకు గుదిబండలు
నీ పాలిట యమపాశాలు
ఏనాడో మేము చేసుకున్న పుణ్యం
నీవు రైతుగా పుట్టటం
అదేనా నీవు చేసుకున్న పాపం!
గిట్టుబాటు ధరలు లేనే లేవు
మద్దతు ధరలు అస్సలు కానరావు
అమ్మబోతే అడవి
కొనబోతే కొరివి
రైతన్న ఓ రైతన్న చూపు నీ తడాఖా
కనిపించాలి నాటి ప్రకంపనల చరఖా
ఒక్కడి తో మొదలై విశృంఖలమై
జలఫిరంగులు దాటుకొని
ఇనుప కంచెలు తొలగించుకొని
నీ పోరాటాన్ని కొనసాగించు
పీక్కుతినే కార్పొరేట్ ధనాదాహపు ఆటలు కట్టించు ...
-కోవూరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి