22, డిసెంబర్ 2020, మంగళవారం

దత్తపది - 63, దోస - బీర - కంద - కాకర, 18 - 12 - 2020

 



18 - 12 - 2020; ప్రణాళిక 

దత్తపది - 63

దోస -  బీర -  కంద -  కాకర

  

పదములతో ఔచిత్యమైన పద్యం  / కవిత్వం అందించగలరు 

అన్యార్థలతో అయితే మరీ ఆనందం.

 

 

ఆటవెలది... ( సూక్తులు )

కంద కూర తినిన కందమ్ము రాదుగా

నేతిబీర లోన నెయ్యి లేదు

దోసమేమి గాదు  దుష్టుల దండింప

కచ్చితముగ  తినుము కాకరముల ......

 

ఉత్పలమాల ( రెండవ ప్రయత్నము )

వీరులు శూరులంచు మది బీరము  లాడుచు కౌరవుల్ నిటన్

"దారులు-దోసముల్ " వెతక తప్పదు యుద్ధము బంధునాశమున్

వైరుల కందకుండ నట పాండవ సేనలు మట్టుబెట్టగన్

శూరులు కౌరవుల్ తెగడ సూతుని "కాకరబీకర"మ్ములన్

కాకరబీకర....భావం.   కర్ణుని ప్రగల్బములు...

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

వచనం

ఇతరుల దోసము లెంచి,

ఊరకే బీరము లు పలుక,

నీ శీలమున కందము రాదు,

చదివాక కాకర, కీకర అయ్యే...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

దోస ఆవ భలే అద్భుతః

బీరకాయ పచ్చడి రుచి మహా  అద్భుతః

కంద బచ్చలి కూర పరమాద్భుతః

కాకర  ఒక్కటియే  బహు చేదు

అయినను చక్కెర వ్యాధిగ్రస్తులకు

ఇది యే బలే మందు.

 

దేవరశెట్టి నాగమణి

 

 

1.              అన్యార్ధంలో పురాణ

నీ అందమునకు నను బానిసగ చేసి

నా కంద నంత దూరమునుంటివే సఖీ

బీర ములు పలికితి నిను పొందెదనని

నన్నవమానముల పాల్ జేయకు సఖీ

కరుణించి నిను చేరు దారి తెలుపుము

నిన్గని నా కనులు కాకర వత్తులౌను సఖీ

వేగిరమున నీ మనసునన్ చోటివ్వుము

నా ప్రేమను కాల దోస ము చేయకు సఖీ

 

2.

బీరము లాడుచు దుష్ట దుర్యోధనుడు

జూద క్రీడ యందున్ పాండవులోడుట

ధర్మనందను దోస మేయని హుంకరించ

సభికుల కంద రకున్ విస్మయ మాయెను,

అంగలార్చిరి  తలంచి లోలో హతవిధీ!

యువరాజు కురువంశ కాకరచిత్త యని.

 

కాకరచిత్త = వ రి తెగులు.

CA కె మల్లికార్జునరావు

 

 

 

మెప్పుల వంట

దోస , బీర, కాకర కూరలు,

కంద దుంప కడిగి తరుగుతుంటే 

తన్నుకొచ్చే నాలో తలంపులు .

నామరూపాలు   వేరయినను

రుచిగా ఉండును వండినచో .

అటులనే మన విధులను 

ఎందరికో నచ్చునట్లు ,

వారికి ఉపయోగించునట్లు ,

మనము వారి మెప్పులు

పొందునట్లు నిరవర్తించవలె !

జి మురళి మోహన్ రావు

 

 

అన్యార్థంలో నా ప్రయత్నం.

 

రాజకీయ నేతల ప్రతి రోజువారి

"ప్రతినల"న  ప్రగల్భంబులు;వారి "యొట్లు"

కపటనీతి కాకర ము;లా కల్ల లెల్లఁ

నేతి బీర లో నుండెడి నెయ్యి భంగి,

వినుట కంద ముగా దోచు బీర ములగు;

వారి దోస పూరితమైన వాక్కులెల్లఁ

దొరకబట్టుకు నేతల దూఱ వలయు !

 

వట్టెం వెంకట రమణ



 

 ll

దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి పిల్చినట్లుగన్ 

దోసము లేని శబ్దములతో మధురోహలు పంచినట్లుగా 

పేశల వాక్సుధాగరిమ బీరములెన్నియొ జూపఁగావలెన్ 

భాసురకాకరా సుషమభావము కందములా మనోజ్ఞమై ! 

 

కాకరా : సూర్యుడు 

కందము : మేఘము 

బీరము : పరాక్రమము, శక్తి  

 

కస్తూరి శివశంకర్

 

 

 

1.    తేటగీతి పద్యం

 

సలిల మడుగు దాగిన దోసర్ప జీవి

దాని కంద రుభయపడిదాగ కుండ

భీతిజెందుటెందుకనియుబీర బలికి

చంప కాకరయముగను చాటు కురికె

 

చంపకాక = చంపలేక

 

 

 

2. వచన కవిత

 

కీర  దోస కాయ కీడుచేయదెపుడు

మేలుకొరకె దానిని మొలకెత్త నిత్తురు

 

 కంద దుంపల్లో కెల్ల కడు పెద్దదిగా నున్నను

దురదగొల్పు జిహ్వకు పులుపు జేర్చకున్న

 

నేతి  బీర జూడ నాణ్యముగా నున్నను

పేరుగొప్పగుండి నెయ్యి లేకనే యుండు

 

బుడిపెలున్న  కాకర పుట్టుక చేదైనను

పుడమి నౌషధముగ పేరెన్నిక గలదయ్యె.

 

 గమనిక :- కంద లో ఒకరకం దురద కంద ఉంది.

 

హేమలత

 

 

 

ఉత్సుకం

దోసపు పల్కులు పల్కినన్

భాసిలు తల్లుల కందమే

రోసపు బాలల బీరముల్

హాసము కాకరమే సదా.

 

రామ నాగేశ్వరరావు

 

 

మెప్పుల వంట

దోస , బీర, కాకర కూరలు,

కంద దుంప కడిగి తరుగుతుంటే 

తన్నుకొచ్చే నాలో తలంపులు .

నామరూపాలు   వేరయినను

రుచిగా ఉండును వండినచో .

 

అటులనే మన విధులను 

ఎందరికో నచ్చునట్లు ,

వారికి ఉపయోగించునట్లు ,

మనము వారి మెప్పులు

పొందునట్లు నిరవర్తించవలె !

 

 

శాస్త్రోక్తంగా గణిత శాస్త్రంలో

ప్రస్తారాలు , సంయోగాలు ప్రకారం దోస, బీర, కంద, కాకరలతో వండవచ్చు

వివిధ రకాలుగా కూరలు . పాక  శాస్త్రజ్ఞుడు  నాలుగు కూరలు మాత్రమే రుచిగా వండిస్తానంటారు. మనందరం విధుల్లో  శాస్త్రాలన్నిటినీ సవ్యంగా వాడుకోవాలి

సమయానికి వండినవి తినాలి.

 

జి మురళీ మోహన్ రావు

 

 

అన్యార్ధంలో...   తే"

జనుల కంద క నెపముల జాగు సేసి

కౌడు  దాచుట కా కర చాలనాలు

బీర ముల్ బల్కె తా రణధీరుడనుచు

దోస మగు పాలన నెరపు ధూర్తుడతడు

 

వాణిశ్రీ నైనాల

 

 

మంజరీ ద్విపద మాలికలో

 

అలుసు చూపగనేల?యందగాడివను

త్రుళ్ళింత లేలరా? దోసము లెంచి

చెలియను నగుబాటు చేయగ యదను

కాదని తెలిసియు కసమస లేల?

 

బీరపు పలుకుల బేరము లేల?

తలపున కందని తడబాటు చాలు

వలపు పిలుపులవి వదలగ లేవు

అంతయే కాక రయమునరావేల ?

 

మనసులు చేసిన మథనము చాలు

తలపు దాచగ లేదు వలపుల సిరులు

మూగబాసలదండు మూకలు గట్టె

రయమున రావోయి రాధికా రమణ

 

అవళూరు సీత

 

 

తే.గీ.

సాయపు ప్ర దోస కాల పూజకు శివు కొర/

కు గొనితెచ్చితి  జం బీర , కోవిదార/

చేయి కంద మారేడు వేయి పత్రి - /

ఫలములే కాక మ్యాబ్జములను గూడ

 

జంబీర - నారింజ

కోవిదార -  పగిడి తంగేడు

 

వారణాశి శ్రీలేఖ


 

విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తూ అర్జునుడు కౌరవ సేనను అడ్డుకున్న ఇతివృత్తంగా ప్రయత్నం

 

సీ.

కదన రంగము నందు కౌరవ సేన నడ్డుకునెడి బీరగాడునని పలికె

నుత్తరుడు, కిరీటి యోధుడని తెలియకనె దోసకారులన్ కాట్పడించె

దనని కాకరపుల్ వదరుగ; విరాటుడు సేనలన్ బంపించె, శ్వేతవాజి

రథసారధిగ నుండ, రణరంగమునకుత్తరుండు వెడలగ, శూరులను గాంచి

 

గీ.

నుత్తరుడదిరి పడినంత, యుగ్రుడయ్యి

స్కందకునిగ బృహన్నల సమర భూమి

నందు సమ్మోహనాస్త్రము నద్భుతముగ

విడిచి యుత్తరునికి గొప్ప విజితి నిచ్చె

 

బీరగాడు= వీరుడు

దోసకారి= దుష్టుడు

కాకరపులు= వ్యర్థ మాటలు, ప్రగల్భాలు

స్కందకుడు= యోధుడు

 

వెంకట్.సి హెచ్

 


 

దోస గింజ వేసితి పెరటిలోన

బీర కాసెను వింతగ తీగ చివర

ఈశ్వరేచ్ఛయని కోసి తినబోవ

వగరు తగిలి కూర మోసగించె

కాకరకై ప్రీతితో ఎదురుచూడ

వెన్నుపోటు పొడిచి పైపైకి పాకి

చేతికందక కాసె మిద్దింటిపైన

నోటికందక పాయె కూరలాగ

ఏమిమాయో మరి మర్మమేమో గాని

తేలకుంది మనసు వికలమాయె

 

విష్ణుప్రియ

 

 

తేగి

నక్క దోస బూసిన జాలు నయనములకు

తాపమును కుదియించెను తనువు మెరెసె

గింజ తోడ కాకర గుజ్జు కిటుకు నిదియె

బీర గాయ గుణము జూడ పీచు యందు

ముఖము మెరిసెను యింతులు ముదము తోడ

కాయగూరల వైద్యంబు కంద కుండ

బాహ్య మెరుగులు మురియుచు బ్రతుకులివియె

 

పద్మలత మున్నంగి

 


 

భద్రకము

 

దోసమే కలుగ పొట్టలో

ఆశనే విడక బీరనే

మాసమున్ వెనుక కాకరే

తీసుకో వదలి కందనే

 

తే. గీ 1

కాకర పరమ చేదగు కంద దురద

దోస యావకాయ నలచి దోర బీర

పప్పు వేడి నేయి కలిపి  పట్టు ముద్ద

యనుచు పిలువ, తగదు  కాదు యనుట నీకు

 

తే. గీ 2

లంకను చేరిన హనుమంతుని భావము

 

కందకములు మణిమయ   ప్రాకారములును

భాసుర మగు కాకర ప్రభా పాటవముల

ధీరగంభీర  జయకర దీప్తవంత

లంకపురపతి  దోస పాలకుడు గాదె

 

సతీష్

 

 

 

1 తే.

విరహ శిక్ష వేసితివేమి తరుణి జ్ఞాప

కాల చెరసాలలో మ్రగ్గి కరిగిపోవ

లెనని, నీ చూపులే ప్రేమ లేఖలయ్యి

మదిమురియ శుభలేఖతో మనువుకూర్చు

 

2 తే.

చెలియ హస్తముల్ తాకంగ శీతల పవ

నమయి కురిసెమబ్బుగ నేనుమమతపంచి

పరవశముపొందుతునె చెలీ!మరులుగొల్పు

చెక్కిలిన దిష్టి చుక్కనై చెలగు గలనె.

 

3 తే.

చెలియ నీ జ్ఞాపకములన్ని తలవగ నను

ముట్టడించి గులాబీల ముల్లు లయ్యి

నాదుయెదనుగ్రుచ్చి తలపునందు విరహ

వేదన రగిలించి ప్రణయ వెలుగు లిడునె.

 

వెంకట్.

 


 

1 సీదా

 

దోస కాయనుగన దొరలకే నోరూరు

బీర కాయ జూడ తీరు ఘనము

కంద గడ్డలేమొ కత్తికి లోకువ

కాక రొక్కటిగన కడుపు నింపు

 

2️ సాదా

 

లేశ మాత్రము దోసము లేని చరిత

సొంతమగు వారి బీరము నెంత పొగడి

నంత వారల కందము; నగరివార

లకిల వారికా కరవాల లాస్యమేను

రాచరికపు చిహ్నము ఘన రమ్య రీతి.....

నగరివారలు = రాజులు...

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

తేటగీతి

బీర ము లతివ హక్కులై వినుతి కెక్క

దోస మెంచని చెలికాడు దొరుకు టరుదు

మాట కంద ని బాసలు మనసు దెలుప

కలికి మోములో కాకరా కాంతు లొలుకు

రమ, కంకిపాడు.



 

మందగమన వధువునుఁ గని

పెందలకడ కేళి సలుప బీరము జూపన్

చిందెనదేదో సతిపై

కందర్పుని శరము వోలె కాక రహితుడై

 

చాగంటి చరణ్

 

 

కలదో సంగతి తెలుసా

లలనా మీరిష్టపడు గు లాబీ రంగున్

కలిగిన మీకందంబిడు

వలువల కాకర ముమాదు బట్టలషాపే

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

దోహమున శశిని గనిన దోస మాప

వెదకుచు శమంత కంబును   వెడలె నంద

బాలుడు విపినమునకు.  జాంబవత బీర

వచనములకును వెరవక వాటు లాడి

ధీరుని గతజన్మపు బాస దీర్చి కంద

రమున డోలికనందున రతనము గని

బాలికా కరకమలము పట్టె హరియు

Venkatappiah sure


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...