6, డిసెంబర్ 2020, ఆదివారం

కార్తీక మాసము – 2020, కస్తూరి శివశంకర్

 

కార్తీక మాసము – 2020

అందరికీ కార్తీకమాసం శుభాకాంక్షలు

కస్తూరి శివశంకర్

 

 

భగీని హస్త భోజనము

16-11-2020 సోమవారం

 

భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? ఏరోజున చేయాలి ?

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు భగినీ హస్త భోజనం అనే వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే అక్క లేక చెల్లెలు. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. సోదరీ సోదరుల ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.

 

భయ్యా ధూజీఅనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

 

భగినీహస్త భోజనం పురాణగాధ

మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున  వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

 

సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువల్లనే ఆచారం ఆచరణలోకి వచ్చింది. సోదరీ సోదరుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉండాలంటే  మన పెద్దలు సూచించిన ఇలాంటి సాంప్రదాయాలను మీరూ పాటించండి.

 

మత్తేభము

భగినీ హస్తపు దివ్యమౌ రుచులు సంప్రాప్తించు భాగ్యంబిదే

జిగియౌదత్తపదుల్ మనంబు వనమున్ జేగంట మ్రోగంగనే

గగనధ్వాంతము వీడిగా కవనముల్ గాంధర్వమౌ భావమై 

ద్విగుణాధిస్ఫురితమ్ము యింధనములై విస్తారమౌ యోచనల్ 

 

1 మత్తేభము

ఉపవాసంబులు జాగరంబు కడుమంత్రోపాసనాసత్క్రియల్

జపముల్ పూజలు యజ్ఞయాగముల సంజాతంబు శూన్యంబుగా

ఉపకారంబులు జేసి సాంత్వమున వ్యామోహమ్ము పోకార్చగా 

చపలత్వంబు, విలాసముల్ విడిచి నీ ధ్యానంబునన్ శంకరా  !

 

2 మత్తేభము

తనలోనే పరమాత్మయున్నదను సత్యంబెన్నడూ మూఢతన్ 

కనలేడాయెను జీవి; నిన్ను వెదకున్; కార్తీక మాసంబునన్

మనసేమందిరమై శివార్చనకు ప్రామాణ్యంబుగానిల్చి, బ్రో

చిన భవ్యంబగు యోగహస్తమును సంసేవ్యుండనై శంకరా !

 

3 శార్ధూలము

"సద్యోజాతము" రూపమై ధరణిలో స్థైర్యమ్ము నింపారగన్     

సద్యస్స్ఫూర్తి భవత్కటాక్షకళికల్ స్వాంతమ్ము నింపంగనే 

హృద్యంబౌ భవదీయమానసములో యీ తీరు  కొల్వంగనే

ప్రద్యోతించు కటాక్షముల్ హృదయమున్ ప్రార్ధింపగా శంకరా     

 

3 మత్తేభము

అనవద్యంబగు భక్తితత్వమున "అద్వైతమ్ము" శోధింపగా    

వినియుక్తంబగు శాస్త్ర సంపదలు చాంపేయంబులై  దివ్య ధా    

త్రిని రక్షింపగ ధర్మమార్గములు సందీపించు తత్వంబులన్ 

ఘనమై, భవ్యపురీతులై మనసు "వాగర్ధత్రయీ" శంకరా  ! 

 

పద్యం వివరణ

శ్రేష్టమైన (అనవద్యమైన) భక్తితత్వాన్ని నాలో నిరంతరం నింపుతూ, నిర్వికారము, నిత్యమూ, జ్ఞానానందాత్మకమూ అయిన అద్వైత సిద్ధాంతాలనూ, నీచే నైవేద్యంగా అందించబడిన శాస్త్ర సంపదలు (వినియుక్తమైన) అత్యంత పవిత్రమై, హరిద్రమై జనావళిని నిత్యమూ రక్షిస్తూ, నిత్యం ప్రకాశించే నీ త్యత్వం తెలుసుకునే ప్రయత్నమే ఇది త్రయీ వేద్యం (మూడు వేదాలకు మూలమైన వాగర్ధమై) నీవు మా మనసులో, హృదయంలో  భవ్యపు రీతిగా నిలిచిపో 

శంకరా.       

 

5 శార్ధూలము

సత్యంబౌ జపముల్-తపమ్ములవి హృత్సంపూర్ణమౌ చింతలై 

సత్యంబౌ "యుపవాసమన్న" హృదిలో "సమ్మోహముల్" వీడుచూ 

నిత్యంబున్ స్థిరవాగ్విలాసములతో  నీమంబు పాటించుచున్ 

సత్యంబౌ భవదంఘ్రి యుగ్మములు సాక్షాత్కారమౌ శంకరా 

 

 

6 శార్ధూలము

యుక్తాయుక్త విచక్షణల్ నెఱిఁగి, "శ్రేయోమార్గముల్" చిత్తమున్ 

నక్తాదుల్, జపహోమముల్, తలపులన్ నైరాశ్యముల్ వీడుచూ 

శక్తిన్ జూపి నితాంతమౌ నిధులనే సంప్రాప్తి జేయంగ, నా

సక్తిన్ జ్ఞానవివేకమార్గములవే సంజాతమౌ శంకరా !

 

7 శార్ధూలము

మౌనంబుల్ ప్రభవించగా తలపులన్ మంజీరమోంకారమై

జ్ఞానంబిమ్ము రయమ్మునన్ శరణమున్ !  సన్మార్గమున్ జూపినన్   

వైనత్యంబును శాంతిసౌఖ్యములతో  భాషించుచందమ్ము ; సం

ధానంబై హృదయమ్ములో విపులమౌ ధ్యానమ్ములే శంకరా 

 

9 శార్ధూలము

 

మన్మోహమ్మగ శబ్దముల్ తలపులై మంజూషమున్ నిండినన్

తన్మాత్రమ్ముల ముగ్ధభావములు హృద్యమ్ముల్ త్వదీయమ్ములై

సన్మార్గమ్మున  జ్ఞానతత్త్వములనే సంభారముల్ యోగ్యమై

చిన్మాత్రమ్ముగ శబ్దమై హృదయమున్ జేగంటవై శంకరా

 

10 శార్ధూలము

చాపల్యమ్ములు చింతలన్ కరుణతో సంప్రోక్షితంబౌ శివా   

సోపానమ్ముల ధర్మమార్గములనే శోధింప జిజ్ఞాసతో

దీపారాధన వెల్గులన్ హృదయమే దివ్యత్వసంప్రాత్వమౌ 

కోపావేశము లేని యోగములతో  కొల్వంగనే శంకరా  

 

 

11 మత్తేభము

భవబంధమ్ముల మాయలోన మనసే "పంచాక్షరీ మంత్రమై"

జవసత్వమ్ముల తేజమున్న కృషితో సంప్రాప్తమౌ యోగముల్

స్తవముల్,స్వాంతమునన్ సదా వరములై శాంతమ్ము సంజాతమౌ

శివమున్ గోరుచు నేను నాత్మ భవునిన్  సేవించగన్ శంకరా

 

 

12 మత్తేభము

వరమందించగ వాఙ్మయమ్ముల నిధుల్ భాషాంగముల్ ఠేవతో  

హరుసంబొప్పఁగఁ బద్యమాలికలతో నర్చించఁగాఁ నీశ్వరున్ 

వరవర్ణంబుల నందచందములతో బాహ్యాంతరంగంబులన్

సిరులౌ పల్లవముల్ ఘటించు పద మంజీరంబులన్ శంకరా 

 

13 మత్తేభము

దుర్మార్గంబు పరిత్యజించు వరముల్ తోడుండగా ! యోగమౌ 

ధర్మంబుల్గుణసంపదల్ దళములై  దాక్షిణ్యమున్ జూపగన్ 

నిర్ముక్తుంబగు మోహముల్ విడువగా నెయ్యంబు సంప్రాప్తమౌ  

నిర్మూలించగ క్లేశముల్, స్తవములై నిన్నెన్నగా శంకరా

 

14 శార్ధూలము

భక్తిన్, శక్తము, యుక్తిమౌక్తికములై భావార్థ సౌందర్యమై    

ముక్తాస్ఫోటములైన చిత్తము సదా మోహమ్ము వీడంగనే 

నక్తాంధమ్ములు వీడగా భవుని విన్యాసంబుదే సత్యమై  

భక్తాభీష్టము యోగమై హృదయమున్ వాగర్ధమై శంకరా !

 

నక్తాంధమ్ములు = అహంకారము వంటి చీకటి

ముక్తాస్ఫోటము = ముత్యపుచిప్ప

 

15 శార్ధూలము

ఆశాపాశ వినాశమున్ గలుఁగుక్లేశాపూర్ణ మోహమ్ములన్ 

నాశమ్మున్ కలుగంగ జేయ ఘనమౌ నానార్ధ గంధమ్ములన్ 

వాసమ్మొందగ నాదు చిత్తమున దివ్యంబైన భావాంబుధుల్

సౌశీల్యాది మహాగుణమ్ముల సిరుల్ సౌహార్దమౌ శంకరా

 

16 శార్ధూలము

ఆద్యంతమ్ములులేనివాడవట! వేద్యంబైన సత్యమ్మదే

చోద్యంబే నిఖిలమ్ములో వెలయు వీశుండౌచు లింగాకృతిన్  

సద్యోజాతుడ మర్మమేమి ? భవమున్ సత్వంబు నీ తత్త్వమున్

ప్రద్యోతించుము వేద్యుడా హృదయమున్ బ్రార్థింపగా శంకరా

 

17 మత్తేభము

వివిధానంద సుధా ధరాశ్రువులతో ప్రేమార్ధసంజాతమౌ 

అవిరామంబగు జ్ఞానమున్ హృదయ భావార్ధమ్ము సౌందర్యమై 

భవమౌ, దివ్యఫలమ్ములన్ ప్రణవమౌ బాహ్యాంతరంగంబులన్

భవబంధమ్ములు మాయలోన శివమై వాంఛింపగా శంకరా !         

18 శార్ధూలము

వేదాంగపు దివ్యరూపమున తానై తోచునన్యంబునై    

భావార్థంబులు దీక్షగా మనసులో  భాషించు సూక్తంబులై 

నీవే మూలమనీ మనమ్మున శివా నిన్నిట్లు భావింపగా    

కైవారంబులు సాంత్వనమ్ము భవమై కైమోడ్చెదన్ శంకరా !   

 

19 శార్ధూలము

పాదమ్ముల క్షేత్రమందమలమౌ స్థేమంబు నిండారగన్ 

సోపానమ్ముల ధర్మమార్గములనే శోధించు జిజ్ఞాసతో

నే పాదమ్ముల గొల్వ నట్టి శివసర్వేశాంఘ్రి చైతన్యమున్  

దాపేక్షాయత బుద్ధి నిల్పి భవముల్  అద్వైతమౌ శంకరా   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...