3, డిసెంబర్ 2020, గురువారం

దత్తపది - 59 “ బాస లాస ఆస మోస ” 27.11.2020

 


దత్తపది - 59

“ బాస లాస ఆస మోస ” 

27.11.2020

ఆటవెలది...

బాసటంచు నిలుచు బాల్యహితులెపుడు

చిద్విలాస మయ్యె చిన్నతనము

ఆకసంబె హద్దు ఆశలుండగ సుమీ

మోస గాళ్ల జేత మోస బోకు.....

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

భద్రకము

 

బాసలై వలపు గీతాలే

ఆసలై మనసు మాటలే

లాసమై మరుల ఆటలే

మోసమై నదిగ పెళ్లితో

CA కె మల్లికార్జునరావు

 

 

బాసరాంబ కనుల భవ్యకరుణకాంతి

తద్విలాస చిద్విలాసములను

గుండెనాసపడకనుండువాడెవ్వడో?

తెలుపుమో సహృదయ తెలుగువీర!

రాంమోహన్,  నిజామాబాద్


 

వచన కవిత

 

ఆసలు ఎన్నో కల్పించి,

బాసలు ఎన్నెన్నో చేసి,

మోసపు మాటలు చెప్పి,

దిలాసగ తిరిగి వస్తానని చెప్పి పత్తాలేడు మళ్ళీ..

 

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

తనయుల వృద్ధి కై ఆసపడంగ

కాయకష్టంబు చేసి చదివించంగ

వారికి తీయని మాటలతో

ఎన్నో బాసలు చెబుతూ

మోసం చేస్తూ కులాసగా తిరగసాగె

బాధ్యత లేని బిడ్డలు

 దేవరశెట్టి నాగమణి

 

 

అభయం

 

కైలాసవాసా  బాసలేక కోరమయ్యా

మోసగాళ్ల ఆసలు

మిన్నంటి మా కనుల నిదుర దూరమాయె

ఓం  నమః శివాయ చిద్విలాసముగా నీ

లాసముతో హడలు గొట్టు ఆ గాళ్ళని .

 

జి మురళీ మోహన్ రావు

 

 

మోసం

వివిధ బాసలలో

పాడిన పాటకి

బడి పిల్లలు చేశారు

ఒకే విధముగా లాసము .

చేయుట చేతగాక , చేయ

లేక ఆసపడి వచ్చిన వీడు

మోసపూరితం అంటూ

ఏడుస్తూ  పోయాడు .

జి మురళీ మోహన్ రావు

 

 

తిక్క కుదిరింది

రక్షక భటులకు దొరికె

వివిధ బాసలలో  మాట్లాడి

మోసగించు చోరులు .

 

బాధితుల ఆసలు

తీరునట్లు  లాఠీలతో

లాసము చేయిస్తూ 

రాబట్టే దొంగసొమ్ము

జి మురళీ మోహన్ రావు


 

ఉత్సుకము

బాసలే తెలుపు సంస్కృతుల్

ఆసలే గెలుపు నిచ్చుగా

లాసమై బ్రతుకు సాగునా

మోసమే గెలుచు నప్పుడూ

 

బాసట నిత్తురు స్నేహితుల్

ఆసలు దీర్చుచు నెప్పుడూ

లాసము జీవన మార్గమై

మోసపు భావన రాదుగా

 

భద్రకము

 బాసలే తెలుపు సంస్కృతుల్

ఆసలే గెలుపు నిచ్చుగా

లాసమై బ్రతుకు సాగునా

మోసమే గెలువ దెప్పుడూ

రమ, కంకిపాడు

 


ఉత్పలమాల

ఆ సుకవిత్వ సౌరభము హాసములై సృజయించినట్లు సం

భాసిత కీర్తులై వెలయు బాసలు, యాసలు కావు మోసముల్ !

వాసిజెలంగు సన్నుతుల వాఙ్మయ సంగ్రహముల్ విలాస వి

న్యాసకళానిధుల్ సొబగు నందనముల్ వరమౌ పటీరముల్  

కస్తూరి శివశంకర్

 

 

ఉత్పలమాల

బాసట నేననెన్ సఖియ బాసలయూసుల నెన్నిజెప్పెనో

యాసలడోలికన్ మదియె యద్భుతమెంతయొ గాంచె మోదమున్

హాసపులాసమున్ వలపునాటగ చేయుచు మోసగించెనే

శ్వాసయె యాగెనే చెలియ బంధపుబాసను  త్రుంచిపోవగన్

డా. నాగులపల్లి

 

 

ఉత్పలమాల..

బాసర నమ్మవారచట, వాగ్డెవి శారద బ్రహ్మ రూపిణిన్

ఆశలు బెట్టుకొన్నచట, హంస విలాసిని వేగిరంబిలన్

బాసలు మెండుగా గొలువ, భక్తుల గోర్కెలు దీర్చగా నిటన్

మోసపు దారినంబడక, మోక్షము లిచ్చును మెచ్చగా జనుల్..

పి.ఎల్.నాగేశ్వరరావు


 

మంజరీ ద్విపదలో

బాసలు చేసిన భర్తయే రాగ

ఆసల ఉరవడి అలలుగ తాకె

మోసపు మాటలు ముగిసిన వేళ

లాసమాడె నగవు అధరము పైన

 

మోసపు మబ్బులే ముత్యమై కురియ

బాసలు చేసెనే భద్రాద్రి కేగ

ఆసల పల్లకీ అమరించి తానె

లాసపు హొయలులె లయలుగ మార్చె

అవళూరు సీత

 

 

భాను తీక్షణ తేజ ప్రభాసమాన

వీర పాండు కుమారులు విధివిలాస

మోస జూదంబు నపజయ మొంది, యాస

కలిగి ధర్మ వర్తన వీడక మసలుకొని,

విశ్వ రూపుని కరుణతో విజయు లయిరి

సూరే వెంకటప్పయ్య

 

 

భద్రకము

కాసులే తమ విలాసమై

ఆస లే అవధి దా ట గా

మోసమే బ్రతుకు బాట యై

బాస లే మరువ నాశమే.

డి.రామ నాగేశ్వరరావు

 

 

అంబాసన్నుత భక్త పోషణ క్రియా వ్యాపార దాక్షాయణీ 

శుంభద్రాజ ముఖా విలాస కరుణా శోభా విరాజేశ్వరీ

సాంబా పత్ని నమో సదాశుభకరీ సంవేద్య సంపత్కరీ

తంబూరధ్వని నాలపించెద తగన్ దాయా సమేతుండనై

 ఆదిభట్ల సత్యనారాయణ

 

 

వచన కవిత

విరటుని కొలువున

మాలినిగానున్న ద్రౌపది పై

మోహముతోనున్న కీచకుని

ఆశను, విలాసమందిరమున

మోసముచే జంపెదనని

పాంచాలికి  బాస చేసె భీముడు

హేమలత


 

ఈశ్వరుని మహిమను తెలుపుతూ  నా భావన . . .

తరువోజ

ఆ సదాశివుని ప్రియముగ కొలవగ నద్భుతంబు జరుగు నవని జనులకు

ధ్యాస నిలిపి హరుని ధ్యానింప నీకు తా బాసటగ నిల్చి తరియింప జేయు

కౌసీద్యము నొదలి కైసేయ నీకు  కైలాసనాథుడు కైవల్య మొసగు

వాసి యేమో సభావనుని పూజింప వరములెన్నో గూడి ప్రభవము కల్గు

వెంకట్.సి హెచ్

 

 

కందము

బాసలు జేయుదురే యు

ల్లాసముగా భువిని బ్రజలు లక్షలు పైనన్

ఆశలు జూపుచు తదుపరి

మోసములను జేయు జనుల ముందుగ గనుమా!!

 

ఉత్పలమాల

బాసలు జేయబో వలదు బాధిత బంధువు లోక్కరైన ను

ల్లాసము జూపుచున్ సతము రక్షణ కోరుచు చేరగా నహో

ఆసన మేయుచున్ బిలిచి యాదరనొందగ జూచుచున్ సదా

మోసము జేయగన్ వెరసి మోదము వీడగ కష్టకాలమౌ

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి


 

ఆటవెలది

ఆసబెట్టబోకు యానందవేళలో

లలన మురిసి చేయు లాస మెపుడు

మోసమెపుడు వీడి  ముదము పంచుతు నీవు

బాసటవ్వు యెదుటి భావమందు

సి.హెచ్. రజిత, కరీంనగర్

 

 

ఉత్సుకమ

1️

లాసము జేయుచు మానవుల్

మోసపు రీతిగ మాటలన్

బాసలు జేయుట న్యాయమా

ఆసలు దీరవు ఎన్నడున్

 

2️

లాసము హాయిగ జేయుచున్

ఆసలు దీరుట తధ్యమే

మోసము కానిది చేతలన్

బాసలు జేయగ బంధముల్

 

పద్మలత


 

మత్త కోకిల

 

విత్త మార్జన జేయుచుండ వివేకులై జనులాసతో

చిత్త మాస పడంగమోసము జేసినైన విలాస వు

న్మత్తులై చరియింప బాసలు మారె నర్ధపు సంచయా

మత్తులో బడియుండకాశల

మాయ భ్రాంతిని వీడుమా!

శిరీష


 

1

చిద్విలాస వదనమ్ముతో

సత్యభామ బాససేయ మని యడుగగ కల్పవృక్షమున్..

సతి యాశ దీర్చె కృష్ణుడు సంతసముగ..

పతిని గెలువంగ గోరి తులాభారమందు మోస బోయెనా సత్యభామ..

2

రామునితో ఉల్లాసముగా తేలియాడే సమయంబున

బంగారు జింకకై సీత ఆశ  పడిన వేళ

తెచ్చెదనని బాస చేసి రాముడు జింకకై

వెళ్లి మాయ లేడి చేతిలో  మోస బోయెనే...

అన్నపూర్ణ, ముంబాయి

 

 

ఉత్పలమాల

మోసపు మత్తు జల్లితిని మూర్ఖపు యోచన లావహించగన్

బాసట నౌదునంచు పలు బాసలు జేసితి ప్రేమ మైకము

ల్లాసమునొంద, నాదు యనురాగము చూపక నొవ్వచేయుచున్;

ఆసనునింప సాద్యమిపు డాత్రము నాప నసక్తుడైతినే!

 

వాణిశ్రీ నైనాల

 

 

ఆసలు కలిగించెనె చెలి యబ్బురముగ

లాసములు జూపి నెయ్యపు రమణి ముదము

కూర్చె; నటనగ వెడలె తా గుణము జూపి

మూగ బాసలవ్వగ సఖి మోసపోయె

 

వెంకట్.సి.హెచ్

 

 

మిత్రుల తొడ లాస అడెను

ఎప్పటికీ విడి పొనని బాస అడిగెను

కలలోనైనా ఆస కల్పించనని కోరెను

చివరికి మోసగించడం తన నైజమనెను

 

మంజూష  నిజామాబాద్

 

 

ఈ నాటి దత్తపదికి.. నా ప్రయత్నం... అన్యార్థాలలో సర్వసతీ మాతపై......

తేటగీతి

 

బాస ర పురంబునన్ కొలువైన తల్లి

యా  స రస్వతీ దేవిని యార్తి తోడఁ

 

మరి, "న మో  స రస్వత్యామ్ నమామి !"  యంచు

నేను, కమ లాస నుని రాజ్ఞిని హృదియందె

దలఁచు కొనుచు నమస్కృతుల్  దెలుపుకొంటి.

 

ఆ తెల్లని, చలువ చూపుల చదువుల తల్లి పాదాలకు మ్రొక్కుతూ.....

 

వట్టెం వెంకట రమణ

 

 

 

కార్తీక మాసము  - వచన కవిత

 

 హరిహరుల సేవించు

అపురూప మాసము

 

సోమవారములలోన

ఉపవాస దీక్షతో

సోమేశ్వరుని, మదిన

సొంపుగానిలుపుకొని

పెంపుజేసుకొందుము

భక్తిభావనను

 

దీపమారాధనలోని

దివ్య మహిమను తెలుసుకొని

దీనబాంధవుని 

దినదినము సేవింతుము

 

దామోదరస్వామి

దివ్యమంగళరూపము

దర్శించుకున్న, దరిచేరవు

దుష్కర్మలు

 

హరిహర సుతుడైన

అయ్యప్పస్వామి

అనుగ్రహమును పొందు

అనువైన మాసము

 

ఉసిరిక వనమందు

ఉమాపతిని పూజించి

వనభోజనములు జేయ

వసతియగు మాసము

 

పున్నమినాటిన పుడమిపై

వెన్నెలను మించిన  వన్నెగల

దీపకాంతులతో

భువిని దివిగ జేసె

దివ్యమైన మాసము.

 

హేమలత

 

 

మహిషాసుర మర్ధిని

ఉత్పలమాల......

 

శ్రీ లలితా మహేశ్వరియు, శ్రీమహ శాంభవి భద్రకాళిగా

శూలము జేతబూని వడి జూచుచు రాక్షసు డొక్కజీల్చగా,

శైలజ నాధుడుండచట జైయన మెచ్చగ నందితోడుగా

కైలస మేగుదెంచనట గైకొనె వేడుక సంతసంబుగా....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

తుఫాను

తొలిపొద్దు మలిపొద్దు

తేడా తెలియక ఆగక కురుస్తుంది

దయలేని వాన జడివాన

కరిమబ్బులు చాటున నీలాకాశం

తల్లి లేని బిడ్డడు లా దిగులుగా చూస్తుంది

చీకటికి ఆహ్వానం పంపి వెలుగు నందించే సూర్యచందురలను

మాయం చేసింది

ఆకాశంలో మిణుక్కుమనే తారలను

పుక్కిట పట్టి దూరం చేసింది

చిన్న పెద్దా తేడా లేదు

పల్లె పట్టణం తేడా అస్సలే లేదు

అంతా ఏకం చేసింది

చిగురుటాకులా వణికేలా చేసింది

పొడి లేని అవనిని చేసింది

వాగులు వంకలు ఏకం చేసింది

కనుచూపుమేర వర్షపునీరు

గుండె తడిని ఏకరువు పెడుతుంది

మొలకెత్తిన పంటపొలాలు నిండా మునిగి

మోరెత్తి ఆకాశం వైపు దీనం గా చూస్తున్నాయి

పోటెత్తిన వరద నీరు జనారణ్యం వైపు పరుగిడుతోంది

 కోవూరి 

 

 

మిత్రాయనమః

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /

అనెడి మిత్రుండొకడుండిన చాలు/

వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/

మిత్రాయనమః     (1)

 

స్నేహితుండులేని జీవితంబు/

తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/

దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/

మిత్రాయనమః!    (2)

 

"ఔషధంబుకానౌషధౌంబు/

మనంబునకు శాంతినొసంగు/

తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/

మిత్రాయనమః     (3)

 

"దేశంబులనున్న, దేవళంబుననున్న/

సంతలోననున్న, సభలలోననున్న/

'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/

మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/

మిత్రాయనమః     (4)

 

"పూర్వజనమ పుణ్యంబున దొరకు/

ఏరాయను బాల్యమిత్రుండు,/

వృద్ధాప్యంబున పలుకరించ/

అమృతము చిలకరించు పలుకు/

అదిలేని జనమంబు దరిద్రమ్ము/

మిత్రాయనమః     (5)

 

"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/

సగము ప్రాణంబులు పోవు/

తీపి గురుతులే మిగులు/

దిగులు చెంద దినంబులు భారంబుగ/

మిత్రాయనమః!"   (6).

 

 మితృలందరికీ అంకితం! 🙏


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...